కువిమర్శ మీదైనా అక్కసు అవసరమా?!

విమర్శ అంటే ఏమిటి? ఒకదానిలోని మంచి చెడ్డలను వివేచించి చెప్పడం. ప్రతి వ్యక్తికీ తనకే సొంతమైన ఒక సంస్కారం, ఒక అభిరుచి ఉంటుంది. ఇది పుట్టిన నాటి నుండి వ్యక్తి పెరిగిన వాతావరణం, గ్రహించిన అనుభవం, సాధించిన జ్ఞానం, వివేచింపగలిగిన మేధపై ఆధారపడి ఉంటుంది. దేన్ని చూసినా, ఏది విన్నా, దేన్ని రుచి చూసినా, ఏ అనుభవం పొందినా అది ఇష్టమవడమో, కాకపోవడమో, వెగటు పుట్టడమో, ఏవగింపు కలగడమో జరుగుతుంది. ఇది ఆ వస్తువుకు సంబంధించిన లక్షణం కంటే కూడా ఆ అనుభవం పొందే వ్యక్తి మీదే ఎక్కువ ఆధారపడుతుంది. ఆ వ్యక్తి కూడా సర్వకాల సర్వావస్థలలోనూ ఒకే విధమైన అనుభూతి పొందడు. ఇవ్వాళ రుచిగా ఉన్నది రేపు ఉండకపోవచ్చు. ఇవ్వాళ ఇష్టమైనది రేపు కాకపోవచ్చు. నిన్నటి వరకు నాస్తికుడైన వ్యక్తి ఇవ్వాళ ఆస్తికుడు కావచ్చు. ఆ వ్యక్తి ప్రాపంచిక దృక్పథమే మారిపోవచ్చు. వ్యక్తికి సంబంధించి ఇదంతా రకరకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది.

అయితే దీనికి సామాజిక పరమైన మరోకోణం ఉంది. వ్యక్తి ఇష్టాయిష్టాలెటువంటివైనా సామాజిక ప్రమాణాలుకొన్ని ఏర్పడతాయి. విశ్వజనీనం అన్నది పెద్దమాట కావచ్చుకాని సాధారణ సూత్రాలు కొన్ని సిద్ధమవుతాయి. వాటికి శాస్త్రత్వం చేకూరుతుంది. అది ఆధారంగా మంచి చెడ్డల నిర్ణయం చేయవచ్చు. అది సమాజానికి ఉపయోగకరం అవుతుంది.

అయితే ఇవ్వాళ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక జీవనంలో విమర్శ అంటే మంచిచెడ్డల వివేచన అన్న అర్థమే పోయింది. విమర్శ అంటే ఖండన, దూషణ, కేవలం చెడును ప్రదర్శించడమన్న అర్థం ఏర్పడిపోయింది. విమర్శించడం అంటే కేవలం దోషాలు చూపించడమనుకుంటున్నాం. ఇవ్వాళ్టి రాజకీయాలు చూడండి. విమర్శలు గుప్పించడం, విమర్శనాస్త్రాలు సంధించడం వంటి ప్రయోగాలన్నీ నిందాపరమైనవే. బహుశా అందుకే కావచ్చు, విమర్శ అంటే అసహనం. ఎవరూ మరొకరు తమ తప్పు ఎత్తి చూపించడం సహించలేకపోతున్నారు. రాజకీయాల్లో ఇది మరీ ఘోరంగా పరిణమిస్తూ ఉంది. వ్యక్తి ఏదో ఒక బృందంలో చేరిపోవడం తప్ప యుక్తాయుక్త విచక్షణ లేకుండా పోయింది. విమర్శించిన వ్యక్తి శత్రువై పోతున్నాడు. ఆ వ్యక్తిని శత్రుపక్షంలోకి నెట్టివేసి దేశద్రోహి, జాతిద్రోహి అనడానికి కూడా సందేహించడం లేదు. ఇది లాభనష్టాలు భారీగా ఉండే రంగం. కాబట్టి ఇటువంటి ప్రతిక్రియ సహజమనుకుంటున్నారు

అసమ్మతిని, విమర్శని స్వీకరించే మనఃస్థితి లేకపోతే సరిదిద్దుకునే అవకాశం ఉండదు.

