కవి విల్లులో ఎనిమిదో రంగు!

కవుల్లో ఎపుడూ రకాలుంటారు. వూహలల్లో నేల విడిచి, జనం గోసని విస్మరించి రాసే వాళ్లొకరకం. వీళ్లకి కవిత్వం కాలక్షేపం, పూర్తిగా వైయక్తికం. వీళ్లకి కాలం పట్టదు. కళ్లముందటి సంఘం పట్టదు. సంఘంలోనే వుంటూ, దాన్ని స్పృశించని కవులు ఏ కాలంలోనైనా తారసపడతారు. అలాగే కళ్లముందరి సమాజాన్నీ, అందులోని జనాన్నీ, అసమానతల్నీ చూసి, చలించి కవిత్వం రాసేవాళ్లు ఇంకో రకం. వీళ్లకు కాలికస్పృహ ఎక్కువ. ఆ కాలానికి అవసరమైన వాటినే బాధ్యతగా రాయడంలో తన్మయిస్తారు. ఈ పంథాకి చెందిన వర్తమాన వర్థమాన కవి అనిల్ డ్యానీ. ఇతడు ఇటీవల “ఎనిమిదోరంగు”తో వచ్చాడు. సప్తవర్ణాలను దాటి కొత్తవర్ణంతో కవిత్వాన్ని మెరిపించాడు. వస్తువైవిధ్యంతో, కళాత్మకతతో సామాజికవాస్తవికతని చిత్రించిన సంపుటిలోని కవితల్ని పరిశీలిద్దామిపుడు!

పుస్తకంలో ఇబ్బడిముబ్బడిగా కవితలసంఖ్యలేదు. కేవలం 37 ఖండికలతో వచ్చిన ఈ పుస్తకం సహృదయుల మన్ననకు పాత్రమైంది. కారణం అనిల్ డ్యానీ కవిత్వాన్ని కవిత్వంగా కూర్చడమే గాక, సమాజాన్ని మార్చగలిగే అక్షరాల్ని పుస్తకంలో చేర్చడమే! సహజంగా ఇతడు కవిత్వ పక్షపాతి. ఆర్నెల్లకు లేదా ఏడాదికి ఒక్కటి రాసినా కవిత్వంగానే రాయాలనే నిష్ఠ కలిగిన వాడు. ఇక సంపుటిలోని వస్తుసంచయాన్ని గమనిస్తే మంచి వైవిధ్యం వుంది. యుద్ధ నిరసన, స్త్రీల పట్ల సానుభూతి, దళిత,బహుజనుల మేలుకొలుపు, సమకాలీన సంఘటనాత్మకత, మానవీయత, సామాజికత, తాత్వికతల మేళవింపు “ఎనిమిదోరంగు”.

తానెందుకు కవిత్వం రాస్తున్నాడో ఈ కవికి స్పష్టంగా తెలుసు. తానెందుకు కవిత్వంతో సమాజాన్ని “పహారా” కాస్తున్నాడో కూడా నికరంగా తెలుసు.

“గతం చెబుతుంది నీకు చీకటి మామూలేనని/ నేనేమో రేపటి వెలుతురు కోసం/ ఈ పర్వత సానువుల మీద నుంచుని కాలానికి పహారా కాస్తున్నాను”. ఈ పాదాల్లో కవి “రేపటివెలుగు” కోసం కవిత్వంతో వచ్చానని అంటున్నాడు. ఆ వెలుగులేవో,ఎందుకో అన్నది ఇప్పుడు చదవండి.

“కొన్ని యుద్ధాలలో ఆయుధాలుండవు/ ఊరికి పొలిమేరకి మధ్యన అంతరాలుంటాయి/ నడివీథుల్లో తిరగొద్దనే ఆంక్షలుంటాయి/ పళ్లెంనిండా పరచుకున్న ఆహారాన్ని తన్నుకెళ్లే గద్దలుంటాయి/ మాటలే మనుషుల్ని పశువుల్లా అదిలిస్తాయి”. అందుకనే గతమంతా చీకటిగాక మరేమిటీ అని ప్రశ్నిస్తున్నాడు. మరందుకే..”చీకటి మింగేసిన వెలుతురు చరిత్రల/ గుట్టు విప్పుతుంది పావురం”. ఇంతకీ కవి భుజంపై వాలి, గుట్టు విప్పే పావురం ఏదో కాదు అతడి కవిత్వమే.

