ఎన్నికల ‘యుద్ధం’ ‘వ్యాగ్ ది డాగ్’ (1997)

దేశాధినేత ఐదేళ్ళు ఏలాడు. మళ్ళీ ఎన్నికలొచ్చాయి. రెండోసారి కూడా పోటీచేస్తున్నాడు. గెలవాలని ఉబలాట పడుతున్నాడు. టీవీలో ప్రచారాల జోరు ఇలా సాగుతోంది.

గుర్రప్పందెంలో గెలిచిన అతడితో ఆమె: ఈ రోజు రేసు చాలా బాగా గెలిచావు. ఫైనల్స్‌లో కూడా ఈ గుర్రమేగా?  అతడు: ఎన్నడూ మార్గమధ్యంలో గుర్రాన్ని మార్చొద్దని మా నాన్న అంటాడు. నేను మా నాన్న మాట జవదాటను. టీవీ తెరపై కాప్షన్‌ వస్తుంది ’’మార్గమధ్యంలో మీ గుర్రాన్ని మార్చకండి. ఎన్నిక రోజు మీ అధ్యక్షుణ్ణి తిరిగి ఎన్నుకోండి.’’ 

ఎన్నికలకు ఇంకా రెండే రెండు వారాలున్నాయనగా వైట్‌ హౌస్‌ ఓవల్‌ ఆఫీసు పడుచు ఉద్యోగినితో స్కాండల్లో ఇరుక్కుంటాడు దేశాధ్యక్షుడు. ఆ అమ్మాయి సంగతి మీడియాకి చేరుతుంది. ‘దేవుడా! పడుచుపిల్లని పంపి కాపాడావు’ అంటూ సంబరపడతాడు ప్రత్యర్ధి. ప్రస్తుత అధ్యక్షుడి పునరెన్నిక అవకాశాలు ఇక అటకెక్కినట్టే. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేదెలా? అధ్యక్షుడి అంతరంగిక సిబ్బంది ఆలోచనలో పడతారు. చివరికి సమస్య పరిష్కారం కోసం కాన్రాడ్‌ బ్రయాన్ (రోబర్ట్‌ డీ నీరో) అనే హై ప్రొఫైల్‌ పొలిటికల్‌ స్పిన్‌ డాక్టర్‌ను నియమిస్తుంది అధ్యక్షుడి సెక్రటరీ వినిఫ్రెడ్‌ అమీస్‌ (అనీ హెచ్‌). సంక్షోభాల సమయంలో కుతంత్రాలతో ప్రజల దృష్టిని మరల్చే మాయల మరాఠీలను స్పిన్‌ డాక్టర్లంటారు. వీరికి భారీ చెల్లింపులు, రాజకీయ ప్రయోజనాలు వుంటాయి. కానీ పనిలో నిర్దిష్టమైన క్రమశిక్షణ కూడా వుండాలి.  అధ్యక్షుడిని ఎన్నికల్లో తిరిగి గెలిపించడం వరకే బ్రయాన్ పని.

యుద్ధం శరణం గచ్ఛామి:

ఎన్నికలకింకా పదకొండు రోజులే వుంది. ఏదో చేసి ప్రజల దృష్టి మరల్చాలి. ప్రజాభిప్రాయాన్ని మార్చాలి. అపరాధిలా కన్పిస్తున్న అధ్యక్షుణ్ణి ఆపద్భాందవుడిలా చూపాలి. రంగంలోకి వస్తూనే బ్రయాన్ తన పని ప్రారంభిస్తాడు. అమెరికాకు అల్బేనియా నుండి ప్రమాదం పొంచి ఉంది, అల్బేనియాలో టెర్రరిస్టులు ఇష్టారాజ్యం చేస్తున్నారు, కెనడా గుండా అమెరికా సరిహద్దుల వరకు బాంబులు చేరవేశారు అనే ఒక కొత్త నకిలీ కథనాన్ని దేశం మీదికి వదలాలి. మీడియా నమ్మే విధంగా దృశ్యాలు, ధ్వనులు వుండాలి. అందుకోసం స్టాన్లీ మొట్స్ అనే హాలీవుడ్ నిర్మాతను ఆశ్రయిస్తాడు బ్రయాన్. బ్రయాన్ – స్టాన్లీలు  మీడియాను ప్రజాభిప్రాయాన్ని మలిచి ప్రస్తుత అధ్యక్షుడు తిరిగి ఎలా గెలిపిస్తారు అన్నదే మిగతా సినిమా!

