అమెరికా నాటకంలో మేలు మలుపు
యుజిన్ ఓ నీల్ (1888 -1953)

నటనే జీవితమూ వ్యసనమూ అయిన తండ్రి, భయంతో మత్తుమందుకు బానిస అయిన తల్లి, అగమ్య గోచరమైన జీవితం, దెబ్బతిన్న బాల్యం, విసుగు, కోపం, జీవితం పట్ల ద్వేషం, ఒక ఆత్మహత్యా ప్రయత్నం, తనకేం కావాలో తనకే తెలియనితనం,  జీవితంతో పోరాటం,  నాటక రచనలో అనూహ్య విజయం, నాలుగు సార్లు పులిట్జర్ ప్రైజ్లు,  అమెరికా నాటక రంగాన్ని మలుపు తిప్పిన రచయితగా నీల్ కు నోబెల్ బహుమతి౼ఇదీస్థూలంగా యూజీన్ నీల్ జీవితం.

19 శతాబ్దం మొత్తం అమెరికన్ నాటక రంగం బయటి ప్రపంచం తో సంబంధం లేకుండా భావోద్వేగమైన, వికటమైన హాస్య నాటకాలతో నిండి ఉండేది. 1914 లో యుద్ధం తర్వాత అమెరికన్ నాటక రచయితలు అనుకరణను,సాంప్రదాయికతను పక్కన బెట్టి కొత్త పద్ధతులను వెదకసాగారు. అలా కొత్తదనాన్ని అమెరికన్ నాటక రంగానికి ఇచ్చిన వారిలో యుజీన్ నీల్ , ఎల్మర్ రైస్, జార్జ్ కాఫ్ మాన్, మార్క్ కోనేల్లీ, పాల్ గ్రీన్,మేక్స్ వెల్ ఎండర్ సన్, జార్జ్ కెల్లీ , సుసాన్ గ్లాస్పెల్,జో లాకిన్స్ ప్రముఖులు.

అమెరికన్ నాటక రంగాన్ని విధంగా మలుపు తిప్పిన యూజీన్ నీల్ అక్టోబర్ 16 1888లో బారట్హౌస్ అనే ఒక హోటల్లో జన్మించాడు. తండ్రి జేమ్స్ నీల్ ఒక ప్రముఖనటుడు. అతనికి నటనే వూపిరి,జీవితం. ఎంతో ప్రేమించిన తన తండ్రి మరణం, నటనకే అంకితమైన భర్త రంగస్థల వ్యాపకం వల్ల,కుమారుని మరణం వల్ల, తల్లి మేరీ మార్ఫిన్ కు బానిసైంది.  చిన్నతనంలోనే నీల్ బోర్డింగ్  స్కూల్ కు పంపబడ్డాడు. ప్రిన్స్ టన్ యూనివర్సిటీ లో చేరినా చదువు పూర్తి కాలేదు. సముద్ర ప్రయాణాలు చేసి ఆల్కహాల్ కు బానిస అయ్యాడు. క్షయవ్యాధితో పోరాడి ఆగస్ట్ స్ట్రిండ్ బర్గ్ వల్ల ప్రభావితుడయ్యాడు. తన శక్తి సామర్థ్యాలను నాటక రచనలో వినియోగించాలని నిర్ణయించుకుని అనేక ప్రయత్నాలు చేశాడు.

