వర్మా’స్ లక్ష్మీ’స్ ఎన్టీఆర్

“అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప; హీరోలూ విలన్లూ లేరీ నాటకంలో … ” (ప్రస్థానం చిత్రంలో ఒక డైలాగ్)

బహుశా ఈ మధ్య కాలంలో బాహుబలి సిరీస్ మరియు చిరంజీవి రీ ఎంట్రీ అన్న కారణంగా ఖైదీ  నెంబర్ 150 మినహా లక్ష్మీస్ ఎన్టీఆర్ లా ఆసక్తి రేకెత్తించిన చిత్రం లేదేమో. దానికి ప్రధానంగా రెండు కారణాలు – ఒకటి చిత్రానికి ఎన్నుకున్న అంశం, రెండవది చిత్రాన్ని రూపొందించిన వ్యక్తి. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించిన నాటినుండి జరిగిన ఘటనల సమాహారం ఒక సంచలనం కాగా, ముప్పుతిప్పలు పెట్టె మీడియాకు కూడా మూడు చెరువుల నీళ్ళు తాగించే నేర్పరి వర్మ దర్శకత్వంలో  రూపొందడం మరో సంచలన కారణం. ఒక సినిమాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకునే ముందు, మనం కొందరి వ్యక్తిత్వాల గురించి మాట్లాడుకోవాలి.

ముందుగా ఎన్టీఆర్ గురించి, తెలుగు సినిమా, రాజకీయ రంగాలలో తనదైన ఒక చెరగని ముద్ర వేసిన వ్యక్తి ఎన్టీఆర్. అతడి ఉత్థానపతనాలను ప్రస్తావించాలంటే – అతడి వ్యక్తిత్వాన్నే ఆవిష్కరించాలి. ఎన్టీఆర్ ఒక మొండిఘటం. ఒకసారి తాను ఏదైనా అనుకుంటే, ఎవరినీ లెక్కచేయని తత్త్వం, అదొక్కటే కాదు ఎన్ని కష్టనష్టాలైన ఎదురొడ్డి నిలబడే రకం. అదే అతడిని శిఖరాగ్రాన నిలబెట్టింది, ఈడ్చి పారేసింది కూడానూ. ఎన్టీఆర్ ని శాసించటం ఒకరి తరం కాదు, ఒకరు చెబితే వినే రకం కాదు అని ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ చెప్పే విషయం. అలా అని మూర్ఖుడు కాదు – విపులంగా అర్థం చేసుకుంటాడు. తరువాత అంకితభావంతో పని చేస్తాడు. సినిమాల్లో, రాజకీయాల్లోనూ అలానే ఉన్నాడు; అంటే అతడున్న రంగం మారినా, అతడి వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు. పట్టువిడుపులు, సర్దుకుపోవడాలూ అలవర్చుకోలేదు. ఎన్టీఆర్ కి ముందూ వెనుకా, క్రిందా పైనా ఎవరూ ఉండరు, ఉండకూడదు అనుకునే వ్యక్తిత్వాన్ని చివరివరకూ నిలబెట్టుకున్న అతడి ధైర్యం అబ్బురపరుస్తుంది.

ఇక మరొకరు చంద్రబాబు నాయుడు – తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ తరువాత ఒక నూతన ఒరవడిని తీసుకొచ్చిన వ్యక్తిగా, సాంకేతికవిప్లవకర్తగా అందరూ పేర్కొనే చంద్రబాబు వ్యక్తిత్వం ఎన్టీఆర్ కు పూర్తి భిన్నం. పట్టువిడుపులూ, సర్దుకుపోవడాలూ, అవకాశం వచ్చినపుడు అన్నిటికీ తయారుగా ఉండటం, అవసరమైనపుడు భేషజాలకు పోకపోవడం వంటివి చంద్రబాబు తత్త్వంలో ఉంటాయి. తనది కాని రోజున తగ్గి ఉండటం, తనదైన రోజున సత్తా చూపడం అన్నది చంద్రబాబు తీరు. ఇక చంద్రబాబులో మరొక ప్రధాన విషయం పట్టు విడువని తత్త్వం – ఓటములు ఎంతగా కృంగదీసినా, ఎన్ని దెబ్బలు తగిలినా పోరాటం విడువడు – గెలిచేదాకా. అదే అతడిని ఇవాళ ఈ స్థాయిలో నిలబెట్టింది. లక్ష్యాన్ని సాధించటానికి ఎంత కష్టమైనా పడతాడు; కుట్రలు పన్నాలంటే ఎలాంటి కుట్రలైన పన్నుతాడు – కానీ, విజయం సాధించాలి అన్నది అతడి లక్ష్యం.

