జైలు కిటికీ లోని నల్లని చందమామ

జైళ్ళలో కవిత్వం రాసుకోవచ్చా ? ఏ ఆటంకమూ లేకుండా, ఓ దస్తాడు కాగితాలూ, బస్తాడు పెన్నులూ (కర్టెసీ: త్రివిక్రం; జులాయి)అందుబాటులో ఉంటాయా ? అసలు శిక్షించే ఉద్దేశ్యంతో రిమాండు చేసిన ఖైదీలందరూ కవిత్వమో, కధో, నవలో రాస్తుంటే పోలీసులూరుకుంటారా ? హత్యలూ, మానభంగాలు చేసిన వాళ్ళెటూ అవి రాసిన దాఖలా తక్కువ. కానీ, పేర్గాంచిన ఆస్కార్ వైల్డ్, ఓ హెన్రీ , నెల్సన్ మండేలా, నెహ్రూ, గాంధీ, మార్టిన్లూధర్ కింగ్, హిట్లర్ లాంటివాళ్ళు  జైళ్ళల్లో సృజించిన సాహిత్య వివరాలు మనకి ఆశ్చర్యం కలగించక మానవు. 1983 లో బొజ్జా తారకం రాసిన నది పుట్టిన గొంతుక కూడా అలాంటిదే. ఎమర్జన్సీ కాలంలో “ప్రజలతో సంబంధం పెట్టుకున్నందుకు, రచయతగా గుర్తింపు పొందినందుకు” తారకం జైలు పాలయ్యాడు. కానీ అతని అక్షరాన్ని ఎవరు బంధించగలిగారు ?

“బాబుకి పాలడబ్బానో, అమ్మకి మందో, రాత్రి భోజనానికి బియ్యమో తీసుకెళ్తుంటావు నువ్వు. అన్నీ అక్కడే రోడ్డు మీద వదిలెయ్యలి.పట్టండి, పట్టండి. జైళ్ళన్నీ నింపండి. ఎందుకో చెప్పొద్దు. ఎవర్నీ చూడనివ్వద్దు, బయటకి తీయొద్దు. వాళ్ళకి వెలుగంటే భయం. భయం వాళ్ళకి మనిషంటే. న్యాయం తలుపులేసుకుంది. అందుకే బయటంతా చీకటి. చీకటి చీకటి. అరెస్ట్. అరెస్ట్” (పేరుతో పనిలేదు) అనేస్తాడు. ఇతనొక న్యాయవాది అయిఉండి, న్యాయం తలుపులేసుకుంది అనడానికి ఎంత ధైర్యముండాలి ?

పాలెం అనే ఒక మారుమూల గ్రామం లో ఒక భూస్వామి తన దగ్గర పనిజేసే పాలేర్ని కొట్టి చంపేస్తాడు. కేవలం నిమ్న కులస్థుడని అతనలా ప్రవర్తించేసరికి తారకం గుండె రగిలిపోతుంది. తోటి మనుషుల్ని వెంట దీసుకుని అతనిపైకి యుద్దం ప్రకటిస్తాడు. మనిషికి మనిషిస్తున్న విలువని చూసి చలించిపోతాడు. సామాజిక ఆర్దిక వైషమ్యాలు ఎంత దారుణాల్ని చేస్తున్నాయో ఎలుగెత్తి చాటుతాడు. అందుగ్గాదూ జైల్లో పెడతారు. జైల్లో అతనీ కవిత్వం రాసేశాడు.

” పేదవాని వేషం వేశావు గానీ ఒక్క పూటైనా అతని గంజి తాగావా ? మగత్వాన్ని పరీక్షించుకోడానికి ఆత్మ నిగ్రహం అలవర్చుకోడానికి ఆడవాళ్ళని నగ్నం చేసి పక్కలో పడుకోబెట్టుకోవాలా మహర్షీ ? నీలాంటి నిగ్రహం మాకొద్దయ్యా ! నీ నీతులు మాకొద్దే వొద్దు” (గాంధీ మహత్మా) అన్నప్పుడు ఇతని కోపం లో ఏదో మంట సెగ పెడుతుంది. సాక్షాత్ జాతిపిత గాంధీని తిడుతున్నాడు. అర్ధ నగ్న ఫకీరువా ? అర్ధ స్వామ్య మాయల ఫకీరువా ? అని అడుగుతున్నపుడతని గొంతులో జీర భరించలేని నొప్పిని తెలియజేస్తోంది. అసలా తిట్టుడు ఏంటి ? నొప్పెందుకు ?

