హెచ్చార్కె కు
రంగనాయకమ్మ చీవాట్లు

   వద్దిపర్తి బుచ్చి బాపూజీ, అల్వాల్, సికింద్రాబాద్ 

ప్రశ్న: రెండు విషయాల మీద, మీ అభిప్రాయం తెలుసు కోవాలనుకుంటున్నాను. (1) బహిరంగంగా, ఒక జంట ముద్దు పెట్టుకోవడం మనోహర దృశ్యమా ? (2) నక్సలైట్ల తో సంభాషణలు మొదలు, ఆరోగ్య శ్రీ వరకూ  ప్రతీ పనీ  రాజశేఖర రెడ్డి సదుద్దేశంతో చేశాడా

ఈ రెండు విషయాలనూ  సమర్ధిస్తూ, హెచ్చార్కె గారు రాశారు. ఒకటి, తన పేస్ బుక్ లోనూ, ఇంకోటి, ‘రస్తావెబ్ మ్యాగజైన్ లోనూ రాశారు.

 బహిరంగంగా జంటలు ముద్దులు పెట్టుకోవడం గురించి రాసిన పోస్టులో ఇలా ఉంది: “లిఫ్ట్ లో చాటుగా కాకుంటే రోడ్డు మీద బహిరంగంగా ఒక జంట ముద్దు పెట్టుకుంటే మాత్రం ఏమిటి? అంత మనోహర దృశ్యం అసభ్యం ఎలా అయ్యింది?ఎందుకయ్యింది?ఇండియా కు ఏమవుతోంది? మనం నడుస్తున్నది ముందుకా, వెనక్కా?” ఇది మొదటి విషయం. 

రెండో విషయం: రాజశేఖర రెడ్డి ని గొప్పచేస్తూ వచ్చిన యాత్రసినిమా మీద రాసిన సమీక్ష లో హెచ్చార్కె గారు రాజశేఖర రెడ్డి ని చాలా మెచ్చుకుంటూ రాశారు. వాటిల్లో ఒకటి ఏమిటంటే, నక్సలైట్ల తో సంభాషణలు జరపడం వెనక సదుద్దేశంఉందని. ఈ రెండు విషయాల మీదా మీ అభిప్రాయం చెప్పండి. 

జవాబుహెచ్చార్కే తన ఫేస్ బుక్ లో రాసింది మీరు చెప్పేవరకూ నాకు తెలీదు. యాత్రసినిమా మీద హెచ్చార్కె రాసిన సమీక్ష వచ్చిన సంగతి తెలుసు గానీ, అప్పుడు చదవ లేదు. ఫోన్లో చూస్తూ ఆ సన్నని అక్షరాలు చదవడం కష్టం గనక, ప్రింటౌట్ తీయించుకుని చదివాను. 

ముందు మొదటి విషయం గురించి మాట్లాడతాను. రోడ్డు మీద బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం గురించి: ఒక జంట ముద్దు పెట్టుకోవడం అనేది, ఆ ఇద్దరికీ సంబంధించిన, సన్నిహితమైన, వ్యక్తిగతమైన, ప్రయివసీ కి సంబంధించిన విషయం. అది బహిరంగంగా జరిగే, జరగవలిసిన విషయం కాదు. జంటలు బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం “మనోహర దృశ్యం” అయితే, జంటలు నగ్నం గా ఆలింగనాలతో గడిపే దృశ్యం మరింత “మనోహరమైనది”.  మనోహర దృశ్యాల కోసమే అయితే, ఆ నగ్న ఆలింగనాలను కూడా బహిరంగంగా రోడ్డు మీద ప్రదర్శిస్తే ఎంత మనోహరం! అంతేగాక, తల్లిదండ్రులు, తమ ముద్దుల్నీ, ఆలింగనాల్నీ పిల్లల ముందూ, ఇంట్లో ఉండే వృద్ధుల ముందూ ప్రదర్శించడం ఇంకెంత మనోహరం! ప్రయివసీ లేని, రోడ్ల మీద జరిపే ముద్దుల, ఆలింగనాల మనోహరాలు, “అది మా ఇష్టం! మా స్వేచ్ఛ!” అంటూ వాదించే బూర్జువా సంస్కృతి  లక్షణాలే! పీప్ షోలూ, పోర్న్ షోలూ  వంటి బూర్జువా అభిరుచులే!