ఇక మరొక వ్యక్తి గురించి – రామ్ గోపాల్ వర్మ ఉరఫ్ ఆర్జీవీ. తెలుగు సినిమాకు శివ చిత్రంతో ఒక నూతన ఒరవడిని నేర్పించిన వ్యక్తి. అతడి ప్రారంభమే ఒక సంచలనం – ఆ తరువాత అతడి ప్రతి అడుగూ ఒక సంచలనమే అయింది. ఎవరినీ లెక్క చేయని వర్మ తత్త్వం, నిలకడ లేకపోవడం, విలువలు గట్రా అంటూ సమాజానికి భయపడకపోవటం వర్మ తీరు. అతడి తీరు తెలిసిన వారెవరైనా అతడు ఒకరికి భయపడి సినిమా తియ్యటమో లేక మానెయ్యటమో చేస్తాడంటే నవ్వుతారు – వర్మని సినిమా తియ్యకుండా ఆపలేం, కానీ అతడి సినిమాని సెన్సార్ లేదా న్యాయస్థానం వంటి మార్గాల ద్వారా ఆపవచ్చేమో, ఒకవేళ అభ్యంతరాలుంటే.

ముఖ్యమైన ముగ్గురి వ్యక్తిత్వాల గురించి చెప్పుకున్నాం. ఇక సినిమా గురించి. ముందుగా సినిమా కథ కొత్తది కాదు, అందరికీ తెలిసిందే. అయితే ఇన్నాళ్ళకు ఆర్జీవీ ద్వారా రెండోవైపు వాదానికి ఒక వాయిస్ దొరికింది. ఇది నిజమా, కాదా అన్నది ఇక్కడ చెప్పట్లేదు నిజమేంటో అటూ, ఇటూ అతి కొద్దీ మందికి మాత్రమే తెలిసుండొచ్చు. కానీ, ఇన్నాళ్ళూ ఒకవైపు వాదమే వినిపించింది, ఇపుడు లక్ష్మి పార్వతి వైపు వాదన బలంగా వినిపించే ప్రయత్నమే ఈ లక్ష్మిస్ ఎన్టీఆర్. 1989 ఎన్నికల్లో ఓటమి తరువాత ఒంటరితనాన్ని అనుభవిస్తున్న ఎన్టీఆర్ జీవితంలోకి; ఆయన జీవిత చరిత్ర రాస్తానంటూ ప్రవేశించి, ఆయన జీవితంలో అనేక సంచలనాలకు లక్ష్మి కారణం కావడమే ఈ చిత్ర కథ. ఆయన జీవితంలోకి లక్ష్మి పార్వతి ఆగమనం నచ్చని కుటుంబ సభ్యుల సహకారంతో, కుట్ర ద్వారా ఆయన అల్లుడు బాబురావు ముఖ్యమంత్రి కావడం, ఆ తరువాత అవమానాల పాలైన ఎన్టీఆర్ మరణించడంతో సినిమా ముగుస్తుంది. చిత్రమంతా ప్రధానంగా లక్ష్మి పార్వతి – ఎన్టీఆర్ – బాబురావు; ఈ మూడు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ముందే చెప్పినట్టు కథగా ఇది కొత్తదీ కాదు, తెలియనిది కాదు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవలసింది ఆర్జీవీ కథనం. ఎక్కువగా ఇంట్రోలు అవీ ఇవ్వకుండా స్ట్రెయిట్ గా ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశంతో సినిమా మొదలు పెట్టి, ప్రథమభాగం అంతా వారిద్దరి మధ్య అనుబంధం ఏర్పడటం మీద మాత్రమే దృష్టి పెట్టాడు. అందులో అప్పుడప్పుడూ కాస్త సాగదీసినట్టున్నా, ఎక్కడా పెద్దగా ఇబ్బంది పెట్టకుండా సాగిపోతుంది. ఇక, రెండవ భాగమంతా రాజకీయ ఎత్తులు, కుట్రలు, ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడ్ని చేయటం, మరణం వంటివి. ఈ కథాగమనంలో ఒక విషయం మాత్రం నమ్మదగ్గదిగా అనిపిస్తుంది – అది ఎన్టీఆర్ తీరు. ఎన్టీఆర్ ఎవరిమాటా వినరు అన్నది అందరూ చెబుతారు, సినిమాలో అదే మొండితనాన్ని, ధిక్కారధోరణిని చూపారు. ఇక మిగతా పాత్రల తీరు మాత్రం ఒకవైపు నుండి అంటే ఒకరి దృక్కోణంలోంచి మాత్రమే చూపినట్టు అనిపిస్తుంది. ప్రధానంగా చంద్రబాబు పాత్రను మొదటినుండీ పదవీకాకాంక్షతో కుట్రలు పన్నే రీతిన చూపడం నప్పదు. లక్ష్మి పార్వతి ప్రవేశం తరువాత, బాబురావు అభద్రతకు లోనవడం, ఆ తరువాత కుట్ర జరగడం నిజమే అయినా – అందులో ఓటమి తరువాత ఎన్టీఆర్ పార్టీని పెద్దగా పట్టించుకోక, అతడి మీద వదిలేయడం అనే తప్పిదం కూడా ఉంది. కానీ, ఇక్కడ వర్మ తెలివిగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అని టైటిల్ లోనే చిత్రం గురించి క్లారిటీ ఇచ్చారు. అలాగే ఇందులో ఈనాడు ఊప్స్ కాదు కాదు ఆనాడు జరిగిన ఘటనల్లో తెరవెనుక ప్రధాన పాత్ర పోషించిన ఒక పత్రికాధిపతి పాత్ర కూడా బాబురావు ఆదేశానుసారం అలా చేసినట్టు చూపారు. ఆ పత్రికాధిపతి తత్త్వం తెలిసినవారికి కూడా, అతడు ఒకరి ఆదేశానుసారం నడుచుకుంటాడంటే నమ్మబుద్ధి కాదు. బహుశా, ఇవన్నీ వర్మ తీసుకున్న సినిమాటిక్ లిబర్టీ అనుకోవాలేమో. ఇది ఆనాడు జరిగిన ఘటనలకు సంబంధించి లక్ష్మి పార్వతి వైపు వాదనగా చెప్పవచ్చు. అందుకే లక్ష్మి పార్వతి పాత్ర ఉదాత్తంగా, బాబురావు పాత్ర పరిచయమే విలనీగా ఉంటుంది. కానీ, కొన్ని సంఘటనలను అలానే (బహిరంగంగా అందరికీ తెలిసిన వాటిని మాత్రమే) తెరకెక్కించిన వర్మ ధైర్యాన్నీ మెచ్చుకోకుండా ఉండలేం.

