కఠోర నిర్బంధాన్ని బహిష్కరించిన
హృదయ భాష

కాదా మరి ? కప్పి చెప్పేది కవిత్వం లాంటి డెఫినిషన్సని ఒక్క అదాటున పక్కకి తోసెయ్యాలని అనిపిస్తోందిప్పుడు. ఏది కప్పి, ఎందుక్కప్పి, ఎలా కప్పి చెప్పినపుడు అది కవిత్వమవుతుందో భాషా శాస్త్రాన్ని తిరగేయడమిప్పుడు కష్టం. ఈ కవిత్వం దేన్నీ అనిర్దిష్టంగా చెప్పటానికి ప్రయత్నించలేదు. ఏ మౌలిక సాహిత్య లక్షణాల చట్రంలోకీ ఇమిడే కష్టం చేయలేదు. అసలా లాక్షణ ప్రస్తావన అనవసరం. కానీ ఎందుకు లేవనెత్తానంటే నేడు ఒక సాహిత్య ప్రక్రియ తన పర్యవసానాన్ని దాని ఫలితంగా కంటే అలా బయటకి ధైర్యం గా తలేత్తి చూసేందుకు చేసే ప్రయత్నంగా చాలా ముఖ్యమైనది. ఆ సందర్భంలోనే కవితైనా, కధైనా జీవ లక్షణం కలిగి విపత్కర కాలపరీక్షల్ని సామాన్యుల ముందు గుడ్డలు విప్పి నిలబెడుతుంది. అలా గొంతు చించుకునే స్వేచ్చాయుత నిజాయితీగల ప్రయత్నమే అసలు సిసలు సాహిత్య వ్యక్తిత్వం. అలాంటి సమున్నత శిఖర మానవుడిగా సాయిబాబా ఈ పుస్తకంలో కనిపిస్తాడు. అవును అతను బతుకును కానిదాన్ని ప్రతీ క్షణం నిరాకరించాడు. అది చెప్పడానికతనికి కవిత్వం జస్ట్ ఒక పరికరంగా ఉపయోగపడిందంతే. బ్రతుకు పట్ల, అనేకానేక ఒత్తిళ్ళమధ్య దాని అస్తిత్వ పరిణామాలపై జరుగుతున్న హింస, పెత్తనం మీద స్పష్టంగా అతను నిర్మాణాత్మక యుద్దం రావం చేశాడు. నా హృదయం మూలుగుతోంది, నా శరీరం కంపిస్తోంది, ఈ నొప్పి నన్ను చంపుతోంది కానీ నేను చావడానికి నిరాకరిస్తాను అని ఇనుప ఊచల మీద అతని వేళ్ళు బిగుసుకున్న ముద్రలు ఈ కవిత్వమంతా కనిపిస్తాయి.

ఇంగ్లీషునుండి తెలుగులోకి అనువాదం చేసిన 35 కవితలున్న పుస్తకమిది.

“నువ్వు కోరేగావ్ భీమా హృదయాన్ని అర్ధం చేసుకోలేవ్. కులాల మతాల తెగల చీలిక పేలికల బొంత పురుగుల్ని తింటూ దేశం అభివృద్ది చెందేది ఏముంటుంది. ఈ దేశం దొడ్డికి పోయే డొప్పల గుండా ప్రవహిస్తుందా; నువ్వు భీమా కోరేగావ్ గుండె చప్పుడు ఎప్పటికీ వినలేవ్” (నా గుండె చప్పుడు నీకర్ధం కాదు: బాసిత్) అన్న కవితలో గానీ:

