ఫ్రాన్స్ వీధుల్లో గ్రేట్ డిబేట్!

“ఫ్రాన్స్ వీధుల్లో ‘గ్రేట్ డిబేట్’ జరుగుతోంది’’ అని కొందరంటే, మరి కొందరు ‘’శనివారం విప్లవం చేస్తూ, తెల్లారే సరికి చల్ల బడుతున్నా”రని వెక్కిరిస్తున్నారు. అన్ని దేశాల్లాగే అక్కడి మీడియా కూడా ఈ  వారం వారం ‘’ఎల్లో వెస్ట్” వీధిపోరాటాల్ని ప్రజలకు చూపించడం లేదు. పోరాడుతున్నదే ప్రజలు, పోరుకు ప్రజల మద్దతు పుష్కలంగా వుంది. మీడియా ప్రజల్నించి వేరుపడిపోయింది. అది ఎవరి వైపో తేలిపోయింది. పోరాటం సోషల్ మీడియా ద్వారానే బయటి ప్రపంచానికి తెలుస్తోంది.

మార్చి 30న, 20 వ అంకం:

ఫ్రాన్స్ లో రెక్క విప్పిన రెవల్యూషన్ ఆకాశం అంతా, ప్రపంచమంతా చుట్టేస్తున్నది. ఫ్రాన్స్ లోపల నిరసన ర్యాలీలు ఆగలేదు. ‘20 వ అంకం’ నడుస్తోంది. నవంబర్ 17 న మొదలయి 20 వారాలుగా ప్రతి శనివారం ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా సాగుతున్న ప్రదర్శనల్లో వేలాది మంది పాల్గొంటున్నారు. పారిస్ నగరంలో ప్రజల కన్న ఎక్కువగా పోలీసులు మోహరిస్తున్నారు. రెండవ, మూడవ శనివారాల్లో, మార్చి 16 న జరిగిన 18 వ ప్రదర్శనల్లో మాత్రమే  హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇప్పటికీ ఎల్లో వెస్ట్ ను నడిపిస్తున్నది ఏ ఒక్క యూనియన్ కానీ, సంస్థ కానీ కాదు.

శనివారం వారంత సెలవు దినం. అయినా ఫ్రాన్స్  వీధుల్లో స్త్రీలు, పురుషులు… యువతీ యువకులు, నడివయసు వారు, డెబ్బై, ఎనభై ఏళ్ళ వారు గుంపులు గుంపులుగా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ నడుస్తూ రోడ్ల మీద కనిపిస్తున్నారు. వాళ్ళ వీపుల మీద తేలికపాటి బ్యాక్ పాక్ లు, లేదా భుజాల మీద వ్యానిటీ బ్యాగులు వేలాడుతుంటాయి. చూసే వారికి వారు ఏ జాతరకో వెళుతున్నట్లు కబుర్లు చెప్పుకుంటూ నడుస్తుంటారు. ఏదో ముఖ్య కార్యక్రమం నిర్వహించబోతున్నామన్న ఒక ఆశయం వారి నడకలో గమనిస్తాం. కబుర్లు చెప్పుకుంటూ పోతున్న ఆడవాళ్ల గుంపులను చూస్తే వాళ్లు ఒకరికొకరు ఇరుగుపొరుగు వాళ్ళో, ఒకే ఆఫీసులో పనిచేసే సహోద్యోగులో అనిపిస్తుంది. ఆడ మగ కలిసిన గుంపును చూస్తే, వాళ్లంతా ఒక స్నేహ బృందమేమో, కుటుంబ సభ్యులో అనుకుంటాం. నిరసన ప్రదర్శనల్లో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ ‘ఎల్లో వెస్ట్స్’ నిరసన జ్వాలను రాజేసింది స్త్రీలే. నిరుడు మే లో ఇద్దరు స్త్రీలు ఫ్యూయల్ ధరలపై ఒక పిటిషన్ ను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తే…  3 లక్షలకు పైగా సంతకాలు పెట్టారట. అలా రాజుకున్న చైతన్యంతో నవంబర్ 17 నుంచి దేశమంతటా నిరసన ర్యాలీలు మొదలయ్యాయి. పెట్రోల్, డీజిల్ లపై పెంచిన పన్నులు తగ్గించాలని ప్రారంభమైన నిరసన ర్యాలీలు… వేతనాలు పెంచాలంటూ, ఆర్థిక సమ న్యాయం జరగాలంటూ, అధ్యక్షుడు మాక్రోన్ ఆర్థిక విధానాలను వ్యతిరేకించే దిశగా మలుపు తిరిగాయి. మాక్రోన్ ఫ్రెంచి శ్రామిక ప్రజలకు నష్టకరంగా, వ్యాపారులకు, సంపన్నులకు లాభం చేకూర్చే ఆర్థిక విధానాలను ఎల్లో వెస్ట్స్ ప్రశ్నిస్తున్నారు. అంతిమంగా ఫ్రాన్స్ లో ఒక రాజకీయ సంక్షోభం నెలకొందని చెప్పవచ్చు.