క్యాస్ట్ ఫీలింగ్స్.

కులం ప్రాతిపదికగా ఉన్న స్వాతంత్ర్యాన్ని చూసి “పేదవాని పంచ పండలేదు. కూలివాని అన్నం పంచుకు తినలేదు. మాలవాని మైల కడగనే లేదు. బతుకుల్లో సగం పస్తుల్లోనే గడిపేవారికి నిరాహార దీక్ష నేర్పావు” అని ఎద్దేవా చేస్తాడు. భారతీయ సమాజంలో కులమెందుకుంది ? వృత్తి మూలంగా నా ? భూమి కలిగి ఉండటమూ, లేకపోవడం వలనా ? కొంతమంది దగ్గరే ఆస్తి పోగుపడ్డం వలనా ? ఎన్ని ప్రశ్నలొచ్చాయీ కవిత్వం చదువ్ తోంటే ?

మన చుట్టూ ఉన్నవాళ్ళు రూపంలో, వ్యవహారంలో, జీవనంలో మనలా లేరని మన ఆలోచన మారిపోవడాన్ని కవి నిక్కచ్చిగా పట్టుకుంటాడు. ఆ తేడా కవికి నచ్చక తన సహచరుణ్ణి “నీగ్రో అన్నయ్యా” అని పిలిచి ఆలింగనం చేసుకుంటాడు. “నువ్వుండేది ఘెట్టో అన్నారు, నేనుండేది మాలపల్లె అని చీదరించుకున్నారు. పనికి మాత్రం మనం పనికి వచ్చాం. నీలా నన్నూ ఇంట్లోకి రానివ్వరు. అంటరానిదంటూనే ఆడవాళ్ళను మానభంగాలు చేశారు. ఆకలి తీర్చుకోడానికి ఉద్రేకాలు చల్లార్చుకోడానికి వారికి రంగు అడ్డం రాలేదు” అంటాడు. నీచులు వాళ్ళు. మనం వంచితులమయాం. అనేస్తాడు కూడా. కవి స్పష్టత చదువర్లని నిశ్శబ్ద చేసేస్తుంది “చట్టాల దుప్పట్ల క్రింద మనపై వేసిన కత్తిపోటులన్నీ హింస కాదట” అన్నప్పుడైతే అతని వెటకారం లో తీవ్ర స్వరం నిలబెట్టేస్తుంది.

ఇతనికి ప్రతీకారేచ్చ ఒకటుంది. అది బయల్పెట్టడానికి కవిత్వం ఆయుధమయ్యింది. చాలావరకూ ప్రతీ వాక్యమూ ఎంతో సరళంగా సూటిగా ఉండి చదివిస్తుంది. బహుశా ఎన్నో ఏళ్ళగా అణగత్రొక్కబడిఉన్న జీవన కాంక్ష ఆరారగా ఈ పుస్తకంలో కనిపిస్తుంది. జీవన దుక్ఖానికి మించిన కవిత్వం ఏముంటుంది ? అయితే ఈ కవిత్వాన్ని సార్వజనీన సాహిత్యమనవచ్చా ?అన్ని సెక్షన్సూ సమాన పద్దతిలో దీన్ని చదువుతారా ? మనల్ని తిడుతున్నాడ్రా పెద్దాయన. మంచి కవిత్వమే గానీ ఆచంద్రార్కమూ మనల్ని తిట్టిపోయడమే ఈ కవిత్వ లక్షణం. అనుకుని పక్కన పెట్టేస్తారా ? ఏమో పెట్టావచ్చు. మనకెవరన్నా నచ్చక పోతే వాళ్ళని ఇగ్నోర్ చేయడం సుల్వైన పనే గదా ? ఐతే ఆ చాన్సే లేదు. తారకం బీసీల్నీ ఎస్సీల్నీ కలిపి అంబేద్కర్ యువజన సంఘం నడిపాడు. మార్క్సిజమూ, అంబేద్కరిజమూ కలసి పనిజేయాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పాడు. లాల్ నీల్ సిద్దాంతమిదేనని మనకందరికీ అర్ధమవుతుంది. సర్వ జన బాధల ప్రస్తావన చేయడం మూలంగా ఇది సార్వజనీన కవితా వస్తువైంది.