” ఆ రోజు రోహిత్ వేముల తనకు తాను వురివేసుకుని ‘నేను నా గుర్తింపుకు కుదించబడకూడదని ప్రకటించిన నాడు నా గుండె చప్పుళ్ళు తప్పిపోయినవి; ఆ రోజు హన్స్ దా సత్వేంద్ర శేఖర్ ‘ఆదివాసీలు నృత్యం చేయరు’ అని ప్రకటించిన నాడు, నా కండరాలు నొప్పితో సలిపినవి” (మనకిప్పుడు మరింత స్వేచ్చ లభించింది: వివి) అన్న కవితలో గానీ, కవిగా అతను దేని గురించి ఆరాటపడుతున్నాడో తెలిసిపోతుంది. హైద్రాబాద్ లో ఎమ్మే, పీహెచ్ డీ చదివిన ఈ అమలాపురం అబ్బాయి, డిల్లీ యూనివర్సిటీలో పాఠాలు చెప్పే ఈ అబ్బాయి ఎందుకింత ఆవేదన పడ్డాడు ? అదీ జైల్లో ఉండి ఇంత కవిత్వం ఎలా రాయగలిగాడు ? చుట్టూ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మారణకాండలు జరిగి ఉంటాయో లెక్కపెడుతూ గోడకొరిగి, చీకట్లో, ఒంటరిగా వికలమైన శరీర భాగాలతో పోరాడుతూ ఎందుకిన్ని అక్షరాల్ని పోగేశాడు ?

కొత్త సంవత్సరాన్ని కలగంటున్న సందర్భాన్ని చెప్తున్నపుడు ప్రవక్త మహమ్మద్ ను, జీసస్ ను మళ్ళీ ఆహ్వానించు, మళ్ళీ కాలాన్ని మరోసారి మొదట్నుంచీ లెక్కగడదాం అంటాడు కానీ, నా చిన్న జైలు గదిలోని అమానుష కాలయంత్రం జీవితం మృత్యువు నైసర్గిక సూత్రాలను కాదని నా మనసు సుడిబెట్టే ఘంటికలు మోగిస్తున్నది అని వివరిస్తున్నపుడు అతని బాధ మన మనసులో ముల్లులా గుచ్చుకుంటుంది.

1994 లో ఆల్ యిండియా పీపుల్స్ రెప్రెసెంటేషన్ ఫోరం (AIPRF) కి సెక్రటరీ గా ఉండి, 2005 లో రెవల్యూషనరీ డెమోక్రేటిక్ ఫ్రంట్ (RDF) లో కీలక పాత్ర పోషించి, రాజకీయ ఖైధీల విడుదలకోసం ఎంతో శ్రమించిన వ్యక్తిగా ఇతన్ని రాజ్యం తన ఫాసిస్టు కళ్ళజోళ్ళతో చూసింది. 2014 లో మావోయిస్టులతో సంబంధం కలిగి ఉన్నాడంటూ రాజ్యం సాయిబాబాని జైల్లో పెట్టింది. అందుకతని విప్లవ దృక్పధమే కారణంగా చూపెట్టింది. యావజ్జీవకారాగార శిక్ష వేసింది. అన్ని అవయవాలుండి కొంత అసౌకర్యం కలిగినా భరించలేని ఆదర్శవంతులున్న దేశంలో, మెదడునిబ్బందిపెట్టే సిన్కోప్ అనే ప్రాబ్లెం తో, హైపర్ ట్రోఫిక్ కార్డియో మయోపధీతో బద్దలయ్యే గుండెతో, గులకరాళ్ళు పేరుకున్న మూత్రపిండాలతో ఒక యోధుడు ఒంటరిగా అమానుషమైన ఖైదులో ఉన్నాడు. అతనికి మన సానుభూతొద్దని ఖరాఖండిగా చెప్పేశాడు. సంఘీభావం కావాలన్నాడు. ఇలా అనడం కన్నా వేరు కవిత్వ సామాగ్రినెక్కడ వెతుక్కోవాలి ?

