అతడి సందేహాలూ ‘ఆమె’ జవాబులు

భాస్కర్

చాలా కాలం తర్వాత ఒ మంచి కవిత్వాన్ని చదివానన్న సంతృప్తిని కలిగించింది కె. భాస్కర్ గారి “ఆమె…”. తెలుగు కవుల కల్పనలో ఎంతో మంది అందమైన స్త్రీలు వున్నారు. కృష్ణశాస్త్రి గారి “ఊర్వశి”, నండూరి సుబ్బారావు గారి “ఎంకి”… చలంగారి స్త్రీ పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే భాస్కర్ గారి “ఆమె” ఓ గొప్ప తత్త్వవేత్త. సంసారపు సౌందర్యాల మధ్య తన అందమైన, అర్థవంతమైన, ఆలోచనలని రేకెత్తించే సమాధానాలతో నిరంతరం మగవాడికి సవాలు విసురుతోంటోంది “ఆమె”. “ఆమె”కు ప్రత్యేకమైన పేరు లేదు. కానీ ఆమెలో ఆమే ప్రధానాంశం.

సంభాషణాత్మక కవిత్వం అరుదు. పురాణ, ప్రబంధ కావ్యాలలో కొన్ని చోట్ల పద్యరూప సంభాషణలు వున్నాయి. కానీ ఆధునిక కవిత్వంలో ఇలాంటి ప్రయోగం అరుదు. కవి లేదా కవయిత్రి తన భావనా ప్రపంచంలో విహరిస్తూ, మనల్ని కూడా మంత్రముగ్ధుల్ని చేసి వినూత్న లోకాల్లోకి తీసుకెళ్లిన అనుభవం మనకు చాలానే వుంది. “మంత్రనగరానికి వెళ్లొచ్చినవాడు/ మధ్య మధ్య మాధ్వరసం చేదంటాడు/ వధ్యశిల మీద విరహగీతం రాస్తాడు/ మాతోపాటు నడుస్తానంటాడు/…” అంటూ తిలక్ కృష్ణశాస్త్రిని వర్ణిస్తాడు. మాయలూ, మంత్రాలూ లేని ఈ ఆధునిక సమాజంలో మంత్రనగరికి వెళ్లి ఎవరొస్తారు? మన చుట్టూ, మన ఇంట్లో పురుషుడు, స్త్రీ అత్యంత సహజమైన వాతావరణంలో కవిత్వ సౌందర్యం చెదిరిపోకుండా అప్పుడప్పుడూ గంభీరంగా, అపుడపుడు సున్నితంగా సంవాదం సాగిస్తూ మనల్ని వింత లోకాలకి తీసుకెళ్తారు ఈ “ఆమె…”లో.

“కవిత్వం మారిపోతుంది. కవితా స్వభావం మారిపోతుంది” అంటాడు తిలక్, “నా కవిత్వంలో నేను దొరుకుతాను” అనే అసంపూర్ణ కవితలో. చాలా కాలం ముందే “కాదేదీ కవిత్వ కనర్హం” అంటూ శ్రీశ్రీ “ఉండాలోయ్ కవితావేశం! / కానీవోయ్ రస నిర్దేశం! / దొరకదటోయ్ శోభాలేశం! / కళ్లంటూ ఉంటే చూసి/ వాక్కుంటే వ్రాసీ!” అని కూడా అన్నాడు. నిజంగానే కవిత్వం మారిపోయింది, స్వభావమూ మారిపోయింది. 1980లలో అనేకానేక సందిగ్ధాల మధ్య కవిత్వం నిశ్శబ్దాన్ని ఛేదించుకుంటూ అనేకానేక కొత్త రూపాలు తీసుకుంది. ఎన్నో కొత్త ప్రయోగాలు! తెలుగు సాహిత్యపు నిరంతర ప్రయాణంలో “ఆమె…” ఓ అందమైన మలుపు.

