రెండు అధికార పక్షాలకూ గడ్డు కాలమే

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార , ప్రతిపక్ష పార్టీలు ఇరువురు పోటాపోటీగా బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. ఒకరకంగా చూస్తే యీ ఎన్నికలు అధికార టీడీపీ ప్రభుత్వానికి గడ్డుకాలమే. ప్రతిపక్షానికి కూడా ఇది జీవన్మరణ సమస్య. ప్రస్తుత ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది సామాన్య  ప్రజలు కూడా అంచనా వేయగలిగేంతగా ఉంది పరిస్థితి. దేశంలో ఆ పరిస్థితి లేదు. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ తన పట్టు బాగా పోగొట్టుకుందనే చెప్పాలి. ప్రచార ఆర్భాటాలు, దేశానికి ఉపయోగం చేకూర్చని విదేశీ పర్యటనలు…. ఇవి కేంద్ర ప్రభుత్వం మీద అసంతృప్తి పెరగడానికి తోడ్పడ్డాయి.

గెలుపును అందుకోలేని స్థాయికి దిగజారకున్నా… 2014 లో ఏ రాహుల్ గాంధీని ‘పప్పూ’ అని ఎగతాళి చేశారో ఇప్పుడు అదే రాహుల్ సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేని స్థాయికి మాత్రం దిగజారారు. దీనికి తోడు పెద్ద నోట్ల రద్దు కూడా చేటు చేసింది. దీనిపై ఎంత ‘లాభదాయక’ సంజాయిషీలు ఇచ్చినా అది ప్రజల ఆగ్రహానికే ఆజ్యమే పోసింది. నోట్ల రద్దు నాటి నుంచి నేటి వరకు ప్రధానమంత్రి నుండి బీజేపీ కింది స్థాయి కార్యకర్తల వరుకు అందరూ దీన్నో అద్భుతం అంటూ వర్ణించారు. దీని వల్ల దేశంలోని నల్లధనం తుడిచిపెట్టుకు పోతుందని బాకాలు ఊదారు. మరి నోట్ల రద్దు వల్ల నల్ల ధనం లేకుండా పోయేది కేవలం రెండు మూడు శాతమేనని ఆర్బీఐ ఇచ్చిన రిపోర్టును మొన్న రాత్రి కాంగ్రెస్ నేతలు బయటకు తెచ్చారు. ఎన్నికల సమయంలో నోట్ల రద్దు వ్యవహారం విపక్షాలకు ప్రచార అస్త్రమైంది. నోట్ల  రద్దుతో బ్యాంకుల ముందు జరిగిన తొక్కిసలాటల్లో దేశవ్యాప్తంగా 150 మంది సాధారణ పౌరులు చనిపోవడాన్ని జనాలు మర్చిపోలేదు. అసలది ఒక ఉపయోగం లేని పని అని ఇప్పుడు బయటపడింది. ప్రజలు దీన్ని తేలికగా తీసుకుంటారా?

అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ల తర్వాత బీజేపీ లొనే ఒక వర్గంలో అసమ్మతి మొదలైంది. నరేంద్ర మోడీ అనుంగు అనుచరుల ‘ఏకేశ్వరోపాసన’ దీనికి కారణం. అనామకులను మంత్రులుగా చేసి పార్టీలోని సీనియర్లను పక్కన పడేశారని ఆ వర్గం కినుక. ఇందులో మాత్రం వాస్తవం ఉంది. మొన్నామధ్యన ఢిల్లీలో ఎవరో జర్నలిస్ట్ ఒక కాలేజీకి పోయి అక్కడి విద్యార్థులను మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరని అడిగితే చాలా మంది శరద్ పవార్ అని సమాధానం ఇచ్చారట. నిజంగా మోడీ మంత్రి వర్గంలో 75 శాతం మంది పేర్లు 2014 తర్వాత నే ప్రజలకు తెలిసుంటాయి. వారంతా వివిధ సాధు సంఘాలకు, మత సంస్థలకు చెందినవారే. వారు చేసే చవకబారు వ్యాఖ్యలకు సరైన చర్యలు తీసుకోలేదనే అపప్రథ మోడీకి ఉండనే ఉంది.

