కల్పన కన్న ‘చిత్ర’మైన వాస్తవాలకు
తాజా ఉదాహరణ?

Truth is stranger a than Fiction అంటాడు మార్క్ ట్వైన్. దీనిని ఆధారంగా చేసుకుని ఇపుడు సినిమాల్లోకి కొత్తగా వచ్చి చేరుతున్న జోనర్-  బయోపిక్. ప్రస్తుతం అటు హాలీవుడ్ లోనేకాక ఇటు బాలీవుడ్ లోనూ బయోపిక్ ల హవా నడుస్తోంది. దానికి తగ్గట్టుగానే  తెలుగు సినిమా కూడా బయోపిక్ ల బాట పట్టిందని చెప్పక తప్పదు. ఐతే కథకులూ దర్శకులూ కొత్తగా ఆలోచించలేక, కొత్త రకమైన ఫిక్షన్ ని సృష్టించలేక బయోపిక్ ల బాట పట్టారనే అపవాదూ ఉంది. ప్రేక్షకులు కూడా రొటీన్ సినిమాలకు కు భిన్నంగా ఉండే  ఈ బయోపిక్ లను ఆదరించటమూ జరుగుతోంది. ఐతే ఇదే లెక్కన కొన్ని బయోపిక్ లు “భయో పిక్” లుగా మారి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాయనీ చెప్పక తప్పదు. బయో పిక్ లు సాధారణంగా బతికి వున్న లేదా చనిపోయిన ఒక ప్రముఖ వ్యక్తి జీవితాన్ని తెర మీద చూపటం చేస్తుంటాయి. ఐతే క్లాసికల్ బయో పిక్ లకు కొన్ని నియమాలను అనుసరించటం చూస్తుంటాం. ఆ వ్యక్తి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా జరిగే ముఖ్యమైన ఘట్టాలు, అంటే ఏ ఘట్టాలైతే ఆ వ్యక్తి ఉన్నతిని లేదా ఆ వ్యక్తి మూర్తిమత్వాన్ని పట్టి ఇస్తాయో ఆ ఘట్టాలను దృశ్యీకరించటం ఒక రకం. రెండు, ఆ వ్యక్తి జీవితంలోని కొంత కాలాన్ని లేదా ఒక ప్రముఖమైన ఘట్టాన్ని మాత్రమే తెరకెక్కించటం రెండో రకం. రాం గోపాల్ వర్మ ఈ రెండవ రకం విధానాన్ని దృష్టిలో ఉంచుకుని లక్మీ’స్ ఎన్టీఆర్ సినిమాను ఇపుడు ప్రేక్షకుల ముందుకు తెచ్చే పనిలో ఉన్నాడు. ట్రెండ్ లో భాగంగా బయోపిక్ లు వస్తున్నా నిజానికి అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయనేది సినిమా పండితుల వాదన. ఎందుకంటే మనిషి జీవితంలో ఒక ఫిక్షన్ కథలో ఉన్నంత నాటకీయత ఉండదు. ముఖ్యంగా క్రోనలాజికల్ ఆర్డర్ ను అనుసరించే జీవిత చరిత్ర సినిమాలు ప్రేక్షకుల సహనాన్ని పరిక్షిస్తాయి. అందుకే సత్యానికి బానిసలై  నాటకీయత లేని జీవన గమనాన్ని తీసేకన్నా నాటకీయతతో కూడిన జీవన శకలాన్ని తెరకెక్కించటం తెలివైన దర్శకుడి పని. “A script has to make sense, and life doesn’t”. అన్నట్టు ఆ వ్యక్తి జీవితం కన్నా సినిమా స్క్రిప్ట్ లో sense ఉంటే చాలు అని తెలుసుకున్న దర్శకుడు ఉత్తమ దర్శకుడు అని చెప్పాలి.

ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ఎన్నో ఘట్టాలకంటే లక్ష్మి పార్వతి ఆయన జీవితంలోకి ప్రవేశించాకనే నాటకీయత ఉందనేది ఆర్జీవీ ప్రముఖంగా వినిపించే వాదన. ఒక దర్శకుడిగా వర్మ చెప్పేది నూటికి నూరు పాళ్ళూ నిజం కూడా. నాటకీయత లేని జీవిత ఘట్టాలను తీసి  ప్రేక్షకులను బోర్ కొట్టించటం దర్శకుడికి విసుగు తో కూడిన విషయమే. ఎన్టీఆర్ అంతగా ఇష్టపడి పెళ్ళి చేసుకున్న లక్ష్మీ పార్వతి తప్పకుండా గొప్ప వ్యక్తి అయ్యుంటుంది అనేది వర్మ అంతరంగం.  కానీ, అందుకు భిన్నంగా మీడియా సృష్టించిన ఎన్టీఆర్ కథలో లక్ష్మీ పార్వతి యే అసలైన విలన్. ఐతే ఈ రెంటిలో ఏది నిజమన్నది వర్మ ఈ సినిమాలో చెప్పబోతున్నాడేమో. దీని వలన మీడియా దృష్టికి రాని, లేదా మీడియా చెప్పని లేదా మీడియా దాచి ఉంచిన అసలైన ఎన్టీఆర్ జీవితం ఏదో ఇందులో చూపబడుతోందనే విషయం సహజంగానే ప్రేక్షకుల్లో ఉత్సుకత ను రేకెత్తించింది. పబ్లిక్ డొమైన్ లో ఉన్న కథకు కొంత హంగులు కూర్చి “మమ” అనిపించే రెగ్యులర్ బయో పిక్ లకు భిన్నంగా…ఎవరికీ తెలియని అంశమే ఈ సినిమా లో ఉండబోతోందని ట్రెయిలర్ చూసినపుడు అర్థమౌతోంది. ఐతే కథను వర్మ ఎలా మొదలు పెడతాడనేది ఆసక్తి కరమైన విషయం. టైటానిక్ సినిమాలో కొంతమంది యాత్రికులు అడగటం, ఒక ముసలమ్మ తన కథను వారికి చెప్పటం ఉంటుంది. అలాగే చాలా సినిమాల్లో ఎవరో ఒక విలేఖరి గానీ వ్యక్తిగానీ అడగటం, వాళ్ళు తమ ఫ్లాష్ బ్యాక్ ని చెప్పటం అనేది ఈ బయో పిక్ కథనాల్లో కనిపించే ఒక రొటీన్ అంశం. మహానటి సినిమాలో కూడా ఇలా కథను చెప్పే పత్రికా విలేకరుల ను పెట్టడమే కాకుండా వాళ్ళ మధ్య ఇంకో లవ్ స్టొరీ కూడా పెట్టి విసుగు పుట్టించాడు ఆ దర్శకుడు. ఈ సినిమా లో వర్మ కూడా అలాగే పురాతన “ఫ్లాష్ బ్యాక్” పద్ధతిని అనుసరించి కథనాన్ని మొదలుపెడతాడా లేదా అన్నది ఆసక్తి కరమైన విషయం. ఐతే వర్మ గతంలో తీసిన రక్త చరిత్ర వంటి సినిమాల్లో తన వాయిస్ ఓవర్ ని కూడా జతచేసి తనలోనూ ” చూపడం కంటే చెప్పటం బెటర్” అనుకునే పురాతన దర్శకుడు ఉన్నాడని నిరూపించాడు.

ఐతే గొప్పవారి బయోపిక్ ల విషయంలో ఉండాల్సిన మొదటి జాగ్రత్త ” కథానాయకుడి ని ఒక మానవాతీత వ్యక్తి గా చూపకపోవడం. చాలా బయోపిక్ లు, ముఖ్యంగా తెలుగులో వచ్చిన, వస్తున్న బయోపిక్ లు ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని white wash చేయగల “divine fallacy” లోకి పడి పోతుంటాయి. ఏదో మానవాతీత శక్తి ఈ సదరు వ్యక్తి ని పుట్టించిందనీ, ఆ వ్యక్తి చర్యలన్నీ రాబోయే ఒక గొప్ప మార్పుకు ఆలంబనలనీ ఊదరగొడుతుంటాయి. ప్రేక్షకుడు ఇటువంటి సినిమాలు చూసి inspire అయ్యేదేమీ ఉండదు. ఎందుకంటే ఆ కథా నాయకుడు తమలాంటి ఒక సాధారణ వ్యక్తి  కాదు అనే స్పృహ ప్రేక్షకుడిలో ఆ కథా నాయకుడి పట్ల భక్తి కలిగిస్తుందే తప్ప ప్రేరణ కలిగించదు. ఐతే హాలీవుడ్ లో ఎన్నో బయో పిక్ సినిమాలు సామాన్యులలో కూడా  ప్రేరణ కలిగించేవిగా ఉంటే, మన సినిమాలు ఆ వ్యక్తి మీద గౌరవమో భక్తో పెరగటానికి మాత్రమే ఉద్దేశించి ఉంటాయి. వర్మ ఈ “డివైన్ ట్రాప్” లోకి పడిపోయాడా లేదా అనేది సినిమా చూస్తే కానీ తెలియదు. పైగా అప్పట్లో వర్మ ఎన్టీఆర్ దేవుడని పొగుడుతూ ఒక పాట కూడా రిలీజ్ చేశాడు. కాబట్టి వర్మ కనుక అదే డివైన్ ట్రాప్ లో కనుక ఉంటే ఇది కూడా మరో క్రిష్ “కథానాయకుడు/మహానాయకుడు” సినిమాలాగా ఔతుంది.

