సంగటి- పండుమెరగాయ కారెం

ఆ ఏడు (సంవత్సరం) మా కొత్తిమిట్ట సేనికి మట్టి తోలాలనుకుంటిమి. అప్పటికే కలంలో నుంచి కుల్లిన సెనిక్కాయ కట్టెను, ‘వామ’డుగు దుగ్గును, సెత్తా సెదారాన్నంతా వరిమల్ల కాడుండే గుంతకు తోలింటిమి. దానిపైకి ఒక వరస ఇసిక్య తోలి, ఇంగో వరస దిబ్బలో ఉండే ప్యాడ తోలి మల్లా దాని పైకి ఇంగో వరస ఇసికేసి కప్పి  మండె కట్టి మగ్గబెట్టాలనుకుంటిమి. అదంతా అట్లా బాగ మగ్గినాక సేనికి తిరగదోలాలనుకుంటిమి. అది సేండ్లకు బో సథవ. సథవ తోల్న్య సేండ్లో సెనిక్కాయ (వేరుసెనగ) బో పండుతాండ్య. జొన్న గిన్న ఐతే గన కంకి బారెడు జంపు తీచ్చాండ్య.

అప్పుడు ఎద్దులు లేని రైతుల్యా. ‘ఎద్దుల్లేని సేతవ ఎనుముల్లేని సంసారం ఎక్కిరాదంటాంటిరి’ పెద్దోల్లు. అందుకే అట్లాంటి రైతల్ను ఊర్లో ఏల్ల మీద లెక్క కట్టాల్సిందుండ్య. గాటిన గొడ్డు గోద ఉండేదాన దిబ్బల్లో ప్యాడకు కొదవల్యాకుండా ఉండ్య. ఇంగ ఎద్దల్ను బట్టి , ఇంట్లో మన్సల వసతి బట్టి వాటమున్నోల్లు వాటమున్యన్ని ఎకరాలకు యాటా( ప్రతి సంవత్సరం) సేండ్లకు సథవ తోల్తాంటిరి. అప్పుడు ఇప్పటి మాదిరి పాస్పేటు గీస్పేటు ల్యా. ఒక తూరి సథవ తోలి,  ఏగిలి(పంట) మార్సుకుంటాంటే అదే మూడు నాలుగేండ్లు న్యాలను పానంతో పెడ్తాండ్య. సథవలో ఇసిక్య పడేదాన న్యాల నవ్రుగా ఉండి, నెమ్ము పట్టుకోని ఒక వాన తక్కువైనా పైరు తట్టుకుంటాండ్య.

ఆ ఏడు  మా ఇంటెదురు లోగిట్లో పుల్లాడ్డన్న మాకు  మట్టి బండికొచ్చాండ్య. ఆ పొద్దు (రోజు) ఆయన్న వాళ్లత్త గారి ఊరికి పోవాలంటే బాగ సీకట్లోనే బండి కట్టినాం. పిండారబోసినట్లుండాది పున్నమి ఎన్నెల. ఎద్దులు గూడా బాగ ఎగమేసి ఆ ఎన్నెలను నెమరేసుకుంటా బో ఉషారుగా నడుచ్చన్నెట్లనిపిచ్చ.

 

వానా కాలం వంక బాగ పారిందాన దొమ్మరాం గడ్డ కాడికి నున్నటి ఇసిక్యను కొట్టకచ్చి పెట్టిండ్య. బండికి ఇసిక్య పోచ్చాంటే యాన్నేగానీ పారకు గులకనేది తగలకుండా కత్తికి కరకరకర గుండు కొరిగినట్లొంచ్చాండ్య. బండికి ఇంగా రోంతసేపు పోచ్చామా అన్నెట్లు నేను సల్లుకోకుండా పోచ్చాంటే ‘సాలుబ్బి ఇంగ, ఎద్దలకు ఉరకైతాద’ని పుల్లాడ్డన్న నన్ను  యామారకుండా సెప్తాండ్య. ఐనా అది ఉత్తబండి గూడా కాదు. ‘డోరు’సెక్కలు బిగిచ్చి ఉండ్య. అట్లైందాన బండికి ఇసిక్య దండిగా పడ్తాండ్య.