“ఇక చెట్లు వీయాల్సింది మార్పుగాలి/ చిట్ట చివరి గుడిసెముందు పాతిన/ వెలుగుచెట్టు కథని ముందుతరాలు/ వెనక్కొచ్చి చదువుకుంటాయి” అని బలంగా చెబుతూనే,

“పహారా కాయడమంటే/ పల్లేరుగాయల దార్లని చీల్చి/ కొత్త దార్లను వేయడమే/ వెలుతురున్న చోట దేహాలు తలెత్తుకు నిలబడతాయి/ ఊరు మొత్తం ఎప్పుడైనా ఒక్కటవుతుందని/ బొడ్రాయి కాడ డప్పుకొట్టి చెప్పడానికెళుతున్నా”. ఈ మాటల్లో అనాదిగా దళిత బహుజనుల పట్ల జరిగే వివక్షను, వాళ్ల శ్రమని దోచుకునీ, వాళ్లకు ప్రగతి ఫ్లలాలు దక్కనీయని సామాజిక దుష్టశక్తులపై కవిత్వాన్ని అస్త్రంగా ఎక్కుపెట్టాడు. ప్రతి వాక్యమూ తన కవితా దృక్పథమేంటో తేటతెల్లంచేస్తుంది.

సమకాలంలోని అకృత్యాలకూ, దుర్మార్గాలకు కదిలేవాడే గొప్పకవి. మంచికవి. అనిల్ ఆ బాటలో నడిచేవాడే. గౌరీలంకేష్ హత్యోదంతంపై ఖండన రాశాడు. “మొదలు పెట్టాక ఎంత నష్టమైనా కొనసాగాల్సిందే/ ప్రాణం పోతుందని తెలిసినా విరిగి పడాల్సిందే/ ఇమడలేని చోట విగ్రహంలా నిలబడటం కన్నా/ మరో ప్రశ్నలా మొలకెత్తడం మేలు/  ఇప్పుడు విరిగిపడటం ఒక సామూహిక సంవేదన” అంటూ అన్యాయంపై, దురాగతంపై వుద్యమించాల్సిన ఆవశ్యకతను వాక్యవాక్యంలో నూరిపోశాడు. ఇంకా కులసర్పానికి బలైన రోహిత్ వేముల సంఘటనపైన, ర్యాంకుల పోరాటంలో అశువులు బాసే విద్యార్థుల ఆత్మహత్యల మీద తన కవిగా తన నొప్పిని తెలియజేశాడు. నదులు పంట పొలాలను ఒరుసుకుని ప్రవహించినట్టుగా. అనిల్ డ్యానీ తన కవితానదిని సమాజ క్షేత్రాలను ఆనుకునే పరవళ్లు తొక్కించాడు. యథార్థత భూమికపై ప్రత్యక్షరాన్నీ, పుటలనీ పూరించాడు. ఇప్పుడు సాంకేతికత వెర్రి వూడల మర్రిలా జనంలో పాతుకుపోయింది. జీవితాలు కృత్రిమంగా తయారౌవుతున్న విచిత్ర, విస్మయ, విపరీత పరిస్థితులు. మనిషికి మనిషికీ మధ్య మౌనం తాండవమాడుతోంది. రైతుమరణాలు, కులవివక్షలూ,  కక్షలూ, ఒంటరితనాలు సతాయిస్తున్నా గొంతులు లేవడంలేదు. కనుకనే కవి “ఈ మౌనం మంచిది కాదు” అనీ కవితాగంట మోగించాడిలా…!

“మనుషులమధ్య మనసులమధ్య/ ఎప్పటికీ ముగిసిపోని/ సంభాషణొకటి కావాలి తోటి మనిషిని/ ఆలోచింపజేసే సంభాషణ కావాలి/ అవును ఇప్పుడు మౌనం పెంచే/ సాంకేతికతను తుడిచేసే/ ఒక యాంటివైరస్ కావాలి/ కనీసం నీకు నువ్వు దొరికే వరకైనా/ నీలో నువ్వు సంభాషించు”. సామాజికంగా ఏది వాస్తవమో అదే అనిల్ కవితావస్తువైంది.

ఏ కవి ప్రతిభైనా ముందు తెలిసిపోయేది కవితాశీర్షికల్లోనే! అనిల్ కవితాత్మకంగా, ప్రతీకాత్మకంగా ఒడుపైన, పదునైన శీర్షికల్ని నిర్ణయించడం విశేషం. ఒక వ్యథాభరిత స్త్రీ జీవితాన్ని గురించి రాస్తూ” ఆమె— రాత్రి చందమామ” అంటాడు. రహదారి పక్కన చీకటి కప్పుకున్న జీవితాల్ని “ఒంటిరెక్క పక్షులు” అన్నాడు. కార్పోరేటు విద్యాశాలల్లో బద్దలయ్యే విద్యార్థుల బతుకుల్ని “గాజుదేహాలు”గా సంకేతించాడు. కవితల శీర్షికలు కవితను చదవాలని మనసుని లాక్కునేలా చేయగలవన్న సత్యాన్ని పాటించాడు.వీటితో పాటు రాసిన ప్రతివాక్యమూ కవిత  మూడ్ లోకి తీసుకెళ్లేలా అమరింది అనిల్ చేతిలో! పక్కదారి పట్టకుండా వస్తువుని ఆవిష్కరించే పదచిత్రాలను, వాక్యరీతిని సమర్థంగా నిర్వహించాడు. అనేకానేక వాక్యాలు గుర్తుపెట్టుకునేవీ, కదిలించేవీ, మేల్కొలిపేవీ, సమాజానికి మేలు చేసేవీ చాలానే అందించాడు. కొన్నింటిని గ్రహించండి.