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ తనే అయిపోయి సినిమా ఫక్కీలో పని ప్రారంభిస్తాడు స్టాన్లీ. అల్బేనియా లోని ఒక గ్రామంపై టెర్రరిస్టులు దాడి చేశారు. ఆ దాడినుంచి పారిపోతున్న అమ్మాయి దృశ్యాన్ని స్టూడియోలో చిత్రీకరించి బ్యాక్ గ్రౌండ్ అంతా స్పెషల్ ఎఫెక్ట్స్ ద్వారా అమర్చుతారు. అమెరికన్ ప్రజల సెంటిమెంట్ కు హత్తుకునేలా ఆ అమ్మాయి చేతిలో ఒక తెల్ల పిల్లి ఉండాలని అధ్యక్షుడు సూచిస్తాడు. అమ్మాయి చేతిలోని చిప్స్ ప్యాకెట్ స్పెషల్ ఎఫెక్ట్స్ ద్వారా తెల్ల పిల్లిగా మారిపోతుంది. అల్బేనియా వంటి చిన్న దేశంపై అమెరికా ఎందుకు దాడి చేయాలి అన్న విషయం ప్రజలు నమ్మాలిగా! అందుకు పాటే ఆయుధం. అల్బేనియా అమెరికన్ జీవనసరళిపై దాడి చేయబోతోంది! ‘అమెరికన్ వే ఆఫ్ లైఫ్’ అన్నది అమెరికన్లకి పెద్ద సెంటిమెంట్. ప్రపంచంలో స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఒక్క అమెరికా మాత్రమే. కోరస్ తో సహా అలాంటి పాటలు రికార్డు అవుతాయి. ‘దేశభక్తి’ మత్తు ప్రజల్లోకి ఎక్కుతుంది. ఫేక్ న్యూస్ మీడియాను ఆక్రమిస్తుంది. పబ్లిక్ డిస్కోర్స్ అంతా అంతా మరో కొత్త పాయింట్ మీదికి మళ్ళుతుంది.

సి.ఐ.ఎ. రంగప్రవేశం:

ఏదో కుట్రను పసిగడుతుంది గూఢచారి సంస్థ. బ్రయాన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుంది సి.ఐ.ఎ. ఈ రహస్యాన్ని బహిర్గత పరచడం వల్ల దేశానికే కాక సి.ఐ.ఎ.కి కూడా నష్టమే అని నమ్మిస్తాడు బ్రయాన్. కానీ సి.ఐ.ఎ. అధికారి ప్రత్యర్థితో కుమ్ముక్కై – ‘యుద్ధ పరిస్థితి వచ్చింది కానీ యుద్ధం ముగిసింది’ అన్న వార్త మీడియాకు వదుల్తాడు. దాంతో, వెనక్కు వెళ్ళిన సెక్స్ స్కాండల్ మళ్ళీ సెంటర్లోకి వస్తుంది. స్క్రీన్ ప్లేలో మళ్ళీ మార్పులు జరుగుతాయి. మరింత సెంటిమెంటుతో మరో కథ అల్లుతాడు స్టాన్లీ.

అమెరికా వీరుడి కథ:

యుద్ధానికి వెళ్లిన అమెరికన్ సైనికుల్లో ఒకడు శత్రుదేశంలో చిక్కుకున్నాడు. పోగొట్టుకున్న ‘పాత చెప్పు’లా యుద్ధఖైదీగా మారి, దేశం కోసం కష్టాలు పడ్తున్నాడు. అతడి తల్లి తన ‘ముద్దుబిడ్డ’ కోసం విలపిస్తోంది. దేశాధ్యక్షుడు ఆ ‘అమెరికన్ హీరో’ని దేశానికి తీసుకురావాలి. పాత జానపద గీతాన్ని నకలు చేసి ‘పాత చెప్పు’ పాటను ప్రజలమీదికి వదులుతారు. సెంటిమెంటు రగల్చడానికి ‘పాత చెప్పు’ టీ షర్టులు, ‘నేషనల్ హీరో’, ‘తల్లి ముద్దుబిడ్డ’ టీ షర్టులు తయారుచేస్తారు. తామే ఓ రాత్రి పూట పాతచెప్పులను విద్యుత్ స్తంభాల మీదికి విసిరి ప్రజలు కూడా అలానే చేసేలా ఉసిగోల్పుతారు. షుమాన్ అనే యుద్ధ ఖైదీని అమెరికా వీర సైనికుడిగా ‘ఆవిష్కరిస్తారు’. ఇపుడా సైనికుడ్ని శత్రుభూమి నుండి కాపాడి దేశానికి తీసుకురావాలి.

