ఇతరులతో పోల్చుకోడం
మీ కష్టాలకు తొలిమెట్టు

ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం మానేసిన మరు క్షణం మీ వ్యక్తిత్వ వికాసం ప్రారంభమవుతుంది. చిరస్మరణీయులుగా మిమ్మల్ని మీరు రూపుదిద్దుకోండి. ఆత్మవిశ్వాసంతో జీవించండి. సగర్వంగా జీవించండి.

షానోన్ ఎల్. ఆల్డర్

మీకు తెలుసు. ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోకూడదన్న విషయం మీకు తెలుసు. ఆచరణలో మాత్రం అంత తేలిక కాదు. ఉద్యోగంలో పదవులు, ఆదాయం, గ్రేడ్లు, ఇల్లు, ఫేస్ బుక్ లో లైకులుఇలా మనం ఇతరులతో పోల్చుకునే అంశాలు అనంతంగా ఉంటాయి. అలాగే మనం ఎంత మందితో పోల్చుకుంటున్నామన్న సంఖ్య కూడా అంతు  లేకుండా ఉంటుంది.

ఇతరులతో పోల్చుకోవడం మన దు:ఖానికి మూల కారణం. మన కష్టాలకు తొలి  విత్తనం. మీలోను, మీ జీవితంలోను మీకు ఇష్టం లేని వాటిమీద మీ దృష్టిని కేంద్రీకరించేలా చేస్తుంది.

ఉదాహరణకు మీరు ఉద్యోగం మారాలనుకున్నప్పుడు, మీరు పూర్తిగా కొత్త దారి మీద దృష్టి పెట్టాలి. కళ్ళకు గంతలు కట్టిన గుడ్డి గుర్రంలా మిమ్మల్ని మీరు ఊహించుకోవాలి. పక్క చూపులు చూడటం వలన పక్క దారి పట్టిపోతారు. కొన్నాళ్ళపాటు ఇది బాగానే ఉంటుంది. తర్వాత మొదటికొస్తుంది. మళ్ళీ ఇతరులతో పోల్చుకోవడం ప్రారంభమవుతుంది. వాళ్ళేం చేశారు; నేనేం చెయ్యలేదు అనే మీమాంస మొదలవుతుంది. ఎదుటివాళ్ళేం చేస్తున్నారన్న ఆలోచన పెరుగుతున్నకొద్దీ మీ లక్ష్యాల నుంచి పక్కదోవ పట్టడం మరింత ఎక్కువవుతుంది. మీ లక్ష్యాల మీద నియంత్రణ కోల్పోతారు. ఎదుటివారు వారి జీవితం జీవిస్తుంటే మీరు మీ జీవితాన్ని కోల్పోతారు. మళ్ళీ మీరు మొదటి నుంచి ప్రారంభించాలి. మళ్ళీ మొదలుపెట్టాక సహజంగానే మిగిలినవారికంటే వెనకబడిపోతారు. మీ దృష్టికోణం, దృక్పథం తక్షణం మార్చుకోవాలన్న స్పృహ మీకు బలంగా కలుగుతుంది.

మరి ఇతరులతో పోల్చుకోకుండా, మన లక్ష్యాల మీద దృష్టిపెట్టి జీవించడం ఎలా? మన జీవితాన్ని జీవంతో నింపుకోవడం ఎలా అన్న ప్రశ్నకు మానసిక శాస్త్రవేత్తలు పది సూత్రాలు చెప్పారు.