ఇక నటీనటుల విషయానికి వస్తే – ప్రధాన పాత్రలకు సమర్థులైన నటుల ఎంపికతోనే వర్మ సగం విజయం సాధించాడు. దాంతో అతడి పని మరింత సులువైంది. ఎన్టీఆర్ గా నటించిన విజయ కుమార్, లక్ష్మి పార్వతిగా యజ్ఞ షెట్టి, బాబూరావుగా శ్రీతేజ్ అద్భుతంగ నటించారు. వాస్తవం అవునా, కాదా అన్నది పక్కనబెడితే – తెరమీద కనిపించినంతసేపు అదే నిజం అనిపించే తీరులో సన్నివేశాలను రక్తి కట్టించారు వారు ముగ్గురు. మిగతా వారంతా అలా వచ్చి, వెళుతుంటారు. కుటుంబసభ్యుల పాత్రలలో ఉన్నవారు కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తారు. ఇక సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే – ఎన్టీఆర్ ను సినిమాలు కాకుండా, బయట కూడా బాగా పరిచయం ఉన్నవారు చెప్పేది ఏంటంటే ఆయనపై ఆయన పోషించిన పాత్రల (ప్రధానంగా పౌరాణిక) ప్రభావం విపరీతంగా ఉండి, అదే నాటకీయత ఆయన ప్రవర్తనలో ఉండేది అని. ఆ ఆహార్యం, వాచకం వంటివి. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో ఆ నాటకీయత చూపినప్పటికీ; బాబురావు, లక్ష్మి పార్వతిల పాత్రల్లో ఆ నాటకీయత లేకుండా (కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే) సహజంగా ప్రవర్తించినట్టే ఉంటాయి. సాంకేతిక అంశాల విషయానికి వస్తే – ఈ సినిమాకు కళ్యాణి మాలిక్ అందించిన సంగీతం వెన్నెముకగా నిలిచింది. ఉన్న పాటలైనా, సన్నివేశాలలో వచ్చే నేపథ్యసంగీతమైనా ఆకట్టుకుంటాయి. ప్రధానంగా కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే – సహజంగా వర్మ సినిమాల్లో ఉండే రణగొణధ్వనుల సంగీతం ఉండులో ఉండదు. కొన్నిసార్లు నిశ్శబ్దమే రాజ్యమేలుతుంది. ఇక ఫోటోగ్రఫీ కూడా సన్నివేశాలకు తగినట్టు ఉంది. 
            వర్మ ఈ సినిమా ఎన్టీఆర్ మీద ప్రేమతో తీశాడో లేక బాబుగారి మీద కోపంతో తీశాడో లేక ఎన్టీఆర్ బయోగ్రఫీ దర్శకత్వం అవకాశం తనకు ఇస్తానని ఇవ్వలేదన్న అక్కసుతో చేశాడో తెలియదు – కానీ, ఎంతో ప్రేమించి తీశాడు ఈ సినిమాని/సబ్జెక్టు ని అని అనిపిస్తుంది. మంచి కథాంశం దొరికితే వర్మ ఎలా తీస్తాడు అంటే – ఇదిగో ఇలా తీస్తాడు అని చెప్పే చిత్రాల సరసన ఈ సినిమా కూడా ఉంటుంది. రాజకీయంగా ఖచ్చితంగా ఈ సినిమా ప్రభావం చూపేదిగానే ఉంది. ఆనాడు జరిగిన ఘటనల్లో కారణాలు ఏవైనప్పటికీ ఎన్టీఆర్ కు జరిగిన అవమానం, వెన్నుపోటు వంటివి నిజాలు. ఎన్టీఆర్ ఆడియో, వీడియో క్యాసెట్లు బయటకు రాకుండా అడ్డుకోవడం; సింహ గర్జన సభకు అనుమతినివ్వకపోవటం వంటివి పచ్చి నిజాలు. వైస్రాయ్ ఘటన, సింహ గర్జన సభ అనుమతి నిరాకరణ వంటివి చూపటం వర్మ ధైర్యమే. అవన్నీ చూపినందుకు వర్మకు రాజకీయరంగు ఆపాదించటం మాత్రం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం లక్ష్మి పార్వతి కోణంలోంచి తీసిన చిత్రం. ఈ చిత్రం చూశాక కొత్తగా ఎవరికీ లక్ష్మి పార్వతి మీద సానుభూతి రాదు, కానీ ఆనాటి ఘటనలు తెలియనివారికి కూడా బాబురావు పాత్ర మీద కోపం ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందులో లక్ష్మి పార్వతి హీరోయిన్ అయినా, కాకపోయినా బాబురావు మాత్రం విలనే. 

