తెలుగు వాళ్ళు ‘అంతా మనవాళ్లే’

https://mail.google.com/mail/u/0/#inbox/FMfcgxwBVgkVfmwGcQhFGmbPkpjscfMP?projector=1&messagePartId=0.3

1954 లో సారథీ సంస్థ నుండి ఒక ఎనిమిది సంవత్సరాల విరామం తరువాత “అంతా మనవాళ్ళే” సినిమా వచ్చింది.  అప్పటికి సినిమారంగానికి కొత్తగా వచ్చిన కవి, రచయిత, పాత్రికేయుడు, అనువాదకుడు, స్వాతంత్ర్యసమర యోధ, తెలంగాణా సాయుధ పోరాటంలో క్రియాశీల పాత్ర పోషించిన కమ్యూనిష్టు యోధుడు  శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ ఈ చిత్రంతో మొదటిసారి సినీరచయితగా పరిచయమయ్యారు.

కథ, మాటలతో పాటు ఈ సినిమాకు కొండేపూడి “నా చిన్నెల వన్నెల చెలికాడొస్తే” అనే చక్కని పాటకూడా వ్రాసారు.  

వీటితో పాటు కొండేపూడి విరచితమై గతంలో ప్రజానాట్యమండలి పాటగా, ఆంధ్రజాతీయోద్యమ గీతంగా, బహుళ ప్రచారంలో ఉన్న ‘పాడరా ఓ తెలుగువాడా’ పాట ఈ చిత్రంలో చేర్చబడి అదనపు ఆకర్షణగా నిలిచింది (గాయకులు జిక్కీ, మాధవపెద్ది – మాస్టర్ వేణు సంగీతం) .

పాడరా ఓ తెలుగువాడా! పాడరా ఓ కలిమిరేడా!
పాడరా మన తెలుగుదేశపు భవ్యచరితల దివ్యగీతము ||”పాడరా”||

యుగయుగంబులనుండి బంగరు గంగ నిచ్చెడు గౌతమీనది
కోహినూరును కురుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి
హొయలుగా రతనాల సీమను ఓలలాడిన తుంగభద్ర
సొగసుగూర్చెను తెలుగుతల్లికి సుఖము గూర్చెను తెలుగువారికి ||”పాడరా”||
కదనరంగమునందు మెరసిన కాకతీయుల ఖడ్గతేజం
దరు శత్రువు నెదిరి పోరిన వనిత రుద్రమ యుద్దపటిమ
కొదమసింగము పగిది నురికిన బాలచంద్రుని బాహుదర్పం
పొంగజేయద మేనిరక్తముప్పొంగ జేయద నీదు హృదయం ||”పాడరా”||

తెగు పలుకుల తేనెలొలికెను తిక్కనార్యుని కవితలోనా
రాలు కరిగే త్యాగరాయుని రాగసుధలో మునిగె తెలుగు
సొంపు గూర్చెను తెలుగుతల్లికి హంపినగరపు శిల్పసంపద
భరతనాట్యపు భంగిమలలో పల్లవించెను తెలుగు పరువం   ||”పాడరా”||

తెలుగుజాతికి నూత్నసంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి
తెలుగుభాషను ప్రజలభాషగ చేయపోరిన గిడుగు పిడుగు
శమంటే మనుజులేనని తెలియజెప్పిన అప్పారాయుడు
తెలుగుతల్లి నోముపంటచె తేజరిల్లిన దివ్యతారలు ||”పాడరా”||

కలవు గనులును నదులజలముల పసిడిపాతర మనదు దేశం
సిరియు సంపద వెల్లివిరిసే స్వర్గతుల్యము చేసికొందము
ఆరుకోటుల తెలుగుబిడ్డల ముక్తకంఠము లొక్కపెట్టున
జయము జయమని తెలుగుతల్లికి విజయగీతిక లాలపించగ   ||”పాడరా”||
సినిమా పాటలో నిజానికి మొదటి చరణం లేదు.  అయినా మొత్తంగానే ఈ అద్భుతమైన పాట సాహిత్యాన్ని చూడాలి.