పొద్దు పుర్స్యాలకల్లా ఐదు తడవలు తోలింటిమి.ఆ పొద్దుకు(రోజుకు)  ఇంగా మూడు తడవలుతోలాల్సి ఉండ్య. తూకమైన పనైందాన వొళ్లంతా నీళ్లలో దేవేసిన గుడ్డ మాదిరి  సెమట కారిపోతాండ్య. వొంటిపై ఇసిక్య్య పడి సెమటకు పై (వొల్లు) కసకసమంటాంటే తట్టుకోల్యాక ఇద్దరం సొక్కాలు గూడా ఇప్పి ఉత్త పైనుంటిమి. తడవ తడవకు వంట్లోని సత్తవ కరిగి పోతా వచ్చ. పొద్దు ఎక్కొచ్చేకొద్దీ ఈపున ఎండ సెర్రుమనబట్య. సీకట్లోనే బండి కట్టిందాన తెల్లవారాల్యకే కడుపులో పేగులు అర్సబట్య.  అప్పటికే సెలంలో నీళ్లు సల్లి రెండు మూడు తూర్లు కడుపునింపుకున్యా ఆకలి మంట మాత్రం ఆరిపోల్య. నేను ఆయన్నా ఎప్పుడెప్పుడు బువ్వొచ్చాదా అని ఎదుర్జూడబడ్తిమి. కూరాక్కు రుసిన్నెట్లే, ఎదురు సూపులకు, ఆఖరికి ఆకలి దప్పులగ్గూడా ఒక రుసంటూ ఉంటాదని నేర్సకునింది అట్లాంటప్పుడే.ఆ తడవ బండికి నేనే పొయ్యోచ్చినా. ‘బువ్వొచ్చింటే బాగుందునే ‘ అనుకుంటి మనసులో. అప్పటికింగా అమ్మల్లపొద్దు కూడా కాల్య. మల్లా తడవకు పుల్లాడ్డన్న పొయ్యొచ్చ. బండి ఆడుండంగానే ‘ఏం బ్బీ ఈ  పొద్దు అమ్మ బూ(బువ్వ) పంపడం మర్సి పొయ్నట్లుందే’ అన్య. ‘అవ్ న్నా .అట్లనే ఉంది సూచ్చాంటే’ అంటి నేనూ వంత పాడతా. ‘ ఇంగేమొచ్చాది లే, ఒకటేతూరి ఇంటికి పొయ్ తింటే పనైపోతాది’ అన్య. ఆకలి సంపుతాంది. అందుకే ఈ నిష్టూరపు మాటలన్ని. నిజానికి అప్పుడప్పుడే అమ్మల్లపొద్దు గావొచ్చాంది. ఐనా మాయమ్మ ఒంటిది. ఇంట్లో ఎనమల్ను సూసుకోని, పాలుపోసి, మజ్జిగ సిలికి, బువ్వజేసి ఎగాసగా పడ్యాలకు ఎట్లైనా అమ్మల్లపొద్దైతాది.

 బండిని ఇసిక్య తావుకు తిప్పి నిలబెట్టి ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటా ఆఖరి తడవకు ఇసిక్య పొయ్బడ్తిమి. ఎన్ని జేసినా మా సూపంతా ఊరి దావ పక్కే ఉంది ‘ఎప్పుడెప్పుడు బువ్వొచ్చాద్యా, ఎప్పుడెప్పుడు తిందామా’ అని ఆకలి సూపులు సూసుకుంటా. అట్లా అనుకుంటండగానే ఆంత దూరాన తలారోల్ల పిల్లోడు గంగాధర బువ్వపుటికె నెత్తిన పెట్టుకోని రావడం  కనపచ్చ.

‘అబ్బ బతికిచ్చినాడ్రా దేవుడా’ అని బో సంబరమాయ మనసులో. ఐనా ఎట్లా వొంగినాం గదా బండికి పోసి తిందాం లే అని గబగబా ఇసిక్య పోయబడ్తిమి. ఆయబ్బి  నేరుగా సెలం కాడికి పొయ్ బూ పుటికె దించి పల్లెం తీసుకుని సెలంలో నీళ్లు సల్లబట్య. ‘ఏం బ్బీ బో బెరీనొచ్చినావే ఈ పొద్దు’ అన్య పుల్లాడ్డన్న-కట్టిర్సి పొయ్లో పెట్నెట్లు. దానికి ఆయబ్బి ఉండి ‘దినాం ఈ యాలకే గదున్నా వచ్చేది’ అన్య.