అందుకే జైలంటే అన్న కవితలో అతనంటాడు “మిత్రమా ఇది ఎత్తైన న్యాయ పీఠాల పైన పరుచుకున్న అబద్దాల సమూహం. అసంఖ్యాకుల ఎడల జరిగే అన్యాయం పట్ల కంఠస్వరాల మౌనం. మిత్రమా కొంత మౌనం నిర్దేశించబడుతుంది. మిగతా అంతా స్వయం నిర్దేశితమవుతుంది. కొంత నియంత్రణ ఆదేశించబడుతుంది. తక్కినదంతా ఎవరికివారు ఆచరిస్తుంటారు. అది నైతిక దౌర్భల్యం. ఒక నాగరికత దురహంకారం. అదే ప్రియ నేస్తమా అదే మన ప్రపంచాన్ని నిజమైన నిరాశామయమైన జైలుగా మారుస్తుంది” (పి వరలక్ష్మి). జైల్లో ఇతనెంత సంఘర్షణకి గురయ్యాడో ఈ కవిత్వం చెప్తుంది. నిర్బంధం అసలు రూపాన్ని పొరలు చీల్చి చూపెట్టడం ఈ కవిత్వం సునాయాసంగా చేసిన పని.

ఏమిటా బంధిఖానా ? అదేంటి? మనం స్వేచ్చగా సంతోషం గా జీవించడంలేదా ? ఏ ? ఒక్క సాయిబాబానో, వరవర్రావ్ లాంటి వాళ్ళనో అరెస్టుచేస్తే యావత్ సమాజాన్ని నిర్భంధించిన ఊహ ఎందుకు కలగాలి ? ఈలాంటి ఖైదు కవిత్వాలెందుకు రావాలి ? ఇవన్నీ చేసే ప్రయోజనమేమిటి ? చూడండి కవి “ప్రజాస్వామ్యాలు మెజార్టేరియనిజాన్ని, నాజీయిజాన్ని, ఫాసిజాన్ని పోషిస్తున్నాయి. తమకు తాము వినాశనం చేసుకునే స్వయం చాలక మానవ యంత్రాలను వాళ్ళు నియంత్రిస్తున్నారు” (కొత్త సంవత్సరం ఎప్పుడు:వివి) అంటున్నాడు. అంటే ఇన్నేళ్ళ మన స్వాతంత్ర్యం ప్రజాస్వామ్యాన్ని ఏ మంచి పనికి వినియోగించిందొ ప్రకటిస్తుందీ కవిత్వం. చక్రాల కుర్చీలో తిరుగాడుతూ కూడా, తన కాళ్ళ మీద తను నిలబడేందుకు చేస్తున్న బలీయమైన ప్రయత్నం కనిపిస్తుంది. అలాగే అతనికి ఎడతెగని దుక్ఖం కలుగుతున్న స్పృహని కూడా ఈ కవిత్వం దాచడం కుదరని పని. దిక్ఖారాన్ని ప్రకటిస్తున్న స్వరంలో భయం బెరుకూ లేవ్ గానీ అతను తన హృదయన్ని నలుపుకుంటున్న శబ్దం మాత్రం మన చెవులకి వినబడకుండా పోదు.

ఈ కవిత్వంలో ఒక మానవీయ దిగులు కవిని సపోర్ట్ చేస్తోందా ? కుంగదీస్తోందా అనే ప్రశ్న పాఠకుడిలో పదే పదే ఉదయిస్తుంది. “నాకిక ఓపిక లేదు. ఎలా మనం కలసి కనలేం కల. నా మదినీ సలుపుతోంది ఈ రాత్రి” అంటాడు. అంతలోనే మళ్ళీ “కానీ వెలుగుతున్నాయి దేదీప్యంగా అడవులు, కొండలు, లక్షల నక్షత్రాల కింద నేస్తమా నాకింకా గుర్తున్నాయి వాటిని చేరాలని మనం కన్న కలలు” (ఓ దుగులు నిశీధి వేళ: అరుణాంక్) అన్న మాటలు చదివినపుడు గమ్యం పట్ల అతని ఆశ సందేహాలన్నింటినీ పటాపంచలు చేస్తుంది. అతని నిబ్బరమైన ప్రేమైక స్పందనలు తెలుగీకరించిన అరుణాంక్ చాలా బాగా రాశాడు. “వాళ్ళు విసిరేశారు మన హృదయాలను వేల మైళ్ళ దూరం. కానీ మన ఊహల కిరణాలు కలుసుకోవడాన్ని ఆపలేదు ఈ రాత్రి. నల్లని మేఘాల వెనుక దాక్కొని ఉన్న తళుక్కుమనే నక్షత్రపు బాధ, నువ్వూ దానిని అనుభూతి చెందావనేది నాకు నిశ్చయమే” (ఒంటరి ఆశ:అరుణాంక్) లాంటి వాక్యాల్లో అతని ప్రతీకలు వేటినెలా అన్వయించి ఏ పరమార్ధాన్ని కలిగి ఉంటాయో, ఆ గంభీరమైన లోతులు చాలా సరళంగా ఆకట్టుకుంటాయి. ఈ రకం భావ ప్రకటన విప్లవ కవిత్వానికి కొత్తకాదు కానీ ఈ ఉద్వేగ ప్రకంపన వ్యవస్తని సూక్ష్మంగా ఎదుర్కుటున్న వాస్తవికతలోకి మనల్ని లాక్కెళుతుంది. ఆ సామాజికతే ఈ కవిత్వం నచ్చడానికి మూల హేతువు.

