ఒక పరీక్షలు…

చెప్పండి…

మీరే చెప్పండి…

వర్షాకాలంలో వర్షాలు కురుస్తున్నాయా?

ఎండాకాలంలో ఎండలు కాస్తున్నాయా?

చలికాలంలో చలి వేస్తోందా?

నాన్నగారు ఆఫీసు నుంచి టైముకే ఇంటికి వచ్చేస్తున్నారా?

అమ్మ పక్కింటి ఆంటీలతో పెట్టే మీటింగు గంటసేపట్లోనే క్లోజ్ చేసి వచ్చేస్తోందా?

అన్నయ్య క్రికెట్లో పోని అవుటవగానే బుద్దిగా ఇంటికి వచ్చేస్తున్నాడా?

తాతయ్య టైంకు మందులు వేసుకుంటున్నారా?

సూర్యుడైనా సరే, టైంకు… టైమంటే టైంకు… రోజూ ఆరుగంటలకే ఉదయించేస్తున్నాడా?

చీకటి పడగానే అయ్యో అని ఆకాశంలోకి చంద్రుడు వచ్చేస్తున్నాడా?

కుళాయిల్లో నీళ్ళు కూడా టైంకు రావు…

సిటీ బస్సులు కూడా టైంకు రావు…

అంతెందుకు, మా క్లాసు టీచరు కూడా బెల్లవగానే క్లాసుకు రారు…

ఇంకో విషయం… మావయ్య రోడ్డు సైడు రోమియోలా ఎంత వెయిట్ చేసినా జీన్స్ జూలియట్ టైంకు వస్తుందా?

పోనీ, మనం హోటలుకు వెళ్ళి ఐస్ క్రీమ్ ఆర్డరు ఇచ్చామే అనుకోండి, వెంటనే ఐస్ క్రీమ్ వస్తుందా? వచ్చినా అది మనం తిన్నంత సేపయినా కరిగిపోకుండా వుంటుందా?

చెప్పండి…

మీరే చెప్పండి…

ఏదైనా అనగానే అయిపోతుందా? అన్న టైంకు అయిపోతుందా? మరి మాష్టారు ఇలా పాఠం చెప్పగానే అలా వచ్చేయాలా?

ప్రశ్న జవాబులు చెప్పెయ్యగానే కంఠస్థము చేసెయ్యాలా?

బిట్లన్నీ బట్టీ పట్టెయ్యాలా?

రోజూ పరీక్షలు పెట్టెయ్యాలా?

పెట్టిన పరీక్షల్లో నూటికి నూరు మార్కులూ తెచ్చెయ్యాలా?

ఫస్ట్ మార్కు కొట్టెయ్యాలా?

ఏ గ్రేడూ ఎక్సులెంటూ వచ్చెయ్యాలా?

ఒక పరీక్ష కాదు, యూనిట్ టెస్టులు నాలుగు. నాలుగు ఎగ్జామ్స్. తెలుగు పద్యభాగమూ గద్యభాగమూ. ఇంగ్లీషులో పోయెట్రీ అండ్ ప్రోజ్. సోషల్లో భౌగోళిక శాస్త్రమూ చరిత్రా పౌర శాస్త్రమూ ఆర్ధిక శాస్త్రమూ (జాగ్రఫీ హిస్టరీ, సివిక్స్ అండ్ ఎకనామిక్స్). ఇంకా సైన్సులో ఫిజిక్సూ కెమిస్ట్రీ బయాలజీ జువాలజీ (భౌతిక శాస్త్రమూ రసాయనిక శాస్త్రమూ వృక్ష శాస్త్రమూ జంతు శాస్త్రమూ) పరిసరాల విజ్ఞానంలో- వన్నూ టూలో ఇవన్నీ వచ్చేస్తాయి. మేథ్స్ లో అర్థమెటిక్కూ స్టేటిటిక్సూ రూట్లూ జామెట్రీలూ గ్రాఫులూ  ట్రిగ్నోమేట్రీలూ ఆల్జీబ్రా గుండె గాబరాలూ… లెక్కల్లో లెక్కలకు అందనన్ని ఉన్నాయ్. ఇంకా హమ్ తుమ్ కాసర బీసర హిందీ… మొత్తం ఆరు సబ్జెక్టులు… ఆరు నాలుగుల ఇరవైనాలుగు టెస్టులు… యూనిట్ టెస్టులే ఇరవైనాలుగు!