‘సరేగాని   ఏం పంపిచ్చింది బ్బి అమ్మ’ అన్య. ‘సంగటి, పండుమెరగాయ కారెం  న్నా’ అన్య ఆయబ్బి. ఆయబ్బి ఆ మాటంటానే సెలంలో ఊట మాదిరి నా నోట్లో బో నీళ్లూరబట్య. వంకలో సెలం గట్టున కూకోని, ఉడుకుడుకు సంగట్లో గురిగె జేసుకోని దాంట్లో కారెమేసుకోని, గురిగెలోకి సిన్న ముద్దలు అద్దుకోని తింటాంటే ఇంగేమన్నా ఉంద్యా, నా సామిరంగా బో కమ్మగుంటాది. ముందే ఆకలిగున్న పులుల మాదిరుండాము అనుకుంటి.

బండికి గబగబ ఇసిక్య పోచ్చిమి. ఎద్దులు నెమరేచ్చా నిలబన్యాయి.  సెలంలో నుంచి తల్లెతో రోన్ని నీళ్ళు తోడుకొని సేతులు మొగమూ బాగా కడుక్కుని,  తలగ్గట్టుకున్న్య తువాల ఇప్పి తడి తుర్సుకుని తినడాని కూచ్చుంటిమి. సంగటి ఇంగా కాల్తాంది. గిన్నెలో ని ఎర్రగారెం వాసన ముక్కుకు కమ్మగ తాకుతాంది. మా కండ్లకది మాద్భుతంగా కాన్రాబట్య. గంగాధరుండి ‘న్నా మజ్జిగలో ఎన్నపూస ఉందంట సూడున్నా’ అంటా బండి పక్కకు నర్స్య . అన్నం గుడ్డలో మొత్తం మూడు పెద్ద ముద్దలుండాయి. సెరో ముద్దా తల్లెలో పెట్టుకున్న్యాం. ముద్ద మద్దెలో బాగ గురిగె జేసి, దాంట్లో ఎర్రగారెం ఏసుకుని మజ్జిగ పైన తేలాడే  ఎన్నపూస కారెంపై ఏసి కలుపుకుంటిమి.

ముని వేల్లతో సిన్న ముద్దలు సేసుకుని ఆ ముద్దల్ని ఎర్రగారెంలో అద్దుకొని నోట్లో పెట్టుకుంటి. నాలిక మీద కమ్మగనిపిచ్చి, ఒళ్లంతా ఒక్కసారిగా జిల్లుమన్య. యాన్నో లోపల కొనూపిరితో తనకలాడే జీవం తిరిగి లేసొచ్చినట్లాయ. ‘ అబ్బ ఇది తింటాంటే ఇంగే లోకం గాబట్దదురా దేవుడా’ అనుకుంటి. ఆకలికి ముద్ద నోట్లో పడ్తానే సర్రున జారిపోతా  నాలికకు బో రుసిగా తగుల్తాంది. రోట్లో దంచిన కారెం ఐందాన కూరలో ఆడాడ తగిలే ఎర్రగడ్డ పలుకులు కరుంకరుమని నములుకుంటా తింటాంటే పోతానే ఉంది.

