పండుగలూ ఎన్నికలూ

అమావాస్య రాత్రి.

చీకటికి రంగులు వేసినట్లు వెలుగు చారికలు.

బజారు బజారంతా కోలాహలం. ఇళ్ళ ముంగిళ్ళలో నిలబడి కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లు, తారా జువ్వలు పేలుస్తున్నారు. పిల్లలు పెద్దాళ్ళు హడావిడిగా తుళ్లి తుళ్లి నవ్వుతున్నారు.

మరి, నేనూ ఇంకొకరం ఏం చేస్తున్నాం?

దీపావళి పండగ కథ గురించి ఆలోచిస్తున్నాం.

కృష్ణుడు అనే రాజు నరకాసురుడు అనే రాజును చంపేస్తే  ఆ ‘వధ’ను పండగ చేసుకుంటున్నట్లు కథ. దానిలో మనమెందుకు పాల్గొంటాం?

ఠాట్,  పాల్గొనం. బాయ్ కాట్. గర్ల్ కాట్.

పాల్గొనకుండా ఏం చేస్తాం?

ఏం చేయం. ఊరుకుంటాం.

ఊరికే వుండలేకపోతే ఏం చేస్తాం? నిరసిస్తాం!

నిరసనగా మన వొళ్ళు మనం తగలబెట్టుకుని వెలుగులు విరజిమ్ముతాం.

అలా వెలుగుల కోసం మరణించాలని లేకపోతే… ఎవురింట్లో వాళ్ళం, ఎవరి అమావాస్య చలి చీకటిలో వాళ్ళం ఎవరి దుర్భర నిశ్శబ్దంలో వాళ్ళం ముడుచుక్కూర్చుంటాం.

ఎందుకంటే మనం ప్రగతిశీల పవితృలం. ప్రగతి భావన పూజారులం. భట్టీయం వేసిన ప్రగతి మంత్రాల్ని భక్తి ప్రపత్తులతో వల్లె వేసే కొత్త పురోహితులం.

అంతేనా? మన పని అంతేనా??

పండగల వెనుక కథలను మార్చి వాటిని ప్రజాపరం చేయలేమా?

పండగలు నిజానికి రుతువుల సెలబ్రేషన్లు. వాటి నుంచి మనం దూరమైతే వాటి నుంచి ప్రతీప శక్తులను దూరం చేసేదెవరు?

బియ్యం లోంచి రాళ్ళు ఏరేస్తామా? రాళ్ళున్నాయని బియ్యమే పారబోస్తామా?

నేను మరొకరే కాదు… ప్రతి ప్రగతిశీలిని ఈ విచికిత్స ఒక్క పండగనాడైనా తొలిచి వుంటుంది. ఎవరి కోసం ఈ స్వయం బహిష్కరణ? ఎందుకు ఈ సెల్ఫ్ ఎగ్జైల్? ప్రవాహం నుంచి వేరుపడి చిన్ని చిన్ని గుంటల్లో నాచు పట్టడమెందుకు? ఆపై, నా గుంట బాగుందంటే నా గుంట బాగుందని కొట్టుకోవడమెందుకు?

***

సంస్కృతిలో భాగం పండుగలు.

సంస్కృతికి ఆధునిక నామం ‘పౌరసమాజం’ (సివిల్ సొసీటీ).

పౌరసమాజం మీద మన వైఖరియే రాజకీయ సమాజం (పొలిటికల్ సొసైటీ) మీద వైఖరిలోనూ వ్యక్తమవుతుంది. వ్యక్తమవుతోంది.

అది ఎట్లన్నన్…

ఉదాహరణకి ఇప్పుడేం జరుగుతున్నది?

ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒకటే గోల. ఎన్నికలు. ఫలానా వాళ్ళకే ఓటెయ్యండని ఫలానా ఆయనా, ఫలానా ఆమే అరుస్తున్నారు.

వీళ్ళలో ఎవరు మంచి ఎవరు చెడు, ఎవరిని గెలిపించాలి ఎవరిని వోడించాలి అనేది ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ చూడాల్సిందే. నిర్ణయీకరణ ప్రక్రియలో మనం పాల్గినాల్సిందే. ఎందుకంటే, ఈ నిర్ణయాలు మన, మన ప్రజల బ్రతుకులను కూడా నిర్ణయిస్తాయి. మనం ఎన్నుకోలేదు కదా అని మోడీ ప్రభుత్వం దండకారణ్య గిరిజనం మీద దమనకాండ మానేయదు. మనం ఎన్నుకోలేదు కదా అని దేశ సంపదను అంబానీలకు, అదానీలకు కట్టబెట్టకుండా వుండరు.   