మంచి పుస్తకం సురేష్ గారు ఈ కవితా సంకలనాన్ని చేతికిచ్చి మన Spreading Lightలో మీరు దీనిపై మాట్లాడండి అన్నారు. సాహిత్యం నుండి చాలాదూరంగా విసిరివేయబడ్డ నేను ఏం మాట్లాడగలను? ఆ సంశయాల సమవాకారమే ఈ సమీక్ష! “ఆమె…”లోని కవితలని ‘బేకారీలు’ అన్నారు భాస్కర్. “Non-serious Poetry” అనేది వారి ఉద్దేశం. కానీ “ఆమె…”ను చదివాక నేను చాలా ఆశ్చర్యానికి గురి అయ్యాను. “ఆమె…” చాలా సీరియస్ పొయెట్రీ. నావరకు నాకు “ఆమె…” ఓ గొప్ప కళాప్రక్రియ – a genre! భర్త చేసే చిన్న చిన్న ప్రతిపాదనలను అత్యంత సున్నితంగా సవరిస్తూ ఉంటుంది ఆమె. స్త్రీ-పురుష సంవాదంగా సాగిన రచనలో ఈ స్త్రీ పాత్ర – సహధ్యాయిని, ఉపాధ్యాయిని, దార్శనికురాలు, తత్త్వవేత్త, సాధారణ స్త్రీ, భార్య, తల్లి. ఈ కవితా సంకలనానికి ఎవరూ ముందుమాట రాయకపోవడం లేదా రాయించకపోవడం – నాకు మరింత ఆనందాన్నిచ్చింది. శ్రీశ్రీ కవిత్వాన్ని తూచే రాళ్లు తన దగ్గర లేవన్నాడు చలం – నిజానికి ఎవరి కవిత్వాన్ని తూచడానికీ, ఎవరివద్దా రాళ్లు లేవు. భాస్కర్, సురేష్‌ల అమాయకత్వం కాకపోతే నేను ఈ కవిత్వంపై పరిచయాత్మక విమర్శ రాయగలనా?
Back coverపై ఓ మూడు బేకారీలు ఉన్నాయి:

“అజ్ఞానానికి, జ్ఞానానికి మధ్య
కొన్ని ప్రశ్నలు ఉంటాయి” అంటూ
“ఎంతటి జ్ఞానికైనా కొన్ని ప్రశ్నలు మిగిలే ఉంటాయి” అంటాడు. కొంత తార్కికత లోపించిందేమో అనిపించింది. దాని తర్వాతి బేకారీ:
“నీ కిటికీలో నుంచి ప్రపంచాన్ని చూడు
స్వతంత్రుడివి అవుతావు
నీ కిటికీనే ప్రపంచమనుకుంటే మూర్ఖుడివి అవుతావు”
అన్నప్పుడు నాకు నిజంగానే నవ్వొచ్చింది. ఈవేళ మన ప్రపంచాలు అన్నీ కిటికీ (Windows)లే కదా! మూడవ బేకారీ గురించి తరువాత మాట్లాడుకుందాం.

“రాళ్లని ప్రేమించేవాడు
హృదయాన్ని ప్రేమిస్తాడు” అని అతనంటే
“ఎందుకంటే
రెండూ శిల్పంగా మలచబడేవే
అంటుందామె, అతన్ని ప్రేమగా చెక్కుతూ” (1) – చాలా గడుగ్గాయి, చెప్పకనే చెబుతోంది అతను ఇంకా శిల్పంగా మారని రాయి అని.

“అతనడిగాడు, ఇన్ని చెబుతావ్ కదా
మరి జీవితానికి నువ్విచ్చే నిర్వచనం ఏమిటని

నిర్వచిస్తే అది జీవితమూ కాదు
ఆ నిర్వచనానికి జీవితమూ ఉండదంటూ
వెళ్లిపోతుందామె, గాలి పువ్వై అతన్ని తాకుతూ” (32) అన్నప్పుడు నిర్వచనాల మధ్య జీవిస్తూన్న ఆధునిక మానవుణ్ణి ప్రశ్నించిందావిడ. అది జవాబా? ప్రశ్నా?