విమర్శ పట్ల అసహనం ఇవ్వాళ కొత్తగా ఏర్పడిందేమీ కాదు. అన్న రంగాల్లోనూ ప్రాచీన కాలం నుండీ ఉన్నదే. పాపులర్ విశ్వాసాలకు భిన్నంగా ఏదైనా కొత్త విషయం చెప్తే దానికి తీవ్ర ప్రతి స్పందన వస్తుంది.

సాహిత్య రంగం దీనికి అపవాదం కాదు. దాదాపు అందరు రచయితలకూ ఈ అనుభవం ఉండే ఉంటుంది. కొంతమంది కవుల్ని విమర్శించడానికీ, ప్రశంసించడానికీ కూడా కథలు లోకంలో ప్రచారానికి వచ్చాయి.

మేఘదూతంలోని ఒక శ్లోకాన్ని వ్యాఖ్యానించే సందర్భంలో ఒక అంతరార్థాన్ని చెప్తారు. దిఙ్నాగుడు వంటి వారు కల్పించిన నిరోధాలను సరసుడైన నిచులుడు వంటి మిత్రులు తొలగించగా కాళిదాసు తలపైకెత్తుకొని ముందుకు సాగాడట.

అలాగే భవభూతి ఈ పృథ్వి చాలా విశాలం, కాలం నిరవధికం. నాలాంటి ఆలోచనలుండి అర్థం చేసుకొనేవాడు పుడతాడులే అంటాడు.

తెలుగుకవులకు కుకవినింద అనే ఒక ఆచారం ఉంది. వాస్తవానికి ఇది కుకవినింద కాదు. కువిమ్మర్శక/విమర్శక నింద. కుమార సంభవ కర్త నన్నెచోడుడి నుండి ఇది ప్రారంభమైంది.

‘‘నెఱయ రసవంతమగు కృతికెఱఁగ నేర
రల్ప రసకృతి కెఱఁగు దురల్పులెల్లఁ
జెఱకు విడిచిన రసమున కెఱఁగిరాక
పిప్పికరిగెడు నీఁగల పెల్లువోలె’’

(వ్యాపించి ఉన్న రసవంతమైన కావ్యానికి నమస్కరించడం (గౌరవించడం) తెలియక అల్పమైన (హీనమైన) రసం కలిగిన కావ్యానికి అల్పులందరూ వందనాలాచరిస్తారు (గౌరవిస్తారు). అదెలాగంటే చెరకు రసాన్ని పిండినప్పుడు ఆ రసాన్ని గ్రోలడానికి రాకుండా పిప్పి కోసం పరిగెత్తే ఈగల గుంపులాగా.) అంటాడతను. గుణం ఉన్న దాన్ని దోషంగా చిత్రిస్తాడు కాని దోషాన్ని గుణం చేయలేడు కుకవి అంటూ పేర్చిన దొంతులను కుక్క కూల్చివేయగలుగుతుంది కాని, మళ్లీ పేర్చగలుగుతుందా అని కూడా అడుగుతాడు.

ఇటువంటి విమర్శకుల్ని కుక్కలన్న కవులెంతోమంది.

‘‘…శునకమార్గమునం జరియించు చున్న దుష్పదకవులెల్ల
మత్కవితఁ దప్పులు పట్టక విండ్రుగావుతన్’’  (…కుక్కల పద్ధతిలో నడుస్తూ ఉన్న దుష్పదకవులంతా నా కవిత్వంలో తప్పులు పట్టకుండా విందురుగాక) అన్నాడు మడికి సింగన.

కొరవి గోపరాజు అభిప్రాయమూ ఇదే.

‘దుష్కవులు దోషములెన్నగ జూతురట్టె’ అన్న దుగ్గన మాటల్లోనూ దుష్కవులు విమర్శకులే.

‘‘మక్షిక వితతుల్ వ్రణంబు పరికించు గతిన్ గొదవల్
గణించుటల్ కుకవులనైజబుద్ధి’’

(ఈగల గుంపులు పుండ్ల కోసమే చూసేటట్లుగా లోపాలెన్నడమే కుకవుల సహజమైన బుద్ధి) అన్న అబ్బయామాత్యుని వాక్యం కూడా విమర్శకము గురించే.

‘‘ఒప్పులు గ్రహింపకెప్పుడు తప్పులరయు
కాకవుల లోకముల నే నిరాకరింతు’’ అన్న సింగనార్యుని వాక్యానికీ అర్థమిదే.