జైల్లో పెట్టేముందు అరెస్టుకోసం పోలీసులింటికొచ్చినపుడు, అతని భావోద్వేగాల్ని భార్యతో చెప్పడం ఎంతో హృద్యంగా ఉంటుంది. ” నన్ను చూస్తూ నిలబడిపోయావు. నీ కళ్ళనిండా నీళ్ళు. నీ కన్నీళ్ళు తుడవడానికి నా చేతులకు సంకెళ్ళు. నీతో చెప్పనే లేదు. అప్పుడు ఏ మాటలైనా ఎన్నైనా ఉట్టి శబ్దాలేనని అర్ధం ఏమీ ఉండదని చెప్పలేకపోయాను నీకు” (నీతో చెప్పనేలేదు) అని రాస్తాడు. ఉండ నీడలేని, ఎండు బ్రతుకులను, తిన తిండి లేని మండు బ్రతుకులను మందగిస్తున్న శవాలను చూశాను నేను. వారి గాధలను, బాధలను నా మాటల్లో పేర్చాను. నా ఊపిరితో ఊదాను. వెలుగు తేవాలని ఉవ్విళ్ళూరాను. నాకు తెలియనే లేదు, ఒక రోజు నువ్వూ నేనూ సాయంకాలం అందాలను మలచుకొంటున్నపుడు, ఆనందాలను తొలుచుకుంటున్నపుడు హఠాత్తుగా వాళ్ళొచ్చారు. నీకు చెప్పనే లేదు. నీ కన్నీళ్ళు నా కొక్కొడికే కాదని, కోటి కోటి బాధాతప్త హృదయాలకు నివాళులని, ఆనంద జలదాలనీ, ఆశా కిరణాలనీ, అరుణార్ణవ కెరటాలనీ నీతో చెప్పనే లేదు” అని ముగిస్తాడు. మనలో ఏదో ప్రారంభమవుతుంది.

అలానే “నన్ను చూడ్డానికి జైలుకి వచ్చే మా ఆవిడలా జైలుకొచ్చింది పున్నమి చందమామ” అన్నపుడు ఈతని కవిత్వ సౌందర్యం, తత్వం కన్నా అందమైనది కాదు. అతనికి కవితా వాక్యం ఒక వాహకం మాత్రమే. దాంట్లో జీవమంతా జీవిత దర్పణమే. దాంట్లోంచి ఇన్నేళ్ళ దొంగ స్వాతంత్ర్యం నటిస్తున్న రాముణ్ణీ, కృష్ణుణ్ణీ, నెత్తిపై సవారీ చేస్తున్న కుహానా ప్రజాస్వామ్య అవతారాల్ని, వల్లించే మంత్రాల్ని, చాలా చక్కగా చూపిస్తాడు.