“ఒకే అంశం నీకు దుఃఖాన్ని
నాకు సంతోషాన్ని మిగిలిస్తే
మన మధ్య ఉన్న వారధి ప్రేమై మిగలదు” అన్న అతని సందేహాన్ని
“కళ్లు తుడుచుకుంటూ అంటుందామె
ప్రేమ వారధి కాదు
ఆకాశంలా ఆవరించుకొని ఉండేది
ఒకేసారి ఒక దగ్గర నిర్మలంగాను

ఇంకో దగ్గర జడివానలాగాను వుండగలదది” (55) అని వివరిస్తూనే ప్రేమ విశాలత్వాన్ని విశదపరుస్తోంది. ద్వైతాల మధ్య ప్రేమ ఉండదు. కానీ “ఆకాశం గగనం శూన్యం” అని పాత సాహిత్యంలో ఎక్కడో చెప్పారు కదా! అయితే “ఆమె” ప్రేమతత్త్వం మరింత విస్తరించిన ఇంకో బేకారీ:

“మనుషులను ప్రేమిస్తూనే వుండాలి
అమాయకత్వానికి జాలిపడ్డా
మూర్ఖత్వానికి సిగ్గుపడ్డా
అహంకారంతో అణచబడ్డా
జ్ఞానానికి గర్వపడ్డా
ద్వేషానికి గాయపడ్డా
మరిచిపోకు, మనుషులను ప్రేమిస్తూనే వుండాలి
అంటుందామె, పాలిండ్లు కొరికిన పసిబిడ్డను
పక్కకు తీసి, ప్రేమతో గుండెలకు హత్తుకుంటూ.” (56)

ఈ కవితలో ఆమె తనను తాను ఓ బుద్ధుడు, ఓ జీసస్, ఓ మహాత్మ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది.
1980-1990లలో సాహిత్య ప్రపంచంలోకి తొంగిచూసే ప్రయత్నం చేసిన చాలా తెలుగు కవులు ఓ అర్థం కాని విసుగు, కొంతమేరకు నిరాశలకు గురికావడం గమనిస్తాం. ఫలితంగా సిద్ధాంతాల గోల నుండి తమను తాము దూరం చేసుకునే ప్రక్రియ కనబడుతోంది.

“సెంటిమెంటల్ ఫూలిజంకి
ఐడియలాజికల్ ఫూలిజంకి
తేడా ఏంటని అడిగాడు అతను

ఒకదాన్ని అర్థం చేసుకోవచ్చు
ఇంకొకటి అర్థం చేసుకోనీదు
రెండూ, మనిషి కళ్లు మూసి
తన చుట్టూ తిప్పుకునేవే
అంటుందామె, అతన్ని అమాయకంగా చూస్తూ” (205) అన్న బేకారీలో కొంత మొరటుగా చెప్పింది.

కానీ 42వ బేకారీలో ఆ సమాధానం చాలా తాత్త్వికంగా, కవితాత్మకంగా వుంది:

“ఎంతటి వరదయినా
కొద్ది కాలంలోనే
రెండు దరుల మధ్య
నదిలో ఒద్దికగా ఒదిగినట్లు
ఎలాంటి విప్లవమైనా
రెండు గీతల మధ్య
నిలకడగా సాగే వ్యవస్థనే సృష్టిస్తుంది

వరదలూ, విప్లవాలూ వస్తుంటాయ్
కాసేపయ్యాక జీవితాలు సహజంగా
అలా ప్రవహిస్తూనే వుంటాయ్, అంటుందామె
బిగించిన అతని పిడికిలితో ఆడుకుంటూ.”
పురుషుడు స్త్రీగా మారితే తప్ప స్త్రీని ఎప్పటికీ తెలుసుకోలేడు. పురుషుడి విషయంలో స్త్రీ కూడా అంతేనేమో? ఆమె అంటోంది:
“….
….
స్త్రీకి సంబంధించి
పురుషుడెప్పుడూ నిరక్షరాస్యుడే
….
….” (264)
కవితా సంకలనపు ముగింపు కూడా చాలా నాటకీయంగా వుంది.

“తన నిష్క్రమణ
నా నిద్రకు తెలియనంత నిశ్శబ్దంగా
రాత్రి పడుతున్న వర్షం
ఎపుడో వెళ్లిపోయింది
మట్టిపాత్రలను నీటితో నింపి
అచ్చు, ఆమెలానే.” (278)

“ఒక అర్ధరాత్రి
గాఢనిద్రలో వున్న చెట్టుకు కూడా తెలియకుండా
ఓ ఆకు రాలిపోయినట్లు
కవితొక్కటి రాలిపోయింది
ఆమె కల్లోలంతో నిద్రిస్తున్నపుడు
ఇంకెప్పటికీ అది ఆ చెట్టు చేరలేదు” (279)
“ఆ రాత్రికి
ఆమె నిదుర దీపాన్ని వెలిగించింది
కనీసం, కలల కాంతిలోనైనా విహరించాలని” (280)