  1. మీ తోట మీద దృష్టి పెట్టండి: ఎదుటివారి మీద దృష్టి కేంద్రీకరించినప్పుడు సహజంగానే మన కోసం మనం వెచ్చించుకోవాల్సిన సమయం వృధా అవుతుంది. ఇతరుల తోట మీద దృష్టి పెట్టినప్పుడు మన తోట పెంపకం వెనకబడిపోతుంది. అందుకే ఇతరుల మీద దృష్టి పెట్టడం మానేసి మీ బతుకు తోటను తీర్చిదిద్దుకోవాలి.
  2. మీరున్న స్థితిని ఆమోదించండి:  మీరున్న పరిస్థితిని ఆమోదించకుండా ముందుకెళ్ళలేరు. మీరున్న స్థితిని ప్రతిఘటిస్తుంటే మీరు ముందుకెళ్ళలేరు. ఉన్న స్థితిని అర్ధం చేసుకుంటేనే ఉన్నత స్థితికి చేరుకోవడానికి దారి దొరుకుతుంది. సరైన మార్గంలో మిమ్మల్ని పయనింపచేసే దృఢ నిర్ణయాలు తీసుకోవాలి,
  3. మీ గతాన్ని ప్రేమించండి: మీ జీవితం అస్తవ్యస్తంగా ఉండవచ్చు. ఇప్పటివరకు మీ జీవితమంతా తప్పులతడకగా, భయంతో, మనోవేదనతో గడిపి ఉండవచ్చు. అవన్నీ కూడా మీలో మార్పుకు విత్తనాలుగా, పునాదులుగా భావించాలి. చేసిన తప్పులన్నీ తలచుకుని కుమిలిపోకూడదు. మీ కథను మీరు సొంతం చేసుకుని, మీరెంత ఎదిగారో గర్వంగా చూసుకోండి. అంత కంటే సగర్వంగా జీవితంలో దూసుకెళ్ళడానికి తీవ్ర కృషి తక్షణం ప్రారంభించండి.
  4. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండండి: మేమిలా ఉన్నాం; మేమలా ఉన్నాం అంటూ సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్-టాగ్రాం లలో మీ మిత్రులు ఊదరగొట్టేస్తుంటారు. అవన్నీ చదివి మీరు అసూయపడకపోయినా, ప్రతి క్షణం వాళ్ళతో పోల్చుకుని నీరసించిపోవడం, నిర్వీర్యమైపోవడం ఖాయం. సామాజిక మాధ్యమాలను వీలైంత తక్కువగా ఉపయోగించండి. వాటిల్లో అందరూ లేనిపోని గొప్పలు చెప్పుకుంటూ బతికేస్తుంటారు. వాటి ప్రభావానికి లోనవడం అంటే ఊబిలో కూరుకుపోవడమే. తక్షణం వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నాలు ప్రారంభించండి. సోషల్ మీడియాను మీరు నియంత్రించాలి కానీ; మిమ్మల్ని సోషల్ మీడియా నియంత్రించరాదు.
  5. సినిమా ఇంకా అయిపోలేదు: అవును. ప్రతి క్షణం సినిమా ఇంకా అవలేదు. నా బతుకు సినిమా ముగింపు, కొనసాగింపు నా చేతిలోనే ఉంది అనుకోవాలి. ‘Don’t write him off yet; he is still alive’ అంటాడొక రచయిత. అతడిని అప్పుడే తీసిపారేయకండి; అతడింకా బతికే ఉన్నాడు అని అర్ధం. ఈ రోజు మీరున్న స్థితి మీకు నచ్చకపోతే, అది మీరు తీసుకున్న నిర్ణయాల ఫొటో అని గుర్తుచేసుకోండి. ఈ రోజు మీరున్న స్థితి, మరో మూడేళ్ళ తర్వాత మీరు చేరుకునే స్థితికి ఏ మాత్రం పోలిక కాదు. మీరిప్పుడెక్కడున్నారన్నది పెద్ద ప్రశ్న కాదు. మీ దృష్టికోణం, మీ సానుకూల వైఖరి, మీ జీవిత పయనం ఎటువైపన్న మీ నిర్ణయాలమీదే అంతా ఆధారపడి ఉంటుంది.  
  6. మీకున్నదానికి కృతజ్ఞులై ఉండండి: మీకున్న దానికి కృతజ్ఞులై ఉండండి. మీకు లేనిదాని గురించి బాధపడుతూ కూర్చుంటే, అన్నీ సమృద్ధిగా ఉండాలన్న మీ కోరిక ఎప్పటికీ ఫలించదు అంటారు ప్రముఖ అమెరికన్ టెలివిజన్ ప్రయోక్త ఓప్రా విన్-ఫ్రే. కృతజ్ఞతలోనే విజ్ఞత ఉంది. ఎప్పుడైతే ఎదుటివారి దగ్గర ఏముందో అన్న పరిశీలన ప్రారంభమైందో; వెంటనే మీ దగ్గర ఉన్నదాని పట్ల కృతజ్ఞతను గుర్తు చేసుకోండి. మీ కుటుంబం, మీ అద్భుతమైన స్నేహితులు, ప్రశాంతమైన మీ దేశం తదితర మీ జీవనస్థితిగతులను సానుకూలంగా గుర్తు చేసుకోండి. మీకు లేనిదాని గురించి ఆలోచన మానేసి; మీకున్న దాని మీద దృష్టి పెట్టండి. అది మీ మనశ్శాంతికి దారితీసి, భవిష్యత్తు మీద దృష్టిపెట్టే శక్తినిస్తుంది.
  7. పోల్చుకుని స్ఫూర్తి పొందండి:  ఎవరైనా జీవితంలో అద్భుత విజయం సాధంచినపుడు మనం చేసే ప్రయత్నాలతో పోల్చుకోవడం సహజం. మనం వాళ్ళ విజయం మీదే దృష్టి పెడతాం కానీ, దాన్ని సాధించడానికి వాళ్ళు వెచ్చించిన వేలాది గంటల కష్టాన్ని గుర్తించం. ఎదుటివారి విజయం మిమ్మల్ని నిరుత్సాహపరిచే ఆయుధంలా కాకుండా స్ఫూర్తినిచ్చే సాధనంలా మలచుకోండి. వారి విజయాన్ని మీ అవకాశాలకు తెరచిన ద్వారంలా భావించండి. జీవితంలో మీరు సాధించే విజయాలకు ఎదుటివారి విజయాలను స్ఫూర్తిగా తీసుకుని, మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోండి.
  8. ఇలా చేస్తే బాగుండేది; అలా చేస్తే బాగుండేది: ఒకసారి పోల్చుకోవడం ప్రారంభిస్తేఅరె మనం అలా చేస్తే బాగుండేది; ఇలా చేస్తే బాగుండేదిఅనిపిస్తుంది. ఇటువంటి ఆలోచనలు మన బలహీనతలను బయటపెట్టి నిరుత్సాహపరుస్తాయి. ‘అలా చెయ్యాల్సిందిఅనుకుని బాధపడే బదులునేనలా చేస్తాను, అలా చెయ్యాలనుకుంటున్నానుఅని మనసులో దృఢంగా అనుకోండి. దీనివల్ల మీరు జీవితంలో అవరోధాలను అధిగమించి ముందుకెళ్ళే మార్గం సుగమమవుతుంది.
  9. మీతో మిమ్మల్ని పోల్చుకోండి: ఎవరితోనైనా పోల్చుకోవాలని మీకనిపిస్తే మిమ్మల్ని మీతోనే పోల్చుకోండి. మీ జీవన ప్రమాణాలను పెంచుకోవడానికి ఏం చెయ్యాలనుకుంటున్నారు? ఇంతకంటే మంచి వ్యక్తిగా, ప్రేమాస్పదుడుగా మారడానికి ఏం చెయ్యాలనుకుంటున్నారు? మిమ్మల్ని మీరు నిన్నటికంటే మిన్నగా ఎలా ప్రేమించుకోగలరు? మీతో మిమ్మల్ని పోల్చుకోగల ఏకైక వ్యక్తి, శక్తి మీరొక్కరే!
  10. మంచి కథ చెప్పండి: మీరు మీకు చెప్పుకునే కథ మీకే స్ఫూర్తినివ్వకపోతే ఎలా? మీరో అది ఆశావాదాన్ని నింపలేకపోతే, సాధికారతకు దోహదం చేయకపోతే, మరో మంచి కథ చెప్పండి. ‘నేనెందుకూ పనికిరాను. పని చెయ్యలేను; నాకంత సమర్ధత లేదు’ అనుకునే బదులుకొత్త అవకాశాలెన్నో నా ముందున్నాయి. వాటిని అందిపుచ్చుకునే ధైర్యం నాకుందిఅనుకోండి. గతంలో చేసిన తప్పులకు మిమ్మల్ని మీరు నిందించుకునే బదులునా శక్తిమేరకు నేను చెయ్యగలిగింది చేశాను. దానివలన ఎంతో నేర్చుకున్నాను.’  అన్న విషయం గుర్తుంచుకోండి.