అనువాదకుడికి సాయిబాబ గుండెలో నొప్పి అంత బాగా, ఎలా తర్జుమా అయ్యిందో, ఆ రహస్యమేంటో మనకి ఎలా తెలుస్తుంది ? ఏమీ లేదు, ఒక ఆలోచనపరుడైన కవి హృదయమెంత మెత్తగా వణుకుతుందో అలాంటి ఇంకో మెత్తటి కవికే అది తెలుస్తుందేమో ? అది స్పష్టంగా మనకీ అర్ధమయిపోతుంది. ఏ ? మన హృదయలేమన్నా రాళ్ళా ఏమిటి? అంతలా హత్తుకుంటుందీ పుస్తకం. అలాగే ఇంకో చోట —

“జీవితంలోంచి జీవం కత్తిరించబడి, నిర్జీవం అయిపోయింది. ఆలోచనలోంచి చింతనా శక్తి వేరు చేయబడ్డది. ఏకాంతవాసంలో జీవితానికి మనుగడలేదు. జీవితం జీవితాన్ని పెనవేసుకునే వర్ధిల్లితోంది” (నది ప్రవహిస్తూనే ఉంది: రాజేంద్రబాబు ఆర్వాణీ) అంటాడు. కవి ప్రతిభావంతమైన చింతనాపరుడు. పైగా సహృదయుడు కూడా. ఏది దేన్ని ప్రకాశింపజేస్తోంది. ప్రతిభని హృదయమా ? హృదయాన్ని ప్రతిభా ? రెంటికి రెండూ సాహిత్య రూపాన్ని పట్టుకుని ఒకదానికొక పునాది రాయిని వేస్తాయి. కవి పురోగామీ తాత్వికతలో హృదయమూ, ప్రతిభా గొప్పతనాలను తేల్చుకునేముందో విషయమూ మనం గుర్తుంచుకోవాలి. ఈ కవిత్వమేం మనల్ని వివశం చేయదు. తన్మయానికీ గురిచేయదు. అయినా చదువరిగా నీకు అది నేరుగా తాకుతుంది. అందుకు నీలోని భావుకతో, రసాస్వాదనో, విప్లవమో, అభ్యుదయమో, ఏమో…మో…మో కారణమవుతాయ్. కాదనలేవ్. అంటే జీవన స్పృహలో అతను సంభాషిస్తున్నదంతా ఈ కవిత్వమైందంటే తప్పు కాదేమో ! ఆ స్పృహ ప్రజల కారణంగా సంఘర్షిస్తుంది.