ఇవే కాదు, క్వార్టర్లీ… సిలబస్ అయినంత వరకు. ఆఫ్యర్లీ… సిలబస్ అయినంత వరకు. యాన్వర్లీ… సిలబస్ అయినా అవకపోయినా- అవకపోవడమేమిటి? రివిజనూ ఉంటేను. మొత్తం సిలబస్… మొత్తం పాఠాలు.. ఆరు సబ్జెక్టులు… ఆల్ టెక్స్ట్ బుక్కులు… క్వార్టర్లీ ఆఫ్యర్లీ యాన్వర్లీ మూడార్ల పద్దెనిమిది పేపర్లూ.. పద్దెనిమిది వందల మార్కులు…

పరీక్షల్లో లేనివి… లేకుండా పరీక్షించేవి… జీకే జనరల్ నాలెడ్జ్- ఇందులో డిస్కవరీ మొదలు కరెంటు ఎఫ్ఫైర్స్ వరకూ అన్నీ వుంటాయి. ఉండనీ. చాలదన్నట్టు కంప్యూటర్ నాలెడ్జ్ ఎగ్జామ్…

అన్నట్టు పర్సనాలిటీ డెవలప్మెంట్. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో- ఇదీ ఓ పరీక్షే. పేద్ద పరీక్ష. తడబడకుండా మాట్లాడాలి. మాట్లాడినా గొంతు పెద్దగా ఉండకూడదు. చిన్నగా ఉండకూడదు. పొ‘లయిట్’గా ఉండాలి. డీ‘సెంటు’గా ఉండాలి. మేనర్స్ ఉండాలి. గట్టిగా తుమ్మ కూడదు. గట్టిగా దగ్గ కూడదు. గట్టిగా నవ్వను కూడా నవ్వకూడదు. కోపమొచ్చినా సరే నవ్వాలి. ఏడుపుగొట్టు నవ్వయినా నవ్వాలి. మనమెలా ఉండాలో అలా ఉండకూడదు. ఎప్పుడూ మాస్క్ వేసుకోవాలి. మనం మనలా ఉండకూడదు. దటీజ్ పర్సనాలిటీ డెవలప్మెంట్.

అన్నట్టు పెద్దన్నయ్య వాళ్ళకు ఇవన్నీగాక హెరిటేజ్ అండ్ కల్చర్ ఎగ్జామట.

సారీ మర్చిపోయాను… అసలు ఫోకస్ పెట్టాల్సిన పరీక్షలు… ఐఐటీ-జేఈఈ, ఏఐ త్రిబుల్ ఈ, ఎయిమ్సూ, నీటూ… అన్నిటికీ ఇప్పటి నుంచే బేసిక్ ఫౌండేషన్ కోర్సులూ… వాటి మీద పరీక్షలూ… మావాడు ఐయ్యేస్ అయిపోవాలని మమ్మీ డాడీ అడగడం… యస్ దానికీ మా దగ్గర మంత్రం ఉందన్నట్టు పాఠాలు చెప్పేయడం పరీక్షలు పెట్టేయడం…

మాది అందర్లా షార్ట్ టర్మ్ కోచింగూ కాదు, లాంగ్ టర్మ్ కోచింగూ కాదు, లాంగ్ లాంగ్ లాంగేస్ట్ కోచింగన్నమాట! ఆరో తరగతి నుంచే ఆరంభం… భం… భం… భమ్! ఏడేళ్ళు తోముడూ రుద్దుడూ!

వీకెండ్ టెస్టులు ఉంటాయి. ఆ వారం అయిన పాఠాలన్నీ చదివి రాయాలి!

డైలీ టెస్టులూ ఉంటాయి. ఏ రోజు జరిగిన పాఠాల మీద ఆరోజే పరీక్ష!

రోజుకొక పరీక్ష కాదు, రోజూ పరీక్షలే! ప్చ్… పరీక్షలు పెద్ద పరీక్ష అయిపోయాయి!

