కట్టు కథ కాదు… పలు తరాల వ్యధ!

“శప్త భూమి ” రాయలసీమ చారిత్రక నేపథ్యంలో రాసిన నవల. రచయిత బండి నారాయణ స్వామి అనంతపురం జిల్లా వాస్తవ్యులు. శతాబ్దాలుగా ఎంతో మంది దేశీ విదేశీ దోపిడి కింద ఇక్కడి సమాజం తన నిజ స్వరూపాన్ని కోల్పోయిన చారిత్రాత్మక మార్పులను రచయిత 1775 సంవత్సరం నేపధ్యంలో మలిచారు. కథా వస్తువును మరీ ఊహాజనిత మూసలోకి పోనివ్వకుండా… ఆ నాటి శాసనాలకు , కాల ప్రమాణాలకు అనుగుణంగా నడిపించారు. అందులోనూ ‘బహుజన’ ప్రజల పాత్రలు ప్రయాణించిన క్రమాన్ని ప్రత్యేకించి చిత్రించారు.

శప్తభూమి అంటే శాపగ్రస్తమైనది అని అర్థం. కథ ఇతివృత్తం అనంతపురం సంస్థానం నుంచి మొదలౌతుంది. అనంతపురం సంస్థానాధీశుడిగా ఉన్న హండే సిద్ధరామప్ప నాయుడు నుంచి ప్రారంభమవుతుంది కథ. అనంతపురం సంస్థానానికి, తాడిమర్రి సంస్థానానికి మధ్యనున్న శత్రుత్వం మూలాన తాడిమర్రి రాజులు అనంతపురం సంస్థానం లోని బుక్కరాయసముద్రం చెరువుకు గండి కొట్టాలని ప్రయత్నం చేస్తారు. ఆ కుట్రను వడిసెల , గొర్ల కుక్కల సాయంతో అడ్డుకుని రాజైన సిద్ధరామప్ప నాయుడుకు చేరువైతాడు ‘బిల్లే ఎల్లప్ప’ అనే గొర్ల కాపరి. ఇక్కడ చెరువుకు గండి కొట్టాలనే శత్రువు పన్నాగానికి కారణం అనంతపురం సంస్థానంలో ఖజానాను నింపే సుంకాలు తెచ్చే భూములు బుక్కరాయసముద్రం చెరువు ఆయకట్టు కింద ఉండడమే. చెరువుకు గండి పడి గ్రామాలు మునిగి జననష్టం తో పాటు రాజ్యానికి చెందిన ఆర్ధిక వ్యవస్త పై ప్రభావం చూపే వరిమళ్లకు నష్టం చేయడం శత్రువు ఆయుపట్ల మీద దాడి. వర్షాలు లేని నాటి కరువు సీమలో అక్కడక్కడా ఉన్న చిన్నా పెద్దా చెరువుల కింద ఉన్న ఆయకట్టు భూమి ఆ నాడు ఎంతో విలువైనది.

ఇంకో వైపు కోడె నీలడు అతని మరదలు ఇమ్మడమ్మ ల మధ్య ఇష్టత సాగుతూ ఉంటుంది. ఆమె తండ్రి తనని కోడె నీలని కిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడడు. కోడె నీలని కడు పేదరికం తో పాటు చెరువు సౌకర్యం లేని ఊరికి తన కూతురు ని పంపడానికి యిష్టపడడు. ఒకనాడు తను పడ్డ కష్టాలు కూతురు పడకూడదని కోరుకుంటాడు. గత స్మృతులను నెమరేసుకుంటూ ఆకలికి తట్టుకోలేక ‘ఎలుక మాంసం , పిల్లి మాంసం పిల్లలకు తినిపించి తానూ తిన్న రోజులు’, ఒక చనిపోయిన తల్లి శవాన్ని బిడ్డ గుక్కపట్టి ఏడుస్తూ చనుకుడవటం వంటివే కాక తానొక బిడ్డను భోగం వాళ్లకు అమ్ముకోవడాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు. అవన్నీ నాటి రాయలసీమ హృదయ విషాదకర సంఘటల్ని స్ఫురింపజేస్తాయి. ఇమ్మడమ్మ కు మరో బావ అయిన బిల్లే ఎల్లప్ప ఒక మండలానికి నాయకుడు కావడంతో బీరప్ప తన కూతురు ఇమ్మడమ్మ ను ఎల్లప్ప కిచ్చి పెళ్లి జరిపిస్తాడు.

