పదవి కోసమే పాల్ బైబిల్ కథలు!

 

బి.రాధ, భీమవరం

ప్రశ్న: కె.ఎ.పాల్‌ గురించి ఎలా అర్ధం చేసుకోవచ్చునంటారు? ఆయన అమాయకంగానూ కనపడతాడు. కానీ, అనేక దేశాలలో రాజకీయ వేత్తలతో గౌరవాలు పొందే వాడంటారు. ఎలా గ్రహించగలం?

జవాబు: మీ సందేహమే, పాల్‌గారి మీద ఎక్కువ మందికి రావచ్చు. అసలు తల్లిదండ్రులు, ఏ మతం వాళ్ళయితే, ఏ ‘దేవుడి’ పేరుతో బోధిస్తే, పిల్లలు కూడా చిన్నతనం నించీ, ఆ నమ్మకాలతోనే ఎదుగుతారు. పాల్‌ విషయం కూడా అంతే. తల్లిదండ్రుల వల్ల చిన్నతనంలో ‘క్రిష్టియన్‌ మతం’ గురించీ, ‘క్రీస్తు’ గురించీ విన్నాడు. ఆ చిన్నతనంలోనే ఆ మతం కధలన్నీ తెలిసి వుండవు. అతను, ఎదుగుతోన్నకొద్దీ, ఆ మత గ్రంధం అయిన ‘బైబిల్‌’ని చదివినట్టు తెలుస్తోంది. ఎందుకు తెలుస్తోందంటే, ఆ గ్రంధంలో వున్న కధల్నీ, ఆ కధల్లో వున్న పాత్రల్నీ, ప్రస్తావించగలుగుతున్నాడు. ఆ మత గ్రంధాన్ని చదివితేనే, అందులో వున్న ఏ పాత్ర ఏం చేసిందో తెలుస్తుంది. ఆ మత గ్రంధాన్ని చదవని మామూలు భక్తులైతే, ఆ ‘మత కధల’ గురించీ, ఆ ‘పాత్రల’ గురించీ, పూర్తిగా తెలిసినట్టు మాట్లాడలేరు. ‘హిందూ మతం’ తాలూకు ‘భారతం’ అనే గ్రంధాన్ని చదవని భక్తుడికి, ‘భీముడు’ అంటే, చప్పున తెలుస్తుంది గానీ, ‘ఘటోత్కచుడంటే’ ఆ రకంగా తెలీదు.

పాల్‌ ప్రత్యేకత ఏమిటంటే, బైబిల్‌ని చదవడమే. అలా చదివిన వాళ్ళు చాలా మంది వుంటారు. అయినా, పాల్‌, ఆ మత కధల్ని ఇతరులకు చెప్పడం కూడా మొదలుపెట్టాడు. ఆ కధలూ, ఆ పాత్రలూ, అంత వివరంగా తెలియకుండానే, ఆ దేవుడి పేరుని స్మరిస్తూ వుండే భక్తులే ఎక్కువ మంది. అలాంటి వాళ్ళ ముందు నిలబడి, ఆ కధల్నీ, ఆ పాత్రల్నీ, చెపుతూ వుంటే, వాటిని ఆనందంగా వింటారు. అలా చెప్పే భక్తుడితో, వేరే వేరే ప్రాంతాల వాళ్ళు కూడా ఆ కధలు చెప్పించుకుంటారు. దానికి డబ్బు ఇస్తారు. పాల్‌ సంపాదన ఆ రకంగానే మొదట, ఒకటి రెండు చోట్ల మొదలై, అతను చాలా గొప్పగా చెప్పగలవాడని ఆ మత జనాభాలో ప్రచారం జరిగి, క్రమంగా అతన్ని అనేక దేశాల భక్తుల సంఘాల వాళ్ళు పిలవడమూ, డబ్బు మస్తుగా ఇవ్వడమూ, ప్రారంభమైంది. ఏ దేశంలో అయినా జనాలకు అనేక సమస్యలు వుంటాయి. ముఖ్యంగా డబ్బులూ, సంపాదన మార్గాలకు ఉద్యోగాలు లేని తనం, పిల్లల పెళ్ళిళ్ళ సమస్యలూ, – ఈ విధంగా అనేక సమస్యలతో సత మత మవుతూ వుంటారు. ఇలా బాధ పడే వాళ్ళకి, ఒక గొప్ప మత ప్రచారకుడితో, ప్రార్ధన చేయించుకుంటే, అతని మాట దేవుడు వింటాడనీ, తమ సమస్య తీరి పోతుందనీ, నమ్ముతారు. నిజంగా, ఆ సమస్య, ఆ ప్రార్ధన వల్ల తీరేది కాదు. జబ్బులకు వైద్యాలు కూడా జరుగుతూనే వుంటాయి కాబట్టి, చాలా జబ్బులు, ఆ రకంగానే పోతాయి. అలాగే, ఉద్యోగాలూ-పెళ్ళిళ్ళూ వంటివి కూడా, వాటి అవసరాల వల్ల అవి జరుగుతాయి. కానీ ఇవన్నీ ఫలానా గొప్ప భక్తుడు దేవుడితో చెప్పడం వల్లనే జరిగిందని, ఆ సమస్యల వాళ్ళు నమ్మి, ఆ ప్రచారకుడికి ఎక్కువ డబ్బే అప్పజెపుతారు. ఆ డబ్బు, వ్యక్తుల ద్వారా రావడమో, ఆ మత సంఘాల ద్వారా రావడమో జరుగుతుంది.