పాణి ముందుమాటలో ఈ కవిత్వాన్ని జైలుకావల ప్రపంచాన్ని చుట్టేసి రావడానికి, దానితో సమతుల్యత సాధించడానికీ, సంభాషించడానికే రాయబడిందన్నాడు. విప్లవకారుడికీ, విప్లవ కవికీ ఈలా రక రకాల జీవన తలాల మీద నిలబడి తన గొంతు వినిపించే సదవకాశం ఉంటుందని చెప్తాడు. నిజమేననిపించింది. సాయిబాబా శాస్త్రీయంగా ప్రజల దుక్ఖాన్ని చాలా సీరియస్ గా పట్టించుకున్నాడు. తన తోటి వాళ్ళతో మాట్లాడేందుకు తనలా వాళ్ళకీ ఒక గొంతు కావాలని కోరుకున్నాడు. తనకున్న స్వేచ్చకూడా లేని వారిని చూసి చలించిపోయాడు. అతని పరిశీలనే ఈ కవిత్వమయ్యింది. కేవలం నినాదం రాసినట్టు రాయడు. చదివేవాళ్ళ చైతన్యాన్ని అవగాహనలో ఉంచుకుని విషయాన్నెంత ప్రభావవంతంగా చెప్పగలడో అంచనా వేసుకుని మరీ చెప్తాడు. మళ్ళీ ఇదంతా ఓ సుదీర్ఘమైన ఉపాయం పన్ని చేయడు. అతని మానవతావాదం మనందరి పరం చేసిన ప్రయత్నంలోనే కవి సాంఘిక దృక్పధం గోచరిస్తుంది. అందుకే ఇదంతా విప్లవ కవిత్వ భూమిక కలిగి ఉంటుంది. అలా అని కవి భావనా శక్తి ఈ తలానికిమాత్రమే పరిమితమై ఉండదు. నీ తలపులలో తుళ్ళిపడుతూ, అలసిపోయావా మిత్రమా, నీ ములాఖత్ కోసం ఎదురుచూడ్డం ఎంత బాగుందీ, లాంటి ఎన్నో కవితలు తద్విరుద్దమైన సుకుమార మానవ లక్షణాల రాపిడిలోనూ భావ వర్ణన కలిగి ఆరాధ్యంగా ఉంటాయి. ఇవన్నీ కాల్పనిక కవిత్వమంటే అస్సలు కుదర్దు. ఇదంతా విప్లవకారుడి సామాజిక సేచ్చా ప్రియత్వమే. తన మనసు వెన్నపూస. విరసం ఈ పుస్తకం వేసి చాలా మంచి పని చేసింది. అలాగే కవి మాతృభాష తెలుగు కావడం చేత ఇంగ్లీషులో సాయిబాబా రాసిన ఈ కవిత్వమ్మొత్తాన్నీ తెలుగు లో కి అనువదించారు కవులు. వేణు, ఉదయమిత్ర, రివేరా, శశికళ, కరుణాకర్, బాసిత్, వరలక్ష్మి అందరూ చాలా చక్కగా అనువాదం చేశారు. అసలివన్నీ ట్రాన్స్లేటెడ్ పోయంస్ అనే భావనే కలగకపోవడానికీ కవుల హృదయంలో విప్లవ కవిత్వం జీవన ధ్వనిలా మోగడమే కారణమై ఉంటుంది. లేకపోతే ఈ వాక్య సౌందర్యం ఆసాధ్యమైనది.

అమ్మా నాకోసం దుక్ఖించకు అన్న కవితలో “జైలు నాకు మరణం కాదు. పునర్జననమని అర్ధం చేసుకున్నాను. నేనింటికి తిరిగివస్తాను. అమ్మా నా స్వేచ్చ గురించి భయపడకు” అన్నపుడో నా విద్యార్ధులకు , సహచర ఉపాధ్యాయులకు కవితలో “మీ నుండి దూరంగా ఖైదు చేయబడినా నరాలలో రక్తనాళాలలో పరుగులెత్తుతున్న స్వేచ్చా కాంక్ష నుండి సంకెళ్ళు లేని మనోనేత్రం నుండి నేను మిమ్మల్ని చూస్తాను. మాట్లాడతాను. నా బలహీనమైన చేతులతో హత్తుకుంటాను” అన్నపుడో ఆ అభివ్యక్తికి కట్టుబడిపోవడం అతి సామాన్య విషయం. అంత అసామన్య వాక్యాలవి.అలాంటివే స్టీఫెన్ హాకింగ్ మీద, జస్టిస్ రాజేంద్ర సచార్ మీద, జైలు గార్డుకు సలాం అంటూ రాసిన కవితలూ వైవిధ్యం గా ఉంటాయి.

