ధర్మం చెర

ఎన్నికలొచ్చేశాయి.

ఇండియాలో, మిగులు ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలలో…

రాజకీయంగా మన అభిప్రాయం మనం చెప్పాల్సిన సందర్భమిది.

మన కోసం మనం, జనం కోసం మనం నిలబడ్డానికి ఏదీ పనికిరాని పరికరం కాదు, చివరికి సార్వత్రిక ఎన్నికలు కూడా.

పార్లమెంట్లు, అసెంబ్లీలు బాతాఖాని క్లబ్బులయితే కావొచ్చు. అది మనల్ని పరిపాలించే బాతాఖాని. మనల్ని ఎవరు పాలించాలో మనం నిర్ణయించడానికి ఇంత కంటె మెరుగైన ప్రక్రియ వొచ్చే వరకు దీన్ని వాడుకోవలసిందే.  

మన కోపాన్ని, మన నొప్పిని వీధులకెక్కి ప్రకటించడానికి మంచి మెగా ఫోన్ ఎన్నికలు.

ఎవరికి వాళ్ళు వాళ్ళ చీకటి మూలల్లో మూల్గడం కన్న పదుగురిలో పడి అరవడం మేలు.

మనిషి మీద మనస్సు మీద పడే ప్రతి దెబ్బకు ప్రతిస్పందన వుండాలి.

ప్రతిస్పందన ఉంటేనే మనిషి జీవించి వున్నట్టు. లేకుంటే మరణం మానవాకారంతో నడుస్తున్నట్టు.

స్పందన ప్రతిస్పందనలే మనల్ని మనుషుల్ని చేస్తాయి. మనుషుల్ని ఏకం చేస్తాయి.

అబద్ధపు వాగ్దానాల మధ్యనే రాజకీయ యుక్తుల మధ్యనే… ఊరూరా వాడవాడ.. మనం ఎక్కడెక్కడున్నామో అక్కడక్కడంతా… గొంతులు చించుకుని అరుద్దాం.

ఫ్రీ… ఫ్రీ… ఫ్రీ….

వాళ్లను వెంటనే విడుదల చెయ్యండి.

రొమిల్లా థాపర్ తో సహా ఐదుగురు మేధావులు సుప్రీం కోర్టుకు పెట్టుకున్న దరఖాస్తులో కోరినట్లు… కామ్రేడ్ వరవర రావు తదితరులు నేరాలు చేసినట్లు ఆరోపణలుంటే ‘విచారించండి’ కాదనం, వుట్టి పుణ్యానికి చెరలో పెట్టి, అసమ్మతిని నొక్కేయడం దారుణం.

ఈ హింసలతో అసమ్మతి ఆగదని నిరూపిద్దాం.

గళాలెత్తి పాడుదాం.

ప్రతి రోజూ ఒక ఫూల్ పుడతాడు
తాను పాలించగలనని అనుకుంటాడు
రేపు కూడా తనదేనని అనుకుంటాడు
ఒక వుదయం వాడు నిద్దర్లేచి చూసే సరికి
జైళ్ళ తలుపులు తెరుచుకుంటాయి సంకెళ్ళు పగిలిపోతాయి
వీధుల్లో అల్లరి అల్లరి
అందరం ఒకే పాట పాడుతుంటాం… ఫ్రీ… ఫ్రీ… ఫ్రీ…’

అది… నల్లజాతి గాయని ట్రేసీ చాప్ మాన్ పాడిన పాట.

మనమూ పాడుదాం…. మనకు వున్న గొంతులతోనే, మన మొరటు నరాలనే గిటారు తీగెలు చేసి

ఫ్రీ… ఫ్రీ… ఫ్రీ….

వివి తదితరులు ఏ నేరం చేయలేదు.

ఆ సంగతి వాళ్ళ మీద పెట్టిన ‘కుట్ర కేసు’ మొహం మీదే రాసి వుంది.

కుట్ర కేసు కాదది. కేసు కుట్ర.

మోడీ హత్యకు కుట్ర పన్నారని చూపించిన ఉత్తరం ఉత్త కాగితమని, అది తమలో ఎవరూ ఎవరికీ రాసింది కాదని నిందితులు పదే పదే నిరూపించారు.

ఇప్పుడిక మిగిలిన నేరం వాళ్ళ రాజకీయ అభిప్రాయాలు. చర్యలు కాదు. అభిప్రాయాలు.

‘ధర్మం చర’ అంటే ధర్మాన్ని ఆచరించాలని అర్థం. ‘ధర్మం’ గురించి తెగ మాట్లాడే ప్రభుత్వం చేస్తున్నది దానికి విరుద్ధం. అభిప్రాయాల్ని జైల్లో వుంచడమంటే ప్రజాతంత్ర ధర్మాన్ని చెర బట్టడమే.

‘సత్యం వద’ అంటే ‘సత్యమే చెప్పు’ అని అర్థం. సత్యవాక్కు అని తమ పురాణాలు ప్రవచించే ఒక దేవుడి భక్తులు నేడు చేస్తున్నది సత్యాన్ని వధించడమే.  

వాళ్ళు తొమ్మండుగురు…  వరవర రావు, సుధా బరద్వాజ్, సురేంద్ర గాడ్లింగ్, సుధీర్ ధావాలే, రోనా విల్సన్, షోమా సేన్, మహేష్ రావుత్, అరుణ్ ఫెరీరా, వెర్నన్ గొన్సాల్వెస్… ఇవాళ పూనే  చెర లో, ఒంటరి గదుల్లో.

మరి ముగ్గురు ఫాదర్ స్టాన్ స్వామి, ఆనంద్ తెల్తుంబ్డే, గౌతమ్ నవ్లఖా బయట వున్నా నిత్య భయమే.

ఎందుకు?

ఎవరైనా చెయ్యాల్సిన పని చేయలేకపోవడమే చిత్రహింస. చెయ్యాల్సిన పని చెయ్యగలగడమే నిజమైన స్వేచ్చ.

బికే 12 (భీమా కొరెగావ్-12) అనబడే వీళ్ళు తాము చెయ్యాల్సిన పనులే చేశారు. ఫాదర్ స్టాన్ స్వామి చెప్పినట్టు తమ అవసరం ఎవరికి వుందో వాళ్ళ కోసం పని చేశారు. దళితులకు, ఆదివాసులకు అండగా నిలబడ్డారు. కార్మికుల కోసం, రైతుల కోసం తమ విద్యాబుద్ధులను వెచ్చించారు. వాళ్ళ కోసం రాశారు. వాదించారు. నిజంగా న్యాయ-వాదం అంటే ఏమిటో అదే వాళ్ళు చేశారు.

మోడీ లు, అమిత్ షా లు రాజ్యమేలడానికి వీలిచ్చిన రాజ్యాంగమే వివి తదితరులు తమ అభిప్రాయాలు చెప్పే హక్కునిచ్చింది.

అలా మాట్లాడినందుకే, రచించినందుకే వాళ్లిప్పుడు చెరసాలల్లో వున్నారు.

చెయ్యాల్సిన పని చెయ్యని వాళ్ళమంతా ఆరుబయట వున్నాం.

నిజమా, మనం స్వేచ్చగా వున్నామా?

ఏది బయలు? ఏది చెర?

సముద్రం ఆటుపోటుల్లోని
అలను నేను కలను నేను కలతను నేను
గొప్ప శాంతి కోసం మహాసంక్షోభంలో
స్వేచ్ఛను కోల్పోయిన సముద్రాన్ని నేను
సముద్రం స్వేచ్ఛలో
సత్యమైన స్వేచ్ఛలో
స్వేచ్ఛను వెతుక్కొంటున్న నీటిచుక్కను నేను.’

అంటాడు… తెలుగువాడు గర్వించదగిన కవి, తొమ్మండుగ్వురిలో ఒకరు… పెండ్యాల వరవర రావు, ‘సముద్రం’ పేరుతో వెలువరించిన తన అద్భుత కావ్యం ముగింపు చరణాల్లో.

సముద్రం… అనగా సమాజం… స్వేచ్చను కోల్పోయింది. సమాజం స్వేచ్చను కోరుతున్నది. ఆ కోరికకు వాక్కునిచ్చిన వాళ్ళు ఆ తొమ్మండుగురు. వాళ్లు స్వేచ్చగా లేనంత కాలం సమాజం సంకెళ్ళలో వున్నట్టే.

ఏం చేశారు వాళ్ళు? ఎందుకు ఖైదు?

ఈ కథ ఎప్పట్నించో జరుగుతోంది గాని, కేసుకు స్థల కాలాలు చెప్పాల్సి వస్తే మహరాష్ట్రలో వుధు బద్రుక్ అనే వూళ్లో ప్రజలు చాల ప్రేమించే గోవింద్ గైక్వాడ్ అనే దళిత వీరుని స్మృతి చిహ్నాన్ని ఎవరో పాడు చేసి, అవమానించారు. ఆ పని చేసిన వాళ్ళెవరో తెలిసినా, వాళ్ళ మీద ఎలాంటి కేసు లేదు, దర్యాప్తు గట్రా అసలే లేవు. నేరగాళ్ళు బోరవిడుచుకు తిరుగుతున్నారు. వాళ్ళ మీద కనీసం పోలీసుల ప్రాధమిక దర్యాప్తు నివేదిక కూడా లేదు.

ఇది చాలు భరత భూమిలో ఒక గీటు గీయబడిందని. ప్రజలతో యుద్ధానికి ప్రభుత్వం తెగబడిందని అర్థం చేసుకోడానికి.

వి వి కావ్యం ‘సముద్రం’ ఎక్కడ ముగుస్తుందో అక్కడే జీవితం మొదలు కావాలి. మనందరి కోసం తమ స్వేచ్చను కోల్పోయిన వాళ్ళ కోసం ఇప్పుడు మనందరం మాట్లాడాలి. ఈ ఎన్నికల వేళ మాట్లాడ్డానికి ఇంతకంటె మంచి టాపిక్ లేదు.

ప్రజాస్వామ్యానికి ప్రాణమైన అసమ్మతిని అణిచివేసి, ఇక అభివృద్ధి గురించి ఏం సోది చెబుతారు? ఎవరి కోసం అభివృద్ధి?

వాళ్ళు నరేంద్ర మోడీ మహాశయుడిని అనగా ఇప్పటి భారత ప్రధానిని హతమార్చాలని కుట్ర పన్నారట.

ఆ మోడీ మహాశయుడిని మనం మళ్లీ ప్రధానిగా ఎన్నుకోబోతున్నాం. ఎన్నిక కాబోయే ముందు మోడీ సారు ఒక నిజం చెబుతారా? మోడీ ఏలుబడి ఒక నిజం చెబుతుందా?

ఆయన హత్యకు కుట్ర జరిగిందంటున్న భీమా కొరెగావ్ గ్రామంలో, పూనే లో నిజంగా ఏం జరిగింది?

భీమా కొరెగావ్ పక్క వూరు వుధు బదృక్ గ్రామంలో దళిత వీరుడు గోవింద్ గైక్వాడ్ స్మృతి చిహ్నాన్ని పాడు చేసిందెవరు? ఆ పని చేసింది అక్కడి హిందూత్వ నాయకులు మిళింద్ ఎక్నోటే, ఆయన సహచరుడు అని తెలిసినా ఎందుకని పోలీసులు పట్టించుకోలేదు? ఎక్నోటే మనుషులు… తాము ఏ దళితులను నొప్పించారో ఆ దళితులకే వ్యతిరేకంగా బంద్ కూడా నిర్వహించారు. దీన్నంతా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు?

దళితులు… ఏటా చేస్తున్నట్టే… భీమా కొరెగావ్ లో మహర్ (దళిత) వీరుల జ్ఞాపక చిహ్నం వద్ద పెద్ద సభ నిర్వహించారు. అది హిందూత్వ శక్తులకు కంటగింపు అయ్యింది.

200 ఏండ్ల కిందట భీమా కొరెగావ్ వద్ద చాల మంది చమార్ల తో కూడిన బ్రిటీష్ సైనిక పటాలం స్టానిక పీడకులైన బ్రాహ్మణ పీష్వాల మీద పోరాడి గెలిచింది. ఆ ఘటన 200వ వార్షికోత్సవమే మొన్న దళితులు అక్కడ చేరిన రోజు. పటాలం బ్రిటిష్ వారిదైనా పోరాడింది, గెల్చింది స్థానిక పీడకులైన పీష్వాల మీద. దాన్ని దళితులు ఇప్పటికీ గుర్తుచేసుకోడాన్ని బట్టి… వారి మీద అక్కడ ఎంతటి ఎలాంటి అణిచివేత అమలు జరిగిందో వూహించొచ్చు.

ఈ ఘటనా స్థలి వద్ద తమ ఆత్మగౌరవ సంకేతంగా దళితులు పండుగ చేసుకోడం డాక్టర్ అంబేద్కర్ నాటి నుంచీ వుంది. భీమా కోరెగావ్ 200వ వార్షికోత్సవం కొట్లాటల్లో ఒక వ్యక్తి మరణించాడు.

మానవ హక్కుల వాళ్ళ మీద దెబ్బ తీయడానికి ఈ ఘటనను వాడుకున్నారు. దొంగలే దొంగ దొంగ అని అరిచారు.

భీమా కొరెగావ్ ఘటనకు ఒకరోజు ముందు పూనే లో ‘ఎల్గార్ పరిషత్’ (దండోరా లేక చాటింపు సమావేశం) పేరిట ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్న వాళ్ళు భీమా కొరెగావ్ వద్ద అల్లర్లు సృష్తించారని, ప్రధాని హత్యకు కుట్ర పన్నారని, వారికి మావోయిస్టులతో సంబంధాలున్నాయని అరోపణ.

‘దండోరా’ సమావేశంలో పాల్గొన్న సురేంద్ర గాడ్లింగ్ తదితర ఐదుగురి మీద, ఆ తరువాత వరవర రావు తో సహా ఏడుగురి మీద… కేసులు పెట్టారు. ఇళ్ళ మీద దాడులు చేశారు.

భీమా కొరెగావ్ లో 200 ఏండ్ల క్రితం పీష్వాల ధాష్టీకాన్నెదిరించి మహర్లు (దళితులు) సాధించిన సైనిక విజయం వారికి గర్వకారణం కావడానిక్కారణం తరతరాల హైందవ దుర్మార్గం. ఇప్పుడు దళితుల పక్షాన నిలబడే పౌరహక్కుల కార్యకర్తలను, రచయితలను చెరబట్టారు. ఇది నేటి ప్రభుత్వం సాగిస్తున్న అమానుషం. కొనసాగుతున్న అధర్మం.

ఇప్పుడిక భీమా కొరెగావ్ కేవలం స్మృతి కాదు, వర్తమాన దుఃఖం.

ఇంత ఘోరమైన ‘వర్తమానా’నికి ఎన్నికల్లో ఓట్లు వేసి, లెజిటిమసీ కల్పిద్దామా?

లేక

దళితుల కోసం, ఆదివాసులూ రైతుల కోసం పని చేయడమే నేరమై చెరసాల పాలైన సుధా భరద్వాజ్, వివి, సుధీర్ దావలే వంటి ధిక్కార స్వరాలకు చోటిచ్చే ప్రజాస్వామ్యానికి బాసటగా నిలుద్దామా?

ఓట్ల జోలె పట్టుకొని మన ముందుకు వచ్చే రాజకీయులను ఈ మేరకు ప్రశ్నించలేమా?

అసలా తొమ్మండుగురిని చెరలో వుంచి జరిపే ఎన్నికలు ప్రజలు పాల్గొనే ఎన్నికలెలా అవుతాయని ఆడగలేమా?

‘సముద్రం’ కావ్యం చివరి చరణాల్లో కామ్రేడ్ వివి… ‘సముద్ర స్వేచ్చ’లో… అనగా సమాజ స్వేచ్ఛలో తన (వ్యక్తి) స్వేచ్చ ఎలా అవినాభావమో గొప్పగా కవిత్వించారు (చూడు: పై ఉటంకింపు). కావ్యం ముగింపు వద్ద జీవితం ప్రారంభమవుతుంది. కావ్యంలో ఈ ఆవృతి వొట్టి చమత్కారం కాదు, జరగాల్సింది అదే. ఆ మాటనే కవి కావ్యం మొదటి లైన్లలో ఇలా ప్రకటించాడు.

ఏమున్నది సముద్రం
నీళ్ళూ, ఉప్పూ
ఉప్పెనా తప్ప

ఏమున్నది జీవితం
చీమూ నెత్తురూ
పోరాటం తప్ప.

నిజం కదా?

ఏమున్నది జీవితం? చీమూ నెత్తురూ పోరాటం తప్ప!

పోరాటం లేకపోతే ఇంకేమైనా వుందో లేదో గాని…

జీవితం మాత్రం లేదు.

12-3-2019

 

హెచ్చార్కె

15 comments

 • Ennikala Vela sampaadakeeyam chernakolalaa panichesthundi
  Aadivaasee poraataalatho
  Nela స్పృశిస్తుంది
  Medhaavula gonthulu nulumuthunna adhikaaraanni dandinchaalsinde

 • మార్వలెస్. చాలా బాగుంది. కంటెంట్ చక్కగా ప్రెసెంట్ అయ్యింది. సందర్భోచితమైన సంపాదకీయం. వస్తువుమీద పోయినంత ధ్యాస మీద శైలిమీద పోలేదీసారి.

  మార్పు మంచిదే కదూ ! థ్యాంక్స్ సర్. మంచి ఎస్సే చదివించారు మాచేత. బీమాకోరేగావ్ ఇస్ష్యూ మీద ఇంకా చాలా చర్చ జర్గాల్సి ఉంది.

  • థాంక్స్ శ్రీరామ్. ఔను, భిమా కొరెగావ్ మీదా, అలాంటి వూరూరి దుఃఖాల మీద చర్చ జరగాలి. అసలు అసమ్మతిని అణిచివేసే దుర్మార్గం మీద అవహన పెరగాలి.

 • జోలె పట్టుకుని వచ్చి మన గుమ్మాల ముందు అడుక్కునే రాజకీయులను సూటిగా ఇలాంటి ప్రశ్నలు అడగట్లేం కాబట్టే వాళ్లు ఇలా చెలరేగి పోతున్నారు … పోరాటం లేకపోతే జీవితం మాత్రం లేదు సర్ మీరన్నట్టు..భీమా కొరెగావ్ జరిగిన సంఘటనల గురించి తెలుసుకునే అవకాశం కల్పించారు ధన్యవాదాలు మీకు..

 • ఎన్నికలలో వచ్చే వాళ్ళంతా ఒకే తానులోని దారప్పోగులు. వాళ్ళ ముందు మనది చెవిటి వాని ముందు శంఖమూదడమే. మన గొంతులు చిన్నవయ్యాయిప్పుడు. ఎవరికి వారుగా ఎవరి గూట్లో వాళ్ళు భద్రమయ జీవితం అనుభవిస్తున్న ఖైధీలం. ఈ సమయంలో ఇది ప్రేరణ ఇచ్చె మాటలే. కానీ గొంతెత్తే వాళ్ళం ఎంతమందిమి. అభినందనలతో.

  • థాంక్యూ సో మచ్, వర్మ గారు, మీ ఆవేదన పూర్తిగా సమంజసం. గూళ్లు వున్నాయి. అదీ సైద్ధాంతిక సమర్థన ఏమాత్రం లేని కెరీరిస్టు గూళ్లు. వీటికి పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ ‘విప్లవ’ సాహచర్యమూ వుంది. అయినా సరే, జనం పక్కన నిలబడదాం. గిరిజనం పక్కన, దలితుల పక్కన, రైతుల పక్కన, మానవ హక్కుల కార్యకర్తల పక్కన.

   వ్యక్తిగత ఎజెండాల్లో ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అని కాదు. మనకు మనం సరిగ్గా అలోచిస్తున్నామా లేదా అన్నదే గీటురాయి. ఏది సరైన ఆలోచన అన్నది… అరమరికలు లేని చర్చ ద్వారానే ఎంతో కొంత తెలుస్తుంది. ఇంతకు మించి వేరే దారి ఏమీ లేదు కదా?

   లేకుంటే రవి గాంచనిచో పైరవి గాంచున్ అని సరిపెట్టుకోవసిందే కదా?!

 • ఈ సందర్భంలో గొప్ప సంపాదకీయం గురువు గారూ… ❤

 • సార్, చిన్న సవరణ.
  “భీమా కొరెగావ్ లో చమార్ (దళిత) వీరుల జ్ఞాపక చిహ్నం వద్ద పెద్ద సభ నిర్వహించారు” అని రాశారు.
  కానీ అది మహర్ వీరుల స్మృతి చిహ్నం.

 • ఎప్పుడో రాయవలసిన మాటలు చాల బలంగా ఇప్పటి నిరంకుశ ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ బాగా రాసారు. నేరమా మోపబడా వాళ్ళందరూ కూడా ప్రజల పక్షాన పోరాడుతున్న వారే. మోడీ ని హత్య చేస్తారన్న మాట ఓకే వెర్రి ఆరోపణ మాత్రమే.
  ఈ ఎన్నికలలో ఈ నియంత నెగ్గితే దేశమెలా ఉంటుందో అన్న ఆలోచన హల భయంకరంగా ఉంది.

 • కొంచెం ఆలస్యమయిన మంచి వ్యాసం ఎన్నికల వేళా , ఇది చాల అవసరం

  • ప్రతిస్పందనకు చాల థాంక్స్. ఔనిది ఎన్నికల వేళ వ్యాసమే. ఎన్నికల్లో దీన్ని మన నినాదం చేసుకోవాలని నా విజ్ఞప్తి.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.