ఇక రోజుకో మలుపు తిరిగిన రాఫెల్ యుద్ద విమానాల గొడవ సరేసరి. దాంట్లో తప్పు జరిగిందా లేదా అన్నది ఇంకా బయటకు రాకపోయినా అందులో ఏదో రహస్య ఒప్పందం ఉంది అనుకునేలా కావాలని కేంద్రం మూసిపెడుతూ వచ్చింది. అదే బీజేపీ కొంపముంచింది. సరిగ్గా మాట్లాడడం కూడా రాదని ఎద్దేవా చేసిన రాహుల్ గాంధీకి బీజేపీనే పలక బలపం ఇచ్చి ఆరోపణలు చేయటంలో ఓనమాలు నేర్పినట్లైంది. రాఫెల్ రచ్చలో ఇంకా ప్రజలకు అనుమానాలు పోలేదు గనుక అది కూడా చేటు చేయక మానదు. నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా 2014 తర్వాత కొన్నాళ్ళకు బీజేపీ కూటమి నుంచి రెండు మూడు పార్టీలు వైదొలగాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్ లోని అధికార టీడీపీ మినహా మిగిలిన అందరూ మోడీ  మీద నియతృత్వం ఆరోపిస్తున్న వారే.

మొన్న జరిగిన యుద్దం. భయానక వాతావరణం సృష్టించి, సమర శంఖం పూరించి యుద్ధ పిపాస ను చాటుకున్నారు. ఆ విధంగా దేశభక్త కోటరీలో ఓటు బ్యాంకు నింపుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి. ఊరుమ్మడి రచ్చబండ సంగతి అలా ఉంచి పేటలోని పెద్ద అరుగు విషయానికొస్తే

ఆంధ్రప్రదేశ్ లో యీ ఎన్నికలు ఏ మాత్రం రాజకీయాభిలాష లేని వాడికి కూడా ఆసక్తిని కలిగించేలా వున్నాయి. ముందుగా అధికార పార్టీ ఐన తెలుగుదేశం విషయానికి వస్తే ఆ పార్టీకి యీ ఎన్నికలు బంగాళాఖాతంలో ఈదినట్లే ఉంది. 2014 లో లాగా బలమైన తెడ్డుకర్ర లేదు. కాంగ్రెస్ కు చేరువైనా ఏపీలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకోవడం నడి సంద్రంలో పొరక పుల్లను పట్టుకున్నట్లే. ఏ కారణంతో అయితే బీజేపీతో చెలిమికి కటీఫ్ చెప్పేసారో ఆ కారణాన్ని ప్రచారాస్త్రంగానైనా ఉపయోగపడకుండా పోయింది. ఇది కచ్చితంగా టీడీపీకి చేతులారా చేసుకున్న పాపమే.

ఎందుకంటే ప్రత్యేక హోదా అంశంపై సరైన సమయంలో సరైన విధంగా స్పందించి వుంటే ఆ పార్టీకి అంతో ఇంతో పేరుండేది. హోదా అంశంపై రోజుకో మాట మార్చారు. హోదా ఏమైనా సంజీవనా అని వ్యంగ్యంగా మాట్లాడారు. నాలుగేళ్ల తర్వాత, బిజెపి తో తెగదెంపులు చేసుకున్నాక ఇప్పుడు హోదా కావాలని అరిస్తే ఏం లాభం ఉంటుంది. అది ఆఖరుకు విశ్వసనీయత అంశంగా మారింది. బీజేపీతో వున్నప్పుడు గుర్తుకు రాని ప్రత్యేక హోదా ఇప్పుడు కావాల్సొచ్చిందా అంటూ ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ఇక 2014 ఎన్నికల్లో బీజేపీతో చెలిమి రాష్ట్రంలో టీడీపీకి ఎంత మేలు చేసిందో అందరికీ తెలిసిందే. ఆడంబరపు వాగ్దానాలతో పాటు మోడీ ఇమేజ్ ని కూడా తన గెలుపు కోసం వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. కనుక ఇప్పుడు బీజేపీకి దూరం కావడం టీడీపీకి ప్రతికూల అంశమే. గడచిన ఐదేళ్లలో మారిన రాజకీయ సమీకరణాల వల్ల కాంగ్రెస్ కు చేరువైనా అది నామ్ కే వాస్తే మాత్రమే.