1.”కొంత మట్టిని తీసుకుని ఒకబొమ్మని చేయండి/ కళ్లు ముక్కు చేతులు కాళ్లూ సరిగ్గా అమర్చి/ కొంచెం ఎవరినైనా అడిగి రక్తమూ ఇవ్వండి/ ప్రాణం ఎలా పోయాలో ఆలోచించకండి/ ఎందుకంటే మీకు మనుషులు అక్కరలేదు/ బొమ్మలు కావాలి/ తలలూపే బొమ్మలు కావాలి”(వ్యంగ్యవైభవం)

2.”దేశమంటే నిజంగా మట్టి కాదు/ దేశమంటే ఏడుపులూ రోదనలూ”( ఆసక్తికరమైన ఎత్తుగడ)

3.”తెల్లారొచ్చిన సూర్యుడి వెలుగంతా/ ప్రపంచ తల్లులు స్రవించిన రక్తం” (ముగింపు మేలిమి వాక్యం)

4.”తలొంచుకుని మాటలు కలుపుకోకుండా/ఎడం ఎడంగా నడుస్తున్న మృతదేహాలు”(కోసేలా ధ్వని)

ముచ్చటించుకోవాలే గానీ అనిల్ కవిత్వంలో విలువైన, బలమైన,అదునున్న,పదునున్న వ్యక్తీకరణలు చాలా వున్నాయి. “ఎనిమిదో రంగు” అన్నప్పుడే ఆకర్షించాడు. ఇంద్రచాపంలో లేని నల్ల నీల వర్ణాన్ని జెండాగా, కవితా ఎజెండాగా ఎగరేసినపుడే అతడి ప్రతిభ వెల్లడయ్యింది. “ఎనిమిదో రంగు” చదివాక ఆలోచనల్లోకి దింపే రచన. సరైన నిర్మాణ వ్యూహంతో కవితల్ని నడిపి, సామాజిక వాస్తవికతని ప్రతిఫలింప జేసిన రచన. నారుమడులు పోసేకాలంలో వానలు కురిస్తే ఎంత ఉపయోగమో, సమాజంలోని  చెడునీ ప్రక్షాళన చేయాల్సి వచ్చినపుడు కవిత్వం వానలు పడితేనూ అంతే ప్రయోజనం. అనిల్ డ్యానీ రాసిన, మనసుగోడలపై పూసిన “ఎనిమిదో రంగు” అలాంటి ప్రయోజనాన్నే సాధించింది. మంచి కవితా భవిష్యత్తున్న కవికి మనసారా అభినందనలు.

మెట్టా నాగేశ్వర్రావ్

మెట్టా నాగేశ్వర్రావ్ గోపాల పట్నం జిల్లా పరిషత్ హైస్కూలులో తెలుగు పండితుడిగా పని చేస్తున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లో చదువుకున్నారు. ‘మనిషొక పద్యం’ పేరుతో వెలువరించిన కవితా సంపుటితో కవితాలోకానికి పరిచయమయ్యారు.

4 comments

  • అనిల్ కవిత్వం గురించి మంచి ప్రయత్నం. ఇంకాస్త విపులంగా రాయాల్సింది. మన తరంలో కావల్సిన వాడు. అతని సాహిత్య నడకలో మనం భాగమవడం అదృష్టమే. అయితే అనిల్ పద్యాల్లో నిడివి నాక్కనిపించే పెద్ద సమస్య. ఇంకాస్త బ్రెవిటీ సాధించగలడు.
    ప్రతీకల సంగతి చెప్పక్కరలేదు. తన క్రియేటివిటీ అంత బాగుంటుంది.

    కలసి వేయాల్సిన ముందడుగులకి అతనికి సలాం చేస్తాను. నీకు మాత్రం అభినందనలు. గుడ్ ఎఫర్ట్

  • అనిల్ కవిత్వం సరళ గాంభీర్యం. సమాజ దర్పణం. సంక్షుభిత హృదయ శకలం.

  • ఎనిమిదో రంగు” చదివాక ఆలోచనల్లోకి దింపే రచన. సరైన నిర్మాణ వ్యూహంతో కవితల్ని నడిపి, సామాజిక వాస్తవికతని ప్రతిఫలింప జేసిన రచన

    అద్భుతమైన కవికి విశిష్టమైన వ్యాసకారుడి విశ్లేషణ

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.