పర్యావరణం కోసం ప్రపంచ బాలల సమ్మె

“మన దగ్గర చాలా డబ్బున్నది.  మిలిటరీ కోసం ఖర్చు చేయకుండా వాతావరణ రక్షణ కోసం ఖర్చు పెట్టొచ్చు కదా?”. అని 8 ఏళ్ల అమ్మాయి ప్రశ్నిస్తే, “బుష్ చేసిన యుద్దాలకు డబ్బెక్కడ్నుంచి వచ్చింది?” అని మరో గడసు పిల్ల ప్రశ్నించింది. ఆ అమ్మాయిలు ప్రశ్నించింది ఎవరినో కాదు కాలిఫోర్నియా డెమోక్రాట్ సెనేటర్ డయనా ఫిన్ స్టెన్ ను. కాంగ్రెస్ లో ’గ్రీన్ న్యూడీల్’ ను సమర్థించాలని స్కూల్ పిల్లలు ఒక బృందంగా వెళ్లి  ఆమెను అడిగారు. ఫిన్ స్టెన్ ససేమిర అన్నది. ఈ పెద్దవాళ్లు చెప్పిన మాట వినడం లేదని ఈ పిల్లలు కోప్పడుతున్నారు.

“మనకు నివాస యోగ్యమైనది భూ గ్రహం ఒక్కటే. మరొకటి లేదు.ఇప్పటికే భూతాపం పెరిగి సముద్రాలూ వేడెక్కుతున్నాయి. ధ్రువాల్లో మంచు కరుగుతున్నది. జంతుజాలం చచ్చిపోతున్నది. భూమ్మీద ఈ సంక్షోభాన్ని పెద్దవాళ్లు  సృష్టిస్తున్నారు. పిల్లలం మేం, దీన్ని అంగీకరించం. మా కళ్ల ముందు ఇది జరుగుతుంటే చూస్తూ వూరుకోలేం. భూ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నాం” అని ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు మార్చి 15 న ‘గ్లోబల్ క్లైమేట్ స్ట్రైక్” చేశారు. ఈ సమ్మె నిర్వహించడానికి గత మూడు నెలలుగా బడి పిల్లలు సమాయత్తమయ్యారు. దాదాపు 125 దేశాలకు చెందిన 14 లక్షల మంది బడి పిల్లలు 2045 నగరాల్లో సమ్మె లో పాల్గొని  వాతావరణ పరిరక్షణకై తగిన చర్యలు చేపట్టాలని ప్రపంచ నాయకులను డిమాండ్ చేశారు.

అంతే కాదు భూమి పొరల్లోంచి ఆయిల్  వెలికితీయ (ఫ్ర్యా కింగ్) కూడదని కోరుతున్నారు. ఫ్ర్యాకింగ్ వల్ల భూ కంపాలు సంభవిస్తాయని, నీరు కలుషితం అవుతుందని, కలుషితమైన నీటి వల్ల మనుషులకే కాక, జీవరాసులన్నిటికీ ప్రమాదమని అంటున్నారు.  బొగ్గు కోసం భూమిని తవ్వకూడదని కూడా చెబుతున్నారు.

కొన్ని నెలలుగా స్వీడన్ కు చెందిన్ 15 ఏళ్ళ పర్యావరణ కార్యకర్త గ్రేటా థున్బర్గ్ ప్రతి శుక్రవారం స్కూలుకు పోకుండా స్వీడన్ పార్లమెంటు భవనం బయట కుర్చొని  వాతావరణ మార్పులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నది.

నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన గ్రేటా థున్బర్గ్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడమే గాక నేటి తరం బడి పిల్లలకు ప్రేరణ గా నిలిచింది.( రస్తా జనవరి 1-15, 2019 సంచికలో  “పర్యావరణ విధ్వంసం మీద పసివాళ్ల తిరుగుబాటు” వ్యాసం చూడండి).

“ఇల్లు కాలిపోతుంటే కాపాడుకోడానికి ఎలా ప్రయత్నిస్తామో అలా మనం పని చేయాలి. సరిచేసుకోడానికి ఆట్టే సమయంలేదు. ఇప్పటికైనా మనం దీన్ని సరిచేసుకోవచ్చు” అన్నది దావోస్ లో మాట్లాడుతూ గ్రేటా. స్విట్జర్లాండ్ లోని దావోస్ లాంటి చోట్ల వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు తమ విజయ గాథలను వినిపించుకోవాలని కోరుకుంటారు. అలాంటి చోట గ్రేటా మాట్లాడింది. ‘వారికి తెలియదు, తమ విజయగాథలకు ఊహించని రేటు మానవాళి చెల్లించుకోవాల్సి వుంటుంద’ని అని అంటున్నది ఆ అమ్మాయి.