ఇండియాకు ఏమౌతోంది?” అన్న  హెచ్చార్కే గురించి, ” హెచ్చార్కే కి ఏమౌతోంది?” అనాల్సివస్తుంది. “మనం నడుస్తున్నది ముందుకా, వెనక్కా?” అన్న   హెచ్చార్కే  గురించి, “హెచ్చార్కె నడుస్తున్నది ముందుకా, వెనక్కా?” అనే ప్రశ్న తప్పదు. 

ఇంక, ‘యాత్రసినిమా సమీక్ష లో విషయాల గురించి. నేను ఆ సినిమా చూడలేదు. కాబట్టి, ఆ సినిమా గురించి ఏమీ చెప్పలేను. కానీ, నక్సలైట్లతో చర్చల విషయంలోనూ, ఆరోగ్య శ్రీ విషయంలోనూరాజశేఖర రెడ్డికి “సదుద్దేశం” ఉందని యోగ్యతా పత్రం ఇవ్వడం అంటే, ఆ యోగ్యతా పత్రం ఇచ్చిన వ్యక్తికి బొత్తిగా శ్రామిక వర్గ దృక్పధం లోపించిందని అర్ధం. వెంగళరావు కాలం నుంచీ రాజశేఖర రెడ్డి వరకూ ఎన్ని క్రూరమైన బూటకపు  ఎన్కౌంటర్లు జరగ లేదూ? పైగా ఒక పక్క చర్చల పేరుతో, వాళ్ళ ఆనుపానులు కనిపెట్టి!  ఆరోగ్య శ్రీ వంటి బూటకపు సంస్కరణల పేరుతొ ప్రైవేటు వైద్య పెట్టుబడిదారులకు ప్రజా ధనాన్నిపంచలేదూ? ఆ డబ్బంతా ఎక్కడిది? శ్రామిక జనాల నుంచి పెట్టుబడి దారులు దోచిన అదనపు విలువ లోంచిపన్నుల పేరుతో వచ్చిన ఆదాయం కాదూ? ఒకప్పుడు, నక్సలైటు గ్రూపుగా జనాలు పిలిచిన, చండ్ర పుల్లారెడ్డి గ్రూపు లో పనిచేసి, ఆ గ్రూపు పత్రిక విమోచనకు ఎడిటరుగా ఉన్న హెచ్చార్కె ఒక బూర్జువా నాయకుడి పనుల వెనక సదుద్దేశం ఉందని కితాబివ్వడం ఆశ్చర్యమే. విరసం మేధావి వేణుగోపాల్, రాజశేఖర రెడ్డి కి బడ్జెట్ ప్రసంగాలు రాసి పెట్టినట్టు, హెచ్చార్కె అలాంటి పనులు చేయలేదు కాబట్టి, హెచ్చార్కే ని బూర్జువా నాయకుడి ఆరాధకుడిగా చిత్రించ లేము. కానీ, ఆయన ఉపయోగించిన రకం మాటలే ఉపయోగించి, “హెచ్చార్కేకి ఏమయ్యింది? అతను నడుస్తున్నది ఇంత వెనక్కా?” అని చివాట్లు మాత్రం పెట్టి తీరాలి.

(రంగనాయకమ్మకు హెచ్చార్కె చీవాట్లు వొచ్చే సంచికలో…)

 

రంగనాయకమ్మ

15 comments

 • రంగనాయకమ్మ గారి వ్యూ పాయింట్ సరైనది.
  పరిణితి ఉన్న మేధోవర్గం చేసే అనాలోచిత వ్యాఖ్యలు చాలా మంది లో గందరగోళం సృష్టిస్తాయి. బహిరంగంగా ముద్దులు అన్నప్పుడు అది ఇంకా వయసు రాని పిల్లల కు వృద్ధుల కు బహుశా ఆ పిల్లల తాలూకు బంధువులకు ఎంత కలవరం కలిగిస్తాయో తెలియని విషయం కాదు.. వర్మ లాంటి వారి సినిమాలే విపరీతంగా తూర్పార పట్ట బడ్డాయి.
  హెచ్ఆర్కే లాంటి వారు ఇలాంటి కామెంట్స్ చేయడం అస్సలు బాగాలేదు..
  ముద్దుల తోనే ఇండియా ముందుకు పోవడం అనే భావన ఏ రకంగానూ సరైనది కాదు..