జీవితమే పెద్ద పరీక్షయిపోయింది- అని నాయనమ్మ అంటుందే- అలాగన్నమాట!

పోన్లే ఇవన్నీ పిల్లలు చచ్చినట్టు చదువుతున్నారు పరీక్షలు రాస్తున్నారు అని అక్కడితో ఆగరు. ఎవరెవరో వస్తారు. వాళ్ళ వాళ్ళ ఆర్గనైజేషన్స్ చెప్తారు. స్టేట్ లెవల్. నేషనల్ లెవల్. ఇంటర్నేషనల్ లెవల్. అని చెప్పి పరీక్షలు పెట్టేస్తారు. ఫీజులు వసూలు చేసేస్తారు. బాగా చదివిన వాళ్ళకే అంటారు. ప్రెస్టేజియస్ ఎగ్జాం అంటారు. బ్రాండెడ్ క్లాత్స్ లాగ బ్రాండెడ్ ఎగ్జామ్స్. ముందు ఆసక్తి ఉంటేనే అంటారు. అమ్మానాన్నా రెడీ అయిపోతారు. ఎంట్రీ ఫీజు కట్టేస్తారు. ఎంట్రుకలు పీకేస్తారు. అలా ఇంగ్లీషు కేపబులిటీకీ ఎగ్జామే. ఇంటలిజెన్సుకీ ఎగ్జామే. ఒక్కరికెవరికో మెడలిచ్చి మా మెడలు వంచుతారు. ఒక్కరికి సర్టిఫికేటు ఇచ్చి అందర్నీ చంపుతారు.

ఇవికాక-

మోడల్ టెస్టులు!

ప్రైజు మనీ! ఫ్రీ సీటు! ఏడేళ్ళ దాక మాదే పూచీ. ఖర్చుల బూచీ లేదని అమ్మానాన్నా ఫస్ట్ వచ్చీమంటారు. అంతా అదృష్టమా- అంటారు. అయినదానికీ కానిదానికీ తిడతారు. నిద్ర పోరు. నిద్ర పోనివ్వరు. ఒకటే పోరు. చదువు… చదువు… చదువు… అమ్మానాన్నా జబ్బయిపోయి మమ్మల్ని జబ్బు చేయించేస్తారు. తిరిగి మీ వల్లే జబ్బయిపోయామని అంటారు. ఊళ్ళో పొలం మీ చదువులకోసమే అమ్మేసామనీ అంటారు. అలాంటప్పుడు కాలేజీ చదువుల వరకూ ఫ్రీ సీటంటే పోటీ మామూలుగా ఉండదు. కుస్తీపోటీలకంటే గట్టిగా ఉంటుంది. పోటీలో గెలిచినా గెలవకపోయినా దెబ్బలయితే తప్పవు.

అందుకే అన్నీ అచీవ్ అవ్వాలంటే- ట్యూషన్లోనూ ఎగ్జామ్స్… ప్రవేటు పరీక్షలు ప్రవేటు మాష్టార్లు పెట్టేస్తారు.

ఇంట్లో ఇంట్రెస్టు ఎగ్జామ్స్… హోం పరీక్షలు… ఇంటిల్లిపాదీ అంటే అమ్మా అక్కా అన్నయ్యా లేదా అక్కా బావా మావయ్యా అందరూ పరీక్షలు పెట్టేస్తారు.

అంతేనా ఇంటికొచ్చిన చుట్టాలూ బంధువులూ స్నేహితులూ ఎవరొచ్చినా సరే- ‘ఒరేయ్’ అని పిలిచేస్తారు. క్వశ్చన్స్ అడిగేస్తారు. పేపరిచ్చేస్తారు. పరీక్షలు పెట్టేస్తారు. మార్కులిచ్చేస్తారు. పనిష్మెంట్లు ఇచ్చేస్తారు. ప్రవేటు క్లాసులు చెప్పేస్తారు.

ఎవరికి కనిపించినా ఎగ్జామే! ఎక్కడ కనిపించినా ఎగ్జామే! ఎప్పుడు కనిపించినా ఎగ్జామే! కనిపిస్తే చాలు కాల్చివేతలా ఎగ్జామే! ఎగ్జామే!