‘‘పొత్తమున నుండు శల్యంబు లెత్తివైచి
శాస్త్రయుక్తిని గొని భేషజంబు సేయఁ
గఁదగు నాక్షేప జీవక కవులఁ దీర్పఁ
జనదు కృతుల నమంగళజనులు వారు’’

(గ్రంథంలో లోపాలను ఏరి ఏవో శాస్త్రయుక్తులు చూపుతూ భేషజం చేస్తూ ఆక్షేపించడమే జీవితంగా కలిగిన కవులను కావ్యాలలో తలచుకోకూడదు. వాళ్లు అమంగళజనులు) అన్న ముద్దుపళని వాక్యాల అర్థమూ ఇదే.

కుకవిని దొంగతో పోల్చి తిట్టిన కవులున్నారు. పాము, తేలు, అడవి జంతువు అన్నవాళ్లున్నారు.

‘‘బోధమల్పంబు గర్వమభ్యున్నతంబు
శాంతి నిప్పచ్చరంబు మచ్చరముఘనము
కూపమండూకములుబోలెఁగొంచె మెఱిఁగి
పండితం మన్యులైన వైతండికులకు’’

(తెలిసింది తక్కువ, గర్వం ఎక్కువ, శాంతి శూన్యం, మాత్సర్యం ఎంతో. బావిలో కప్పల్లాగా కాస్త తెలిసి పండితులమనుకొనే వితండవాదం చేసే వాళ్లకు/కలహశీలురకు) దూరంగా ఉండడమే మంచిదంటాడు శ్రీనాథుడు. ఆయనే శ్రీహర్ష నైషధ కావ్యాన్ని విమర్శించేవారిని ‘లేజవరాలు చెక్కుగీటిన వసవల్చు బాలకుని పగిది’ అంటాడు. ‘కొయ్యబొమ్మలె మెచ్చుకళ్లకు కోమలుల సౌరెక్కునా?’ అన్నాడు గురజాడ. అందువల్ల అందరి మెప్పూ పొందేటట్లు కవిత్వం రాయడం లేదా ఏ సాహిత్య రచననైనా చేయడం సాధ్యమేనా? అన్న అనుమానం కలుగుతుంది.

‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే గదా!’ అన్న చేమకూర వేంకటకవి వాక్యం చెప్పేదిదే.

ఏ కవికయినా తన రచనలో ఎవరైనా తప్పుపడితే తొలి ప్రతిస్పందనలో కోపమే వ్యక్తమవుతుంది. తెనాలి రామకృష్ణుడు, తిరుపతి వేంకటకవులు వంటివారు కొన్ని సందర్భాల్లో తిట్లకే తెగబడ్డారు.

వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, ఈర్ష్యాసూయలు ప్రధానంగా ఉండి విషయనిష్ఠంకాని విమర్శలపట్ల ఇటువంటి ప్రతిస్పందన సహజమే, న్యాయం కూడా. కాని దాన్ని కూడా సంయమనంతో స్వీకరించగలగడం, లేదా ఉపేక్షించడం మేలు. నిజానికి ఈ కవులంతా సాహిత్య చరిత్రలో శతాబ్దాలుగా నిలిచిపోయి మన గౌరవం పొందుతున్న వాళ్లే కదా. వాళ్ల సమకాలంలో వాళ్లనా విధంగా విమర్శించిన వాళ్లెవరయినా ఉంటే మనకు వాళ్లపేర్లు కూడా తెలియవు కదా. నిజమైన కళాకృతి ప్రజల హృదయాల్లో నిలిచే ఉంటుంది కదా. మరి (కు) విమర్శకుల మీద మనకింత అక్కసు అవసరమా!

డి చంద్ర శేఖర రెడ్డి

ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో చదువుకున్నారు. అదే కళాశాలలో లెక్చరర్ గా, ప్రిన్సిపాల్‌గా పనిచేసారు. తెలుగు కావ్య పీఠికలపై పరిశోధన చేసారు. ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించి పలు గ్రంథాల అనువాదాలలో పాలుపంచుకున్నారు. ప్రస్తుతం ఎమెస్కో ప్రచురణ సంస్థ సంపాదకులుగా ఉన్నారు.

1 comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.