ఆనాటి కమ్యూనిస్టు కవులలో నాస్తికత్వం, మానవవాదం హెచ్చు. ‘మనుష్యుడే నా సందేశం’ అన్నాడు శ్రీశ్రీ..  తదనుగుణంగా ఈ పాట దేవతారూపమైన తెలుగుతల్లిని కాక తెలుగువాణ్ణి కథానాయకుడిని చేస్తుంది. ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా’ అని వేములపల్లి శ్రీకృష్ణ వ్రాసిన మరో ప్రసిద్ధ గేయం కూడా ఈ కోవకుచెందిందే.  దీనికి ప్రతిగా శంకరంబాడి సుందరాచారి ‘మా తెలుగు తల్లికి’ పాట చూడవచ్చు. పాడరా ఓ తెలుగువాడా పాటలో తెలుగుతల్లి ఒక పాత్రధారి మాత్రమే.

మరో విషయం ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా’ లో ఉన్న ఆవేదన స్థానే ఈ పాటలో ఒక ఆశావాదం కనబడుతుంది.  గతమెంతో ఘనకీర్తి ఉండీ వర్తమానంలో సంధికాలంలో ఉన్న తెలుగుజాతి గురించి వేములపల్లి శ్రీకృష్ణ వ్రాసారు.

అందుకు భిన్నంగా కొండేపూడి పల్లవి తెలుగువాడిని కలిమిరేడా అని సంబోధిస్తుంది, రాబోయే భవ్య చరితల గురించి మాట్లాడుతుంది.  ఆఖరు చరణంలో “కలవు గనులును నదుల జలముల పసిడి పాతర మనదు దేశం, సిరియు సంపద వెల్లివిరిసే స్వర్గతుల్యము చేసికొందము” అన్న పాదాలవరకూ ఈ ఆశావహ దృక్పథం కొనసాగుతుంది.

రమణీయమైన చరణాలలోని కొన్ని పాదాలు చూద్దాం.  

“గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు” సనాతనంగా యుగయుగాలుగా సప్తపుణ్యనదుల లో గోదావరి ప్రాముఖ్యాన్ని వివరించే శ్లోకం. దక్షిణగంగగా పేరు గాంచిన గోదావరిని గౌతమి అనడంలో గంగతో సామ్యం మరింత బలంగా చెప్పబడింది.  ఈ విషయాలు అందంగా ఒక్క పంక్తిలో పొదిగిన పాదం –

యుగయుగంబులనుండి బంగరు గంగ నిచ్చెడు గౌతమీనది

మూడువేల సంవత్సరాలకు పైగా భారతీయులకు తెలిసిన రత్నం వజ్రం.  ఆనాటినుండి 18వ శతాబ్దం వరకూ ప్రపంచంలో వజ్రాలు దొరికిన ఏకైన ప్రదేశంకూడా భారతదేశమే. మధ్య యుగాలనాడు భారతంలోని గోల్కొండ గనుల వజ్రాల గురించి మిగతా దేశాల్లో కథలుకథలుగా చెప్పుకునేవారు.  గోల్కొండ గనులలో శిఖరాయమానమైనవి కొల్లూరు గనులు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పులిచింతలకు నైరుతి దిశలో కృష్ణానది ఒడ్డున ఉందీ ప్రదేశం.  కోహినూర్ తో పాటు, హోప్ వజ్రం, గ్రేట్ మొఘల్ వజ్రం, ఆర్లోవ్ వజ్రం, నిజాం వజ్రం – ఇవన్నీ ఇక్కడ లభించినవే అని నిపుణుల అంచనా. ఇక్కడ గనులున్న ప్రాంతం చుట్టూ కృష్ణవేణి చర్నాకోలలా వయ్యారంగా ఒంపు తిరుగుతుంది. ఇన్ని విషయాలను స్ఫురింపజేసే అద్భుత పాదం –

కోహినూరును కురుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి
రతనాలు రాశులు పోసిన సీమ రాయలసీమలో జలక్రీడలాడినదట తుంగభద్ర –
హొయలుగా రతనాల సీమను ఓలలాడిన తుంగభద్ర

తెలుగు తల్లికి ఈ మహానదులు అందాన్నిస్తే, తెలుగువారికి సుఖసంతోషాలనిచ్చాయని చెప్పటం ఎంత నిజం.