ఇంకో వైపు; ప్రతిపక్ష వైసీపీ సంగతికొస్తే ఇది వారికి సదవకాశాలున్న సమయమని చెప్పుకోవచ్చు. ప్రత్యేక హోదా అంశం నుండి పార్టీ ఫిరాయింపుల వరకు వాళ్ళు ఒకే మాటపై నిలబడుతూ వచ్చారు. ఆ సానుకూలత ప్రజల మనస్సులలో అలాగే వుంది. అంతేకాకుండా ఏ జాతీయ లేదా ప్రాంతీయ పార్టీలతో పొత్తుకూ వారు వెంపర్లాడడం లేదు. పాదయాత్ర చేస్తున్న సమయంలో గ్రామాల్లో తిరుగుతూ లోకల్ గా ఎక్కడి సమస్యలు అక్కడే వింటూ దానికి తగిన హామీలు ఇస్తూ పోయారు జగన్మోహన్ రెడ్డి. వలస చేరికలు జరిగినా, నియోజకవర్గ సీట్ల విషయంలో ఎటువంటి భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. పైగా చంద్రబాబు నాయుడుకు 2014 లాగే జగన్మోహన్ రెడ్డి కేసులను బూచిగా చూపడమే కానీ తన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకొని ఓట్లు అడిగే పరిస్థితి లేదు. రాయలసీమ లోని ప్రాజెక్టుల విషయంలో ఐదేళ్లు సైలెంట్ గా ఉండి ఎన్నికలు నాల్గు రోజుల్లో ఉన్నాయనంగా ఏవో జీవోలు జారీ చేశారు. దానికి భిన్నంగా ప్రతిపక్ష నేతలు తాము అధికారంలోకి వచ్చిన తరువాత నెరవేరుస్తామని నమ్మకం ఇవ్వగలుగుతున్నారు. అధికార పక్షం ఎన్నికల ముందు హడావుడి ని జనాలు నమ్మే స్థితిలో లేరు. ఒక్క రుణమాఫీ అంశమే దానికి ఉదాహరణ. 2014 ఎన్నికల్లో ఆడంబరంగా రుణాలు మాఫీ చేస్తామని వాగ్దానం చేసి ఆ తరువాత మాట తప్పుతూ  మూడు విడతల్లో పదివేలు విదిలించారు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ముందర ఇంకో పదివేలు మూడు విడతల్లో అని ఎర వేశారు. ఇది కచ్చితంగా అనధికార ఓటుకు నోటు జూదమే. దీన్ని వైసీపీ ప్రజల్లో సమర్థవంతంగా ఎండగట్టగలిగింది. ఇక టీడీపీ మీద పోలవరం అక్రమాలు, అడుగడుగునా కమీషన్లు, ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వంటి ఆరోపణలు ఉండనే ఉన్నాయి.

పొత్తుల సంగతికొస్తే అధికార పార్టీకి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వున్నా అది రాష్ట్రంలో లాభం తెచ్చిపెట్టదు. ఒకవేళ రాబోయే ఎన్నికల్లో ఓడిపోతే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం వల్లనే ఓడిపోయామను ఆత్మ సమర్థన చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్11 న ఒకేసారి ఒకే విడతలో ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకుని బోర్లా పడడం జరిగింది. వారు ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లోనైనా ఒంటరిగా పోటీ చేస్తే అప్పుడు గెలిచిన సీట్లను బట్టి నిజంగా వారికి ప్రజల్లో బలం లేదా లేక టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల దెబ్బ కొట్టిందా అన్నది తేలుతుంది.

