ఏంటట…?
నాకేంటట…?
ఊహూ… నాకేంటి లాభం?
ఎవరి లాభాలు వాళ్ళకే ఉన్నాయి కదా?!
చెల్లి ముద్దు పెడితే, చాక్లెట్ లాభం!
అన్నయ్య షాపుకు వెళ్ళి ఇంటికి కావలసినవి తెస్తే అమ్మనుండి టెన్ రుపీస్ లాభం!
అక్క కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులు అవసరానికి తీసి నాన్నకు ఇచ్చేస్తే హండ్రెడుకు టెన్నూ- తవుజెండుకు హండ్రెడ్డూ లాభం!
మావయ్య వేసే వెధవ్వేషాలు తెలుసుకదా?, ఒకసారి సిగరెట్ కాల్చడం, ఒకసారి మేడమీది అక్కని కన్నుగీటి లవ్ చేయడం, ఒకసారి సెకండు షో సినిమాకు వెళ్ళడం… ఇలా చాలా ఉన్నాయిలే!? ఉంటే ఉన్నాయిలే అని ఊరుకుంటే చూసీ చూడనట్టు ఉంటే చాలా లాభాలు! ‘ఊ… ఏం కావాలి?’ అని మావయ్యే అడిగిమరీ లాభం చేతిలో పెడతాడు!
పిన్ని విజయనగరం నుండి చీరలు తెస్తుందా? అమ్మకు ఇస్తుందా? డబ్బులు ఉన్నప్పుడు ఇవ్వండక్కా అని అంటుందా? ఎవరు బయటివాళ్ళూ- అని అందరితో అదే మాట సాగదీసి అంటుందా? పిన్ని అలా వెళ్ళగానే- ఒక్కో చీర మీద బోలెడంత లాభం ఉంటుందని- వేసుకుంటుందని- అమ్మా అత్తా లెక్కలు వేసుకుంటారు. చీరకు డిజైన్ ఉన్నా లేకున్నా లాభం మాత్రం ఉంటుందట!?
అత్తకు పెళ్ళయిన దగ్గర్నుంచీ- ఇంటికి వచ్చిన ప్రతిసారీ- ఒత్తి చేతులతో వెళ్తే ఆడపిల్లని, ఏం బావుంటుందని, మిక్సీయో గ్రైండరో ఫ్రిజ్జో బైకో ఏదో ఒకటి పట్టుకుపోతుంది. వచ్చి వెళ్ళినప్పుడల్లా లాభమే లాభం! అలా లాభం లేకపోతే తేకపోతే పుట్టింటికి వెళ్ళి ఏం లాభం?- అని అత్త వాళ్ళ అత్తయ్య అంటుందట! ఆవిడకీ లాభం గురించి బాగా తెలుసు అని నాకు తెలుసు!
‘మిమ్మల్ని కట్టుకొని ఏం లాభం?’ అని అమ్మకూడా అప్పుడప్పుడూ నాన్నని అంటుంది! ‘నిన్ను కట్టుకొని చాలా లాభపడ్డాను మరి…’ అంటారు నాన్న. ‘అలా దెప్పి పొడవకండి… మీకొచ్చిన నష్టమేమిటి? మావాళ్ళు ఇవ్వాల్సిన కట్నకానుకలు ఇచ్చారు కదా?’ అంటుంది అమ్మ. ‘ఆ చాలా ఇచ్చారు… లాభాలు లెక్కపెట్టుకోలేకపోతున్నా’ అంటారు నాన్న. ‘అయినా మావాళ్ళకి బుద్ది లేదు, ఇంకో మూడు లక్షలు ఇచ్చుంటే ఆ డాక్టరు సంబంధమే అయ్యేది’ అంటుంది అమ్మ. ‘మరి చేసుకోలేకపోయావా?’ అంటారు నాన్న. నీతో లాభం లేదంటే- నీతో లాభం లేదని- ఇద్దరికిద్దరూ అనుకుంటారు!
ఔను, లాభాలు తగ్గితే నష్టాలే! అమ్మ అలుగుతుంది. నాన్నా ఆఫీసుకు కోపంగా వెళ్ళిపోతారు!
ఏమౌతుందో తెలీదు, అప్పుడు నాన్న వస్తూ వస్తూ చీర తెస్తారు. అమ్మకి చీర లాభం! నాన్న పార్టీకి వెళ్ళడానికి అమ్మ పర్మిషన్ ఇచ్చేస్తుంది. అదే నాన్నకు లాభం?!