  మనోహరం ఎవరికి ? 70 శాతం మంది అర కొర చదువులు కూడా లేకుండా రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో ఉన్న దేశంలో ఇలాంటి దృశ్యాలు మనోహరం అనుకునే పరిస్థితి ఉంటుందా?

  ఏ అడ్డా కూలీల దగ్గరో ఇలాంటి మనోహర దృశ్యాలు చూసి ముచ్చటించుకునే అవకాశం అస్సలు వుండదు..
  గ్రామ సీమల్లో అయితే మరీ దారుణం..

  అవును ఇండియా వెనక్కు వెళుతుంది మీ రన్నట్టు..
  దానికోసం నిరంతరం కృషి చేసే వారికి సైతం ఈ మాటలు అసలే నచ్చవు..

  ఇండియా ముందుకు పోవాలనుకునే వారికి సైతం ఇలా బహిరంగంగా ముద్దులు పెట్టుకుంటే నే ముందుకు వెళతాం అన్న భావన నచ్చదు.

  • You are right sir,comments from HRK like leftists would create confusion in d minds of many. I too surprised when I saw his comments.

 • Hrk గారికి బహిరంగ ముద్దుల విషయంలో రంగనాయకమ్మ గారి చీవాట్లకి కారణాలు నాకు నచ్చేయి. రాజశేఖరరెడ్డి విషయంలో నేను hrk పక్షం.

 • ఒకరకంగా హెచ్చర్కే ఈ సంపుటిలో రాసిన సంపాదక్యానికి మంచి జవాబు

 • రంగనాయకమ్మ గారి జవాబు ‘మనోహరం’గా ఉంది!

  హెచ్చార్కే గారి వ్యాఖ్య (ఆరోగ్యశ్రీ) చూశాక. … ప్రపంచ బాంకు ముద్దుబిడ్డ అయిన
  చంద్రబాబు ‘జన్మభూమి’ కార్యక్రమాన్ని శ్లాఘించి విరాళమిచ్చిన మహీధర రామ్మోహనరావు గారు గుర్తొచ్చారు.

 • అవును హెచ్చార్కే గారు కొన్ని విషయాలలో ఎందుకనో కన్‌ఫ్యూజ‌న్ గా రాస్తారు. అమెరికాలో ఉంటూ ఉండటం వల్ల అయి ఉఁటుంది, అక్కడ ఉన్న స్వేచ్చ ఇక్కడ లేదన్న బాధ ఆయనకు ఉన్నట్లున్నది.

 • రంగాజీ..
  రెండో టాపిక్ మరీ దారుణం. నమ్మక ద్రోహం. ఎంత వ్యతిరేకత ఉన్నా, పైకి మంచిగా చర్చల పేరుతో… పిలిపించి ఆనవాళ్ళు కనిపెట్టి చంపించటం అనేది, అదంతా కో ఇన్సిడెంట్ గా జరిగిందీ అని నాకు నమ్మసఖ్యంగా అస్సలనిపించదు. కావాలనే ప్రీ ప్లాన్డ్ గా చెసినట్లనిపిస్తుంది.

  • 4రాజశేఖర రెడ్డిదినమ్మక ద్రోహమే.ఆ విషయం ఆ చర్చలు ఏర్పాటుకావడానికి ప్రయత్నాలు చేసిన సిటిజన్స్ కమిటీ సభ్యులనేవారిని అడిగినా చెబుతారు.

