అబద్ధాల పట్టాలపై
రాజకీయ రైళ్ళు

ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా పరిణమిస్తున్నాయి అంటే వాటి గురించి మాట్లాడుకోవడానికే అసహ్యం వేసేంతగా. బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మునుపు జరిగిన ఏ ఎన్నికలూ ఇంత అద్వాన్నంగా జరిగి ఉండవు. పూర్తిగా అబద్దాలు, అనైతికతలతో ఏ మాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా ఎన్నికల హంగామా కొనసాగుతోంది. యీ ఎన్నికల్లో అధికారికంగా అన్ని పార్టీలు (తెలుగుదేశం, వైయ్యేస్సార్సీపీ, కాంగ్రెస్, జనసేన, బీజేపీ, ప్రజాశాంతి వగైరాలు ) తలపడుతున్నాయి. వాస్తవంగా బరిలో ఉన్నది రెండే ప్రధాన పక్షాలు. ఒకటి  జనసేన, కాంగ్రెస్, ప్రజాశాంతి, సీపీఐ, సీపీఎం  పార్టీలతో కూడిన తెలుగుదేశం కూటమి. ఇంకోటి వైయ్యేస్సార్సీపీ. ఇక్కడ ఒక విషయం గురించి ముందు మాట్లాడుకోవాలి. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో టీడీపీ , జనసేన పార్టీలు వైయ్యేస్సార్సీపీ బీజేపీకి అనధికారిక మిత్ర పక్షమే అంటూ ప్రచారం సాగిస్తూ వున్నారు కానీ ,  అలా చెపుతున్న పార్టీలకు కానీ లేదా సామాన్య ప్రజలకు గానీ బీజేపీ , వైకాపా ల మధ్య లోపాయకారి ఒప్పందం వుందీ అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు.  జగన్ తన పార్టీ మద్దతును ఎప్పుడూ వాళ్లకు ఇవ్వడం జరగలేదు. రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్ వంటి రాజ్యాంగబద్ధ పదవులకు మాత్రం అన్ని పార్టీలలాగే యునానిమస్ సంప్రదాయం పాటించి మద్దతు ఇచ్చారు. అప్పుడు కూడా బీజేపీ అభ్యర్థులకు సంపూర్ణ మెజారిటీ ఉండి గెలుపు అనివార్యమైన పరిస్థితుల్లోనే ఆ పదవులను గౌరవిస్తూ మద్దతు ఇచ్చారు. బీజేపీ నిర్వహించే మిత్రపక్షాల సమావేశాలకు ఇతర కార్యక్రమాలకు ఎన్నడూ వెళ్ళలేదు. ప్రత్యేక హోదా తదితర అంశాల్లో బీజేపీని ఎన్నో సందర్భాల్లో విమర్శించడానికి వెనుకాడలేదు. ప్రత్యేక హోదా ఇస్తే వాళ్ళు బీజేపీ ఐనా లేక కాంగ్రెస్ ఐనా మద్దతు ఇవ్వడానికి అభ్యంతరం లేదని ప్రకటించారు. ఇది వాస్తవమయినప్పుడు వైకాపాను బీజేపీతో పొత్తు పెట్టుకుందంటూ గోల చేయడంలో అస్సలు అర్థం లేదు. కనుక వైకాపాది ఒంటరి పోరు అనడమే సమంజసం.  

ఇప్పుడు మళ్లీ ఒకసారి ఆపద్ధర్మ అధికార పక్షం సంగతికొద్దాం. ఈ ఎన్నికల్లో టీడీపి రంగాటకం అంతా ఇంతా కాదు. పచ్చి అబద్దాలలో నిత్యం తరించిపోతున్నారు. చంద్రబాబు నాయుడు నాలుగున్నర సంవత్సరాలు మైత్రి వెలగబెట్టి ఆ తర్వాత బయటకు వచ్చి ఇప్పుడు బీరాలు పలుకుతున్నారు. పైగా ఆ సంబంధాన్ని వైకాపాకు అంటగడుతున్నారు. కలిసి వున్నన్ని రోజులూ  ఏ ప్రత్యేక హోదా సంగతీ , లోటు బడ్జెట్ సంగతీ గుర్తుకు రాలేదు. విడిపోయిన తర్వాత అన్ని లెక్కలూ గుర్తుకు వచ్చేస్తున్నాయి. మొన్న రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు చంద్రబాబే స్వయంగా హోదా బదులు ప్యాకేజీ ఇవ్వండంటూ ఇచ్చిన లెటర్ ను బయట పెట్టారు. ఇప్పుడు ఇద్దరి విశ్వసనీయత ప్రజలకు తెలిసిపోయింది. ఇంతకాలం ఆ లేఖను బయట  పెట్టకుండా ఇప్పుడే బయటకు తీసి చూపడంలో ఉన్న ఆంతరంగమేమిటో. 