ఒక్కోసారి నాన్న నష్టాలు వచ్చే పనులు చేసినప్పుడు- అమ్మకి చీర లాభం సరిపోనప్పుడు- అమ్మకీ నాన్నకీ గొడవలొస్తాయి. ఆపైన బంగారపు గొలుసో చెవిరింగులో ఉంగరాలో ఏదో ఒక లాభం!
అమ్మకు అన్నీ ఇవ్వాలనే నాన్నకూ ఉంటుందట. కాని ఈ ఉద్యోగంతో లాభం లేదంటుంటారు నాన్న. అవునని అమ్మ కూడా చాలా చాలా బాధ పడుతుంటుంది!
పక్కింటి పరమేశ్వర్రావు అంకులుకయితే ఉద్యోగంలో రోజూ లాభాలేనట. రెండు చేతులా సంపాదిస్తున్నాడట. జీతమొక్కటే అయితే ఈరోజుల్లో బతకలేమట. పై రాబడి కూడా ఉండాలట. లేనిదే లాభం లేదట. అందుకే డిపుటేషన్ మీదైనా నాన్న జాబు మారిపోవాలట. ఆఫీసర్ని అడిగితే? లాభం లేనిదే ఆ జాబు మనకెందుకిస్తాడు? బోలెడంత పోటీ. మనమూ యాపిల్ ఫోనూ లేదూ యాపిల్ కంప్యూటరూ ఏదో ఒకటిస్తే లాభం చూపిస్తే- మనకీ లాభమట!
అమ్మానాన్నల మాటకేం? అందరి మాటకేం? నేనెంత చదివినా- ఇలా చదివితే లాభం లేదని ప్రతొక్కరూ- మాస్టారు నుండి మావయ్యదాకా అందరూ అనేవాళ్ళే!
ప్చ్… నేను లాభం లేదట!
ఔను, ఎవరి లాభాలు వాళ్ళకే ఉన్నాయి. లాభాలే లాభాలు!
మీనాక్షి అత్తదే అదృష్టమట. మీనాక్షత్తదే లాభమట. మగపిల్లాడు పుట్టాడు కదా… లాభమట!? బోయ్ ప్లస్సట. గర్ల్ మైనస్సట. అందరిదీ అదే లాంగ్వేజ్. అదే లాంగ్వేజ్‌లో ‘మీ క్లాసులో స్ట్రెంగ్త్ ఎంతరా?’ అని అడిగితే- పదిహేను మైనెస్లూ ఇరవైయ్యైయిదు ప్లస్‌లూ’ అని చెప్తే మావయ్య మెచ్చీసుకున్నాడు! ఆపై ఒక థియరీ కూడా చెప్పాడు. అమ్మాయి మైనస్సయినా అబ్బాయికి ప్లస్సేనట. మావయ్యకీ ప్లస్సేనట. లాభమేనట. ఒక్క కూతురున్న సంబంధం దొరికిందట. అదే పేద్ద లాభమట!
పక్కింటి పద్దూ ఆంటీ వాళ్ళాయనది ఇంకా పేద్ద లాభమట! ఆయనకి అలా పెళ్ళవగానే యిలా అత్తా మావా హార్టెటాకొచ్చి పోయారట! అలాంటి లాభాలు అందరికీ రావట?! స్కూల్లో చెప్పే లాభనష్టాల లెక్కలు అర్థమవుతాయి కాని ఈ పెద్దవాళ్ళ లాభనష్టాల లెక్కలు అర్థం కావు?! పోనీ అంటే- పుస్తకాల్లో ఇలాంటి లాభాల గురించి ఇవ్వరు?! సంబంధము లేనివన్నీ ఇస్తారు!
మనమూ ఉన్నాం దేనికీ? మనకి కలిసొచ్చేదేమీ లేదే?- అని నాన్నా అంకుల్సూ నవ్వుతూ మాట్లాడుకుంటారు. అమ్మా పిన్నీ కూడా టీవీ చూస్తూ కబుర్లాడుకుంటారు!