ఒక ఇంగ్లీషు సాహిత్యం బోధించే దివ్యాంగ పంతులుగార్ని ఈ విశ్వం మానవీకరించబడిందని, చరిత్ర మానవీయమైనదని, కాలం మానవీయమైనదని చెప్పినందుకు ప్రభుత్వం కటకటాల వెనక్కి తోసింది. మానవీయవమవడమంటే జీవించి ఉండటమనే సత్యంగా; కొత్తగా జన్మించే నక్ష్తత్రాల్లో, బుల్లి గెలాక్సీల్లో అపురూపంగా చూసుకునే ఓ అద్వితీయ భావుకుడిలో పలికిన కవిత్వం. వేర్లు కత్తిరించి కొమ్మలు తెగనరికిన చెట్టు వంటి తన గుండెతో బిగ్గరగా ప్రజలకు న్యాయం చేయకుండా ఎవడూ సమాజాన్ని మార్చలేడని హృదంతరాళమూ శబ్దిస్తున్న విశ్వమోహన మానవుడి స్వేచ్చా గానం. ఈ మనహ్ స్తితిలో కవిత్వం చేసిన నిశ్శబ్ద శబ్దమే అతని విజయం.

శ్రీరామ్

శ్రీరామ్: పుట్టింది తెనాలిలో, పెరిగింది విజయవాడలో. వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో బ్యాంకుజ్జోగం చేసుకుంటున్నారు. కవిత్వమూ, కవిత్వ విశ్లేషణ, సమీక్షా వ్యాసాలు రాస్తున్నారు. కవిసంగమం లో కవితా ఓ కవితా శీర్షిక నిర్వహిస్తున్నారు. అద్వంద్వం తనకి గుర్తింపు తెచ్చిపెట్టిన తొలి కవితా సంపుటి. +91 9963482597 మొబైల్ నంబర్లో అతన్ని పలకరించవచ్చు.

11 comments

 • భావుకుని విప్లవ తత్వాన్ని బాగా చెప్పారు

 • ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ..ఇవాళ నేను చదివిన వ్యాసాలన్నీ సమాజం పట్ల మన భాధ్యత ఎంతా అని ప్రశ్నిస్తున్నట్టే ఉన్నాయి.సాయిబాబా గారి గొంతుక లోంచి స్వేచ్ఛా గానం పదే పదే వినిపిస్తుంది అది సమాజం పట్ల ఆయనకున్న ప్రేమను తెలియజేస్తుంది… బాబాగారిని జైలుగోడల్లో నడుమ బంధించినంతమాత్రనా గెలిచినమనుకునే ప్రభుత్వాలకు తెలీయంది ఒకటుంది…అతని కవిత్వ నిశ్శబ్ద శబ్దం ఎప్పుడో విజయం సాధించినది అని…అభినందనలు శ్రీరామ్ గారు….ఎప్పటిలాగే మీ శైలి మమ్మల్ని కట్టి పడేస్తుంది

 • Saibaba ghosha ni sameekshinchina Sriram gaariki abhinandanalu.anuvaadam chesina kavulanthaa viplava shankhaaraavaale kaavatam vishesham

 • సాయిబాబా గారి నిశ్శబ్ద శబ్దాన్ని మీ విశ్లేషణతో పేల్చేసారు…చాలా బాగుంది సార్…అభినందనలు