పాల్‌ వంటి మత ప్రచారకుడికి, దేవుడి దయ వల్లనే తనకీ పేరూ, సంపాదనా, వస్తున్నాయి అనుకుంటాడు. ”అసలు దేవుడు నిజమా, కల్పనా – అనే ప్రశ్న, అతనికి ఎందుకు వస్తుంది? తన డబ్బుతో, కొన్ని సంస్కరణలు కూడా చేస్తే చేస్తాడు. పాల్‌ చెప్పుకుంటాడు, తను ఎందరి సమస్యలకో, తన డబ్బుతో, దాన ధర్మాల మార్గంలో చేశానని! అనాధ పిల్లల శరణాలయాలకి, డబ్బు ఇచ్చి వుండవచ్చు. అసలు, ఆ అనాధ పిల్లలు ఎందుకు తయారవుతున్నారో అతను అర్ధం చేసుకోడు! సమాజంలో వున్న సమస్యలు పోయే మార్గం, తన వంటి గొప్ప మత ప్రచారకులు దేవుడికి చేసే ప్రార్థనలే అనుకుంటాడు. సమస్యల జనం కూడా అలాగే అనుకుంటారు. – అసలు, పాల్‌కి వచ్చే డబ్బు శ్రమ చెయ్యడం వల్ల వచ్చే డబ్బు కాదు. ఒక ‘భక్తి ప్రసంగం’ చేస్తే, దానికి కోటి రూపాయలు రావడం అంటే, అది అతని శ్రమ వల్ల వచ్చేదేనా? – ఇటువంటి మత ప్రచారాలు పెద్ద వ్యాపారాలు. ఆఖరికి ఇవి, ఏవో ఒక ‘సరుకు’ కోసం చేసే వ్యాపారాలు అయినా కావు. పాల్‌, ‘నేను ఇన్ని దేశాలు తిరిగాను, అన్ని దేశాలు తిరిగాను’ అంటాడు. అలా తిరిగి చేసిందేమిటి? మత ప్రసంగాలూ, ప్రార్ధనలూ! వాటి వల్ల జనాల్ని మూర్ఖత్వంలో నిలబెట్టి వుంచడమే జరుగుతుంది గానీ, అంత కన్నా ఏం జరుగుతుంది?