1914 లో మొదటి సంపుటి తీసుకొచ్చినా 1919 దాకా న్యూ యార్క్ కు నీల్ గురించి తెలియదు. 1920లో తాను వ్రాసిన నాటకంబియాండ్ హొరైజన్సంచలనం సృష్టించడంతో పులిట్జర్ బహుమతి పొందాడు. అదే సంవత్సరంలోఎంపరర్ జోన్స్అనే నాటకాన్ని రాశాడు. 1922 లో రాసినఆన క్రీష్టీరెండో పులిట్జర్ బహుమతి పొందింది.  తర్వాత కాలంలో తన సోదరుని తల్లితండ్రులనీ పోగొట్టుకున్నాడు. తన వైవాహిక జీవితం రెండుసార్లూ తనకు ఆనందాన్ని ఇవ్వలేక పోయింది.  నటి కార్లెటా మాంటరీ తో అనుబంధం బంధం గా మారి 1929 లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె అతని లోని రచయితను వెన్నుతట్టి ప్రోత్సహించింది. 1931లో అతను వ్రాసినమౌర్నింగ్ బికమ్స్ ఎలక్ట్రాపాఠకులను, నాటక సందర్శకులను ఆశ్చర్యచకితుల్ని చేసింది. అమెరికన్  రచయితా పొందని నోబెల్ బహుమతిని కైవసం చేసుకున్నాడు. 1946లోఐస్మన్ కమెత్తర్వాత ఓనీల్, పార్కిన్సన్ వ్యాధి తో బాధపడ్డాడు. 1953 లో 50 కి పైగా నాటకాలు వ్రాసిన నాటక రచయిత గా నవంబర్ 27 బ్రాంకియల్ న్యుమోనియా తో మరణించాడు.  తన రచనా పటిమ తో  షేక్స్పియర్ , బెర్నార్డ్  షా వంటి ఆంగ్ల రచయితల సరసన నిలిచాడు.

వ్యక్తిగతంగా సిగ్గరి,బిడియస్తుడూ అయిన నీల్ కలం పడితే చాలు మనసుల్నీ మస్తిష్కాల్నీ కదిలించి వేస్తాడు. సముద్రం పై ఎక్కువగా గడిచిన అతని జీవితం అతనికి సముద్రమంత లోతైన జీవితానుభవాల్నీ, వేదాంత ధోరణినీ ఇచ్చింది.

నాటక  రచయితగా నీల్ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. నాటకాన్ని ఒక కళగా మలిచాడు. అమెరికన్ల దైనందిన వ్యవహారిక భాషను, నిజ జీవితం లోని పాత్రలను, అణగారిన వర్గాల ప్రజలను,వాస్తవిక దృష్టితో నాటకరంగం మీద ప్రతిష్టించడం తో 20 శతాబ్దపు అమెరికన్ నాటక రంగానికి బంగారు భవితను ఇచ్చాడు. వాదానికీ పరిమితం గాక అనిర్వచనీయుడిగా మిగిలిపోయాడు. అందుకే నీల్ కు పరిధులను నియంత్రించడం చాలా కష్టం.

ప్రతి నాటకం లోనూ ఒక విచిత్రమైన ప్రయోగం చేశాడు. ఆయన నాటక కథలు, పాత్రలు తనదైన ఒక సందేశాన్ని ఇస్తాయి.  చరిత్రని,  రాజకీయాలని చాలా ఆసక్తికరంగా నాటకంలో చూపిస్తాడు.  ప్రతి నాటకం లోనూ ఒక లోతైన సందేశాన్ని ఇస్తాడు.  ప్రతి మనిషి తన జీవితంలో నిజాన్ని గ్రహించాలని,  ఆశని పెంపొందించుకోవాలని, తనదైన శక్తిని గుర్తించి ఒక ప్రత్యేక వ్యక్తిగా నిలబడాలని సూచిస్తాడు.

అవాస్తవ పరిస్థితులు నాటక రంగాన్ని ఏలుతున్న తరుణంలో నీల్ సమాజ గతమైన సమస్యలను ప్రతిబింబించేలా చేశాడు. ఆయన రచనలపై గ్రీకు నాటకాలు, ఫ్రాయిడ్, స్ట్రిండ్ బర్గ్, ఇబ్సన్ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే భావవాదం, వాస్తవికవాదం, ఐతిహాసికత, ప్రతీకవాదం, అధివాస్తవికత వంటివన్నీ కలిసి ద్యోతకమవుతాయి. చాలా తీక్షణమైన దుఃఖ నిర్వేదం ఆయన నాటకాలలో ప్రముఖంగా కనిపిస్తుంది. అప్పటిదాకా బ్రాడ్వేలో ప్రదర్శన కాని నాటక విషయాలను, అంశాలను నీల్ నాటకరంగానికి పరిచయం చేశాడు. తన జీవితంలో చూసిన, అనుభవించిన, మానవ సంబంధాలు, ప్రవర్తనలు అన్నీ ఆయన కథల్లో ప్రతిబింబిస్తాయి.