వంశీ కలుగొట్ల

వృత్తి: సాఫ్ట్వేర్ ఇంజనీర్; వ్యావృత్తి: రచనలు, కవిత్వం; నివాసం: బెంగుళూరు; పుట్టిన ఊరు: గని, కర్నూలు జిల్లా; తల్లిదండ్రులు: కలుగోట్ల విజయాత్రేయ, విజయలక్ష్మి. రచయిత/కవిగా : బృందావన చరితం - విద్వత్ ఖని కథనం, భారతీయం, సుప్రసిద్ధ భారతీయ కళాకారులు, సుప్రసిద్ధ భారతీయ క్రీడాకారులు, భారతీయం, భారతరత్నాలు, ఆంధ్రప్రదేశ్ జనరల్ నాలెడ్జి తదితర పది పుస్తకాలు (మొదటిది మినహా మిగతావి ఆదెళ్ళ శివకుమార్ గారితో కలిసి). ఇవి కాక జాగృతి మాసపత్రికలో సంవత్సరం పాటు అసోసియేట్ సబ్ ఎడిటర్ గా, శ్రీ దత్త ఉపాసన మాసపత్రికకు ఆరు నెలలపాటు సబ్ ఎడిటర్ గా పని చేశాను. దాదాపు 500 కవితలు; 120 కు పైగా రాజకీయ, సినీ, సామాజిక అంశాలకు సంబంధించిన వ్యాసాలు; 20 కి పైగా కథలు; రెండు బుర్రకథలు రాశారు.

3 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.