పార్లమెంట్లు, అసెంబ్లీలు పందుల దొడ్లు, బాతాఖానీ షాపులని పెద్దోళ్ళు చెప్పారు గనుక ఎన్నికలతో మనకు పని లేదనేది… ప్రగతి శీల మస్తిష్కాల్ని కబ్జా చేసిన ఒక ఉదాసీన భావన.

దుందుడుకు చర్యలకు, పాలక తోకలు పట్టుకు వ్రేలాడ్డాలకు… వామ పక్ష పరిభాషలో చెప్పాలంటే, అతివాదానికి, మితవాదానికి… రెండింటికీ… ఈ ఔదాశీన్యమే మూలం.

అవి పందుల దొడ్లు, బాతాఖానీ క్లబ్బులు కాబట్టి వాటిలో మనం పాల్గొనొద్దు… బాయ్కాట్… అనడం…  ప్రజలకు చెందిన దీపావళి వంటి పండుగలను ప్రభువులకు, వారి పురోహితులకు ఇచ్చేసి ప్రజల్ని నిష్క్రియుల్ని చేయడం వంటిదే.

ప్రత్యామ్నాయం లేని బహిష్కరణ మనల్ని పనికిమాలిన దిగులు లోనికి నెడుతుంది. నిరాశలో, నిహిలిజంలో ముంచెత్తుతుంది. మేలు చేయదు.

ప్రగతి శీలురు పండుగల్లో, ఎన్నికల్లో పాల్గొని వాటి రూప సారాల్ని మార్చాలి. వాటిని ప్రజాపరం చేయాలి.

ప్రతీ చిన్న పెద్ద విషయాన్నీ బహిరంగ చర్చనీయం చేయడానికి పండుగలూ, ఎన్నికలు కూడా వేదికలే.

ఎన్నికలంటే డబ్బు వెదజల్లే పండగ. మన్దగ్గర డబ్బుల్లేవు అందుకని ఎవరో వొకరి తోక పట్టుకుని పోదాం, మనమూ ఎన్నికల్లో వున్నామనిపించుకుందాం అనేది మరో మాట.

ఏం ఎందుకలా?

మన దగ్గర డబ్బుల్లేవు గాని, మనం వున్నాం. ఏ ప్రజల మధ్యన ఏ ప్రజల కోసం పని చేస్తున్నామో ఆ ప్రజలున్నారు… మనం నిజంగా పని చేస్తూ వుండినట్లైతే, ఎంత పని చేస్తే అంతగా మనమూ వున్నాం….  

ఇంత వరకు పనిచేయకపోతే ఇక ముందు చేద్దాం. ఇంత వరకు సరిగ్గా పని చేయకపోతే ఇక ముందు సరిగ్గా పని చేద్దాం.

ఎన్నికల ముందు, ఎన్నికల్లో, ఎన్నికల తరువాత…. పార్లమెంటుల్లో, అసెంబ్లీల్లో, ఆఫీసులూ ఫ్యాక్టరీలూ వంటి పని ప్రదేశాల్లో అన్ని చోట్లా పని చేద్దాం.

ప్రజల్లో ఎంత పని చేస్తే అంతే మనం. అంతకు మించి మనం ఏమీ కాము.

ఊరక విప్లవ ప్రచారం కోసం మైకు పట్టడం కాదు. సమస్య నుంచి సమస్యకు… ఏ సమస్యకు ఆ సమస్యలో…  కలిసే వారందరం కలిసి పని చేద్దాం.

ఇది యుద్ధం. సామాజిక యుద్ధం. యుద్ధంలో లేని వాడు విజయంలోనూ వుండడు.

ఈ యుద్ధం జయిస్తుంది.

ఇటుక ఇటుకగా నిర్మాణం కావలసిన స్వప్న సౌధమిది,

ఓహ్, కల. ఎంతెంత దూరం?

నిజమే. చాల చాల దూరం! దగ్గరి దారి లేదు.

ఈ యుద్ధం నుంచి వైదొలగి చేసేదేదైనా పలాయనమే. ఎస్కేపిజమే.

మనకు పండుగలుండాలి. చారిత్రకమైన మేడేలూ అవే కాదు, రుతువులను సంబరం చేసుకునే పండగలుండాలి. మనకు పరాయి అయిపోయిన పండుగలను తిరిగి ఆక్రమించాలి.

అలాగే, మనకు ఎన్నికలు కావాలి. ‘విప్లవాలు’ విజయవంతం అయ్యాక కూడా నాయకులెవరో నిర్ణయించాల్సింది ‘సూక్తులు’ కాదు, ఎన్నికలే. దానికి మనం, మన జనం ఇప్పటి నుండీ అలవాటుపడాలి. అలా అలవాటు పడడమే రష్యా చైనా తరహా తప్పిదాలకు సరైన దిద్దుబాటు.