ప్రమాద ఘంటికలు:

పది రోజుల క్రితమే చూశాం దక్షిణాఫ్రికాలోని మొజాంబిక్, జింబాబ్వే, మలవి దేశాల్లో ఇదాయి తుపాను  సృష్టించిన బీభత్సం. ఊర్లకు ఊర్లు నేల మట్టమయ్యాయి. వేయి కి పైగా జనం మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. 17 లక్షల మంది ఈ తుపాను తాకిడికి గురయ్యారు. తుపాన్ అనంతరం తాగు నీటి సమస్య ఏర్పడింది. కలరా, మలేరియా విజృంభించాయి. పంట పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. ఆ దేశాలకు ఇది కని విని ఎరుగనిది. ముందే ఇవి నిరుపేద దేశాలు, పైగా ఇలాంటి దుర్ఘటనలు గతంలో జరగలేదు. ఇంతగా తుపాన్లు విరుచుకపడితే ఎలా ఎదుర్కోవాలో, ముందస్తు చర్యలు ఏవి ఎలా తీసుకోవాలో, అందుకు తగిన సరంజామా, వనరులు కూడా వారికి లేవు. ఈ వాస్తవాల్ని గమనించినప్పుడు వాతావరణ మార్పుల వల్ల  సంభవించే ప్రమాదాలకు ముందుగా పేద దేశాలు, పేద ప్రజలు గురవుతారు. ప్రకృతి బీభత్సాలు, ప్రమాదాలు ఎక్కడైనా జరగవచ్చు. ఐదారు నెలల క్రితం కాలిఫోర్నియాలో చెలరేగిన దావానలంను అమెరికా కనుక తట్టుకోగలిగింది. మొన్నటికి మొన్న నెబ్రస్కా, ఐయోవా, కాన్సస్ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు మిసిసిపి నదికి వచ్చిన వరదలతో పంట పొలాలు మునిగిపోయి, నీరంతా కలుషితమయింది. యుద్ధ ప్రాతిపదికపై సమస్యలను అధిగమించే సాంకేతిక, ఆర్థిక వనరులు ఆ సంపన్న దేశాలకు ఉంటాయి. అంతేకాదు, అమెరికా, అందునా న్యూయార్క్ లో సంపన్నులు నివసించే ప్రాంతాలలో స్వచ్చమైన నీరు, స్వచ్చమైన గాలి ఉంటుంది. (ఇళ్ల చుట్టు చెట్లు, మొక్కలు, పచ్చిక బయళ్లు వుండడంతో), న్యూయార్క్ స్లమ్స్ ల్లో,  బ్రాంక్స్( Bronx) లో నివసించే పేద ప్రజలకు స్వచ్చమైన గాలి, నీరు లభించవు. కలుషితమైన గాలి వల్ల అక్కడ పెరిగే పిల్లల్లో ఆస్త్మా సర్వసాధారణం. సంపన్న దేశాల్లో కూడా పేద ప్రజలు స్వచ్చమైన గాలి, నీరు కావాలని కోరుకోవడం అత్యాశే.

పాపం, పుణ్యం తెలియని పిల్లలు, లాభాలు, దోపిడీలు అంటే తెలియని పసివాళ్లు. భూమిని తమ కోసం, భవిషత్ తరాల కోసం కాపాడుకోవాలని, తపన పడుతున్నారు. మార్కెట్ కు లొంగకూడదని, నిరాడంబరంగా జీవించాలని, యుద్ధాలు, ఘర్షణలు లేని సమాజం కావాలని కోరుకుంటున్నారు. పెద్దవాళ్ళం మనమేం చేస్తున్నాం?   

ఎస్. జయ

ఎస్. జయ: కవి, కథకురాలు. చిరకాలం ఎమ్మెల్ పార్టీలో పని చేసిన క్రియాశీలి. ఆ సమయంలో పొర్టీ పత్రిక 'విమోచన'లో, తరువాత 'ఈనాడు'లో, 'నలుపు' పత్రికలో సంపాదక బాధ్యతలు నిర్వహించారు. 'విరసం' లో చురుగ్గా పని చేయడమే గాక, పలు సంవత్సరాలు 'విరసం' జంటనగరాల కన్వీనర్ గా పని చేశారు. 'అన్వేషి' అనే స్వచ్చంద సేవా సంస్థలో కో ఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించారు. 'మట్టి పువ్వు' అనే కవితా సంపుటినీ, 'రెక్కలున్న పిల్ల' అనే కథా సంపుటినీ వెలువరించారు. పలు పుస్తకానువాదాలు, విడి అనువాదాలు చేశారు.

1 comment

  • పెద్దవాళ్ళు పిల్లలు తెచ్చే ర్యాంకుల కోసం చూస్తారు
    పర్యావరణం కోసం ఆలోచించే అంత తీరిక లేదు పాపం.పర్యావరణాన్ని రెండు చేతులు కాదు.కొన్ని కోట్ల చేతులు అడ్డు పెట్టి రక్షించుకోవాలి.ఆ ఆలోచన పాఠశాల ల నుండి కలిగించాలి.
    మనకు ఉద్యో గాలు ముఖ్యం. పిల్లలు డాక్టర్లు,ఇంజినీర్లు ఐపోవాలి.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.