“ఓ నా దేశ ప్రజలారా ! మిమ్మల్ని అడుగుతున్నాను. కష్టించే జనులు కోట్లాదిగా ఆకలితో ఎందుకు చస్తున్నారు ? అభాగినులు అనేకంగా వొళ్ళమ్ముకునే కుళ్ళులో ఎందుకు మగ్గిపోతున్నారు ?చూడు, అపుడెపుడో పరాయివాడొచ్చి ఏదో చేస్తున్నాడని ఎగర గొడితే మనవాడొచ్చి ఏమి చేస్తున్నాడో చూడు. మనల్ని నంజుకు తింటున్నాడు. వాడు విడిచిన చెప్పుల్లోనే కాళ్ళు పెట్టి తిరుగుతున్నాడు” (ఓ నా దేశ ప్రజలారా) అనే కవిత చారిత్రక దృష్టికోణం నుంచి తప్పించుకోలేని సాహిత్య ప్రయోజనాన్ని కావ్య లక్షణం చేస్తుంది. అప్పటి కాలాన్ని పట్టుకోవడమేగా ఏ కవిత్వమైనా చేసే పని. ఈ నది పుట్టిన గొంతుక ఆ పని బాగా చేస్తుంది. ఈ పుసకంలో వర్గ పోరాట తాత్వికతలో స్పష్టత కొద్దిగా కొరవడిన తనం కనిపించింది. ఉన్నా, లేనట్టుగా తోచింది . భాషలోనూ సామాన్యుడి గొంతు వినపడుతుంది. భావ సారళ్యం గొప్ప లక్షణం.

సామాజిక చరిత్రలో అనుకున్నాం గనుక ఈ కవిత్వం సమాజానికి ముడిపడే కొనసాగిన లక్షణాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అలా ముడిపడటం, ఈ కవిత్వం నెరవేర్చిన పన్ని బట్టి బేరీజు వేయాలి అనుకున్నపుడు, ఈ అక్షరాలు జైల్లో మేడే నాడు పాడే సుత్తీ కొడవలి గుర్తుగ ఉన్న ఎర్రని జండాలా ఎగురుతాయి. లేకపోతే “డామిట్, జైల్లో ఎర్రజండా ! ఎక్కడిదెక్కడిదంటూ లాఠీల టపటపలతో బూట్ల టకటకలతో జైలంతా హడావుడీ పడిపోదూ ! (జైల్లో మేడే). అందుకే కుల వ్యవస్థ వలన కలిగిన చీలికల్నీ, అసమాన, వైరుధ్య పూరితమైన స్వేచ్చా చైతన్యాల్ని చాలా బలంగా చెప్పిన కవివమిది. వర్ణాశ్రమాన్ని ఎదిరించి మాట్లాడాలంటే ఎంత ధైర్యం కావాలో చంపి పూడ్చిపెట్టిన దళిత శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేయించినపుడు అడగాలతన్ని. ఆ శవం ఎన్ని కన్నీళ్ళ పర్యంతమై ఈతని కాళ్ళు మొక్కి ఉంటుందో. బొజ్జా తారకం హక్కులకోసం ఉద్యమించిన వాడు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు. బోయిభీమన్న గారి అమ్మాయి భారతిని వివాహమాడాడు. “ఒళ్ళు నొప్పులైనా తగ్గకుండానే పసి గుడ్డును పంచలో వదిలేసి పనికోసం దేవులాడే పచ్చి బాలింతల గాధలు, కామందుల కామాంధకారానికి యెవ్వనాన్ని బలిచేసుకున్న అనాధల కరుణామయ గాధలను నువ్వు చెబుతుంటే కతలు వెతలుగా ఆవేదనలో కలబోసుకుంటున్నానని కాంతి రేఖలు వెతుకుతున్నాని నన్ను తీసుకెళ్ళిపోయారు. నువ్వు పని వదలకు. ప్రాణమున్నది పనిలోనే” (నా మాటగా) అని ఆమెకి చెప్తాడు.

నేను అస్పృశ్యుణ్ణి అనే కవిత పుస్తకమ్మొత్తానికీ అసామాన్యమైనది. హిందూ సమాజంలోని కులాల్ని నిర్మూలించడం అంత సులువుగా సాధ్యం కాదని అంబేద్కర్ చెప్పినట్టే ఉంటుందీ పద్యం. తారకం “నా కలాన్ని కొట్టే శక్తి పోలీసు తుపాకీలకు లేదురా. నిరాయుధుణ్ణైనా నన్ను చూసి గోడలు తుపాకీలు ఎందుకు భయపడతాయో అమ్మనడుగు. నన్ను చూడ్డానికొచ్చినపుడు నవ్వుతూ రావాలిరా నువ్వు. (సూర్యుడివిరా నువ్వు) అని తన కొడుక్కోసమే చెప్పాడేమో !