 • “ఒక సాహిత్య ప్రక్రియ తన పర్యవసానాన్ని దాని ఫలితంగా కంటే అలా బయటికి ధైర్యంగా తలెత్తి చూసే ప్రయత్నం చాలా ముఖ్యమైనది….ఆ సందర్భంలోనే కథైనా, కవితైనా జీవ లక్షణం కలిగి విపత్కర కాల పరీక్షల్ని సామాన్యుల ముందు గుడ్డలు విప్పి నిలబెడుతుంది….” వాహ్.. శ్రీరాం గారూ, ఏం చెప్పారండీ….మీ ఈ వాక్యం నన్ను హత్తుకుంది….నాకు మరింత ప్రోద్బలమిచ్చింది…
  అలా గళం విప్పిన మనసు ముసుగులు తొలగించి ఏ ఆఛ్ఛాదనా లేని సాయిబాబాగారి కవిత్వం జీవిత అస్తిత్వంపై జరుగుతున్న హింస, పెత్తందారీతనంపై ప్రచండ యుద్దమే….
  అనారోగ్యంతో అవయవాలు ప్రతిఘటిస్తున్నా జైలుగోడల మధ్య జన్మించిన కవిత్వం పలికేది నగ్న సత్యాలే మరి….
  ఆ నగ్నత్వం వెనుక అతను హృదయం నలుపుకుంటున్న శబ్దాన్ని, అతని మదిని సలుపుతున్న బాధను అంతే గాఢంగా మీదైన శైలిలో మా ముందుంచారు……
  మహోన్నత వ్యక్తి అద్భుత పరిచయం…
  మరికొన్ని అతని వాక్యాలు ఉదహరించకపోవటం వెలితనిపించింది….

 • చాలా ఆలస్యంగా చదివాను మిత్రమా. ఈ పుస్తకం చదివిన దగ్గరనుంచి మొదట మీరు చెప్పిన వాక్యాలే నాకు అనిపించాయి.కళ్ళముందు జరుగుతున్న అరాచకాన్ని ఎంత సింప్లి ఫై చేసి చెప్పగలిగితే అంత మేలు కదా.సాయిబాబా సానుభూతి కోరుకోలేదు,సహకారం అడిగారు ఇప్పుడు అది ఇవ్వవలసిన బాధ్యత మనమీద ఉంది.మీ వ్యాసం నాలాంటి వారికి చాలా అవసరం బాగా రాశారు

 • అన్న….ఈ పుస్తకం లో వాక్యాలు ఎంత బలమైనవో.. మీ సమీక్ష అంత బలంగా ఉంది..
  ఖచ్చితo గా చదవాలని ఉంది

 • గత రెండు రోజులుగా ఈ పుస్తకమే చదువుతున్నాను… కొన్నిసార్లు కన్నీరు కార్చాను
  కొన్నిసార్లు పిడికిలి బిగించాను.ఇంకా ఆ పుస్తకం ప్రభావంలోనే ఉన్నాను… ఇంతలోనే మీ సమీక్ష!
  మీ సమీక్ష అద్భుతంగా ఉంది సర్…మీదైన స్వరంలో సంఘీభావం తెలిపారు.
  ధన్యవాదాలు

 • విశిష్ట రచనకు ఇంకా విశిష్ట మైన విశ్లేషణ

 • చాలా బాగా వచ్చింది వ్యాసం … నినాదం గా కాకుండా విప్లవాన్ని స్వప్నించే ఆలోచన నిండిన భావుకత

 • గొంతు చించుకునే స్వేచ్చాయుత నిజాయితీగల ప్రయత్నమే అసలు సిసలు సాహిత్య వ్యక్తిత్వం. అలాంటి సమున్నత శిఖర మానవుడిగా సాయిబాబా ఈ పుస్తకంలో కనిపిస్తాడు.

  ఆచరించని దాన్ని వ్రాయడం,తను వ్రాసిన దాన్ని ఆచరించకపోవడం… కవిత్వం ఎంత చిక్కగా ఉన్నా కవిని పలుచన చేస్తాయి.
  ఈరెంటితో సాయిబాబా అసలు సిసలు కవిగా నిలిచాడు.

  వ్యాసంలోని ప్రతి వాక్యం విమర్శ అంటే ఏమిటి?అనే వాళ్ళకు పాఠం.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.