నాటి సమాజంలో వేళ్లూనుకున్న దేవదాసి వ్యవస్థ, కుల వివక్ష తో పాటు బహుజన వాడలు ఊరికి బయట ఉంచడం తో పాటు మండలాధీశుడైన వీర నారాయణ రెడ్డి మాదిగ స్త్రీలపై చేసే లైంగిక దాష్టీకాలు… నాటి స్థితిని కళ్ళకు కడతాయి. ఒక మాదిగ వ్యక్తిపై పగతో అతనికి పుట్టబోయే కూతురిని దేవదాసినిగా ఉంచాలని శిక్ష వేసి ఆ కూతురు ఎదగడం కోసం ఎదురుచూసిన వైనం అప్పటి థాష్టీకానికి పరాకాష్ట.

తన తండ్రి ని చంపినాడని క్రోధంతో పెమ్మరాజు తిమ్మప్పను మల్ల యుద్ధంలో ఓడించి తల నరికి నెత్తురుతో తాండవమాడిన బోయ ఆడపడుచు హరియక్క స్త్రీ పౌరుషానికి ప్రతీక అనిపిస్తుంది. బిల్లే ఎల్లప్ప చేత మోసగింపబడి పిచ్చోడై దేవర దున్న లాగా గ్రామాలపై పడి తిరుగుతున్న కోడె నీలడిని చూసి మనసు పారేసుకుంటుంది హరియక్క. హండే రాజునూ ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంటుంది. ఆ కాలంలోనే ఇంకో అమరనాయకుడు అయిన నాగప్ప ప్రెగడ వారసత్వానికి అడ్డు ఉండకూడదని భర్తను పోగొట్టుకున్న పడమూడెళ్ల అన్న కూతురిని సతీ సహగమనం పేరిట మంటల్లో తోయడం వంటి దూరాచారాలు కనబడతాయి. అయితే నీలడు అక్కడ ఒక్కరోజు కూడా హరియక్కతో ఉండకుండా పారిపోయి ఎల్లప్ప మండలాధీనంలో వానలు పడడానికి జరుపుతున్న జాతరలోని ‘గాలి దేవర’ ను దొంగిలించి తన గ్రామానికి తీసుకెళ్లబోతాడు. బోడె ఎల్లప్ప దాన్ని అడ్డుకుని నీలడిని హతమారుస్తాడు. హరియక్క, నీలడు ల జంటను చూసి ఆశ్చర్య పోతుంది ఇమ్మడమ్మ. పెళ్ళైనా కూడా తాను ప్రేమించిన నీలన్నే తలుచుకుంటూ ఎల్లప్పను దరి చేరనీయనందుకు బాధపడుతుంది. 

నీలన్ని చంపిన క్రోధంతో వచ్చి బలవంతంగా భార్య దగ్గరకు చేరతాడు. ఒకప్పుడు భార్య ఇమ్మడమ్మే స్వయంగా దగ్గరకు వచ్చినా కోడె నీలడు ఎంగిలి చేసిన వస్తువు గా భావించి దూరం జరిగిన ఎల్లప్ప ‘భార్య ప్రియుణ్ణి’ చంపిన తరవాత అహంకారంతో బలవంతంగా భార్యను ఆక్రమిస్తాడు. ఇంక నేను ఎల్లడి తో కాపురం చేయలేనని పుట్టింటికి చేరుతుంది ఇమ్మడమ్మ.  

అమర నాయకుడు ఐన అల్లుడు ఎల్లప్ప తన ఇంటికి రమ్మని పిలిచినా, తన ఇలాకాలో పుల్లరి (పన్ను) లేకుండా గొర్లు మేపుకోమని చెప్పినా ఆత్మాభిమానం తో వద్దంటారు బీరప్ప , ఉజ్జినమ్మ దంపతులు. పుట్టింటికి చేరిన కూతుర్ని తీసుకుని కరువు కాలంలో అక్కడ ఉండలేక వలస పోవడానికి సిద్ధమవుతుంటారు. తల్లిదండ్రులతో పాటు వలస పోతున్న ఇమ్మాడమ్మ గొర్ల మందలు రేపుతున్న మట్టి దుమారం లో తన కోసం గుర్రం పై వచ్చిన ఎల్లడిని చూసి తిరస్కారంగా తలతిప్పుకుంటుంది. ఎల్లప్ప నిరాశగా ప్రశ్చాత్తాపంతో వెనుదిరిగి పోతాడు. 