ఇక, రాజకీయ నాయకులు, పాల్‌ని గౌరవించడాల గురించి చూస్తే, రాజకీయాల వాళ్ళందరూ మూఢ భక్తులే. వాళ్ళు, వేరు వేరు మతాల వాళ్ళయినా, ‘పాల్‌ ప్రార్ధనల’ వల్ల తమకు గ్యారంటీగా మేలు జరుగుతుందని నమ్మే స్తితిలోకి పోయారు. ఉన్న పదవుల్ని నిలబెట్టుకోవాలనీ, ఇంకా పెద్ద పదవుల్లోకి పోపాలనీ వాళ్ళ ఆశలు! గొప్ప భక్తుడైన పాల్‌ మాటలు దేవుడు వింటాడనీ, తమ పదవుల్ని నిలబెడతాడనీ, ఆ రాజకీయాల వాళ్ళ నమ్మకం! అసలు, ప్రజల సమస్యల్ని తెలుసుకోవాలనీ, వాటిని తీసివేసే మార్గంలో అనుసరించాలనీ, వాళ్ళు అనుకోరు. అలా జరగాలంటే, ‘శ్రమ దోపిడీ’ విధానాన్ని తీసివెయ్యాలి. ఈ మార్గాన్ని దోపిడీ రాజకీయాల వాళ్ళు వొప్పుకోరు. అందుకే, తమ పదవులకు ప్రమాదం రాకుండా వుండాలంటే, గొప్ప భక్తుడి ప్రార్ధనలే మార్గం అనుకుంటారు. పాల్‌ గురించి విని, అతనే గౌరవంగా పిలిచారు.

కానీ, ఇదంతా పాల్‌కి ఎలా కనపడుతుంది? తను నిజంగా గొప్ప వాడిననీ, రాజకీయాల వాళ్ళు కూడా తనని గుర్తించి గౌరవించేటంత గొప్పవాడిననీ, అనుకుంటాడు. అనేక దేశాలు తిరగడమే తన గొప్ప – అనుకుంటాడు. యుద్ధాలకు వ్యతిరేకంగా చేశానంటాడు. భారత్‌కీ, పాకిస్తాన్‌కీ వున్న యుద్ధాల్ని ఒక్క ప్రార్ధనతో తీసెయ్యమనండి! యుద్ధం ఆగితే, అది, వాళ్ళ రాజకీయాల్లో కారణాల వల్లే జరుగుతుంది గానీ, భక్తుల ప్రార్ధనల వల్ల జరగదు.

పాల్‌ ఇప్పుడు ‘ముఖ్యమంత్రి’ కావాలని, తెగ ఆశ పడుతున్నాడు. ఎందుకంటే, కేవలం ‘దేవుడి’ వల్ల అతనికి సంతృప్తి కలగడంలేదు. ఒక పదవిలోకి రావాలని ఆశ పట్టుకుంది. దాని కోసం, ప్రార్ధనలు చేసుకుంటూనే వుంటాడు కదా? ‘పార్టీ’ పెట్టేసి, ప్రార్ధన చేసుకుంటే, సరిపోదా? రాజకీయాల వాళ్ళకి నెత్తి మీద చెయ్యి పెట్టి, ఆశీస్సులు ఇస్తాడు. ప్రార్ధనలు చేస్తాడు. తన ‘పదవి’కి అయినా అదే మార్గం కదా?

పాల్‌కే కాదు; ఏ భక్తుడికైనా, సమాజంలో సమస్యలు ఎందుకు వస్తున్నాయో, ఏమీ తెలీదు. ఈ మహా భక్తుడికి, దాని వల్ల ఆనందం లేదు. ‘ముఖ్యమంత్రి’ పదవి కావాలి! దేవుడితో మాట్లాడడాన్ని మించిన ఆశ ఇది!

రంగనాయకమ్మ

2 comments

 • జస్ట్ వ్యాపారం —-ఎం.ఎల్ .ఏ కూడా కాలేడు.
  మన దేశం లో. నాయకులు అంతా దేవుని. భక్తులే కదా
  జీసస్ పేరు తో — వ్యాపారం తో —డబ్బు. గడించాడు —దేశాలు తిరగడం —అందరి తో బొమ్మలు
  దిగడం —అవి చాపాయించి -తాను గొప్పవాడు అనే ఫీలింగ్ తో —కళల తో
  అమ్మ గారి జవాబు excellent
  =================
  Buchi Reddi gangula

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.