 • ఈమె చాదస్తం తెలిసిందే!
  ఈమె అన్నదాన్నే రివర్సులో అంటే ఇలా అవుతుందేమో మరి.
  జంటలు బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం “మనోహర దృశ్యం” కానట్లయితే, భర్త, భర్తకు నాలుగు అడుగులు వెనకాల కొంగు కప్పుకొని, తలవంచి నాజూకుగా నడచే భార్య దృశ్యం మనోహరంగా వుంటుంది కాబోలు అనాల్సుంటుంది.
  ఇంకా మనోహరంగా వుండాలంటే భర్త పేరు కూడా వుచ్చరింపడానికి సిగ్గుపడుతూ తలుపుచాటున నిలబడే స్త్రీ దృశ్యం ఇంకా మనోహరంగా వుంటుంది.

  రెండో పాయింటు చీవాట్లు సరైనవే!

 • ఇవి చీవాట్లు కావేమో..సూచనలు అని అనుకుంటున్నా.

 • బహిరంగంగా ఒక పేరెంట్ చిన్న పిల్లను ముద్దుపెట్టుకుంటే దాన్ని ఆమోదించే మనం ప్రేమికులు ముద్దు పెట్టుకుంటే ఆమోదించలేని స్థాయికి ఎలా వెళ్ళామో ఆలోచించుకోవాలి. పైగా బహిరంగంగా ముద్దు పెట్టుకుంటే బహిరంగంగా రతి క్రిడను సలపడాన్ని కూడా ఆమోదించాలని వితండ వాదాన్ని ఆశ్రయించడం ఇంకా ఆశ్చర్యం కలిగించేది. బహిరంగంగా మల విసర్జనని కూడా సమర్ధించాలేమో అని వాదించవచ్చు. ఆరోగ్య కారణాల వాళ్ళ అది సమర్ధనీయం కాకపోవచ్చు వాసన సంగతి అటుంచితే. సిగ్గు బీడియం ప్రయివసీ లాంటివి వ్యక్తిగత విషయాలుగా ఉండాలి సామజిక అందరము కింద ఉండాలా? జననాంగాల పట్ల సిగ్గు శృంగారపట్ల సిగ్గు పబ్లిక్ స్థలాల్లో శృంగారం చేసుకోవడానికి స్థలాలు కావాల్సినంత లేకపోవడమూ గురించి అందరము ఆలోచించాల్సిందే. ఏ సిగ్గులేక సహజమైన జీవనం సాగించే జంతువులకు లేని సిగ్గు అనే ఎమోషన్ హోమో సేపియన్లకు ఎలా వొచింది? ఏమో? . కానీ ప్రాన్సులో కానీ నెదర్లాండ్స్లో కానీ బహిరంగంగా ముద్దులు శృంగారం రెండు నేరం కావు. మాములుగా పార్కుల్లో జరిగిపోతూ వ్వుంటాయి. అక్కడి ప్రజలు ఆయా స్థాయి మారారన్న విషయం మనం గమనిస్తే అవన్నీ అసహజమైనవనే దురభిప్రాయం మారవచ్చు. 18 వ శాతాబ్దపు విక్టోరియన్ నైతికత ను బ్రిటిషువాళ్ళు ప్రవేశపెట్టిన తరువాత ఈనాటికిమనం దాన్ని అసలు ప్రశ్నించామా? పబ్లిక్ ప్లేసులో మగాడు నిక్కరేసుకుంటే ఆడది వేసుకుంటే అంతకంటే. పెళ్ళిముందు గట్టిగా నవ్వితే పెళ్ళిముందు సెక్స్ తప్పు…. ఇలాఇలాగ సెక్సువాలిటీ ని కంట్రోల్ చేసే సంస్కృతిలో భాగమే పబ్లిక్గా ముద్దు పెట్టుకోవడం తప్పు అని వాదించడం. అది మన అస్థిసంబధాలు పితృస్వామ్య పరిరక్షణ ఆధిపత్య సంబంధాల పునరుత్పత్తి చేసే సంసకృతిలో భాగమే.

  • ముద్దుల విషయంలో రంగనాయకమ్మ గారు చేసిన వాదనలో slippery slope fallacy దోషం ఉంది. ఆ విషయంలో నేను ఆవిడతో అంగీకరించడంలేదు.