సొగసుగూర్చెను తెలుగుతల్లికి సుఖము గూర్చెను తెలుగువారికి
మొత్తంగా నదులను వర్ణించే మొదటి చరణాన్ని ఇటువంటి నదుల ప్రస్తావన ఉన్న ఇతర పాటలలోని పాదాల తో పొల్చి చూస్తే కొండేపూడి రచనలోని క్లుప్తత, భావసాంద్రత, కవితావైభవం ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది.  పోలికకు ‘కల్లోలగౌతమీ’, ‘గలగలా గోదారి’, ‘జీవకళ లొల్కు గోదావరి తరంగాల’ వగైరా పాదాలను చూడవచ్చు.

రెండో చరణంలోని దకారానుప్రాస, ద్వితీయాక్షర ప్రాస, యతులు, అంత్యప్రాసల అందం ముందుగా చూడండి.

నాగమ్మ, మల్లమ్మ, మాంచాల మొదలైన వారుగాక ఆంధ్రసామ్రాజ్ఞి రుద్రమను తెలుగు స్త్రీశక్తికి ప్రతీకగా ఎంచుకోవడంలోనే కవి ఆలోచనలోతు తెలుస్తుంది. కొలువులోనే కాక యుద్ధంలో కూడా వదరుబోతులైన శత్రువుల పురుషాధిక్యతాభావాన్ని ఎదుర్కోవలసిన అవసరం ఆమెకు కలిగిన సంగతి ఎంతబాగా చెప్పారో చూడండి.  

కదనరంగమునందు మెరసిన కాకతీయుల ఖడ్గతేజం
వదరు శత్రువు నెదిరి పోరిన వనిత రుద్రమ యుద్దపటిమ

నూనూగుమీసాల వయసులోనే సింహకిశోరంలా అజేయపరాక్రమం చూపి రణస్థలికి ఆహుతైపోయిన మరో అభిమన్యుడు బాలచంద్రుని ఇంతకన్నా బాగా ఎవరూ వర్ణించి ఉండరనిపిస్తుంది.  

కొదమసింగము పగిది నురికిన బాలచంద్రుని బాహుదర్పం
వీరిని తలచి ఉప్పొంగని తెలుగుహృదయం ఉంటుందా?
పొంగజేయద మేనిరక్తముప్పొంగ జేయద నీదు హృదయం

1, 2, 4 చరణాల్లో శిల్ప పరంగా మూడుపాదాల్లో మూడు విషయాలను వర్ణించి నాలుగో పాదం  ముక్తాయింపుగా వ్రాసారు కొండేపూడి.

ఈ శిల్పానికి భేదంగా మూడో చరణంలో నాలుగు పాదాలు నాలుగు విషయాలను (సాహిత్యం, సంగీతం, శిల్పం, నాట్యం) ఒక్కొక్క పంక్తిలో వర్ణిస్తాయి.  నారీలోకానికి ప్రతినిధిగా రుద్రమను ఎంచుకున్నట్టే, కవులలో తిక్కనకు అగ్రతాంబూలం ఇచ్చారు కొండేపూడి. (ఆది యుగంలో తిక్కన మహాకవి అన్నాడు శ్రీశ్రీ).  తిక్కన శైలి తెలుగు పదానికి, తేటకు పెద్ద పీట వేస్తుంది.

తెలుగు పలుకుల తేనెలొలికెను తిక్కనార్యుని కవితలోనా

త్యాగరాజును తెలుగు సంగీతానికి ప్రతీకగా ఎన్నుకోవడం ఎంత సమంజసం.  (ఆయన రాగంలొ తెలుగు మునిగింది అంటే శాస్తీయ సంగీతంలో మాటలను పాట మింగెయ్యటం కూడా తలపులోకి వస్తుంది.)  

రాలు కరిగే త్యాగరాయుని రాగసుధలో మునిగె తెలుగు
తెలుగు తల్లి విశ్వరూప విన్యాసమే హంపీశిల్పం –
సొంపు గూర్చెను తెలుగుతల్లికి హంపినగరపు శిల్పసంపద

భరతనాట్యం తెలుగువారిది కాదని తమిళులదే అని అపోహలో ఉన్న తెలుగువారు చాలామందే ఉంటారు.  వారికోసమే అన్నటుగా ఆరోజునే కొండేపూడి తెలుగు పరువం పల్లవించడమే భరతనాట్యం అని అమోఘమైన నిర్వచనం చెపారు.  