స్త్రీ పురుష సంబంధాలలో ఫ్రాయిడ్ వివరించినఈడిపస్’, ‘ఎలక్ట్రా ప్రవర్తన ఈయన నాటకాలలో కనిపిస్తుంది. హెల్మన్,  వైల్డర్, టెనిసి విలియంస్‌ , ఆర్ధర్ మిల్లర్ వంటి రచయితలకు స్ఫూర్తిగా నిలిచాడు. లాంగ్ డేస్ జర్నీ ఇన్టు నైట్‘ ‘ ఐస్మన్ కమెత్‘ ,  ‘ మూన్ ఫర్ మిస్ బిగాటెన్ ,  ‘ గ్రేట్ గాడ్బ్రౌన్‘, ‘ డైనమో‌’ , ‘ ఫౌంటెన్‘,  ‘స్ట్రేంజ్ ఇంటర్లూడ్‘,  ‘ హేరీ ఏప్‘,  ‘ యంపరర్  జోన్స్వంటి గొప్ప నాటకాలు రచించాడు.

డిజైర్ అండర్ ఎల్మ్స్ అనే నాటకంలో రెండు ఎల్మ్ వృక్షాల క్రింద ఉన్న పొలము, ఇల్లు తాలూకు బంధాన్ని వివరిస్తాడు. తండ్రీ కొడుకులిద్దరూ పొలంతో పాటు తమ అనుబంధాన్ని కాపాడుకోవటం కోసం పోటీపడతారు. తండ్రికి తనభార్య గుర్తుగా, కొడుక్కి తనతల్లి గుర్తుగా పొలాన్ని ఇద్దరూ కూడా కోరుకుంటారు. తన తల్లి అనుభవించిన బాధలన్నింటికి ప్రతీకారం తీర్చుకోవాలని కొడుకు ఈబెన్ పొలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అనుకుంటాడు. తన సవతి సోదరులతో కూడా ఒక ఒప్పందం ఏర్పరచుకొని పొలానికి తగిన డబ్బుని తానే చెల్లిస్తానని అంటాడు. లోపు తండ్రి ఒక యువతిని పెళ్లాడి తీసుకువస్తాడు. ఆబి పొలంకోసమే అతనిని పెళ్ళి చేసుకుంటుంది. యువతి ఆబి తో ఈబెన్ ప్రేమ లో పడతాడు.ఆబి కూడా ఇతన్ని కోరుకుంటుంది. వీరిద్దరి కలయిక వల్ల ఒక పిల్లవాడు జన్మిస్తాడు. అయితే పొలం పిల్లవాడికి చెందుతుంది అని ఆమె ఈబెన్ తో చెబుతుంది. దాంతో ఈబెన్ కోపగించుకుని ఇల్లు విడిచి వెళ్లిపోవాలని చూస్తాడు. దీంతో నిర్ఘాంతపోయిన ఆబి పిల్లవాడిని చంపి తన ప్రేమను నిరూపించుకోవాలని చూస్తుంది. ఇంతలో ఆమె భర్త ఈబెన్ తండ్రి ఎఫిరమ్ కి విషయం అంతా తెలుస్తుంది. ఆస్తిపాస్తులకోసం బంధాలు ఎలా ఛిద్రమౌతాయో నాటకం తెలియ చేస్తుంది.

మౌర్నింగ్ బికమ్స్ ఎలక్ట్రా అనే నాటకం ఎస్కిలిస్ రాసిన గ్రీకు విషాద నాటకంఒరిస్టస్ను పోలి ఉంటుంది. మేజర్ ఎజ్రా మామన్, క్రిస్టిన్ ఇద్దరు భార్యాభర్తలు. ఎజ్రా అనేక సంవత్సరాలు మిలిటరీ జనరల్ గా యుద్ధంలో పాల్గొని ఇంటికి తిరిగి వస్తాడు. అయితే క్రిస్టిన్ తన ప్రియుడు బ్రాంట్ తో కలిసి ఎజ్రాను హత్య చేస్తుంది.  తండ్రిని ఎంతో ఇష్టంగా ప్రేమించిన కుమార్తె లవీనియా తండ్రి ద్వారా విషయాన్ని తెలుసుకొని, తన తల్లి ప్రియుడు బ్రాంట్ ని తన సోదరునితో కలిసి హత్యచేస్తుంది. విషయాన్ని అంతా  గ్రహించిన క్రిస్టిన్ అవమానంతో తనని తాను కాల్చుకుని చనిపోతుంది. అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ సహజంగా జీవించటానికి ప్రయత్నిస్తారు. కానీ పశ్చాత్తాపంతో రగిలిపోయి సోదరుడు ఆత్మహత్య చేసుకుంటాడు. అందరినీ కోల్పోయి ఒక్కతే పిచ్చిదానిలా లవీనియా కాలం వెళ్ళదీస్తుంది.

