ఇప్పుడిదొక బహిరంగ బహిర్భూమి!

ఇక్కడ తిమింగలాలు సముద్రాన్ని శాసిస్తాయి
చిన్న చేపలెప్పుడూ చితికి పోవడమే!

చట్టం ఎప్పుడంటే అప్పుడు కళ్లు మూసుకుంటుంది
తెరిచిన కళ్ళను అప్పటికప్పుడు పెకిలించి వేస్తుంది

నల్లకోటు చిమ్మచీకట్లో ఎక్కడ తప్పిపోయిందో ఎవరికీ తెలియదు
దానిని వెతుకుతూ వెళ్ళిన వాడెవడు
మళ్లీ వెలుగులోకి వచ్చిన దాఖలాలు లేవు

అధికారానికి స్వేచ్ఛ
స్వేచ్ఛకు సంకెళ్ళు

ఇక్కడ చీకటే వెలుగు
వెలుగే చీకటి

ప్రశ్నించే వాడికి చెరసాలే స్నేహితుడు
బుల్లెట్ల మీద తను రక్తంతో చేసిన సంతకమే ఏకైక సాక్ష్యం
హక్కుల కోసం పోరాడితే
జీవించే హక్కును కోల్పోయే సుందర ప్రదేశం నా దేశం!

ఇక్కడ ఎవడికి వాడు బతకలేడు
ఎవడికోసమూ బతకలేడు
ఎవడికి వాడు బతికినా అభద్రతే
ఎవడి కోసం బతికినా అభద్రతే!

నాకు నచ్చినట్టుగా నేను బొట్టు పెట్టుకోలేను
నచ్చినట్టుగా టోపీ పెట్టుకోలేను సిలువా వేసుకోలేను
ఇక్కడ ప్రతి దానికి రాజ్యాంగం అనుమతి కాదు…
రాజ్యం  అనుమతి కావాలి!

బొట్టు పెట్టుకునే దగ్గర టోపీ పెట్టుకున్నా
టోపీ పెట్టుకునే దగ్గర సిలువ వేసుకున్నా
కొన్నిసార్లు ఉనికే ప్రశ్నార్థకం!
ఇక్కడ సామరస్యం ఎప్పుడంటే అప్పుడు ఎగదోయబడే కుంపటి!

ఓటుకూ నోటుకు, ఓటుకూ మందుకు ఉన్న
అక్రమ సంబంధానికి పుట్టిన బిడ్డలే నా దేశ రాజకీయ నాయకులు!
జపించేది గాంధీ మంత్రాలు
జరిపించేవి గాడ్సే పనులు!

నాలుగు వందల ఏళ్లు బానిసలుగా బతికినా లేనంత బాధ ఆక్రోశం
ఇప్పుడున్నాయి
ఈ బానిసత్వం నుండి ఎప్పుడు విముక్తులమవుతామో ఎవరికీ తెలియదు!

ఎక్కడ చూసినా మలమలమాడే పేగులు
వైద్యం అందని రోగులు
పేగులు మాడాల్సిందే
రోగులు చావాల్సిందే
అదిగో ఆర్తనాదాలతో…భారత్ వెలిగిపోతోంది!

నిత్యం నలిగిపోతున్న మనుషుల గురించి ఈ దేశంలో బెంగ లేదు
మూగ జీవుల పట్ల మాత్రం మా ప్రేమ శంకించలేనిది!

ఐదు సార్లు టాయిలెట్ కోసం వెళ్లి నీళ్లు లేక తిరిగొచ్చిన అమ్మాయి
ఆరవసారి తరగతి గదిలోనే…సిగ్గుపడాలో
ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన నా దేశ ప్రతిష్టను చూసి
ఎలా గర్వపడాలో తెలియని స్థితి!

నడిరాత్రి స్త్రీల సంగతి అటుంచు
ఇక్కడ మేకనూ వదలరు… కుక్కనూ వదలరు!
ఇక్కడి మగ జంతువు ప్రతి జీవినీ అత్యాచారం చేయగలదు
కాశ్మీర్ లో అయినా కన్యాకుమారిలో అయినా!

యుద్ధం అనివార్యమైన చోట మౌనాన్ని ఆశ్రయించడం ఇక్కడ పరిపాటే
మన దాకా రానంతవరకు ఇక్కడ ఎవడికీ పట్టింపు ఉండదు
కొంతమంది పిచ్చి వాళ్లకు తప్ప!

దశ కంఠులు,శతకంఠులు తిష్ట వేసిన చోట
ఒక్క ముఖంతో బతకడమంటే
వేల సార్లు మృత్యులోయలోకి వెళ్లి రావడమే!
బాధ్యతతో మెలిగే వాడికి ఇక్కడ బతకడం కత్తిమీద సామే!

తక్షణ శిక్ష
సత్వర న్యాయం కరువైన చోట
నగరం నడిబొడ్డున  కామపిశాచాలు!
మూర్ఖత్వానికిక్కడ  సరైన మందు లేదు
కుల అహంకారం డబ్బు మదం
తీరని అధికార దాహాలతో
ఇప్పుడిదొక బహిరంగ బహిర్భూమిని తలపిస్తోంది!

కాసుల ర‍వికుమార్‍

ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కవి,రచయిత, లీడ్ వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్; "ముగింపులేని వాక్యం" కవితా సంపుటి రచయిత; నర్సంపేట, వరంగల్ రూరల్ జిల్లా సెల్: 9908311580

12 comments

  • ఎక్కడ మొదలయ్యి ఎక్కడ కెళ్ళావు తమ్ముడూ, గాంధీల్ని కన్నా గాడ్సేల ప్రస్తావన కాషాయానికి అతికింది. రాజ్యమూ రాజ్యాంగమూ వేరన్నావు. అదీ బాగుంది. మూగజీవుల్లో ఆవు కనబడింది. దేశంలో లేని బాత్రూములు కనిపించాయి.

    రవీ, నీ కవితలో ఎంతో గాఢమైన అభివ్యక్తిని చవిచూపావు. థ్యాంక్యూ కవిత చదివి చాలా ఆనందమేసింది. ఆ చిక్కదనం కూడా !

  • రస్తా సంపాదకులకు హృదయపూర్వక ధన్యవాదాలు

  • చాలా చాలా బాగా వ్రాశారు బ్రదర్ .

  • It’s an excellent poetry . Which is predicted in current indian political scenario. I love it each sentence

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.