బొజ్జా తారకాన్ని ఒకటడగాలని ఉంది. ” అయ్యా నీ కన్నీళ్ళు మాటలయి, పాటలై, రక్త నాళాలన్నీ ఖంగున మ్రోగి అలలై జనం నదిలో పొంగి ప్రవహిస్తోంటే నది పుట్టిన నీ గొంతుక నెవరు అదిమి పట్టారు?.

బందెల దొడ్డిలో నిన్నెవరు పెట్టారు ? నువ్వెవర్ని బంధించావు? అవరోధాల అరణ్యాల్ని, ఊపి నువ్వెక్కడిదాకా వ్యాపించావు ? ఆచారాలను, ఆదేశాలను, నీతులను, సూత్రాలను, కర్మలను, ధర్మాలను, గతాన్ని, మతాన్ని, దేవుళ్ళని, దెయ్యాల్ని, స్మృతుల్ని, సంస్కృతుల్ని ఎందుకు చెరిపేశావు ? తెంచేశావు? ఎందుకో మళ్ళీ ఒకసారి చెప్పు.

శ్రీరామ్

శ్రీరామ్: పుట్టింది తెనాలిలో, పెరిగింది విజయవాడలో. వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో బ్యాంకుజ్జోగం చేసుకుంటున్నారు. కవిత్వమూ, కవిత్వ విశ్లేషణ, సమీక్షా వ్యాసాలు రాస్తున్నారు. కవిసంగమం లో కవితా ఓ కవితా శీర్షిక నిర్వహిస్తున్నారు. అద్వంద్వం తనకి గుర్తింపు తెచ్చిపెట్టిన తొలి కవితా సంపుటి. +91 9963482597 మొబైల్ నంబర్లో అతన్ని పలకరించవచ్చు.

19 comments

 • తారకం గారి గురించి తెలుసుకోవడం చాలా సంతోషం గా ఉంది. వివరణాత్మక చదివింపచేసేలా చాలా బాగా చెప్పారు.

 • మంచి వ్యక్తి కవిత్వాన్ని సమీక్షించారు శ్రీరామ్ గారు..నాకు తెలియని చాలా విషయాలు తెలిశాయి మీ సమీక్ష ద్వారా..
  అభినందనలు..

 • వారి పేరు తెలుసు — కాని యింత గొప్ప రచయిత అని మీ రివ్యూ తో
  అర్థం అయింది –భాగ చెప్పారు సర్

  ==============================
  బుచ్చి రెడ్డి గంగుల

 • మనషులం‌త ఒకే అన్న సంగతే మరచి జాతుల పేరిట వర్ణ వర్గాలుగా తెగ్గోసి ఆఖరిది అంటరానిది అని ఒక జాతి మూలాలపైనే మసి పూసి మారేడుకాయ చేసిన ఈ సమాజంపై విరుచుకుపడ్డ కవి బొజ్జ తారకం గారి నది పుట్టిన గొంతుక సమీక్షించిన తీరుకు నిజంగా అభినందనలు శ్రీరామ్ గారు….ఈ సమీక్షల వెనుక మీ కృషి ఎంతటిదో ఊహించగలం..మీ శ్రమ ఊరికేపోదు..మాలాంటి వారిని ఎందరినో ముందుకు నడిపించే దిక్సూచీలు ఇలాంటి రచనలు….