చంద్రబాబు తాను ఒకప్పుడు చేసిన అక్రమ, సక్రమ స్నేహాలను వాటి తాలూకు పార్టీలను ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి అంటగట్టి ప్రచారం చేస్తున్నారు. ఈ పని కోసం అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారు.హరిక్రిష్ణ శవం సాక్షిగా టీఆర్ఎస్ పార్టీ పొత్తును ఆశించానని స్వయంగా చెప్పుకున్న చంద్రబాబుకు ఇప్పుడు ఆ పార్టీ పెద్ద భూతంలాగా కనబడుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే కేసీఆర్ అక్కడ చంద్రబాబు జోక్యాన్ని ప్రశ్నించాడు. ఇప్పుడు చంద్రబాబు కూడా అలాంటి ఫోజు కొట్టాలనుకుంటున్నారు. కానీ భంగిమ కుదరడం లేదు. ఎలా కుదురుతుంది. అప్పుడు తెలంగాణ లో బాబును ‘నీకిక్కడ’ ఏం పని అని కేసీఆర్ ప్రశ్నించాడంటే దానికి ఓ కారణం ఉంది. ఎందుకంటే చంద్రబాబు తెలంగాణ రాజకీయాలను వదిలేసి అమరావతి కి పెట్టె బేడా సర్దుకుని వచ్చేయడం మొదటి కారణం అయితే  అక్కడికి పోయినప్పుడు తెలంగాణ రావాలని లెటర్ రాసింది నేనే అని సెల్ఫ్ గోల్ చేసుకోడం,  ఇక్కడికి వచ్చి తెలంగాణ విడిపోవడం అక్రమం అని గగ్గోలు పెట్టడం రెండవ కారణం. యీ రెండు పడవల ప్రయాణం ఆయనకు ఇప్పుడు కొత్తేమి కాదు. అందుకే కేసీఆర్ మూటా ముల్లె సర్దుకునిపోయినోనికి మళ్ళీ ఇక్కడ పనేంటి అని ప్రశ్నించాడు. అంతేగానీ ఆంధ్ర జనాలకు తెలంగాణ లో పనేమిటి అని… ఎన్నికల సందర్భంగా అనలేదు. అటువంటప్పుడు చంద్రబాబు, ఆయన బహిరంగ రహస్య మిత్రుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ ప్రాంతీయ ద్వేషం రెచ్చగొట్టడంలోని అర్థం ఏమిటి. నరం లేని నాలుక కనుక ఎలా ఆడమంటే అలా ఆడుతుంది కాబట్టి వైసీపీ కి ఓటేస్తే టీఆర్ఎస్ కు వేసినట్లే అని అనగలుగుతున్నారు. కేసీఆర్ కనుక నిజంగా అంత ఆంధ్రా ద్వేషే అయ్యుంటే ఆయన్ని రాజధాని శంకుస్థాపనకు ఎందుకు పిలిచినట్టు? ఇదే విమర్శలు ఇంతకాలం చేయకుండా ఎన్నికల సమయంలోనే చేయడమెందుకు? .