ఒక రకంగా చెప్పాలంటే ఏ ప్రాంతీయ, జాతీయ పార్టీల ఇమేజ్ తో కలిసి కాకుండా సొంతంగా ఎన్నికలకు వెళ్తున్న ఎలక్షన్లు టీడీపీకి ఇవే మొదటి సారి కావచ్చు. ఎన్నికల నగారా మోగినందున ఇక ఇప్పటి నుంచి రెణ్ణెళ్ల వరుకు రాజకీయులకు జాగరణే. ఎవరి భవితవ్యం ఏమిటో వేచిచూద్దాం.

వంశీ పులి

వంశీ పులి: పూర్తి పేరు పులి. వంశీధర రెడ్డి. స్వస్థలం: కర్నూలు జిల్లా లోని వెల్గోడు గ్రామం.
డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి,. ప్రస్తుతం కర్నూలులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు .

5 comments

  • పార్లమెంటరీ పార్టీలు అన్ని ఇవ్వాళా ప్రపంచ వ్యాప్తంగా విశ్వాసహీనత (క్రెడిబిలిటీ) లేక ఆంతరంగిక చీలికలులో మునిగితేలుతున్నాయి. ఎదో ఒక పర్లియామేన్తరే పక్షం అధికారం లోకి వస్తే కలిగే ఉపశమనం ఒక క్షణికం మాత్రమే. ఒక పెద్ద ఫాసిస్ట్, మతవాద , హింసను ఆరాధించే సంస్థ స్థానంలో కొంచం మర్యాద పూర్వక సంస్థ వచ్చినా దాని గమనం అదే నిరంకుశత్వం వైపే . ఇండియా లాంటి వెనుకబడిన దేశంలో ఈ దిగజారుడు, హింస బాహాటంగా నిసిగ్గుగా జరుగుతుంది.

    అన్ని వ్యవస్థలు తమ స్వతంత్ర ప్రతిపత్తి పోగొట్టుకుని హింసను (వర్గ అణిచివేతను) బాహాటంగా సమర్ధించే స్థితి ( సుప్రీమ్ కోర్ట్, పార్లమెంట్, సివిల్ సర్వీస్ , విశ్వవిద్యాలయాలు, ఎలక్షన్ కమిషన్ , కాలేజీలు , విద్య , వైద్యం ) కి చేరుకున్నాయి . ఇప్పటి పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్న దశలో ( ప్రపంచీకరణ చెందిన ద్రవ్య పెట్టుబడి ) మన ముందు ఉన్న ప్రశ్న విప్లవమా- వినాశనమా (కొంత కాలం భీబత్సం ) .

    ముందు ఈ వస్తహ్వాన్ని గుర్తించటం అవసరం. ఏ సమస్య మీద నైనా ఉద్యమించ వచ్చు కానీ నాయకత్వం వహించే వారికి ఈ అవగాహన అవసరం.

  • ఈ విశ్లేషణ నూటికి నూరుశాతం కరెక్ట్. అయితే ఇటీవల ఓ యాభై పేజీల పరిశీలనా వ్యాసం హల్ చల్ చేస్తోంది. ఈ అధ్యయనం అదే తెలియజేస్తుంది. స్థూలంగా మూడు శాతం వోట్లు తేడా తో వైఎస్సార్ సిపి ముందు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఎంపెరికల్ స్టడీ లో చంద్రబాబు నాయుడు పెర్ఫార్మెన్స్ బాగానే ఉన్నట్లు యాభై శాతం ప్రజలు భావిస్తున్నారు. అయితే టోటల్ గా ఏంటి ఇన్ కంబెన్సీ ఫేక్టర్ టేక్స్ ది టోల్.

  • నైస్ ఎనాలిసిస్ బ్రదర్.. కీప్ డూయింగ్ గ్రేట్లీ …

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.