అటుపక్క ఆయన్నేం తక్కువ తిండ్ల్య. ఆమైన ఇద్దరం ఉసుర్లు గొడ్తానే ఉండాం గానీ తినడం మాత్రం సల్లుకోల్య.  ఎప్పుడూ తిన్నోల్ల మాదిరి, ఎన్నాల్లనుంచో బువ్వకు మొగమాసినోల్ల మాదిరి యంపర్లాడ్తా తింటిమి. కారెం గిన్నెలో ముద్దేసి ఊర్సి కూర మట్టసంగ అయ్పోగొడ్తిమి. పల్లెంలో సిక్కెని మజ్జిగ పోసుకుని, ఆ మజ్జిగలో సంగటి పల్చాంగ కలిపి తాగుతాంటే అది కడుపులోకి  సల్లంగ దిగ్య. మేం తినేది అయ్పోయాలకు మూడో ముద్దలో రోంత సంగటి మిగిల్నాది. మజ్జిగ రోన్ని మిగిల్తే పుల్లాడ్డన్న నోట్లో పోసుకుండ్య. తీరా అప్పుడు మతికొచ్చ ‘ అవ్..ఆయబ్బి తిన్నాడో లేదో‘ అని. పల్లెం కడిగి బూ పుటికెలో పెట్టి పుల్లాడ్డన్న బీడీ ముట్టిచ్చినాడు. నేనుండీ ‘ బ్బీ అమ్మ నీగ్గూడా ఈడికే పంపిచ్చింద్యా బ్బి’ అంటి. రోంత అనుమానపు మొగం పెట్టి.   ‘అవ్ న్నా’ అన్య ఆయ్బి నా తిక్కు జూసి నగుతా. ‘నువ్వొక మాట ముందే సెప్పేది ల్యా బ్యా , నేనుండానని. మాకెట్ట తెలుచ్చాదీ నువ్వు తినింది లేంది’ అంటా పుల్లాడ్డన్న రొప్పినట్లు మాట్లాడ్య. ‘మీరీపొద్దు బో ఆకల్తో ఉన్నెట్లున్యారు న్నా. మూడు ముద్దల సంగటి, గిన్నె కారెం, పెద్ద సెంబు మజ్జిగ ఇద్దరు మంచులు తింటారాన్నా యాన్నన్నా, ఐనా నాకు ఆకల్లేదు లేన్నా . ఇంటి కాడ తింటాలే మల్ల’ అన్య  నక్కుంటానే.

మాది తినేది అయిపాయ. పారలు, పుటికెలు బండ్లో బేచ్చిమి. ‘నేనొచ్చాన్నా బండికంటా’  ఆయబ్బి మాకంటే ముందే బండెక్కి కూకుండ్య బూ పుటిక్య తీసుకుని. నేను పుల్లాడ్డన్నా కూడా బండెక్కి  వరిమల్ల దావ పడ్తిమి. ఎద్దులు నెమరేసుకుంటా నడుచ్చనాయి. మేం లోపల యాన్నేగానీ సందు ల్యాకుండా కుతికెల కాడికి మెక్కింటిమి. అట్లైందాన ఏం మాట్లాడకుండా నేను నగల్లో, పుల్లాడ్దన్న బండ్లో ఓ పక్క కూచ్చోనుండాం గూటం కొట్నోల్లమాదిరి.

మండె దగ్గరపడబట్య. తీరా అప్పుడు  నా కడుపులో ఒక్కరవ్వ తేడా అనిపిచ్చ. రోంత దూరం పోయ్నామో లేదో కడుపులో మల్లా గుడగుడమనబట్య.  ‘యాన్నో యవ్వారం సెడినట్లుందే…’ అనుకుంటా అట్లనే బిగపట్టుకుని కూచ్చున్యా. మల్లా ఆయన్నకు తెలిచ్చే ‘అంతగా ఎవరు తినమన్యారు బ్బీ’ అని అవ్లెయ సేచ్చాడని. ఊహు నా వల్లగాల్య. ఇంగ కుదరదని సెప్పి ‘న్నోవ్..నువ్వు నగల్లోకి రా న్నా నాకు బైటికొచ్చినట్లుంది’ అంటా ఎనిక్కి మల్లి బండ్లోకి సూచ్చి. ఆయన్న నా తట్టు జూసి ‘బండి నిలుపు బ్బీ ‘ అన్య భీముని మాదిరి గంభీరంగా . ‘ఈ కరుకు మనిసి ఏందో ఒకటి కసరకుండా ఉండడు. అయ్నా ఏం జేచ్చాం, పడ్దాంలే తప్పుతుంద్యా ‘ అనుకుంటి మనసులో.  మనసులో నేనట్ల తలుచ్చండగానే ఎనక దబ్బని సప్పుడాయ. మల్లిడూచ్చే ఇంగేముంది ఆయన్న నాకన్నా ముందే బండి దుంకి సెట్లల్లోకి ఉరకబట్య, లుంగీ ఎగబెరుక్కుని. వార్నీ పాసుగుల నువ్వు నాకంటే పైనుండావే అనుకుని నేను, ఆయబ్బి పడిపడి నగబడ్తిమి. ‘బ్బీ… నువ్వు నగల్లోకి రా ‘ అని ఆయబ్బి సేతికి పగ్గాలు ఇచ్చి నగల్లో నుంచి దిగి నేనూ ఉరికితి సెట్లల్లోకి.