కాలం చట్రం లో పడి తిరిగే మనుషుల జీవితాలు ఎన్ని మలుపులు తిరుగుతుంటాయో. వలసెల్లి పోయిన బీరప్ప కుటుంబం తిరిగి తన వాళ్ళను కలుసుకునేటప్పటికి కొడుకులు తండ్రులై వుంటారు. తండ్రులు తాతలై వుంటారు. ’దశలు దశలు దాటుకుని వచ్చిన సీతాకోకచిలుక జీవిత క్రమమే కదా ప్రతి మనిషి జీవితం’ అన్న మాటలతో ప్రధమ భాగం ముగుస్తుంది. 

కాల గమనంలో కరువు బారిన పడిన కురువ వంశాలు తమ ఊర్లను విడిచి గొర్లను మేపుకోవడానికి వలస పోయి, తిరిగి పన్నెండేళ్ల తర్వాత జరుగుతున్న పరస ( జాతర ) లో కలుసుకుంటారు. హండే దొర చేరదీసిన దేవదాసి, పద్మసాని ని పట్టించుకోకపోవడంతో పద్మసాని రాజు ప్రాపకాన్ని వదిలేసి ఓ బీడు మైదానాన్ని ఎంచుకుని అందులో చెరువు తవ్వించి జక్కులూరును స్థాపిస్తుంది. అంతేకాకుండా చుట్టుపక్కల మండలాల్లో అమరనాయకుల చేతిలో పీడించబడుతున్న జనాలకు తన ఊరిలో ఆశ్రయం కల్పిస్తుంది. అది చుట్టుపక్కల మండలాధీశులకు మింగుడుపడదు. ఆమె కొడుకు ఇంగ్లీషు చదువులు చదువుకోవడానికి మద్రాస్ పోయి అక్కడే క్రైస్తవ మతం పుచ్చుకుంటాడు. తన మతం చేసే దురాచారాలతో పాటు తన తల్లిని అసహ్యంగా చూడటానికి కారణం అయిన బసివిని వ్యవస్థ, తనను తండ్రి ఎవరో తెలియని వాడని లోకం హేళన చేయడం వంటివన్నీ హైందవ మతం మీద అతడికి అయిష్టం పెంచుతాయి. కిరస్తాని మహిళ మేరిని పెళ్లి చేసుకుని తల్లిని చూడటానికి జక్కులూరు వస్తాడు. అక్కడ అతని తల్లి ఒక సాధువు ను పూజించటానికి రమ్మంటే వ్యతిరేకిస్తాడు. పద్మసాని పెంపుడు కూతురు నాగసాని తను పద్మసాని కి అసలు కూతుర్ని కానని, కరువు కాలంలో బిడ్డని అమ్ముకున్న బీరప్ప ఉజ్జినమ్మ ల కూతుర్ని అనీ తెలుసుకుంటుంది. పన్నెండేళ్ల కొకసారి కలిసే కురువల ‘పరస’ లో తన వాళ్ళని కలుసుకోవచ్చనే పెంపుడు తల్లి సూచనతో బయలుదేరుతుంది. తన అక్క , అమరనాయకుడు ఎల్లప్ప భార్య ఐన ఇమ్మడమ్మ ను చూసి నిర్ఘాంత పోతుంది. ఎల్లప్పను వదిలేసిన తర్వాత ఏడు పెళ్ళిళ్ళు చేసున్న సంగతి తెలిసి నాగసాని ఆశ్చర్య పోతుంది. 