అమర వీరుడిగా మారిన అమెరికా వీరుడు:

వైట్ హౌస్ తరుపున షుమాన్ ను తీసుకొచ్చే టీంలో అమీస్, బ్రయాన్, స్టాన్లీ యధావిధిగా వుంటారు. తీసుకురాబోయిన యుద్ధఖైదీ నిజానికి ఒక కరుడుగట్టిన నేరస్తుడనీ, ఒక సన్యాసినిని మానభంగం చేసి శిక్ష అనుభవిస్తున్నాడనీ తెలుస్తుంది. అతడో మానసిక రోగి అని తెలుస్తుంది. వాడిని తీసుకొస్తుండగా విమానం ప్రమాదానికి గురవుతుంది. ఒక పల్లెటూరి రైతు విమానంలోని వారిని కాపాడతాడు. కానీ షుమాన్ ఆ రైతు కుమార్తెను బలాత్కరించబోవడంతో అతడ్ని కాల్చి చంపేస్తాడు ఆ రైతు. కథలో మళ్ళీ మార్పులు చేస్తాడు స్టాన్లీ. యుద్ధ ఖైదీని కాపాడినప్పుడు తగిలిన గాయాలతో చనిపోయిన షుమాన్ ఇపుడు అమరవీరుడయ్యాడు. సర్వ లాంఛనాలతో  అమెరికా అమరవీరుడి అంత్యక్రియలు జరుగుతాయి. ఇలా ప్రజల సెంటిమెంట్లతో ఆడుకున్న క్రమంలో అధ్యక్షుడు తిరిగి ఎన్నికవుతాడు.

మార్గమధ్యంలో గుర్రాన్ని మార్చవద్దు:

‘మార్గమధ్యంలో గుర్రాన్ని మార్చవద్దు’ అన్న ప్రచారం ఫలితంగానే అధ్యక్షుడు తిరిగి ఎన్నికయ్యాడన్న విధంగా టీవీల్లో ప్రచారం ఉంటుంది. స్టాన్లీలోని కళాకారుడికి ఇది నచ్చదు. తనకు కనీసపు గుర్తింపు రాలేదననీ, అసలు సంగతినీ, తన పాత్రనూ బయటపెడతానననీ బిగుసుక్కూర్చుంటాడు. డబ్బు ఎర చూపినా, మరో దేశపు రాయబారిగా చేస్తానన్నా ఒప్పుకోడు. ‘ఇప్పుడు నువ్వు నీ ప్రాణాలతో చెలగాటమాడుతున్నావు’ అన్న హెచ్చరికను కూడా లెక్కచేయకుండా అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ప్రఖ్యాత హాలీవుడ్ నిర్మాత గుండెపోటుతో ఇంటి వద్ద మరణించాడన్న వార్త టీవీలో వస్తుంది. అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిరోజుల్లోనే అల్బేనియన్ గ్రామాల్లో తామే బాంబు దాడులు చేశామంటూ ఒక అల్బేనియన్ టెర్రరిస్ట్ సంస్థ బాధ్యత వహిస్తుంది.

కల్పనను మించిన వాస్తవాలు:

అధికారంలో వున్న రాజకీయవేత్తలు రాజకీయ మాంత్రికులతో, మీడియాతో కుమ్మక్కయి ఎన్నికలను ఎలా హైజాక్ చేస్తారో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా విడుదలైన నెలరోజుల్లోనే ప్రెసిడెంట్ క్లింటన్ – మోనిక లెవెన్స్కి స్కాండల్ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో సుడాన్లో ఆల్ఫా మందుల కంపెనీపై క్లింటన్ ప్రభుత్వం బాంబు దాడులు జరిపింది. తర్వాతి సంవత్సరం డిసెంబర్ నెలలో క్లింటన్ మీద ఇంపీచ్ మెంట్ వస్తుందనగా ఇరాక్ మీద బాంబు దాడి జరగడం కూడా యాదృచ్చికం కాదేమో! సీనియర్ బుష్ ప్రభుత్వం గల్ఫ్ వార్ దృశ్యాల్ని దృశ్యీకరించడానికి ఒక హాలీవుడ్ నిర్మాతను నియమించిన వార్త కూడా మనకు తెలిసిందే. సినిమావాళ్ళకి, రాజకీయాలకు మధ్య సంబంధాన్ని కూడా ఈ సినిమా విశ్లేషిస్తుంది. సినిమా వాళ్ళు తమ హద్దుల్లో ఉన్నంతవరకు సరేసరి. హద్దు మీరి ఎత్తువేస్తే మాత్రం ప్రాణాంతకం అన్న సందేశం ఈ సినిమాలో కనిపిస్తుంది. లేరి బెయిన్హార్ట్ ‘అమెరికన్ హీరో’ నవల ఆధారంగా తీసిన ఈ సినిమాకు దర్శకుడు బేరి లెవిన్సన్. ఈ సినిమా బెర్లిన్ ఫెస్టివల్ లో స్పెషల్ జూరీ అవార్డు గెల్చుకుంది.