ఈ సినిమా టీడీపీ ఓటు బ్యాంకు ను కొల్లగొడుతుందనో లేక వైసీపీ పార్టీ కి బలాన్ని చేకూరుస్తుందనో కొన్ని పొలిటికల్ వాదనలు ఇటువంటి ఎలక్షన్ల సమయంలో సహజమే.  వైస్రాయ్ హోటల్ సంఘటన, చంద్రబాబు అడ్డదారి పదవీ స్వీకారం వంటి అంశాలు సినిమా ట్రెయిలర్ లో కనిపిస్తున్నాయి కనుక సినిమా ఆసక్తికరంగా మారిందనటంలో సందేహమే లేదు. ఐతే కొన్ని కుటుంబ ఆంతరంగిక విషయాలను పని మనుషులు డ్రైవర్లు వంటి వారితో తెలుసుకున్నానని వర్మ చెప్పటంలోని ఔచిత్యమేమిటో అర్థం కాదు. చిన్న జీవుల మీద అనవసరమైన ఒత్తిడి పెంచి వారిని స్కేప్ గోట్ చేయటం అనవసరం. సెలెబ్రిటీల జీవిత చరిత్ర కోసం చరిత్ర  రాయబడని చిన్న జీవుల జీవితాల్ని ఇబ్బందుల పాలు చేయటం ఎంతమాత్రమూ ఆహ్వానించతగ్గ విషయం కాదు. అసలు కథలోని నిజా నిజాలను ఎక్కడి నుండి తెలుసుకున్నారనే విషయం చెప్పటం అవసరమే లేదు. మగవాళ్ళ మీద బయోపిక్ చేస్తే అందులో ఆ వ్యక్తి పడిన కష్టాలూ, వాటిని అతడు అధిగమించి గొప్పవాడిగా ఎదిగిన తీరూ చూపబడుతూ ఉంటుంది. అదే ఆడవాళ్ళ మీద తీసే జీవిత చరిత్ర ల్లో వాళ్ళు ఎలా విక్టిమ్ లుగా మారిపోయారోననే విషయం చూపబడుతుంటుంది. ట్రెయిలర్ ను బట్టి ఈ సినిమాలో లక్ష్మి పార్వతి విక్టిమైజేషన్ విధానం ఉందేమో అనిపించింది. దాని వెనుక ఉన్న కుటుంబ కుట్రలు బయట పడబోతున్నాయని అనిపించింది.  ఐతే ఈ సినిమా ప్రభావం ఎలక్షన్ల మీద ఉంటుందని భయపడే స్టేజ్ లో అధికారిక పార్టీ ఉందని భావిస్తుంటే తప్పక ఇందులో నిజాలు చెప్పబడుతున్నాయనే సంకేతమూ వెళ్ళిపోయింది. అధికార పార్టీ వాళ్ళ భయమే ఈ సినిమాకు మరింత బలాన్ని తెచ్చిపెడుతుంది

డాక్టర్ విరించి విరివింటి

డాక్టర్ విరించి విరివింటి: ఎంబీబీఎస్ చదివిన తరువాత ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో ఐదేళ్ళకు పైగా పనిచేశారు. ఆ తరువాత క్లినికల్ కార్డియాలజీ లో పీజీ డిప్లొమా చేసి స్వంతంగా ప్రాక్టీసు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ భారతంలో గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక సాహిత్య కళా రంగాల్లో ఆసక్తి మీకు తెలియంది కాదు. కవిత్వం, కళలపై ఆయన ఆసక్తి అందరికీ తెలిసినదే. ‘రెండో ఆధ్యాయానికి ముందుమాట’ పేరుతో కవితా సంపుటి ప్రకటించారు.

‘పర్స్పెక్టివ్స్’ అనే షార్ట్ ఫిల్మ్ తో సినిమా దర్శకత్వం రంగంలో ప్రవేశించారు. తన 'ఇక్కడి చెట్ల గాలి'కి తెలంగాణ ఫిలిమ్ ఫెస్టివల్ అవార్డ్ లభించింది. 'షాడోస్', 'డర్టీ హ్యాండ్స్', "ఫ్యూచర్ షాక్' లఘు చిత్రాలు ఎడిటింగ్ దశలో వున్నాయి.

4 comments

  • మీ విశ్లేషణ బాగుంది కానీ ఇక్కడ వ్యక్తిగత లేదా రాజకీయ సమీకరనాలు పక్కన పెడితే అసలు నిజాలు కొన్నైనా బైటకి వస్తాయన్న ఆశ ఉంది. చంద్రబాబు లాంటి మనిషి నిజస్వరూపం/ బుద్ది ప్రజలకి తెలియాల్సిన ఆవశ్యకత ఉంది. దానికోసమే వెయిటింగ్ ఫర్ ది మూవీ. బై ది వే నేను ఎవరి ఫ్యాన్/ supporter కాదు. Iam a common man from uk

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.