సంసిద్ధత లేకుంటే విజయం లేదు

మనం మానసికంగా సన్నద్ధమై ఉంటే అన్నీ సిద్ధంగా ఉంటాయి’..

 –విలియం షేక్స్పియర్

(“All things are ready, if our mind be so.” William ShakespeareHenry V)

సంసిద్ధంగా లేనివాడి దగ్గర అవకాశం తన సమయాన్ని వృధా చేసుకోదు అంటాడు ఇడొవు కొయెనికన్.

(“Opportunity does not waste time with those who are unprepared.” ― Idowu KoyenikanWealth for All : Living a Life of Success at the Edge of Your Ability)

అంటే ఆ అవకాశం మరొకరిని వరించడానికి వేగమే వెళ్ళిపోతుంది. నెపోలియన్ హిల్ తన ప్రసిద్ధ స్ఫూర్తిదాయక గ్రంధం ‘Think and Grow Rich’ లో ‘మనిషి మెదడుతో ఆలోచించేది, విశ్వసించేది ఖచ్చితంగా సాధించగలడు’ అంటాడు. విజయం సాధించడానికి మానసిక సన్నద్ధత ఎంత అవసరమో మనకు ఈ ప్రముఖులు చెప్పిన సూక్తులు చూస్తే తెలుస్తుంది.  విజయం సాధించడానికి సన్నద్ధత ఎంతో అవసరం. మానసికంగా విజయాన్ని ఆహ్వానించడానికి సన్నద్ధం కావాలి. నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడే గొప్ప విజయాలు సాధించగలవు. నీ మెదడులో ఒక ఆలోచనకు విత్తనం వేసి, పెంచి, పురుడు పోయాలి. అప్పుడే విజయాన్ని సాధించే సామర్ధ్యం పెంపొందుతుంది. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన టెన్సింగ్ నార్కే నుంచి నేడు అఖండ విజయాలు సాధిస్తూ గిన్నెస్ రికార్డులకెక్కే ప్రముఖులదాకా అందరూ ఈ విజయ సూత్రాన్ని పాటించినవారే.

విజయానికి సన్నద్ధత మూడు దశల్లో ఉంటుంది. ఆలోచన, ఆచరణ, విజయానంతర పరిణామాలు దృశ్యమానం చేసుకోవడం. ఈ మూడు దశలు విజయానికి సన్నద్ధతను పరిపూర్ణం చేస్తాయి. మన సంతోషాలను హరించేవి మన మెదుడులోని ఆలోచనలే. సారవంతమైన ఆలోచనల భూమిక మెదడు. ఆలోచనలు లేని మెదడు బలహీనమవుతుంది. ప్రతి రోజు మన మెదడు అరవై వేల ఆలోచనలకు జన్మనిస్తుంది. వీటిలో 95 శాతం నిన్నటి ఆలోచనల అవశేషాలే ఉంటాయి. మన ఆలోచనలకు పరిమితులు విధించుకోవడం వలన కొత్త ఆలోచనలకు తావుండదు. ముందుగా మన ఆలోచనా పరిధిని విస్తరించుకోవాలి. అద్భుత విజయాలు సాధించిన వాళ్ళందరూ ఈ ప్రక్రియనే అనుసరిస్తారు. ప్రతిరోజు పుస్తక పఠనం, కొత్తవాళ్ళను కలవడం వలన మీ ఆలోచనా పరిధి విస్తరించి ప్రతికూల ఆలోచనలకు బలి కాకుండా కాపాడతాయి.

మీ మనోబలంతో అద్భుతాలు సాధించగలరు. దీనికి తిరుగులేని ఉదాహరణ మహత్మ  గాంధి. మనోబలానికి, విజయ సన్నద్ధతకు ఉదాహరణ గాంధీజీ. మహాత్ముని మనోబలం గురించి చెప్పడం చర్విత చర్వణమే అయినా బలహీనంగా, బక్క పలచగా ఉండే ఒక మనిషి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భరత భూమి నుంచి తరిమి కొట్టాడంటే ఎంతటి మనోబలం ఉండి ఉండాలి.  ఈ శతాబ్దంలోనే ‘అత్యంత శక్తివంతమైన వ్యక్తి ‘ గా మహాత్మా గాంధీని టైం పత్రిక శ్లాఘించింది. మానసికంగా సన్నద్ధమై జీవితంలో విజయాన్ని సాధించడం ఎలా?

ఈ క్రింద సూచించిన సూత్రాలు పాటిస్తే విజయం మీ సొంతమవుతుంది.

  1. ప్రతి రోజు మీ మెదడుకు ఎంత పదును పెట్టుంకుంటున్నారో విశ్లేషించుకోండి.
  2. మెదడుకు పదును పెట్టుకోవడమంటే ప్రతి రోజు మీ ఆలోచనలకు పదును పెట్టుకోవదమే.
  3. ఒక పని ప్రారంభిస్తే దానిని సన్నద్ధతతో చేయండి. ఫలితాలు ఎంత వేగంగా వస్తున్నాయో నిశితంగా పరిశీలించండి.
  4. మీ ఆలోచనా ధారకు అవరోధం కలిగించే ప్రతికూల ఆలోచనలను పొరపాటున కూడా మీ మెదడులోకి రానీయకండి.
  5. ప్రతికూల ఆలోచనలు మానసిక సన్నద్ధతకు ఎల్లప్పుడూ అవరోధమే.

అనుకూల ఆలోచనలను అభ్యాసం చేస్తూ, ప్రతికూల ఆలోచనలను దూరంగా ఉంచితే మీరు ఎటువంటి పనిలోనైనా అద్భుత విజయాలు సాధించగలరు. మీరు నిరంతరం విజయాలు సాధిస్తున్నారంటేనే, విజయాలు సాధించడానికి మానసికంగా సన్నద్ధమయ్యారని అర్ధం. అదే విజయాలను సాధించడానికి జీవిత పరమార్ధం. సర్వకాల సర్వావస్థలయందు సన్నద్ధతే విజయాలకు మూలం. విజయోస్తు!

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.