వాగ్ ది డాగ్ అంటే? సినిమా ఈ మాటలతో ఆరంభమవుతుంది.కుక్క తోకెందుకు ఆడిస్తుంది? – ఎందుకంటే తోక కంటే కుక్క తెలివైంది కనుక! తోక గనుక తెలివైనది అయితే? – అదే కుక్కను ఆడిస్తుంది‘వాగ్ ది డాగ్’ అంటే తోక కుక్కను ఆడించడం. అంటే దేహాన్ని తోక ఆడించడం! అంటే పెద్దగా ప్రాధాన్యత లేనిది ప్రాధాన్యత గలదాన్ని శాసించడం! అయితే ఈ సినిమాలో కుక్క ఎవరు? తోక ఎవరు? ‘అమెరికన్ ప్రజల అభిప్రాయాలు’ కుక్క అయితే, ‘మీడియా వాళ్లు’ తోక అవ్వచ్చు. ‘మీడియా వాళ్లు’ కుక్క అయితే ‘రాజకీయ ప్రచార ఎత్తుగడలు’ తోక అవ్వచ్చు. ‘అమెరికన్ ప్రజలు’ కుక్క అయితే ‘వారి ప్రభుత్వమే’ తోక అవ్వచ్చు. ఎలా చూసినా శాసించగల అంశం శాసించబడాల్సిన అంశం ముందు మోకరిల్లడమే ఆధునిక రాజకీయ పరిస్థితుల్లోని విషాదం! ‘వాగ్ ది డాగ్’ అన్న పదబంధానికి ఈ సినిమా కొత్త అర్థం ఇచ్చిందని ఇంటర్నెట్లో ఒక నిఘంటువు కూడా చెబుతోంది. ఫలానా ఎన్నికలు ‘వాగ్ ది డాగ్’ ఎన్నికల్లా సాగాయనే పోలికలు కూడా నెట్లో కనిపిస్తాయి. ఈ సినిమా 1997 లో తీసినది. ఆ రోజుల్లో టీవీ, వార్తాపత్రికలు మాత్రమే ఉన్నాయి. ఇంటర్నెట్ లేక ఫేస్బుక్ వాట్సప్ ట్విట్టర్ వంటి సోషల్ మీడియా లేనేలేదు. ఈ రోజుల్లో ఈ మాధ్యమాల ద్వారా ‘పబ్లిక్ ఒపీనియన్’ అన్నది ఇంకెంత దుర్వినియోగానికి గురవుతోందో అర్థం చేసుకోవచ్చు.

తాజా పరిస్థితి:

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పబడే ఒకానొక ఆసియా ఖండపు దేశంలో కొద్దిరోజుల్లో ఎన్నికలు రానున్నాయి. ఆ దేశంలో ప్రధానిగా ఐదేళ్లుగా కొనసాగిన వ్యక్తి తన పాపులారిటీని పోగొట్టుకున్నట్టు ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో పొరుగు దేశంతో ‘యుద్ధం అనే ఆట’ మొదలు పెడితే ఎన్నికల్లో ప్రజాభిప్రాయం మరో రకంగా ఉంటుందేమో! పైగా కార్పొరేట్లు ఆ ప్రధాని గెలుపులోనే తమ ప్రయోజనాలు చూసుకుంటుండగా, మీడియా మొత్తం ఆ కార్పొరేట్ల చేతుల్లోనే ఉండగా, వివిధ కోర్టులు, సైన్యం, పోలీసులు, గూఢచర్య సంస్థలు వంటి ప్రతి చోటా ప్రధాన స్థానాల్లోకి ప్రధాని అనుసరించే పిడివాద సంస్థకు సంబంధించిన వ్యక్తులు చేరిపోయినప్పుడు, ఏదైనా ఒక సంఘటన జరిపినా, జరిపించినా, జరుగుతుందని తెలిసినా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోకుండా జరగనిచ్చినా – ఏదోక ఒక ఉగ్రవాద చర్య ఇట్టే జరిగిపోతుంది. ‘యుద్ధం బూచి’తో ప్రజాభిప్రాయం మలచడమే కాక, ప్రతిపక్షాల నోళ్లు కూడా మూయించే పథకాలు ఏమైనా అమలు జరగడం లేదు కదా అనే అనుమానం ఇటువంటి సినిమాల వలన కలిగితే అందులో మన తప్పులేదేమో