ఐస్ మాన్ కమెత్ అనే నాటకం జీవితం లోని కష్టాన్ని, వాస్తవాన్ని భరించటంలో ఉన్న దుఃఖాన్ని తెలియజేస్తుంది. ప్రతి మనిషీ జీవితంలో ఉన్న కష్టాల్ని ఎలా తప్పించు కోవాలనుకుంటాడు, కష్టాన్ని ఎదుర్కోవడంలో ఎలాంటి బాధను అనుభవిస్తాడుఅనే విషయాన్ని తెలియ జేస్తుంది నాటకం. వాస్తవిక సమస్యల్ని వదిలి ఊహాత్మక ప్రపంచంలో కలలు కంటూ బతికే వారి కథ ఇది. ఒక బార్లో కలుసుకునే వ్యక్తులు అనేక వృత్తులలో ఉన్నవాళ్ళు, విద్యార్థులు, విప్లవవాదులు, పోలీసువారు, మిలటరీ వారు ఇలా కొందరు ఒక బార్లో కూర్చుని కలలు కంటూ ఉంటారు. సంవత్సరానికి ఒక్కసారి బార్ కి వచ్చే ఒక వ్యక్తి వాళ్లందరికీ కూడా మద్యాన్ని కొనిపెడుతూ ఉంటాడు. అయితే ఒకసారి ఆవ్యక్తి వాళ్లకి ఏమీ కొని పెట్టడు. పైగాబయటకు వెళ్లి కష్టపడి పనిచేసుకోమని, ఇలా కలలు కంటూ కూర్చో వద్దని చెప్తాడు. కానీ వాళ్ళు బయటికి వెళ్లి ప్రయత్నించి ఆకష్టాన్ని ఎదుర్కొనలేక, జీవితంతో పోరాడలేక, మళ్ళీ అక్కడికి చేరి కలలు కంటూ ఉంటారు. అప్పుడా వ్యక్తి తన గతాన్ని వివరిస్తాడు. తన హింసా ప్రవృత్తిని ఎంతోకాలం భరించిన తన భార్య తాను చనిపోతే బతకలేదని గ్రహించి ఆమెను చంపేశానని అతను చెప్తాడు. నగ్నసత్యం వారిలో ఒకరిని పూర్తిగా మార్చి వేస్తుంది. జీవితాన్ని ఎదుర్కోలేక అసత్యాలతో తమని తాము మభ్యపెట్టుకుంటూ కాలం వెళ్ళ దీసుకునే ప్రవృత్తులను చూపుతుంది నాటకం.

లాంగ్ డేస్ జర్నీ ఇన్టు నైట్ అనే నాటకం వ్యసనాలకు బానిస అయిన కుటుంబ సభ్యులను చూపిస్తుంది. ఇది తన స్వీయ జీవిత ఘటనల ఆధారంగా వ్రాయబడింది. మేరీ, జేమ్స్ అనే దంపతులు ఆల్కహాల్ కు బానిస అవుతారు. వారి పిల్లలు ఎడ్మండ్, జేమీ కూడా ఇలాంటి బానిసలే. ఎడ్మండ్ కు క్షయ వ్యాధి అని తెలిసినప్పుడు మేరీ తట్టు కోలేక పోతుంది. డయాగ్నసిస్  నిజం కాదని వాదిస్తుంది ఆమె కూడా నిజానికి మార్జువానాకి అలవాటు పడుతుంది. అది కేవలం తన భర్త వల్లనే అని అనుకుంటుంది. జేమ్స్ ను పెళ్లి చేసుకోవడం వల్లనే తానిలా మారిందని అనుకుంటుంది. జేమ్స్ తన ధన దాహం తనను అలా మార్చిందని అనుకుంటాడు. లోపు జేమీ కూడా తాగుడికి బానిస అవుతాడు. ఇలా అసంతృప్తి, కీర్తి కండూతి, ధన వ్యామోహం లాటివి కుటుంబ సంబంధాలను ధ్వంసం చేసి ఎలా మనుషుల్ని మత్తుమందుకు బానిసలుగా మార్చి జీవితాలను ఎలా నాశనం చేస్తాయో చూపిస్తాడు.