భరతనాట్యపు భంగిమలలో పల్లవించెను తెలుగు పరువం  

మొదటి మూడు చరణాలు చూస్తే ప్రాచీన గోదావరి కృష్ణల నుండి, పల్నాడు, కాకతీయులు, విజయనగర నాగరికతలే కాక ఇటువంటి వేరే పాటలలో కనిపించని తంజావూరు తెలుగు వంగడం ప్రస్తావన కూడా వస్తుంది.  ఈ ప్రస్తావనలను ఆధునిక యుగంలోకి తీసుకొచ్చి నాలుగో చరణం ముగ్గురు వైతాళికులతో ముద్దుగా ముగించి మొత్తం పాటకు ఒక సంపూర్ణత్వాన్ని ఇస్తుంది. ఇందులో కూడా వాడిన వర్ణనలు అయావ్యక్తులకు అతికినట్టు ఎంతబాగా సరిపోయాయో చూడండి.  కందుకూరి సంఘసంస్కరణ, వాడుక భాష కోసం సంకుల సమరాలు సాగించిన గిడుగు, గురజాడ అపూర్వ మానవవాదం – వీరందరూ తేజరిల్లిన దివ్యతారలే అనడం అత్యుక్తి కాదు.

తెలుగుజాతికి నూత్నసంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి
తెలుగుభాషను ప్రజలభాషగ చేయపోరిన గిడుగు పిడుగు
దేశమంటే మనుజులేనని తెలియజెప్పిన అప్పారాయుడు
తెలుగుతల్లి నోముపంటచె తేజరిల్లిన దివ్యతారలు

అయిదవ చివరి చరణం పైన చెప్పినట్టు ఆశావహ దృక్పథంతో (అనూచానంగా ఐకమత్యం కొరవడ్డ ఆంధ్రజాతిలో ఆరుకోట్లమంది ముక్తకంఠంతో చేసిన), జయజయధ్వానాలతో ముగిసి పాటకు మంచి ముక్తాయింపునిస్తుంది.  

భావపరంగా అనల్పార్థస్ఫోరకంగా, పద శిల్పపరంగా కావ్య సౌందర్యభాసితంగా ఉన్న ఈ గీతం ఛందోపరంగా ముత్యాల సరాల సంకలితం.  గురజాడ మహాకవి ప్రచారంలోకి తీసుకొచ్చి, భావ అభ్యుదయ కవులు విరివిగా వాడిన ముత్యాలసరంలో నాల్గవపాదం నిడివి మొదటి మూడు పాదాల నిడివికన్నా భిన్నంగా ఉంటుంది.  

ఈ గీతంలో ముత్యాలసరం నాలుగు పాదాలూ సమాన మాత్రలతో వ్రాసి గీతానికి సహజమైన తూగునీ గానయోగ్యతనీ సంతరించారు కొండేపూడి.  

“అంతా మనవాళ్ళే” సినిమా వెర్షన్ ఆన్ లైన్లో అంతతేలికగా దొరకటంలేదు.  ఆడియో ఇందులో పొందుపరుస్తున్నాను.

ప్రజాగాయకులు ఇప్పటికీ పాడుతున్నదానికి ఉదాహరణ https://www.youtube.com/watch?v=qsZmUWBTNls .  పాట సాహిత్యాన్ని ఈ రోజుకు అనుగుణంగా (ఆరు కోట్ల బదులు పదికోట్ల తెలుగు బిడ్డలు అని) చిన్న మార్పుచేసుకుని పాడుతున్నారు వీరు.

ఇక్కడివరకూ చదివిన జిజ్ఞాసువులు  ఈ గీతం గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవాలనుకుంటే చదవటం కంటిన్యూ చేయండి.   

1942-45 సంవత్సరాలలొ భారతదేశంలో ఎన్నోవిధాలుగా అనిశ్చితి నెలకొని ఉంది.  

గాంధీ నాయకత్వంలొని  స్వాతంత్యసమరం సజావుగా సాగటంలేదు.  1942లో మొదలైన క్విట్ ఇండియా ఉద్యమం కాంగ్రెస్ నాయకత్వం అందరినీ జైళ్ళకు పంపడంతో త్వరగానే బలహీనపడింది. 1944లో ఆరోగ్యం దెబ్బతినడంతొ గాంధీని విడుదల చేశారు.

రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూనే ఉంది.  సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో ఆజాద్ హింద్ ఫౌజ్ కొంతపోరాటం సాగించి నష్టాలు చవిచూసింది.  

తెలుగుదేశంలో పరిస్థితి కొస్తే, 1910-11 ప్రాంతాలనుండీ స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా మద్రాసురాష్ట్రంలో భాగంగాఉన్న జిల్లాల్లో ఆంధ్ర మహాసభ నాయకత్వంలో ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటుకు ఉద్యమం నడుస్తూనే ఉన్నా, ఆంధ్రమహాసభ చివరి సమావేశం (1941) జరిగిన తరువాత క్విట్ ఇండియా అణచివేతలో భాగంగా నిషేధానికి గురై మళ్ళీ జరగలేదు.

కాంగ్రెస్, ఆంధ్రమహాసభ నిషేధానికి గురైన సమయానికి (1942 లోనే) కొంచెం ముందుగా విధివిలాసంగా భారత కమ్యూనిష్టు పార్టీపై నిషేధం తొలగించబడింది.  సోవియట్ రష్యా, బ్రిటన్ రెండో ప్రపంచ యుద్ధంలో కలిసి పోరాడటం వల్ల ఇది సాధ్యపడింది. అదే సంవత్సరం మద్రాసు నుండి ఆంధ్రకమ్యూనిస్టు పార్టీ అధికార పత్రికగా ‘ప్రజాశక్తి’ ప్రారంభమైంది.  1945 లో ప్రజాశక్తి బెజవాడకు మారి దినపత్రికగా వెలువడసాగింది.

ఈ సరికి నైజాంలొ ఆంధ్రోద్యమం కొనసాగుతూనే ఉంది (ఇక్కడ కూడా ఆంధ్రమహాసభ పేరుమీదే తెలంగాణ నాయకులు సభలు జరిపేవారు). 1944లో సమావేశాల్లో  నైజాం సభల్లో అతివాదులు, మితవాదులమధ్య చీలికలు వచ్చాయి.

ఇంకో రెండేళ్ళకి తెలంగాణా సాయుధ పోరాటం మొదలవబోతోంది.  పై రెండు విషయాలూ ఈ పోరాటంలో కీలక పాత్ర పోషించనున్నాయి.  

ఈ నేపథ్యంలో 1945 ప్రాంతాలలో తెలుగు జాతీయ గీతాల పోటీ జరిగింది.  ఆనాడు కొండేపూడి లక్ష్మీనారాయణగారి ‘పాడరా ఓ తెలుగువాడా’ గీతాన్ని అత్యుత్తమ రచనగా ఎంపిక చేయడంలొ కమిటీ వారు చూపించిన అభిరుచి శ్లాఘనీయం.       

మద్దుకూరి విజయ్ చంద్రహాస్

మద్దుకూరి విజయ చంద్రహాస్: సాహిత్యం సంగీతం ప్రత్యేకంగా అభిమానిస్తారు. వినడం, చదవడం, ఎప్పుడైనా వ్రాయటం, నచ్చిన వాటి గురించి ఆసక్తి ఉన్నవారికి చెప్పటం, సహధర్ములతో సమయాన్ని గడపటం ఆయనకు ఇష్టమైన విషయాలలో కొన్ని. ప్రస్తుత నివాసమైన డాలస్ లో తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని తోచిన సహాయం చేయటం కూడా ఒక వ్యాపకం.

2 comments

  • మిత్రమా ఎన్ని సార్లు విన్నా పాడినా ఈ పాట ఉద్వేగానికి గురిచేస్తుంది. తెలుగు వైభవం ఒక విషయమైతే ఆ పాట రచన పురుడు పోసుకున్న సందర్భం ఒక చారిత్రక విషయం.పత్రికా ప్రకటన వేయించిన కామ్రేడ్ సుందరయ్య గారు , కామ్రేడ్ కొండేపూడి గారు కళ్ళ ముందు మెదులుతారు. సంపూర్ణంగా లోతుగా వివరించినందుకు నెనర్లు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.