 • రంగనాయకమ్మగారి అభిప్రాయంతో నేను నూరుశాతం ఏకీభవిస్తున్నాను – బహిరంగ ముద్దులు మనోహరం అనడం అంటే బహిరంగ శ్రుంగారం ఇంకా మనోహరం గానే ఉంటాయి –
  “మనోహర మెదళ్ళకు” ఆ విశ్రుంఖలత్వాన్నే – స్వేఛ్ఛ ముందుకెళ్ళడం గా చిత్రీకరిస్తారు “విశ్రుంఖల మనోహరులు!!” పైగా కొందరు
  రంగాజీ అభిప్రాయాన్ని వక్రీకరిస్తూ ఘోషా అనీ అదనీ ఇదనీ పక్కదారి పట్టించే వ్యాఖ్యలు చేస్తూన్నారు!!.
  ఇంక రాజ్యం అప్పటి భూస్వామ్య ఫాక్షనిస్టు
  నియంత రాజశేఖరరెడ్డి చర్చలకు పిలవంగనే
  ఎగేసుకురావడం – అసలు జనబాహుళ్యాన్ని
  విప్లవపోరాటాలకు సిధ్ధం చేయకుండా ఏదో కొందరు అమాయక గిరిజనులను పదుల్లోనో
  వందల్లోనో వారిని సిధ్ధంచేసీ, శత్రువు శక్తియుక్తులూ ఆయుధసంపత్తీనీ లెఖ్ఖలోకి తీసుకోకుండా – తమ శక్తియుక్తులను అంచనా
  వేసుకోకుండా – అపుడపుడూ అక్కడక్కడా
  కొందరు భూస్వాములనూ శత్రువులనూ మట్టుబెడుతూ, అదే విప్లవోద్యమంగా చిత్రించుకుంటూ మురిసిపోవడం నక్సల్ ఉద్యమ
  నాయకత్వ బలహీనత. కార్మికరంగంలో రైతురంగంలో సామాన్యజనంలో ఉద్యమాలు
  నిర్మిస్తూ- విప్లవకారులపట్ల సానుభూతీ అవగాసనా పెంచకపోవడం, ప్రజాబాహుళ్యాన్ని
  అందుకు సిధ్ధం చేయకపోడం – ఇవన్నీ విప్లవోద్యమ
  నాయకత్వ బలహీనతలు!!
  ఇంకోపక్క విప్లవకారుల మేతావివర్గం తమ
  అయోమయంతో స్వార్ధంతో – శత్రువుకు తమ రచనా పటిమతో సాహితీ సహకారం అందిస్తూంటుంది!! అదేసమయంలో ఆ ఫాక్షనిస్టు
  భూస్వామ్య నియంత రాజశేఖరరెడ్డి తను ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం నక్సలైట్లను
  చర్చలకు పిలవడం – నక్సల్ నాయకత్వమేమో
  దానిని స్వీకరించి – అదేదో పండగలాగా తరలివచ్చీ
  శత్రువు (రాజ్యం అతిధిగ్రుహాల్లో) గెస్టుహౌసుల్లో
  “కొత్త అల్లుళ్ళలాగా” ఆతిధ్యం పొందడం !!
  అదనుచూసి ఆఫాక్షనిస్టు భూస్వామ్య నియంత
  తన రకరకాల అంగబలం ద్వారా వీరి ఆనుపానువులు కనిపెట్టి “మెరికెల్లాంటి విప్లవ
  యోధులను మట్టుబెట్టి” నక్సల్ ఉద్యమ వెన్నెముక విరిచి, తను ముందుగా వేసుకున్న
  ప్రణాళికను అమలు పరచడం!!” ఇదంతా ప్రణాళిక
  ప్రకారమే జరిగింది – దీనిని హెచ్చార్కె తన అయోమయంతో రాజశేఖరరెడ్ఖి “సదుద్దేశంగా”
  వర్ణించడం……..!!

 • ఈ రచనకు స్పందిస్తున్న మితృలందరికీ రస్తా కృతజ్ఞతలు, మిగతా రచనలకు వచ్చే స్పందనల్లాగే.