***

పీడిత ప్రజలు ‘రాజ్యాధికారం’తో పని చేసిన ప్రపంచానుభవాల్లో అతి ముఖ్యమైనవి… రష్యా, చైనా.

ఆ రెండు చోట్లా… కమ్యూనిస్టు పార్టీల్లోపల ఏమి ఎన్నికలు జరిగాయో గాని, పార్టీ బయట ప్రజలు పాల్గొన్న ఎన్నికలు మృగ్యం. చైనా సంగతి సరే. రష్యాలో సార్వత్రిక తిరుగుబాటు (ఇన్సరెక్షన్) తరువాతైనా సార్వత్రిక ఎన్నికల వూసు లేదు. దానికి చెప్పుకునే సమర్థనలు తెలుసు. కార్మికవర్గ నియంతృత్వం అవసరమని, అది లేకపోతే శ్రామిక వర్గ రాజ్యాధికారం నిలబడదని.

ఇక్కడ రాజ్యాధికారం (నిలబడనిది) ఎవరికి? పార్టీకి. పార్టీకి రాజ్యాధికారం ఎందుకు? ఈ ప్రాధమిక ప్రశ్నను విస్మరించిన వైపరీత్యమే తదనంతర ఘోరాలకు మూలకందం. ఆ విప్లవం ఎవరి కోసం జరిగిందో ఆ శ్రామిక వర్గం మీదే స్టాలినిస్టు నిరంకుశం అమలు జరిగిందని చార్లెస్ బెతల్హ్యామ్ నిరూపించారు. నాజీ ప్రమాదమనీ అంతర్యుద్ధ ప్రమాదమనీ కుంటిసాకులు వినా;  శ్రామిక వర్గం మీదే అమలైన నిరంకుశానికి తగిన వివరణ ఏ ‘థర్డ్ ఇంటర్నేషనల్’ పార్టీ నుంచీ ఇంతవరకు లేదు. ఇక ముందు వుండే అవకాశం లేదు.

అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరిగుంటే ఏమయ్యేది?

కింది రెండు పరిణామాల్లో ఒకటి జరిగేది:

ఒకటి: ప్రజలందరు పాల్గొనే ఎన్నికల ద్వారా సాంఘిక ‘సమ్మతి’ని సాధించి, శ్రామిక వర్గం తనకు తాను నిలదొక్కుకునేది. పార్టీ కమిటీల వూతకర్ర రాను రాను అనవసరమయ్యేది. అదే జరిగితే అదొక అద్భుతం అయ్యేది. సోషలిజం వాస్తవికమయ్యేది.

రెండో పరిణామం: శ్రామిక వర్గం తనకు తాను నిలదొక్కుకోలేక, రాజ్యాధికారం తిరిగి బూర్జువా వర్గం పరమయ్యేది. 

రెండోది జరిగినా, అదే అంతిమ పరిణామం కాదు. శ్రామిక వర్గం తన సమస్యల పరిష్కారం కోసం, తనదైన రాజ్యాధికారం కోసం తిరిగి తిరిగి ప్రయత్నించేది. ఆ ప్రయత్నాలకు మార్గదర్శకత్వం కోసమే కమ్యూనిస్టు పార్టీ వుండాలి; తానే రాజయిపోవడానికి కాదు.

ఆ ప్రయత్నాల అనుభవాల పట్టాల మీదే పౌర, రాజకీయ సమాజాలలో ప్రొలిటేరియట్ తన పట్టు పెంచుకునేది. అదొక క్రమం, అదొక ప్రాసెస్. ప్రాసెస్ కు గండి కొట్టే షార్ట్ కట్ ల వల్ల సాధించిందేమిటి?

ఏం ఆ స్టాలినిస్టు నిరంకుశాలతో బూర్జువా వర్గాన్ని నిరోధించ గలిగారా? నిరోధించలేదు. ప్రొలిటేరియట్ పార్టీలు కాస్తా బోరిస్ ఎల్త్సిన్ పార్టీలుగా మారాయి. ఆ రెండు దేశాల్లో నేడున్నది బూర్జువా ప్రజాస్వామ్యమే (లేక బూర్జువా నిరంకుశమే).

రహస్య గోపనం వల్ల ఒరిగేది ఎప్పుడూ ఇంతే.

పోటీ పడదాం ఎన్నికల బరిలో, బహిరంగ చర్యల్లో, వీధిపోరాటాల్లో.