 • బొజ్జా తారకం చనిపోయినప్పుడు అతనెవరనేది కొంత తెలుసుకున్నాను.ఇప్పుడు మీ సమీక్షలో అతని బలమైన గొంతుకను చూసిన.బహుజనులు ఎదుర్కొనె వివక్షతలలో కులం చాలా విషమైనది.”వాడిప్పిన చెప్పులోనే వీడు కాలు పెట్టిండు” ఇది ఎంత సత్యమో ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతాన్ని చూస్తే తెలిసిపోతుంది. కులాలు కులవృత్తులు… ప్రస్తుతంలో ఓటు బ్యాంక్ గా వృద్ధి చెందుతున్నాయి.ప్రభుత్వాల స్వార్థంతో లౌకికం అలౌకికమై….కులరహిత సహితమై ….రాజ్యాంగం రూపురేఖలు మారిపోయేలా చేస్తున్నారు.
  తారకం గారి గొంతులో నది పుడితే… మీ సమీక్ష తో అందరి మనసులోకి పారించారు.
  ధన్యవాదాలు శ్రీరాం సార్….ఈ ఆర్టికల్ మిగతా వాటికన్నా యూనిక్ గా అనిపించింది.ఇలాంటివి మరెన్నో మాలో కలిసేలా చేయాలని కోరుకుంటున్నాను.

 • మనిషన్నవాడు గుక్కపట్టి అరుస్తాడు గొంతు తెగేదాకా,నరాలు చిట్లేదాకా -ఒక దృశ్యం అదృశ్యమౌతున్నప్పుడో,ఒక గమ్యం అగమ్యమౌతున్నప్పుడో.ఉద్యమం నాడియైన కవి మనిషిని ఆవాహన చేసుకున్నాక ముప్పేట రూపమై నినదిస్తాడు బొజ్జా తారకంలా.కానీ మరింత రాయవలసింది మిగిలిపోయిందేమో,తొందరగా పెన్ను ముడిచేసినట్టనిపించింది.కావ్యానుగత శైలి మాత్రం శ్రీరామీయమే.

 • అన్న చాలా మంచి వ్యాసం…
  సర్ కవిత్వం ఇంతకు ముందు చదివాను…అయితే ఇప్పుడు మీ వ్యాసం వల్ల మరింత అర్థం చేసుకున్న…ప్రజా పక్షం, ముఖ్యంగా పీడిత జన పక్షం నిలబడ్డ గొప్ప గొంతు, మనలాంటి ఎందరికో స్ఫూర్తి.
  మీ విశ్లేషణ లో ఆయన సామాజిక నిబద్ధత ,నిక్కచితనం, ధిక్కారం అన్నీ సుభలంగా తెలియజేశారు.
  ముగింపులో ఆలోచనాత్మకంగా ప్రశ్నలు వేస్తూ…తారకం గారి ఉద్యమ స్ఫూర్తి విజయవంతాన్ని స్పష్టం చెందారు…ఇటువంటి మహనీయయులు చాలా అరుదు…మాకు గొప్ప వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు అన్న…జైభీంలు…

 • ఆద్యంతం చదివించింది వ్యాసం…నీ మాటల్లో తారకం గారిని వినడం…వెంటనే ఆ పుస్తకఎం చడవాలనిపించేంత ఆసక్తిని కలుగజేస్తోంది…శ్రీరామ్ సోదరా…ఇలా ఇంతమంది కవులను పరిచయిస్తున్నందుకు ధన్యవాదాలు 😍😍😍

 • పీడితుల పక్షాన నిలబడి పోరాడిన గొప్ప ఉద్యమ కారునిగా, ప్రజా పోరాటాలలో పాల్గొని చేయని నేరాలకు జైళ్లలో మగ్గిపోతున్నవారిని బయటకు తీసుకురావడం కోసం ఉచిత న్యాయ సేవలందించడమే కాక తన సంపాదనను కూడా ధారపోసిన నిస్వార్థ ప్రజా న్యాయవాదిగానే తారకం గారిని నేనెరుగుదును. కానీ కవిగా అతన్అంని ఇంతవరూ చదువుకోలేదు. మంచి అభివ్యక్తితో కూడిన గొప్ప కవితలను పరిచయం చేసిన శ్రీరామ్ గారికి ధన్యవాదాలు. అక్షరాలను ఆవరించిన కన్నీటి తడి, ఆవేదనై ప్రవహించిన వాక్య ఝరి మీరు ఉదహరించిన ప్రతీ కవితలోనూ కనిపిస్తోంది. బొజ్జా తారకం లాంటి వ్యక్తిత్వం లానే అతని కవిత్వమూ గొప్పగా వుంది.