ఏంటి బాబూ… నీ పేరేంటీ?- అంటారు. చెప్పామా, ఆ పై ఏం చదువుతున్నావూ?- అంటారు. అదీ చెప్పామా, మీ క్లాసులో ఎవరు ఫస్టూ?- అంటారు. మీ స్కూల్లో ఎవరు ఫస్టూ?- అంటారు. మనం చెప్పక ముందే మన అమ్మానాన్నా ఆన్సర్ ఇచ్చేస్తారు. నువ్వెందుకు ఫస్టు రాలేదూ?- అంటారు. ఏ సబ్జెక్టుల్లో డల్లుగా ఉన్నావూ?- అంటారు. ఎందుకు డల్లుగా ఉన్నావూ?- అంటారు. మా వాడికి ఆట మీద తప్ప చదువు మీద ద్యాస లేదు- అమ్మ అంటుంది. మధ్యలో అటు అడిగిన వాళ్ళూ ఇటు నాన్నా క్రికెట్ స్కోరు ఎంతయింది?- అని కనుక్కోకుండా మాత్రం ఉండరు! వాళ్ళ తాతా నాయినమ్మల ముద్దు ఎక్కువైపోయింది- అమ్మ చెపుతూనే ఉంటుంది. పిల్ల ముద్దా? చదువు ముద్దా? భాగ్యం ముద్దా?- అని వాళ్ళెవరో మనల్ని హక్కుగా తిట్టేస్తారు. బుద్దులూ సుద్దులూ చెప్పేస్తారు. ఎవరికి తోచింది వాళ్ళు ‘క్లాసులు’ పీకేస్తారు!

చెల్లి పాపం చిన్నది కదా?- అని కూడా చూడరు. రైల్లో ఉన్నామా?- బస్సులో ఉన్నామా?- కిటికీలోంచి చక్కగా నేచర్ చూస్తున్నామా?- అని కూడా చూడరు. అందరూ మా‘స్టార్లు’ అయిపోతారు. చెల్లికయితే రైల్లోనే డిక్టేషన్ చెప్పేస్తారు. లెక్కలిచ్చేస్తారు. క్వశ్చన్స్ వేసేస్తారు. పద్యాలు అప్పజెప్పించేసుకుంటారు. రైలు ఆపమన్నట్టు అరచినా ఆగరు. టైం ఎంతయిందోనని కూడా చూడరు. వేళాపాలా లేకుండా వెర్రి వెర్రి ప్రశ్నలన్నీ వేసేస్తారు. చెప్పేస్తే వెరీగుడ్ అంటారు. చెప్పలేకపోతే వెరీబ్యాడ్ అంటారు. పూర్ అంటారు. రైల్లో టికెట్ ఎగ్జామినర్ ఒక్కడే ఉండడు. ఒక్కొక్కడూ ఒక్కో ఎగ్జామినర్. ఏ ఎగ్జామినర్ ఎప్పుడు ఎక్కుతాడో… ఏ ఎగ్జామినర్ ఎప్పుడు దిగుతాడో తెలీదు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎగ్జాం పెట్టేస్తారో తెలీదు.

లాస్టుకు ఊరెళ్ళినా అంతే!

సెలవుల్లో గాలి పట్టి పోకుండానట. అమ్మానాన్నే అరేంజ్ చెయ్యక్కర్లేదు. అక్కడా ఎగ్జామినర్స్ రెడీగా ఉంటారు. అందరూ క్లాసులు తీసుకొనే మాస్టార్లే! సమయముండదు. సందర్భముండదు. తప్పు రాస్తే వీళ్ళదేం పోయిందీ… టెన్ టైమ్స్ కాదు, ఏకంగా హండ్రెడ్ టైమ్స్ రాసేయమంటారు. మళ్ళీ లైఫ్లో మరచిపోవంటారు. అక్కడితో ఆగరు చెప్పింది చేయలేదని లెక్క చేయలేదని గుంజీలూ గోడ కుర్చీలూ నీల్ డౌన్లూ… హు… ఒకటా?