ఈ పుస్తకం సురేష్ గారు నాకిచ్చి, దీనిపై మాట్లాడండి అన్నపుడు, నాకు కవితో మాట్లాడే ఆవవకాశం ఇవ్వండి అన్నాను. ఆధునిక సాహిత్యం రోజురోజుకి వ్యక్తిగతం, వ్యక్తి కేంద్రం, కవులు తీసుకునే images, ప్రయోగించే పదాలు – అన్నీ వారి వ్యక్తిగత జీవితం, వారు చదువుకున్న విషయాలు, అనుభవాలు – వీటిపై ఆధారపడి వుంటాయి. అయితే message పెట్టిన కొద్ది రోజులకు కానీ భాస్కర్ దగ్గరనుండి జవాబు రాలేదు. చాలా సమయం తీసుకుని ఇచ్చిన జవాబులో – తానేమీ ప్రత్యేకంగా గొప్ప కవుల్ని చదవలేదని, ఎదో అలా, అలా… అంటూ. కానీ 101వ బేకారీలో
“ఈ దిబ్బాస్, జబ్దాజ్, పోషో లాంటి
గొప్పవాళ్లెవ్వరూ నాకు తెలీదు, అన్నాడతను బాధగా
….” అన్నప్పుడు కవి పరోక్షంగా పాఠకుల్ని తస్మాత్ జాగ్రత్త అని ముందు హెచ్చరికలు పంపించినట్టే వుంది.

మొత్తంమీద “ఆమె…” ఓ అందమైన కవిత్వం మాత్రమే కాదు. చాలా serious poetry. అనేక కవితల్లో సామాజిక విషయాలపై వ్యంగాస్త్రాలున్నాయి. స్త్రీ, పురుష సంబంధాలపై గొప్ప ఆలోచనలున్నాయి. ముఖ్యంగా “ఆమె” ఓ స్త్రీ – ఊరిస్తుంది, ఊరడిస్తుంది, ప్రశ్నిస్తుంది, సమాధానాలిస్తోంది, సమన్వయపరుస్తోంది, పురుషుణ్ణి సంస్కరిస్తోంది. మధ్యలో అనేకానేక భావాలు – ఆనందం, నిరాశ, ప్రేమ, విసుగు… చాలా బేకారీలలో ముగింపు పదాలు మొత్తం narrativesకి ఒక మలుపుని, ప్రశ్నని చేర్చినట్టుంది. “అతన్ని ప్రేమగా చెక్కుతూ”, “బలంగా హత్తుకుంటూ”, “వెటకారంగా చూస్తూ”, “బేరీజు వేస్తూ”, “మరోసారి నిట్టూరుస్తూ”, “కాస్తంత హాస్యం పూసి ఊరడిస్తూ”, “మారుతున్న రంగులు చూస్తూ”… ఇలా దాదాపు అన్ని బేకారీలునూ!

“స్త్రీకి సంబంధించి, పురుషుడెప్పుడూ నిరక్షరాస్యుడే” అన్న “ఆమె” సృష్టికర్త 97వ బేకారీలో “క్రియేటివ్ మెనోపాజ్” అనే పదం వాడాడు. “క్రియేటివ్ మెనోపాజ్” అనే పదం నాకెందుకో ఇబ్బందికరం అనిపించింది. స్త్రీలో పునరుత్పత్తికి సంబంధించిన హార్మోనులు తగ్గే స్థితే మెనోపాజ్. అదేమైనా oxymoronic ప్రయోగమా అని కూడా ఆలోచించాను. సందర్భం అలా లేదు. భాస్కర్‌ని అడిగితే సృజనాత్మక ప్రక్రియ తగ్గిపోవడం అనే ఉద్దేశంతో వాడాను అన్నాడు. పూర్తిగా అంగీకరించలేకపోయినా, ఇక మౌనం వహించాను.