 • ప్రజా పోరాటాలన్నింనింటా ముదుండి నిర్భీతిగా నిలిచే గొప్ప పోరాటయోధునిగానే తారకం గారిని నేనెరుగుదును గానీ‌ కవిగా ఇంతవరకు అతన్ని చదువుకోలేదు. అతని అక్షరాల నిండా ఆరని కన్నీటి తడి, ఆవేదనై ప్రవహించే వాక్య ఝరి మీరు ఉదహరించిన అన్ని కవితలలోనూ కనిపిస్తున్నది.
  సూటిగా హృదయాన్ని తాకే అతని కవింలాగే శ్రీరామ్ గారి కవిత్వ పరిచయం కూడా అద్భుతంగా సాగింది. వారికి ధన్యవాదాలు.

 • బొజ్జా తారకం గారి నదిపుట్టిన గొంతుక ఓ గొప్పరచన..ఎమర్జెన్సీ కాలంలో జైలు గదిలోంచి రాసినది. అన్యాయమైన పద్ధతిలో ఎవరైనా ఒకసారి తప్పించుకోవచ్చు. కానీ అక్కడితోనే ఆగిపోతే, అది వారి న్యాయమైన గెలుపుగా చలామణీ అవుతుంది. అందుకే అన్యాయాన్ని మళ్లీ మళ్లీ ప్రశ్నించడం ద్వారానే న్యాయాన్ని గెలిపించుకోవచ్చు..అన్న సూత్రాన్ని పాటించిన వారు గొప్ప మేధావి..వ్యాసం ఆఖరున మీరు ఊహాత్మకంగా సంధించిన తీరు అద్భుతం చక్కటి సమీక్షా వ్యాసం అందించిన మీకు ఆభినందనలు

 • నది పుట్టిన గొంతుకలోని మూలాలను చక్కగా పట్టుకొని
  సున్నితంగా ఉప్పదీశారు..
  దీంట్లో 1.జైల్లో కవిత్వం రాయవచ్చా అని సాగుతూ
  అతని అక్షరాలను ఎవరు బంధించగలరు అనే ఒక సటైరికల్ థీమ్ కనిపిస్తుంది..
  2.వర్గపోరాటాల విషయం,పేదవాని పక్షంగా కవి మాట్లాడిన తీరు ప్రశంసనీయం..కవిలో అంబేద్కర్ వాదం స్పష్టంగా కనిపిస్తుంది..
  3.జైలుకు వెళ్ళేటప్పుడు భార్యతో చేసిన భావోద్వేగ సంభాషణ..జైలులో ఉన్నప్పుడు భార్యరావటం పున్నమి రావటం ఒకటే అని క వి చెప్పటం దళితవాద దృక్పథం కనబడుతుంది..
  మొత్తంగా మీ లోతైన విశ్లేషణ నదిపుట్టిన గొంతుకను పట్టుకుంది.. మంచి వ్యాసాన్ని అందించిన మీకు అభినందనలు..

 • ఓ గొప్ప అభ్యదయవాది ని పదునైన అక్షరాల్లో పరిచారు. గొప్ప దార్శనికుడు కాబట్టే మహాత్ముడిని సైతం సూటిగా ప్రశ్న వేయగలిగాడు. పస్తులున్న వారికి నిరాహార దీక్ష నేర్పడం, వేషం వేసినా పేదోడి గంజి తాగావా అని నిలదీయడం భావ స్పష్టతే కాదు చాలా ధైర్యం కూడా. మంచి విశ్లేషణ

 • ఈ వ్యాసాలన్నీ త్వరలోనే ఓ పుస్తకంగా తీసుకొస్తారని ఆశిస్తున్నాను.
  ఒక గొప్ప గొంతుకను మీదైన స్వరంలో వినిపించారు.
  ధన్యవాదాలు!

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.