మా ఎద్దులు  మమ్మల్నుజూసి కొమ్ముల్దిప్పుతా ‘సంగటి, పండు మెరగాయ కారెం ఎంత కమ్మగున్యా రోంత మితంగా తినొద్దూ…, ఐనా పక్కోని కడుపు గాల్చి తింటే ఇట్లనే ఉంటాది యవ్వారం. పోండి…పోండి బెరిగ్గెన ఉరకండి…’ అనుకుంటా పక్కున నగబట్య. బండి నగల్లో కూకోని గంగాధర మండె దావ పట్య. మా సంగతేమో గానీ నగి నగి ఆయబ్బి కడుపు మాత్రం ఆ  నగుతోనే నిండిపాయ ఆ పొద్దు సల్లగా.

సొదుం శ్రీకాంత్

శ్రీకాంత్ సొదుం: పనిచేసేది కంప్యూటర్ పైన అయినా పుస్తకాలతో పెంచుకున్న అనుబంధం తెంచుకోలేక చదవడం, అప్పుడప్పుడు రాయడం చేస్తుంటారు. ఇప్పటి వరకు పర్యావరణం మీద యురేనియం మైనింగ్ ప్రభావం, నోట్లరద్దు, నగదు రహిత సమాజం వెనుక అసలు రహస్యాలు, అమెరికాలో నల్లజాతీయులపై జాతి వివక్ష, పెద్ద వ్యాసాలు, రెండు పుస్తక సమీక్షలు ఇలా మొత్తం ఏడెనిమిది  పరిశోధన వ్యాసాలు వివిధ సామాజిక రాజకీయ మాసపత్రికలలో ప్రచురిచితమైనాయి. కొన్ని కవితలు కూడా ప్రచురితమైనాయి. ప్రస్తుతం ‘పిల్లప్పటి’ పల్లె అనుభవాలను రాయలసీమ యాసలో కతలు పనిలో ఉన్నారు.

5 comments

 • మావూరుని నా కండ్లముందుకి తెస్తివికదప్పా !

  • అన్నా…

   మొన్న కర్నూల్ లో మిమ్మల్ను కల్సినప్పుడు బలె సంతోసం, ఎంతో ధైర్యం వెచ్చన్నా. మీలాంటోల్లతో కలిసి శానా పన్జేయాల్సి ఉందిన్నా

 • న్నో సికాంత్ న్న.. సదువతంటే నాకు నా పిల్లప్పుడు చేసిన పనులన్ని మతికి వచ్చనాయిన్న… నేను సిన్నప్పుడు మా నాయన నన్ను కుసుమ కట్టే కొయ్యను తీసుకుపోతాండే … కుసుమ కట్టెను తెలర్జమున 2 గంటలకు కొయ్యాలి ఎందుకంటే ముళ్ళు మెత్తగా ఉంటాయి అని… నీయ్యక్క అయ్యాలాటప్పుడు పని మొదలు పెడితే కోడికుయ్యముందే ఆకలి ఎచ్చది…. మట్టి బండికి పొయ్యినప్పుడు కూడా ఇదే పరిస్థితి బ్బి…

  దీనెక్క ఏది ఏమైనా పిల్లప్పుడు పల్లెలు పల్లెలే…

  ఇప్పుడంతా యాంత్రికం 😥😥😥

  • న్నోవ్… నువ్వు బో మొరట మనిసివి ఉన్నెట్లుండావ్ గదున్నా 🙂 నిండు దండాలు న్నా

 • ఎంత బాగా సెప్పావంటే, ఆ బండి కండ్ల ముందు వురుకుతుంది.🙏

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.