ఈ ఎల్లో వెస్ట్స్ ఉద్యమాన్ని ‘1968 ఉద్యమం’తో పోలుస్తున్నారు చాలా మంది. మరి కొందరు అమెరికాలో  జరిగిన ‘ఆక్యుపై వాల్ స్ట్రీట్’ ఉద్యమంతో పోలుస్తున్నారు. హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు, ప్రజల నుంచి ‘ఎల్లో వెస్ట్స్’ విమర్శలు ఎదుర్కొంటున్నారు, అయినా, ఇప్పటికీ 80 % మంది ప్రజలు ‘ఎల్లో వెస్ట్స్ ‘పోరాటాన్ని సమర్థిస్తున్నారు. 18 వ శనివారం  జరిగిన కొన్ని చెదురుమదురు హింసాత్మక సంఘటనల తరువాత ఫ్రాన్స్ ప్రభుత్వం నిరసన కారులను అదుపు చేయడానికి పోలీసులతో పాటు మిలిటరీని దించబోతున్నట్టు ప్రకటించగానే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. దీంతో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించరాదని నిషేధం విధించారు.

‘ఎల్లో వెస్ట్స్’ ఉద్యమాన్ని ఏ యూనియన్లు నాయకత్వం వహించనప్పటికీ, దేశంలోని  అనేక కార్మిక సంఘాలు, టీచర్ల సంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. మద్దతుగా పేపరు ప్రకటనలకు పరిమితం కాకుండా ఫిబ్రవరి 5న, మార్చి 19న సమ్మెలు నిర్వహించాయి.

ఎల్లో వెస్ట్స్ ఉద్యమం అనేక దేశాల్లోని ప్రజలను ప్రభావితం చేస్తున్నది. ఇప్పటికే దాదాపు 25 దేశాల్లో  పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా, వేతనాలు పెంపుదల కోసం ఎల్లో వెస్ట్స్ ధరించి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిరసన ర్యాలీలు జరిగిన దేశాలు… ఆస్ట్రేలియా, బల్గేరియా, బెల్జియం, కెనడా, ఈజిప్ట్, ఫిన్లాండ్, జర్మనీ, ఇరాక్, ఐర్లాండ్, ఇజ్రాయిల్, ఇటలీ, నెదర్లాండ్స్, పాకిస్తాన్, పోలెండ్. రష్యా, స్పెయిన్, రిపబ్లిక్ ఆఫ్ చైనా( తైవాన్) యు.కె, యు ఎస్ ఏ… ఇది మరిన్ని దేశాలలో రాజుకొనే అవకాశం వుంది.

            

ఎస్. జయ

ఎస్. జయ: కవి, కథకురాలు. చిరకాలం ఎమ్మెల్ పార్టీలో పని చేసిన క్రియాశీలి. ఆ సమయంలో పొర్టీ పత్రిక 'విమోచన'లో, తరువాత 'ఈనాడు'లో, 'నలుపు' పత్రికలో సంపాదక బాధ్యతలు నిర్వహించారు. 'విరసం' లో చురుగ్గా పని చేయడమే గాక, పలు సంవత్సరాలు 'విరసం' జంటనగరాల కన్వీనర్ గా పని చేశారు. 'అన్వేషి' అనే స్వచ్చంద సేవా సంస్థలో కో ఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించారు. 'మట్టి పువ్వు' అనే కవితా సంపుటినీ, 'రెక్కలున్న పిల్ల' అనే కథా సంపుటినీ వెలువరించారు. పలు పుస్తకానువాదాలు, విడి అనువాదాలు చేశారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.