సరే,

ఈ ఫనిష్మెంట్లూ పరీక్షలూ ఎప్పటి వరకు?

వేసవి సెలవుల వరకే!

‘యా’ అని ఎగిరి గంతేద్దామంటే- ఆ అవకాశమూ లేదు! లేనే లేదు!

సమ్మర్ క్యాంప్స్!

సమ్మర్ స్పెషల్ కోచింగ్స్!

మేథ్స్… సైన్స్… ఇంగ్లీష్…

ఎందులో వీకో అందులో తర్ఫీదన్నమాట!

వీకని ఒక్కో టెస్టూ పెట్టరు! డైలీ టెస్టులే!

పరీక్షలే పరీక్షలు!

టైమ్లీగా రాయాలంట! టైమ్లీ చదవాలంట! అంతా టైమ్లీ… టైమ్లీ… మొక్కై వంగనిది మానై వంగదట! (అప్పటికీ వంచి చూసా. మొక్క వంగలేదు. విరిగిపోయింది. మా పెరట్లో మొక్కని ట్రై చేశాను)

ఏదైనా టైం టు టైం అంటారు అమ్మానాన్న.

నన్ను నేను చూసుకుంటే ATM మిషనులాగుంటాను. నా తోటివాళ్ళూ నాలానే నాకు కనిపిస్తారు. ATM మిషను కూడా అడిగిన వెంటనే- కార్డు పెట్టిన వెంటనే- డబ్బు రాదు. ఇవ్వదు. ఒక్కోసారి పని చెయ్యదు. మొరాయిస్తుంది. ఔన్లే మిషనుల్లా మనుషులు… పిల్లలు మొరాయిస్తే ఎలా?

మర్చిపోయాను. మొన్న చేపల మార్కెట్టుకు వెళుతున్నప్పుడు పక్కింటి అంకుల్ క్వశ్చన్స్ వేసి ఎగ్జాం పెట్టేసాడు. రోడ్డు మీద పరీక్ష రాశా. చేపల మార్కెట్టులో పరీక్ష రాశా. నాకు కాన్సంట్రేషన్ లేదన్నాడు. వేస్టన్నాడు. మీ అమ్మానాన్నలకి డబ్బు వేస్టు- అని రిజల్స్ కూడా ఇచ్చేశాడు!

అప్పటికీ ఎక్కడ ఎప్పుడు పరీక్ష పెట్టినా రాసెయ్యడం అలవాటు చేసుకున్నాను. అప్పుడూ ఫస్ట్ క్లాస్ కాదు… ఫస్ట్ మార్కు తెచ్చుకోవాలి- ఫస్ట్ ర్యాంకు తెచ్చుకోవాలి- అలా తెచ్చుకోకపోతే ఎవరైనా ఏదైనా అనొచ్చు. తిట్టొచ్చు. కొట్టొచ్చు. ఇదంతా పిల్లలమీద ప్రేమతోనే అని మీకు మీరు సరిపెట్టుకోవచ్చు.

కానీ… ప్రతిసారీ ఫస్ట్ రావాలంటే వస్తుందా?

ప్రతి టైమూ పరీక్షల్లో ఫస్ట్ వస్తుందా?

ఒక రోజు కాదు!

ఒక పరీక్ష కాదు!

మూడు వందల అరవైయ్యయిదు రోజులూ-

వందలు కాదు, వేల వేల పరీక్షలు!

ఇంటా బడీ బయటా కలిపి లక్షల పరీక్షలు!

అన్ని పరీక్షల్లో- అన్ని టైముల్లో- అన్న టైంకల్లా- మీకైనా ఆ దేవుడుకైనా ఫస్ట్ వస్తుందా?

చెప్పండి…

మీరే చెప్పండి…

-మహేశ్వర్రావు,

ఏడవ తరగతి,

చైతన్య టెక్నో స్కూల్స్.

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

1 comment

  • హః అహహ్హ-ఆహాహ్హ్- పిల్లల బాధ- ఏది నిజంగా సమయాన్ని ఫాలో అవ్వవు కానీ పరీక్షలు మాత్రము

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.