మనం ఇంతకుముందు కవర్ పేజీపై వున్న రెండు బేకారీల గురించి మాట్లాడుకున్నాం. మూడో బేకారీ:

“మార్పే సత్యం
తర్కమే జ్ఞానం
ప్రశ్నే మార్గం
సత్యజ్ఞాన మార్గమే జీవితం”
అంటోంది. కొంత Sermon on the Mountలో సూక్తిముక్తావళి అనిపించింది. మార్పే సత్యమైతే ఏ తర్కమూ జ్ఞానాన్ని శాశ్వతంగా నిలపలేదు. ప్రశ్నే మార్గమయినపుడు నిశ్చితమైన సత్యజ్ఞాన మార్గమూ లేదు.

మొత్తంమీద “ఆమె…” అనే శీర్షికతో భాస్కర్ రాసిన కవితలు బేకారీలు మాత్రం కావు. చాలా తీవ్రమైన, ముఖ్యమైన స్త్రీ-పురుష సంబంధాల చర్చ వుంది. అయితే ఈ మొత్తం కవితల్లో (మొత్తం 280 బేకారీలు) పురుషుడి ప్రతి ప్రతిపాదనని – ఆమె సవరిస్తున్నట్టుగానో, తిరస్కరిస్తూన్నట్టుగానో వుంది. ఈ సంబంధాలలో మనం సాధించవలసిన సమానత్వం మళ్లీ ఇంకోవైపుకి ఒరుగుతోందా? కానీ వేల ఏళ్లుగా స్త్రీని అసమానంగా చూసిన సమాజంలో అవతలివైపు మొగ్గు చూపించే కవితలు ఇంకా చాలా రావడమే ఆ ప్రయత్నంలో ముందడుగేమో? భాస్కర్ చెప్పడం – తను షుమారు 1000కి పైగా బేకారీలు రాసినట్టు. అందులో ఓ 400 నిర్దిష్టమైన రూపం తీసుకున్నట్టు, మృత్యుంజయ రావు, శ్రీసుధ గార్ల (వీరు నాకు తెలియదు) సహకారంతో ఈ “ఆమె…” అనే రూపంలో ఓ 280 బేకారీలు పుస్తక రూపం చెందటం.

కొంత సూక్తిముక్తావళిలా అనిపించినా, అనేక భావాలు, ఆలోచనలు సంఘర్షించడం వల్ల, ప్రతి బేకారీలో “ఆమె” అనేక మనోభావాలని ప్రదర్శించడం వల్ల, గొప్ప తాత్త్విక చర్చలని కూడా చాలా అందంగా, కవితాత్మకంగా చిత్రీకరించడం వల్ల – ఈ బేకారీలు మనల్ని క్షణం ఆగకుండా పరిగెత్తిస్తాయి. తెలుగు కవిత్వంలో ఇది స్వాగతించదగ్గ రూపం, ప్రయోగం.

అవధానం రఘుకుమార్

:కర్నూలు జిల్లా నందికొట్కూరులో పుట్టి పెరిగిన అవధానం రఘుకుమార్ ప్రస్తుతం హైదరాబాద్ లో వుంటున్నారు. హై కోర్టు న్యాయవాది. ఎక్కువగా చదివి తక్కువగా రాసే మంచి రచయిత. ఇటీవలే తన మొదటి కవితా సంపుటిని వెలువరించారు గాని, చిరకాలంగా రాస్తున్నారు.

4 comments

 • “తెలుగు సాహిత్యపు నిరంతర ప్రయాణంలో “ఆమె…” ఓ అందమైన మలుపు.”
  చాలా చక్కటి రివ్యూ ..భాస్కర్ గారికి అభినందనలు.
  రఘుకుమార్ గారికి ధన్యవాదాలు.

  • Thank you Rajasekhar Chandran. మీ comments నాకు మరింత ఆనందాన్ని కలిగించాయి.

 • స్త్రీ కి సంభందించి పురుషుడు
  ఎప్పుడు ని ర క్ష రా స్యు డే

  నిజం– పురుషుడు స్త్రీ ని ఎప్పటికి తెలుసుకోలే డు
  రఘు గారు –యిది సీరియస్ పోయెట్రీ — కొత్త ప్రయోగం
  మీ మాటలు నిజం సర్

  ————————————–
  బుచ్చి రెడ్డి గంగుల

  • థాంక్స్ బుచ్చి రెడ్డి గారు. మీ comments నాకు మరింత ఆనందాన్ని ఇచ్చాయి.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.