ఆవేశంతో సంఘాన్ని సంఘ వ్యవస్థలనీ ప్రశ్నించే ఆవేశపరుడి కధ హేరీ ఏప్. కలిమి లేములపై ఆధారపడి నిర్మింపబడిన సమాజం ఎప్పటికీ మారదు. ఒక ఓడలో కొలిమి దగ్గర నిప్పును తోసే కార్మికుడు యాంక్.  తన జీవితాన్ని తన నిస్సహాయ స్థితి ని నిరంతరం గా ప్రశ్నిస్తాడు. ఒకసారి చాలా ఆర్ధికంగా ఉన్నత స్థితి లో ఉన్న ఒక ఓడల వ్యాపారి కుమార్తె మిల్డ్రెడ్ పేద వారికి సేవ చేసే నిమిత్తం మురికి వాడలను, కార్మికులను సందర్శిస్తూ కొలిమిలో బొగ్గును తోసే యాంక్ ను చూస్తుంది.  బొగ్గుమసితో మొరటుగా ఉన్న ఇతన్ని చూసిబొచ్చు కోతిఅని భయపడి పారిపోతుంది.  తోటి కార్మికులందరూ యాంక్ ను ఎగతాళి చేస్తారు.  యాంక్ ఉన్నత వర్గాలాను నిలదీసి ఏడిపించే ప్రయత్నంలో జైలు పాలవుతాడు.  మిల్డ్రెడ్ తండ్రి తన అవస్థలు, మానసిక స్థితికి కారణమని గ్రహిస్తాడు. తోటి ఖైదీలు కార్మికసంఘంలోచేరి పోరాడమని సలహా ఇస్తారు.  అలాటి పోరాటంలో ఉంటూ అతని తీవ్రవాద మనస్థితి చూసి అతనుపోలిస్ గూఢచారిఅని తోటి కార్మికులు అనుమానిస్తారు.   ప్రపంచ స్థితిగతులతో విసుగు చెంది ఒక జూ లో ఉన్న ఒక కోతి బోను లోకి వెళ్లి దానితో చేతులు కలిపిమనం ఇద్దరం ఒకటేనని చెప్తాడు.  కానీ చాలా బలిష్ఠమైన కొండముచ్చు అతన్ని తొక్కి చంపేన్తుంది. మానవులలో కలివిడి తనం లేని తనాన్ని పశుత్వాన్ని పోలుస్తూ జీవితం ఎంత నిస్పృహా మయమైనదో నీల్ చూపిస్తాడు.

ఎంపరర్ జోన్స్ చాలా విభిన్న మైన రచన. నాటకాన్ని అంకాలుగా రాయడం ఆపివేసి ఎనిమిది దృశ్యాలుగా చూపుతాడు. ‘ఒక సాధారణ మానవుడు ఒక ద్వీపం లోని అమాయక ప్రజలకు ఎలా చక్రవర్తి ఔతాడు, ఎలాటి భయాందోళనల మధ్య జీవిస్తాడుఅనే ఇతివృత్తం తో హాస్యాన్ని మేళవించి చూపుతాడు. నాటకమంతా ప్రధాన పాత్రధారి స్వగతమే. మిగిలిన పాత్రలన్నీ మొదట చివరి దృశ్యాలలో అగుపిస్తాయి. నాటకం లోనిడప్పుశబ్దం నాటకం లో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తుంది.