ఇక, పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారని అనడం ఆంతర్యమూ తెలిస్దిందే. పైగా యీ స్వీయ ప్రకటిత చేగువేరా  ఆంధ్ర ప్రజల్ని ఉద్దేశించి మీరు ఆంధ్రా పుట్టుక పుట్టలేదా అంటూ ప్రశ్నించడం మొదలెట్టాడు. కేసీఆర్ ను పొగిడి , టీఆర్ఎస్ పార్టీకి ఓటేశానని ట్విట్టర్ వేదికగా ప్రకటించిన తన రెండో అన్న నాగబాబుకు ఎంపి టికెట్ ఇస్తాడు కానీ జనాల ‘పుట్టుకల’ గురించి అడుగుతాడు.  హైదరాబాద్ లోనే ఫార్మ్ హౌస్ నిర్మించుకుని అక్కడే సినిమాలు తీసుకుంటూ బతికే పవన్ ను తెలంగాణ వారు ఎన్నిసార్లు కొట్టారో ,  అలా కొడుతుంటే తాను దెబ్బలకు తాళలేక ఏ యే సందులు , గల్లీలు తిరుగుతూ దాక్కునేవాడో ప్రచారానికి వచ్చినప్పుడు జనాలు అడిగి చూడాలి. యీ మొత్తం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రక్రియలో మనం అర్థం చేసుకోవలిసింది ఏమిటంటే పవన్ కళ్యాణ్ కు గానీ, చంద్రబాబుకు గానీ పక్క రాష్ట్రం తో సఖ్యతగా మెలిగే ఉద్దేశ్యం లేదని. బహుశా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  లు ఇండియా, పాకిస్థాన్ లాగా గొడవలు పడుతూ ఉండాలని వారు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.  గడచిన ఐదేళ్లలో తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుని ఓట్లు అడిగే బదులు ప్రాంతీయ విద్వేషాలు రేపుతూ వాటిలో ఓట్లు ఏరుకోవాలని చేస్తున్న ప్రయత్నంలో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. 

ఇవేగాక తెలుగుదేశం పార్టీ తన మిత్ర మీడియా ద్వారా కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతోంది. కేసీఆర్ ఎప్పుడో ఉద్యమ సమయంలో రాయలసీమ ప్రాజెక్టుల గురించి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు వారికి ఇప్పుడు గుర్తుకు వచ్చి హెడ్ లైన్లలో రాసుకుంటున్నారు. అటు తెలంగాణ ఇటు రాయలసీమ ఉన్న కృష్ణా నది మీద వున్న రాజోలిబండ, సుంకేసుల, గుండ్రేవుల తో పాటు సీమ ప్రజల చిరకాల ఆకాంక్ష ఐన సిద్దేశ్వరం అలుగు వరుకు అన్ని ప్రాజెక్టులకు సఖ్యత అవసరం. భారీ ప్రాజెక్టులైన తుంగభద్ర డ్యామ్, శ్రీశైలం ప్రాజెక్టులలో ఇరువురి భాగస్వామ్యం ఉండనే ఉంది. అటువంటప్పుడు టీడీపీ కూటమి వేస్తున్న కేసీఆర్ వ్యతిరేక ఉచ్చులో రాయలసీమ ప్రజలు పడ్డారంటే  అంతకుమించి మతిలేని చర్య ఇంకోటి ఉండదు. 

ఆఖరుకు పోలవరం ముంపులో తమ భూభాగం మునిగిపోతుంది కాబట్టి ముందు అందుకోసం చర్యలు తీసుకోవాలని తెలంగాణ సుప్రీం కోర్టుకు పోతే దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వారు కేసీఆర్ పోలవరం పై భారీ కుట్ర అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇందులో అంత పెద్ద కుట్ర ఏమీ లేదు.

ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ అధికార పక్షాన్ని వదిలేసి ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం, తన నిలకడ లేని మాటలు ఆయన రాజకీయ అపరిపక్వతను తెలియజేస్తున్నాయి. కెఏ పాల్ అనే ఆయన, పొలిటికల్ పార్టీ నిర్మాణం లో అ ఆ లు కూడా రానోడు… 60 అసెంబ్లీ స్థానాల్లో వైకాపా అభ్యర్థుల పేర్లను పోలిన వారిని బరిలో నిలబెట్టాడంటే దానికి వ్యూహ రచన ఎవరిదో ఇట్టే తెలిసిపోతుంది. 

మూణ్ణెళ్ల నుంచి జరుగుతున్న యీ నాటకంలో నడిచేవారు ఎవ్వరు , నడిపించేవాడు ఎవరు అనేది సామాన్య ప్రజలకు అర్థం అవుతూనే ఉంది. అయినా చంద్రబాబు కోటరీయులు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారంటే ప్రజలు ఏమి చెప్పినా నమ్మేస్తారనే గట్టి నమ్మకమే కారణం. చూద్దాం ప్రజలు ఎవరి నమ్మకాన్ని వమ్ము చేస్తారో.

వంశీ పులి

వంశీ పులి: పూర్తి పేరు పులి. వంశీధర రెడ్డి. స్వస్థలం: కర్నూలు జిల్లా లోని వెల్గోడు గ్రామం.
డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి,. ప్రస్తుతం కర్నూలులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు .

2 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.