బాలాజి (కోల్ కతా)

ఐకా బాలాజీ: చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్థాపక సంపాదకులు. సాహిత్యం సినిమా విమర్శలు రాస్తుంటారు. ‘ముందడుగు' తరుఫున టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, సినిమా పాఠాలు, లఘు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతి శీల విమర్శకులు. ప్రస్తుతం కోల్ కతాలో నివసిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సింగిల్ విండో ఆపరేటర్ గా పని చేస్తున్నారు.
మొబైల్: 9007755403

7 comments

 • Must have been appreciated and applauded by those who could go through your write ups. I know you are an excellent film critic but the language barred me from rejoicing your excellence. I will be in touch to get text translated by you. Thank you and regards. Prasanta Chowdhury.

 • నిత్య సత్యమైన సినిమా.
  విశ్వవ్యాప్తమైన కథ.

  ఏకాలంలో ఈకథ చెప్పినా,
  ఏదేశంలో ఈకథ చెప్పినా,

  నిన్ననే ఈకథ అల్లేరేమో అని ఉలిక్కిపడేలాచేసే కథ.

 • ఆలోచింపజేసే సినిమా..
  విశ్లేషణ అద్భుతంగా సాగింది‌.

 • Refel యుద్ధ విమానాల గురించి దాదాపు అందరూ మరిచి పోయారు. రాహుల్ గాంధీ నోరుమూసుకొను మీరు చెప్పిందే వేదం అంటున్నాడు. ఇంప్రెషనిజం ప్రజల మనస్సు ల్లో నుండి అంత త్వరగా తొలిగి పోదు. కొండకచో ఎన్నికల నాటికి అందరూ ఆకలి అందరూ మరిచి పోతారు. యుద్దమే ఉనికిని ప్రశ్నిస్తుంది.

 • మనవాళ్ళు ఇంత దిగజారిపోయారు అంటారా…పదవీ లాలసత, పెదవీ లాలసత ఎంత పని అయినా చేయించ వచ్చు

 • నిజాలు మాట్లాడితే ఇపుడు దేశద్రోహి అని ముద్ర వేయడం, శాంతిని జపిస్తూ హింసతో భయాన్ని కల్పించడం ఆర్డర్ ఆఫ్ ద డే అయింది. అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారడం, సైనికుల ప్రాణాలు పణంగా పెట్టడం దారుణం.

  //యుద్దమంటే..//

  యుద్దమంటే నల్లా నీళ్లకై
  బిందెలతోటి చేసే తన్నులాటకాదు

  యుద్దమంటే టీలు తాగుతూ
  టీవీ ఛానెల్ లో చూపే రచ్చకాదు

  యుద్దమంటే ఇంటిపక్కోని
  గోడకు చిమ్మిచ్చికొట్టే ఉచ్ఛకాదు

  యుద్దమంటే ఆఖరు బంతికి
  అవుతలి దేశపోడు కొట్టే సిక్సు కాదు

  యుద్దమంటే నోళ్లు కట్టేసి
  బలవంతంగా నెలకొల్పే శాంతికాదు

  యుద్దమంటే ఒకరు గెలిచి
  మరొకరు ఓడిపోవడం మాత్రమే కాదు

  యుద్దమంటే ఆపక్కా ఈపక్కా
  కాస్త అటూ ఇటూగా అనంత విధ్వంసం

  సరిహద్దుకు రెండు వైపులా
  నిలువునా కూలిపోయే సైనిక హననం

  శాంతి కాముక సామాన్యుల
  దేశం దేశమంతా విచ్ఛిన్న శిధిలం

  ఎవరి చీకటి ఎజెండా నో
  మన మెదడు లోకి ఎక్కించబడుతోంది

  కుహనా దేశభక్తి పేరుతో
  నిశ్శబ్దం నిర్బంధంగా రుద్దబడుతోంది

  యుద్ధమంటూ జరిగితే
  ఈనేలకు ఒరిగేదేమిటో తెలియదుగాని

  పోరులో ఎంతమంది
  నేలకు ఒరగాలో ఊహించవచ్చు

  ఇప్పటికే మన చేతుల్లో
  44 కొవ్వొత్తుల మసి ఆనవాళ్లు

  మౌనాన్ని తొడుక్కుని ముందుకెళితే
  కొత్తగా ఎన్ని కొవ్వొత్తులు కరిగిద్దాం?

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.