లాజరస్ లాఫ్డ్ అనేది బైబిల్ పాత్ర ఆధారిత కధ. కానీ విభిన్నమైన ధోరణిలో నడుస్తుంది. ‘జీవితం ఒక నిరంతర ప్రవాహమనీ, చావు అనేది లేదనీ, అది కేవలమొక మార్పేననీ తెలియచేస్తాడు.

నీల్ సృష్టించిన పాత్రలన్నీ మూస పాత్రలు కాదు.  వారి మానసిక సంఘర్షణలను చాలా ఆసక్తికరంగా వెలికి తీస్తాడు.  సమాజం లోని అన్ని వర్గాల నుంచి స్త్రీ  పురుష పాత్రలను ఎన్నుకుంటాడు.  అయితే పాత్రలు వారి పేదరికాన్ని గురించి కానీ, దారిద్ర్యాన్ని గురించి కానీ, లేక ఆస్తిపాస్తుల గురించి మాట్లాడరు.  మనుషులుగా మనమేం కోల్పోతున్నామో మాట్లాడతారు. కేవలం సమాజమే కాక మానవుల పతనానికి వారి  చర్యలు, వారి నెలా పశ్చాతాపం చెందేలా చేస్తాయో చెప్తాడు.  

1936 లో నోబెల్ బహుమతి సాధించినస్ట్రేంజ్ ఇంటర్లూడ్అనే నాటకంలో  ఐదు పురుష పాత్రలతో నినా అనే స్త్రీ పాత్రపడే సంఘర్షణ అద్భుతంగా ప్రదర్శింప చేస్తాడు.  ‘అనా క్రిష్టివంటి నాటకాల్లో వాస్తవ వాదిగా, ‘హేరీ యేప్వంటి నాటకాల్లో భావవాది గా కనిపిస్తాడు. నీల్ నాటక రంగంపై పలుప్రయోగాలు చేశాడు. పాత్రల మనోగతాల్ని బయటికి తెచ్చే అనేక విధానాలనుఅంటే, పాత్రలుఏకాంతంగా  మాట్లాడుకోవడంసంభాషణల మధ్యలో పక్కకు తిరిగి మాట్లాడుకోవడం’, ‘మధ్యాంకికలను ప్రవేశపెట్టడంవంటివి అనేక ప్రయోగాలు చేశాడు. నీల్ నాటకాలు, నాటక ప్రదర్శన కోసం ఇచ్చే సూచనలు, దర్శకులకు అనేక సవాళ్లు విసరుతాయి. సూచనలలో భాగంగా నటులకు సంభాషణలను పలికేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను చెప్తాడు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నా భవిష్యత్తులో రాయవలసిన ఎన్నో నాటకాల రూపకల్పనను కూడా చేసుకున్నాడు. విభిన్నత, వైవిధ్యత, నీల్ ప్రధాన లక్షణాలు. రచనా కాలంలో ఒక్కోప్పుడు పాత్రల జీవితాలగురించి ఆలోచించి దుఃఖించేవాడని ఆయన జీవిత చరిత్ర వ్రాసిన ఆర్థర్, బార్బెరా గెల్బ్ తెలియచేస్తారు. జీవితపు నిజాల్ని గ్రహించమనీ, హృదయంలో ఆశను పెంచుకొమ్మనీ, వ్యక్తిగా నీ శక్తిని తెలుసుకొమ్మనీ మనకు గొప్ప సందేశమిచ్చిన నిబద్ధత గల అరుదైన రచయిత యూజీన్ నీల్. అతని మరణంతో అమెరికా తన నాటక ప్రతినిధిని కోల్పోయింది. 

డాక్టర్ విజయ్ కోగంటి, డాక్టర్ పద్మజ కలపాల

2 comments

  • ఆయన రాసిన “Beyond the Horizon” నాటకానికి చాలా మంచి పేరు వచ్చింది. ఆ నాటకానీ గొల్లపూడి మారుతీరావు గారు “రాగరాగిణి” పేరుతో తెలుగులో రాసిన నాటకాన్ని ప్రఖ్యాత నటులు దర్శకులు కె.వేంకటేశ్వర రావు గారు 1960ల్లో చాలా విజయవంతంగా ప్రదర్శించారు.

    • ఈ సమాచారం పంచుకున్నందుకు ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారూ

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.