దొంగల దాడిలో భర్త చనిపోతే సతీ సహగమనం చేసిన మంగలి గైరమ్మ తో పాటు అమరనాయకుదు నల్ల నాగిరెడ్డి చనిపోతే తండ్రి వీరనారాయణ రెడ్డి కోడలిని సహగమనం చేయించాలని ప్రయత్నం చేస్తే కడప నవాబుల ముస్లిం పఠాణీకుడు అడ్డుపడి తాను పెళ్లిచేసుకుంటానని తీసుకెళ్లడం మరో ఆసక్తికర సంఘటన. 

టిప్పు సుల్తాన్ తరుపున గుత్తి తాబేదార్ అనంతపురం సంస్థానం రాజు సిద్ధరామప్ప నాయుడు కప్పం కట్టలేదని కోటను ముట్టడిస్తే పన్ను కట్టనూ లేక, యుద్దానికి దిగనూ లేని స్థితిలో పడిపోతాడు సిద్ధరామప్ప నాయుడు. ఒక్క వానా కురవక చెరువులు ఎండిపోయి పంటలు పండక ప్రజలు వలసలు పోతుంటారు. ఖజానాకు కూడా సరైనన్ని నిధులు సమకూరని పరిస్థితి. చివరికి కప్పం కట్టలేక ఒక చెరువున్న గ్రామాన్ని నవాబుకు తనఖా పడతాడు. మధ్యవర్తిగా వచ్చిన గుత్తి తాబేదార్ సిద్ధరామప్ప నాయుడుని కట్టలేకపోతే బీగముద్రలు ( తాళాలు ) అప్పగించమని కరాకండిగా చెపుతుంటే ఎల్లప్ప అవమానబారంతో, కోపంతో రగిలిపోతాడు. కత్తి దూయబోయి దళవాయి సుబ్బారాయుడు సైగతో ఆగిపోతాడు. పూర్వపు వైభవం మొత్తం పోయి వానల కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడుతుంది. తన రాజుకు పట్టిన ఆ దుస్థితి చూడలేక ఎల్లప్ప శ్రీశైల మల్లికార్జున స్వామి సన్నిధిలో వీరమంటపం ( ఆత్మర్పణం ) ఎక్కడానికి సిద్ధమవుతాడు. తన భార్య బిడ్డలతో కలిసి శ్రీశైలానికి పయనమవుతాడు. వర్షాలు కురవాలని , తన రాజు రాజ్యాన్ని నవాబుల పాలు కాకుండా ఉండాలని , ‘సగం ప్రపంచం మునిగిపోనినా పర్వాలేదు కానీ అనంతపురం పై కుంభవృష్టి కురవాల’ని కోరుకుంటాడు. శరీరంలో అవయవాలన్ని ఒక్కొక్కటి కత్తిరించి దేవతలకు సమర్పణ చేసుకుంటాడు. ఆ భీకర కార్యం తర్వాత రాజ్యంలో ఉరుములు ఉరిమాయి , పెళ పెళ మని మెరుపులు మెరిసాయి కానీ వర్షం మాత్రం రాలేదు. 

ఆ వీరుడి మరణం తర్వాత వాన ఒక్క చుక్క పడలేదు

టిప్పు సుల్తాన్ కు పన్ను కట్టలేదు

గుత్తి తాబేదార్ వచ్చి కోట తాళాలు వశం చేసుకున్నాడు

రాజు సిద్ధరామప్ప నాయుడు తన దివాణం లోనే ఖైదీ అయ్యాడు. 

టిప్పు సుల్తాన్ పోయి నిజాం నవాబు వచ్చాడు

నిజాం ను వదిలించుకుంటే సీమ ఇంగ్లీషు వాని పాలబడింది

ఇదీ సీడెడ్ జిల్లాల కథ , వదిలించుకున్న జిల్లాల కథ. కరువు కాటకాలు , పాలేగార్ల కొనసాగింపే కదా ‘శప్త భూమి’ కథ అంటారు నవలా రచయిత బండి నారాయణ స్వామి.

నవలా రచయిత నారాయణ స్వామి

 

వంశీ పులి

వంశీ పులి: పూర్తి పేరు పులి. వంశీధర రెడ్డి. స్వస్థలం: కర్నూలు జిల్లా లోని వెల్గోడు గ్రామం.
డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి,. ప్రస్తుతం కర్నూలులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు .

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.