మీదైనది మీ సొంతం చేసుకోండి: ఎదుటివారితో పోల్చుకోవడం మనల్ని బలహీనుల్ని చేస్తుంది. విరక్తి పుడుతుంది. నిలువెల్లా నిరుత్సాహం ఆవరిస్తుంది. మనం జీవించాలనుకున్న జీవితాన్ని అది మనకు దూరం చేస్తుంది. మన కోసం మనం వెచ్చించుకోవలసిన విలువైన సమయాన్ని ఎదుటివారి గురించి ఆలోచిస్తూ వృధా చేస్తాము. దీనివలన మన భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన సమయం ఎదుటివారి ఆలోచనలతో ఆవిరైపోతుంది. ఎదుటివారి గురించి ఆలోచించడమంటే మన శక్తిని వారికోసం ధారపోయడమే. ఒక్క నిముషం మీరు ఎదుటివారి గురించి ఆలోచించినా, ఒక్క నిముషం మీ భవిష్యత్తు నిర్మాణంలో మీరు కోల్పోయినట్టే.

మీరెక్కడ వదిలేశారో అక్కడనుండి మళ్ళీ ప్రారంభించి మీ శక్తిని పుంజుకోండి. మీరు ఆలోచించిన మనుషులు, ప్రాంతాలు, సంఘటనల నుంచి మీ శక్తిని తిరిగి తెచ్చుకోండి. మీ శక్తిని మీ ఆత్మవిశ్వాసం పెంచుకోవడంలో వినియోగించండి. మిమ్మల్ని మీరు సందేహించుకోకండి. మరింత సృజనాత్మకంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి. స్వీయ విధ్వంసక నిర్ణయాలకు చరమగీతం పాడండి. మీరు జీవితంలో సాధించాలనుకున్న విజయ శిఖరాల మీద గురి పెట్టండి. మీ భవిష్యత్తు మీద దృష్టి సారించండి. ఎందుకంటే అది మీ భవిష్యత్తు. మీ భవిష్యత్ విజయోత్సవాలకు విత్తు!

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

1 comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.