అర్ధం కాని నవ్వు !

క్యాష్ కౌంటర్లో బిల్లింగ్ చేస్తూ దూరంగా కస్టమర్ తో మాట్లాడుతూ హరితనే చూస్తున్నాడు ఆనంద్. చాలా చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా అదే హుషారు. ‘ఇవాళ ఎలాగైనా అడగాల్సిందే’ అనుకున్నాడు. రెండు నెలల క్రితం ఈ హైపర్ మార్కెట్ లో చేరడానికి తానే సహాయం చేసింది. బిల్లింగ్ అయిపోగానే చెయ్యి ఊపాడు. తాను కూడా చేయి వూపింది. అంతలో ఫెసిలిటీస్ ఇన్చార్జ్ రావడంతో మళ్లీ బిల్లింగ్ చేయడం మొదలెట్టాడు.

మొత్తం స్టాఫ్ లో హరిత కు చాలా గౌరవం. చాలా ఓర్పుగా అందరికీ సమాధానం చెబుతూ సహాయ పడుతూ ఉంటుంది. కస్టమర్ ఫీడ్ బాక్ కూడా చాలా బాగుంటుంది. అందుకే చేరిన ఐదేళ్లలోనే  పైపై స్థాయి ల్లోకి వచ్చింది. మాల్ మూసే టైం అవుతుంది. ‘హరిత కూడా ఆ వైపే వస్తుంది కదా అడుగుదా’మనుకున్నాడు.

‘ఆమె నవ్వులో ఏదో మాయ వుంది. ఎంత చూసినా చూడాలనిపిస్తుంది. డేర్ చేయాలి కదా అందుకే ఇవాళ అడిగేయాలి’ అనుకున్నాడు. హుషారుగా బయటికి వచ్చి బైక్ తీశాడు. హరిత బస్సు కోసం వెయిట్ చేస్తోంది. లాస్ట్ సిటీ బస్సు. రాకుంటే బాగుంటుంది అనుకున్నాడు.  వెళ్లి ‘హాయ్’ చెప్పాడు . ‘హాయ్’ అంటూ ‘ఏంటి ఇంకా వెళ్ళలేదు’ అడిగింది. ‘మీ కోసమే ఈ వెయిటింగ్’ అన్నాడు. ‘ఎందుకు?’ అంది. ‘అదీ, ఏం లేదు లైఫ్లో సెటిల్ అవుదామని అనుకుంటున్నాను’ అన్నాడు.

హరిత రోడ్డు చివరి వైపు చూస్తోంది. బస్ ఇంకా రాలేదు ‘అలాగా కంగ్రాట్స్’ అంది.

‘మీ నవ్వు చాలా ఫ్రెష్ గా ఉంటుంది’

‘థాంక్యూ’

‘హరిత ఐ లవ్ యు’. తను మామూలుగానే నవ్వింది.  ఏ మార్పు లేదు .

‘ఎందుకు, ఏం చూసి? నా గురించి నీకు ఏం తెలుసు ?’.

‘చూస్తున్నాగా రెండు నెలల నుంచి’.  

‘నీకు తెలిసిన హరిత వేరు కావచ్చు కదా’ అంది అదే నవ్వుతో.  ‘నేను ఇక్కడ చేరి అయిదేళ్ళు. ఇలా ‘ఐ లవ్ యు’ చెప్పిన వాళ్లలో నువ్వు వందోవాడివో నూట యాభయ్యో వాడివో అయి ఉంటావ్.. నాకు ఆల్రెడీ పెళ్లయింది తెలుసా.  ఇలాగే వెంటపడి మోహించి చేసుకున్నవాడు ఉద్యోగం మాననందుకు అనుమానంతో నసిగి నసిగి వదిలి పోయాడు. పాప వూళ్ళో అమ్మ దగ్గర పెరుగుతోంది. వీక్లీ బ్రేక్ బుధవారం ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాను. నీకుద్యోగం ఇక్కడ ఉంది – అని చెప్పింది నీ అవస్థలు చూసి. కొంచెం చనువుగా ఉన్నా కదా అని ఇలా అనుకోకు. రెండు సంవత్సరాల పాటు పోగొట్టుకున్న నవ్వును మళ్ళీ మనసును బుజ్జగించి వెనక్కు తెచ్చుకున్నాను.  ఇలా అన్నావని నాకు నీ మీద కోపం లేదు. కొంచెం మనుషుల్లా కూడా బతకాలని ప్రయత్నించాలి కదా. అందుకే అలా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను. ఇది లైఫ్ కదా అంతే’ అంటూ ఆటో ఆపి నవ్వుతూనే ‘బై’ చెప్పింది. ఆనంద్ కి ఇంకా ఆ నవ్వు అర్ధం కావటం లేదు.

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.