అన్ని అబద్ధాల మీద… ఎస్, ఎర్ర రంగు పులుముకున్న అబద్ధాల మీద కూడా… జనస్వామ్య జయకేతనాలెగరేద్దాం.

అబద్ధం (హిపోక్రసీ) అనే దున్నపోతును కేవలం ఎర్రజెండా నిలువరించలేదు. ప్రజాస్వామమనే బల్లెం తప్పని సరి.

ఎవరు నిర్మాతలు? ప్రజలు ప్రజలు ప్రజలు!

ఎవరు నిర్ణేతలు? ప్రజలు ప్రజలు ప్రజలు!

ప్రజా ఇచ్చ ఎలా వ్యక్తం కావాలి? ప్రజలు పాల్గొనే ఎన్నికల ద్వారానే!  

ఎన్నికలు లోప భూయిష్టమయితే ఏం చేయాలి? ఆ లోపాల్ని సరిదిద్దాల్సింది, సరిదిద్దేది కూడా ప్రజలే.

‘మాస్ లైన్’, ‘పీపుల్స్ వార్’  అనేవి తరచు వినిపించే పదాలు. మరిచిపోయిన అర్థాలు.

ఇప్పుడు జగుతున్నది ప్రజల్ని వొదిలేసిన అనర్థాలు.

యోధుడా జాగ్రత.

30-3-2019

 

హెచ్చార్కె

10 comments

 • పండగల కథలు గురించి అలా పక్కన పెడటాను ఒక్క క్షణం. మిగతా వ్యాసం superb. ఇప్పటికే 70 ఏళ్ళు ప్రగతి శీలురు వృధా చేసేరు.

  • థాంక్స్ సర్, పండుగల వంటి సాంస్కృతికాంశాల్ని పక్కన పెట్టొద్దు కూడా.

   అలాగని వాటికి ప్రజానుకూల వివరణ ఇవ్వకుండా, ఆ వివరణతో కూడిన ఆచారాల్ని ప్రచలితం చేయకుండా పాల్గొనవద్దు. అది మన మన అజెండా లేకుండా ఎన్నికల్లో పాల్గొనడం వంటిదే.

 • సర్ మీరు కమ్యూనిస్ట్ అని విన్నాను. ఆర్టికల్లో కమ్యూనిజాన్ని విమర్శించడం ఎలా అర్ధం చేసుకోవాలి?

 • అదే అదే సర్, అదే వ్యూహం! దోపిడీ కధలను తిరిగి వాటి తలపై spin చేయించడమే కరెక్ట్. అయితే దానికి ముందు కొంత కాలం విమర్శ జరగాలి ఆ రెంటి పైన చర్చ జరగాలి.

  మత పండుగలు ప్రకృతిలోని రిథమ్ నుంచి వచ్చిన వైతే స్వీకరించాలి. కానీ దీని మాటున అంటే ‘చెట్టు చాటునుంచి చేసిన ధర్మ యుద్ధం’ లాంటిది కూడా వుండే అవకాశం లేకపోలేదు. యుద్ద కథలు జాతి వివక్ష కథలనే థీసిస్ వుంది. దీంట్లో కేరక్టర్ లు ఇటుదిఅటు అటుదిఇటు మార్చి ఏమార్చిన జాడలు కూడా మతకవితా స్రవంతి లో ఉండకపోలేదు.

  ఉదాహరణకు: కోలుకోలంకా కొడవల్లంకా , కాళ్ళాగజ్జా కంకాళమ్మా, లంకా తెచ్చి రావణు కిచ్చి….అసల్ది. కానీ ‘లంకా తెచ్చి రామునికిచ్చి’ రిడేక్షన్,. ప్రక్షిప్తం. అని….
  కాబట్టి, ఉదాసీనత పోవాలంటే ప్రత్యామ్నాయం కావాలి, రావాలి. మేధో మథనం జరగాలి

  • ఔనండీ. మేధా మధనం జరగాలి. మన లాంటి వాళ్ళం వూళ్ళల్లో నలుగురైదుగురం వున్నా, ఒక డక్కి పట్టుకుని పాత కథ ఎలా తప్పో అసలు ఫలానా పండుగ ఎందుకు చేసుకోవాలో… మనకు చాతనయినంత ఇంపుగా పాటలు కట్టి పాడి, ప్రజల కోసం పని చేసిన వాళ్ళకు జై కొట్టి మరీ పండుగ చేసుకోవాలి. కొన్నాళ్ళు ఇలా చేస్తే మనదైన సంప్రదాయం ఏర్పడుతుంది. సంప్రదాయాల మధ్య అర్థవంతమైన ఘర్షణ్ జరుగుతుంది. జరగాలి.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.