టీవీ చూస్తూ- లాభం లేదని ఆస్తి కోసం రాధ గోపీకి విషమిచ్చి చంపేస్తుందా? గోపీ మళ్ళీ పుట్టి మళ్ళీ ప్రేమిస్తాడా?- ఈ ప్రశ్నలకు ఆన్సర్లు పంపిస్తారు అమ్మా పిన్నీ. అలా పంపితే గిఫ్ట్ లాభం! పట్టుకుంటే పట్టుచీర లాభం! ఇలాంటి లాభాలెన్నో అమ్మ చెపితే- టీవీ వాళ్ళకి ఏమిటి లాభం… ఒత్తి పుణ్యానికి లాభాలు పంచితే?- అంటుంది అమ్మమ్మ. టీవీ వాళ్ళకి రేటింగు లాభమట! రేటింగు వల్ల యాడ్స్ వచ్చి రెవెన్యూ లాభమట! మావయ్య చెపుతాడు. లాభం లేనిదే ఎవరూ పిత్తు కూడా పిత్తరని అమ్మమ్మ గొణుక్కుంటుంది!
మరి అన్నయ్యో? ఎంసెట్టులో ర్యాంకు వస్తేగాని లాభం లేదంటాడు. ఎగ్జామ్స్ పోస్టుపోన్ అయితే తప్ప లాభం లేదంటాడు. పోస్టుపోన్ అయితే స్టూడెంట్సుకు లాభం ఉన్నా లేకున్నా కోచింగ్ సెంటర్ల వాళ్ళకే లాభమని మావయ్యంటాడు!
ఏమో… చదువుకుంటే బోలెడు లాభాలట!
బాగా చదివితే ఉద్యోగమొస్తే అదే లాభమట. సబ్జెక్ట్ సంగతి? చదివే చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధం లేదట. మరేమో కట్టిన లంచాలు ఉద్యోగమొచ్చాక చక్కగా వెనక్కి తీసేసుకోవచ్చట! రెండు చేతులా సంపాదిస్తే దర్జాగా కాళ్ళు మీద కాళ్ళు వేసుకు బతకొచ్చట! కార్లలో తిరగొచ్చట! బంగాళాలో దొర్లొచ్చట! నచ్చిన పెద్దింటి అమ్మాయిని పెళ్ళాడేయవచ్చునట! డబ్బే ప్రేమట! డబ్బే దైవమట! డబ్బు సంపాదించాలంటే బాగా చదవాలట! చదువువల్ల ఇలా ఎన్నెన్నో లాభాలట! చదవకపోతే లాభం లేదట! మూటలు మోసుకోవాల్సి వస్తుందట! అందరూ చెప్పేది యిదే! నువ్వు ఇలా ఉంటే లాభం లేదట! నువ్వంటే నేను!
లాభాలు ఇంకా చాలా ఉన్నాయట. రిగ్గింగు చేస్తే రాజకీయ నాయకులకి లాభమట. అమెరికా చెప్పినట్టు ఇండియా వింటే లాభమట. ఇండియా వదిలి ఫారిన్లో సెటిలయితేనే లాభమట!
లేకపోతే నా మీద బోలెడు డబ్బు తగలెట్టి చదివించింది దేనికట? మామూలు చదువులు చదివితే లాభం లేదట! సంకనాకి పోవడమేనట!
చదువెందుకు సంకనాకి నందుకు
పది గోవుల్ ఉన్న పాలున్ పెరుగున్…
చదివితే లాభమున్న చదువులు చదవాలి! లాభాలు తెచ్చే చదువులు చదవాలి! లాభం లేని చదువులతో లాభం లేదట! అందుకే మామూలు బియ్యే డిగ్రీలు అవుట్ డేటెడట! మరి ఇంజనీరింగు కాలీజీల్లో సీట్లు ఫిలప్ అవట్లేదట! మరికొన్ని ఇంజనీరింగు కాలీజీలు మూత పడుతున్నాయట! అంటే లాభాలు ఉన్నాయనుకొని చదివితే లాభాలు లేకపోవచ్చు!
అంచేత చదువుకొని కూడా లాభం లేదని నేనంటే మీరేమంటారు? నీతో లాభం లేదని తిరిగంటారు!
నిన్న లాభం అనుకున్నది నేడు లాభం కాకపోవచ్చు! నేడు లాభం లేదనుకున్నది రేపు లాభం కానూవచ్చు! లాభాలకోసం చూసినప్పుడు నష్టాలు తప్పవు! ఈ పెద్దలతో కష్టాలు తప్పవు! లాభాలు అనేది లెక్కల సబ్జెక్టు కానే కాదని నాకు అనిపిస్తుంది!
-మౌర్య,
ఏడో తరగతి, ‘ఎ’ సెక్షన్,
విజ్ఞాన్ హై స్కూల్.
జగదీశ్వర్రావుగారూ, శుభాకాంక్షలు. కథ బాగుంది. మిమ్మల్ని యిలా కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది –