నాన్న చనిపోయాడు. అందరూ ఏడుస్తున్నారు. నేను మాత్రం ఏడవడం లేదు. చెట్టంత కొడుకులు కూడా ‘నాన్నా.’.అంటూ బావురుమన్నారు. ఆఖరికి, ‘వీడు ఎప్పుడు పోతాడా’ అని కళ్లల్లో వొత్తులు వేసుకుని ఎదురు చూసిన కోడళ్లు కూడా కుమిలి కుమిలి ఏడుస్తున్నారు.
“కూతురి కంట్లోంచి చుక్క రాలడం లేదు…” అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. అయినా నాకు ఏడుపు రావడం లేదు.
చిన్న చిన్న విషయాలకే వల వలా ఏడుస్తానని చిన్నప్పటినించే పెద్ద పేరు నాకు. కాస్త పరిచయం ఉన్న వాళ్ళకి కష్టమొస్తే కన్నీరు కారుస్తాను. అలాంటిది కన్నతండ్రి చనిపోతే ఎందుకు ఏడవడం లేదు ???
నేను పుట్టక ముందునించే నాన్నకి నేనంటే అయిష్టం. అసహ్యం కూడా.
నేను అమ్మ పొట్టలో ఉన్నపుడే పక్కింటి అబ్బాయిలు వేళాకోళంగా అనేవారట, “ మామయ్యా! ఈసారి నీకు ఆడపిల్లే పుడుతుంది “ అని.
“నేను అబద్దాలు ఆడను. నాకు ఆడపిల్ల అస్సలు పుట్టదు.” అని వాదించేవాడట నా “కన్న”తండ్రి.
“ ఒకవేళ ఆడపిల్ల పుడితే మాకిచ్చి పెళ్లి చేస్తావా?” సవాలు విసిరారట ఆ పక్కింటి బడుద్దాయిలు ఐదుగురు.
“నాకు ఆడపిల్ల పుట్టదు. పుడితే మీరే చేసుకోండి. దరిద్రం ఒదులుతుంది “ అని అమ్మ కడుపులోనే నన్ను ద్రౌపదిని చేసేసాడు.
నేను పుట్టాను. “ నాకు తెలియకుండానే అబద్ధం ఆడి ఉంటాను.” అని నిట్టూర్చాడట ఈ సత్య హరిశ్చంద్రుడు.
ఆ మాటలన్నీ పక్కింటి వాళ్ళ నోట్లోంచి ఎన్ని సార్లు విన్నానో! అంతా చెప్పి పెద్దగా నవ్వేవాళ్ళు. నేను తల దించుకుని ఇంట్లోకి పరుగెత్తే దాన్ని. అమ్మని పట్టుకుని ఏడ్చేదాన్ని. అమ్మ కూడా ఏడ్చేది. నాన్న చేష్టలకి కోపం తెచ్చుకోవడం అమ్మ నేర్చుకోలేదు.. నాకూ నేర్పలేదు.
అమ్మకి పనికిమాలిన భర్త తప్ప దిక్కూ మొక్కూ ఎవరూ లేరు. మా అమ్మకి అమ్మ లేదు, ఎప్పుడో చనిపోయింది. తండ్రి దేశదిమ్మరి. అమ్మకి అన్నలున్నారు. కానీ వాళ్ళు పుట్టిందీ, బతికేదీ డబ్బులు దాచుకోవడం కోసమే. సొంత చెల్లితో రెండు మాటలు మాట్లాడితే ఆ తర్వాత నాలుగు రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందేమోనని భయపడేవారు.
నేను పుట్టాక అమ్మకి నేనే లోకమయ్యాను. తన జీవితంలో జరిగిన ప్రతీ సంగతీ నాకు తెలుసు. అన్నీ కళ్ళకి కట్టినట్టుగా చెప్పేది.
” చంటి పిల్లలు ఎవరయినా ముద్దుగానే ఉంటారు. నువ్వయితే తెల్లగా..బొద్దుగా ..ఉంగరాల జుట్టుతో…ఇంకా ముద్దొచ్చే దానివి. నిన్ను చూస్తేనే కడుపు నిండిపోయేది ” అని అమ్మ ఎన్ని సార్లు చెప్పేదో.
నా తండ్రికి మాత్రం నేను ఒక్కసారి కూడా ముద్దు రాలేదు, తను తెలియక ఆడిన అబద్ధానికి నేను శిక్షని కాబట్టి.
చక్కగా తలస్నానం చేయించి, సాంబ్రాణి పొగతో జుట్టు ఆరబెట్టి, ఒంటినిండా పౌడరు రాసి, పువ్వుల్లా ఉతికిన బట్టలు తొడిగి, శుభ్రంగా, పండులా వున్న పసి బిడ్డని ఒక్కసారి ఎత్తుకోమని చేతికి అందిస్తే, చేతులు అరమైలు దూరంగా చాచి ‘పీతి గుడ్డ’ని పట్టుకున్నట్టు నన్ను పట్టుకున్నాడట. ఆ తర్వాత ఎప్పుడూ నన్ను తన చేతికి ఇవ్వలేదట అమ్మ.
నా చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ అమ్మతోనే. గుడికయినా…బడికయినా.. అమ్మే. జ్వరమొస్తే అస్పత్రికీ అమ్మే.
నాకు పదేళ్ళ వయసున్నపుడు, ఒకసారి దీపావళి రోజు అమ్మ చెప్పిందని మా గోడ మీది దీపాలు ఆరిపోతే వెలిగించడానికి బయటికి వచ్చాను. మావి వెలిగించి ఊరుకోకుండా పక్కింటి వాళ్ళ దీపాలు కూడా వెలిగించడానికి బయలుదేరాను. పక్కింటి అబ్బాయి నన్ను బెదిరించడానికి టపాకాయ కాల్చి విసిరేసాడు.
నా చేతికున్న రబ్బరు గాజు ఒక్కసారిగా భగ్గున మండింది. ఆ మంటలకు నా కళ్ళు పోయాయనుకున్నాను. కళ్ళు మూసుకుని ‘అమ్మా’ అంటూ పెద్దగా ఏడ్చాను. అమ్మ లోపలి గదిలో నుంచి పరుగెత్తుకుంటూ వచ్చింది. వరండాలో కూర్చుని జరిగేదంతా గుడ్లప్పగించి చూస్తున్న నాన్న మాత్రం కుర్చీ దిగలేదు.
అమ్మ నన్ను గబాల్న చంకనేసుకుని ఆస్పత్రికి పరుగెత్తింది. అప్పుడు నాకు పదేళ్ళు. పైగా బొద్దుగా ఉండేదానిని. అంత బరువున్న నన్ను ఎత్తుకుని అరమైలు దూరం పరుగెత్తింది. నన్ను అపరేషన్ థియేటర్లో పడుకోబెట్టి, చేతి మీది పెద్ద పెద్ద బొబ్బల్ని డాక్టర్లు కత్తిరిస్తుంటే నా కన్నా ఎక్కువ అమ్మే ఏడ్చింది.
నా గాయాలు పూర్తిగా మానడానికి నెలరోజులు ఆస్పత్రి చుట్టూ తిరిగింది అమ్మే. అదీ గిట్టలేదు అ మనిషికి. “ అ పిల్ల కోసం నా పనులు ఆలస్యం చేస్తావా?” అంటూ అమ్మని పట్టుకుని తిట్టడం, కొట్టడం.
అమ్మకి ఎప్పుడయినా ఒంట్లో బాగాలేక ఆసుపత్రిలో చేరితే, వంట పని నాకే చెప్పేవాడు. నాకు రాదంటే “ ఆడ పిల్లవి. పైగా పన్నెండేళ్ళు ముడ్డి కిందకి వచ్చాయి, ఈ మాత్రం వంటచేయలేవా ?” అంటూ తిట్ల దండకం. తనొక్కడే వుంటే మాత్రం చేపల పులుసు చేసుకొని లొట్టలేస్తూ తినేసే వాడు. పెళ్ళికి ముందు తనే వంట చేసుకునే వాడట, హోటల్ తిండి పడదని. నేను కూడా అమ్మతో పాటే ఆసుపత్రిలో ఉండి పోయినపుడు, పక్కింటి అత్తయ్య ఒండి పెట్టేది “ మొగాళ్ళు మీరెందుకు చెయ్యి కాల్చుకోడం? “ అంటూ. అమ్మలు ఊరేళ్లినా, నాన్నలకు తిండి పెట్టే వాళ్ళకేం లోటు ఉండేది కాదు అప్పట్లో . మా నాన్న తీసుకొస్తే, మా ఇంటికి కూడా భోజనానికి బోలెడు మంది వచ్చే వాళ్ళు, పెళ్ళాలు ఊరెల్లిన మొగుళ్ళు.
ఇరుగూ పొరుగూ కూడా ఊరెళ్ళినపుడు, గత్యంతరం లేక ఎప్పుడైనా నాన్నే పొయ్యి దగ్గర కూర్చోవాల్సి వస్తే, ‘’ తల్లీ, పిల్లా ఆసుపత్రిలోనే కాపరం పెట్టారు. ఇంట్లో ఇద్దరు ఆడాళ్ళు వున్నా, నేనే వొండుకు తినాల్సి వచ్చింది” అంటూ ఆర్నెల్ల దాకా ఎత్తిపొడుపులూ, సాధింపులూ. వంట బాగా చేయడం వచ్చిన ఆ మనిషి , జీవితంలో ఒక్కపూట కూడా భార్యకీ, కూతురికీ ఒండిపెట్టలేదు. అమ్మకి అసలు అంత “ఆశ “ ఎప్పుడూ లేదు, కలలో కూడా. మొగుడు తిట్టకుండా, కొట్టకుండా ఉన్న రోజు పరమాన్నం తిన్నట్టే.
అమ్మకి చదువు లేదు. పిల్లలని పోషించే స్తోమత లేదు. మొగుణ్ణి ఎదిరించే శక్తి లేదు. ఒంటరిగా బతకగలిగే ధైర్యం లేదు. “పీడించే మొగుణ్ణి వొదిలి పారేసి కూడా బతకొచ్చు’’ అనే జ్ఞానం అందే మార్గం లేదు.
అమ్మకి ఏమీ తెలీదు. “ అంతా నా ఖర్మ” అంటూ ఏడుచుకునే తరతరాల దాస్యం తప్ప. అయినా, పెద్ద చదువులు చదివి, ఉద్యోగాలు చేస్తూ కూడా భర్తల చెప్పులు నాకే భార్యల ముందు అమ్మ బానిసత్వం ఏపాటిది!
నేను డిగ్రీ హాస్టల్లో వుండి చదివాను. నేను ఆ హాస్టలు వదలడానికి కొన్ని రోజుల ముందు నా స్నేహితురాళ్ళు కొంతమంది నన్నడిగారు చాలా ఆశ్చర్యంగా, “మీ నాన్న బతికే వున్నాడా! మరి ఈ మూడేళ్ళలో ఒక్కసారి కూడా మీ నాన్న మాట ఎత్తలేదు ఎందుకు?” అని. అప్పుడర్ధమయ్యింది నాకు, నా తండ్రి నీడ కూడా నా మనసులో లేదని.
అలాంటి వాడు అనారోగ్యంతో ఆసుపత్రిలో వున్నపుడు అన్ని సేవలూ చేశాను, అమ్మ చెప్పిందని. పదిహేను రోజులపాటు అన్నీ నేనై చూసుకున్నాను. “నిండా ఇరవై ఏళ్లయినా లేని అమ్మాయి ఎంత బాధ్యతగా వుందో!” అని ఆ వార్డులో వున్న పేషెంట్లు చాలామంది మెచ్చుకున్నారు. “ మా అబ్బాయిలకి సెలవు దొరకలేదు. మా ఆవిడకి అస్సలు వొంట్లో బాగా లేదు. అందుకే పిల్లని పంపారు.” అని చప్పరించాడు. అంతేగాని ఒక్క మెచ్చుకోలు మాట లేదు. కనీసం ఆ చూపుల్లో కూడా సంతోషం గానీ, అభిమానం గానీ పిసరంతయినా కనిపించలేదు నాకు.
నా తండ్రి లాంటి వాడికి భార్య అయినందుకే నా తల్లికి యాభై ఏళ్ళకే నూరేళ్ళూ నిండాయి. నా తల్లి పోయినపుడు ఏడ్చాడు. పశ్చాతాపంతో కాదు, “ నా భార్య చేసినంత ఓపికగా ఇకముందు నా పనులన్నీ ఎవరు చేస్తారూ..” అని. నేను తల్లి లేని పిల్లనయ్యాననీ, నా భాధ్యత తనదేననీ మాత్రం తోచలేదు అతనికి. నా భవిష్యత్తు గురించి బెంగపడలేదు. అమ్మ లేని చోట ఉండలేక ఆ ఊరినే ఒదిలేస్తే పట్టించుకోలేదు.
“ ప్రతీ కూతురి జీవితంలో తండ్రే మొదటి హీరో.” అని ఎక్కడో చదివినపుడు ఎంత చిర్రెత్తిందో! నా జీవితంలో మొదటి విలన్ నా తండ్రే కదా! నేను చూసిన చాలా మంది అమ్మాయిల జీవితాల్లో కూడా తండ్రులు హీరోలు కాదు. కూతురితో సిగరెట్లు తెప్పించుకుంటూ, తేవడం కాస్త ఆలస్యమైతే ఆ చంటి దాన్ని బెల్టుతో గొడ్డుని బాదినట్టు బాదే తండ్రిని మా పక్కింట్లో చూసాను. తనకు వ్యాపారంలో లాభం రావాలని పట్టుమని పదేళ్ళు కూడా లేని పిల్లని పచ్చి మంచి నీళ్ళు కూడా ఇవ్వకుండా పదహారు రోజుల పాటు పూజలో కూర్చో బెట్టిన తండ్రిని మా పక్క వీధిలో చూసాను. తమ కులం కాని వాన్ని ప్రేమించిందని కూతురికి విషమిచ్చిన తండ్రిని మా పక్క ఊరిలో చూసాను.
“తండ్రులందరూ తమ కూతుళ్ళను ప్రాణంగా చూసుకుంటారు” లాంటి ‘పంచదార’ పలుకులు విన్నపుడు, అలా అన్న వాళ్ళ పళ్ళు రాలగొట్టాలనిపిస్తుంది. కూతుళ్ళని, కొడుకులతో సమానంగా ఎందరు తండ్రులు చూస్తారు!
కూతుళ్ళు, తల్లి కడుపులోంచి బయటికి రాక ముందే ఆ రక్తపు ముద్దల్ని హత్యలు చేసిన తండ్రులు మన కళ్ళ ముందే తిరగడం లేదా! కూతుళ్ళు పుట్టి కొన్ని రోజులైనా కాక ముందే, ఆ పసి గుడ్డుల ప్రాణాలు తీసిన తండ్రులు కనిపించ లేదా! కూతుళ్ళ మీద “ అఘాయిత్యం” చేసిన తండ్రుల గురించి ఏ పేపరులోనూ చదవలేదా!
అసలు చాలా మంది తండ్రులకి వాళ్లకి ఎక్కడెక్కడ ఎంతమంది కూతుళ్ళు పుట్టారో తెలుసా! తాళి కట్టని భార్యలకి పుట్టారని, తమ కూతుళ్ళకి తండ్రులు కాని మగానుభావులెందరో!
‘నా తండ్రి ఇంతింత ఘోరాలు చేయలేదు కదా!’ అని నా అసహ్యాన్ని తగ్గించుకున్నాను. “వయసు మీద పడింది కదా, చేసిన తప్పులను తలచుకుని కుములుతూ వున్నాడేమో!” అని ఆశ పెంచుకున్నాను. అందుకే అతని ఆఖరి రోజుల్లో చూడడానికి ఆసుపత్రికి వెళ్ళాను. పడుకునే ఎవరితోనో కబుర్లు చెపుతున్నాడు. కాసేపు బయటే ఆగాను. “ నా చేతుల్లో ఎంతమంది దెబ్బలు తిన్నారో! మా అమ్మమ్మనీ, నాయనమ్మనీ కొట్టాను.” అతడి చిన్నప్పుడే తల్లి చచ్చిపోతే ప్రేమగా పెంచిపెద్ద చేసిన వాళ్ళిద్దరినీ కొట్టిన విషయాన్నీ గొప్పగా చెపుతున్నాడే అని అసహ్యం వేసింది. అతని తల్లి చచ్చిపోయి, బతికిపోయింది. లేకపోతే ఆవిడనీ కొట్టేవాడేమో!
“ నా చెల్లెలు ఇష్టంలేని మొగుడితో కాపరం చేయనని పేచీ పెడితే చెట్టుకి కట్టేసి మరీ బెల్టుతో రక్తాలు కారేలా కొట్టాను. ఆ తర్వాత చచ్చినట్టు కాపరానికి వెళ్ళింది.” ఆ గొంతులో విజయగర్వం. ఆ నోరు పడిపోతే బాగుణ్ణు. తోడబుట్టిన దాన్ని అంత హింస పెట్టడమే కాకుండా, చచ్చేముందు కూడా గొప్పగా చెప్పుకున్నాడు.
“ ఇక నా పెళ్ళాన్నయితే ఎన్నిసార్లు కొట్టానో లెక్కేలేదు. నేను ఏం చేసినా నోరేత్తేదే కాదు. ఒకవేళ నోరెత్తిందా, నా చేతిలో ఆ రోజు చచ్చిందే. ఒక రోజయితే నా మాట వినలేదని రాత్రంతా వర్షంలో బయటే నిలబెట్టాను, పిల్లలతో సహా. నా అంత మొగాడు మా ఊళ్లోనే లేడు తెలుసా?. ……….”
ఛీ !ఛీ ! ఇలాంటివాడినా నేను చూడడానికి వచ్చింది!” నన్ను నేను తిట్టుకుంటూ వెనక్కి తిరిగాను. లోపలినుంచి ఇంకా మాటలు వినిపిస్తున్నాయి. “ నా కూతురు నన్ను ఎదిరిస్తే, పసిముండని కూడా చూడకుండా చెప్పుతో ఎడాపెడా బాదేసాను. కానీ దాన్ని మాత్రం దారిలో పెట్టలేకపోయాను. నన్నసలు లేక్కే చేసేది కాదు.”
ఆ మాటలతో అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక వెళ్లి పోయాను.
ఆ తర్వాత చనిపోయాడని తెలిసింది. అస్సలు రావాలనిపించ లేదు. కానీ అనారోగ్యంతో ఉన్న మేనత్త పోరుతో రాక తప్పలేదు.
నేనయితే వచ్చాను, కానీ బతికున్నప్పుడే చచ్చిపోయిన ఆ “శవం” మీద నాలుగు కన్నీటి బొట్లని ఎలా రాల్చను!
ఆ మనిషి చచ్చే దాక మారలేదు. మారకుండానే చచ్చాడు. నా తండ్రి అనే మనిషి చేసినవి ఒక్కోటి గుర్తుకు వస్తుంటే గుండెలు మండుతున్నాయి. ఇంకా కన్నీరు ఎక్కడ ఉంటుంది!?
Katha excellent
ఈ కామెంట్ కథకి సంబంధించి కాదు, కథ కింద పెట్టిన ఫోటో గురించి. కథకి కింద ఆ ఫోటో పెట్టడం బాలేదు. ఈ కథ నిజమై, నిజంగా ఈ కథలోని తండ్రిదే ఆ శవయాత్ర అని నేను అనుకోవటం లేదు. పాపం ఆ ఫొటోలో ఉన్నాయన ఎవరో నిజంగా కూతుళ్ళను చక్కగా చూసుకున్నాయన అయివుంటే… అనిపించింది.
మాష్టారూ, పత్రిక ను జాగర్తగా చదివి మీ అభిప్రాయం పంచుకున్నందుకు కృతజ్ఞతలు. ఈ స్నేహం కొనసాగాలని కోరుకుంటాం.
బొమ్మకు సంబంధించి మీ అభిప్రాయం సరైనదే. ఆ బొమ్మను తీసేశాం. మరోసారి కృతజ్ఞతలు.
దౌష్ట్యం. తండ్రి కూడా ఇలా!!
కథే అయితే బాగుణ్ను.
కూతురి ని అలా చూసేవాళ్ళు చాలామందే ఉంటారు. ఎందుకు కన్నీళ్ళు రాలేదో అన్న ప్రశ్నకు పూర్తి న్యాయమైన సమాధానం. చాలాకథలు ఇలాంటి కథనంతో నే వచ్చాయి. కాని పరిష్కారం లేదన్నట్లు ,ఇలాంటి వ్యధల్లో కుమిలి పోతారన్నట్లు గా ఉంటాయి. కొసమెరుపుగా ఆయన అలా ఎందుకయ్యారో చెప్పినా , మార్పుని అడ్డుకునేవి ఇవి అని చెపితే బాగుంటాయి. ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు చూస్తున్నా ,ఎలా దానిని నివారించాలో తెలియక చాలామంది ఉంటారు. అలాంటి వారికీ విశ్లేషణాత్మకంగా రాస్తే ఉపయోగం. ఇది రాసిన వాళ్ళు వాళ్ళతండ్రి అలా అవడానికి కారణం ఏవంటారు?