  ఈ స్పందనల్లో అనివార్యంగానే సంపాదకుడిగా, రచయితగా నా ప్రస్తావనలు వుంటాయి. వీటికి నేను ఇక్కడే జవావివ్వవొచ్చు కదా అని ఒక మితృడు (ఫేస్ బుక్ లో) ఆడిగారు. ఇవ్వట్లేదు, కారణాలు రెండు 1. ఇందులో చాల వరకు రంగనాయకమ్మ కు ప్రతిధ్వనులు లేదా కంకరింగ్ స్టేట్మెంట్లు. ఆమెకు నేను రాయాల్సి వున్న జవాబే వారికీ జవాబు. 2. అలా కాని అదనపు అంశాలను ఆ (రానున్న) జవాబులో మనసులో వుంచుకుంటాను. అందువల్ల పేరుపేరునా ఇక్కడ జవాబులు రాయలేదు. మూడో రకం స్పందనలూ వున్నాయి. అవి మరీ పచ్చి రైటిస్టుగా వున్నాయి. కాకపోతే రంగనాయకమ్మ రచన వాటిని ఆకామడేట్ చేస్తుంది. ఇస్తే వాటికీ కూడా అప్పుడే జవాబిస్తాను, లేదా ఇగ్నోరె చేస్తాను. ఓకేనా?!

 • బహిరంగ ప్రదేశాల్లో చాటుచాటుగా ముద్దులు లాక్కోవటం మనోహరమే—ముద్దులు లాక్కొనేవాళ్ళకీ, లాక్కోగలవాళ్ళకీ. మనం ముసలాళ్ళం ఏమనుకుంటే వాళ్ళకెందుకు. అలాగని చట్టాలు సరేనన్నంత మాత్రాన బహిరంగ ప్రదేశాల్లో అందరూ చూస్తుండగా పెట్టుకుంటారా, చట్టాలు కాదన్న మాత్రాన బహిరంగ ప్రదేశాల్లో చాటుగా పెట్టుకోవటం మానతారా. అలికిడి లేని ఈ ముద్దులు సదా ఇవ్వబడుతూనే ఉంటాయి, పుచ్చుకోబడుతూనే ఉంటాయి. మునిసిపల్ పార్కుల్లోనే కాదు, కోతలూ కుప్పనూర్పుళ్ళ కాడ కూడా. ఇప్పుడనేముంది, పల్లవ చోళ కాకతీయ రాజ్యాల్లో తుంటరోళ్ళు ఉండరా. ఇంతకీ ఈ విషయంలో చట్టాల అమలును తీవ్రంగా పట్టించుకునే (అంటే ఎవరైనా రెడ్ లైట్ దాటితేనో, పాన్ ఉమ్మితేనో చట్ట ప్రకారం ప్రొసీడయ్యే) భారత పౌరులు ఎప్పుడు పోలీసులకు ఫోన్ చేయాలి? 100 ఎప్పుడు డయల్ చేయాలి? తమ పరిధిలోని ఖాఖీ యూనిఫాం దగ్గరకు పరిగెత్తుకెళ్ళి ఎప్పుడు ఫిర్యాదు చేయాలి? బహిరంగ ప్రదేశాల్లో చేతులు పట్టుకోవటం మొదలైనప్పుడేనా, చెంపలు నిమరటం దాకా వచ్చాకనా, జుట్టు సర్దేంత దూరం వెళ్ళాకనా? మరి అది చెవిలో గుసగుసలాడటమో ముద్దో ఎలా తేల్చుకోవాలి, ఎంత దగ్గరికెళ్ళి నిర్ధారించుకోవాలి? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్స్‌లాగ ‘కిస్ కంట్రోల్ రూమ్స్’ పెట్టాలా? ఇదంతా సరే.. బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా పూల మీద తుమ్మెదలు వాలటం, కరెంట్ తీగల మీద అసభ్యంగా పిచ్చుకల ముక్కులు పొడుచుకోవటం… వీటి గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరు? మన సంగతి సరే, సాటి పిచ్చుకలకైనా పట్టదా? తనకు లేని ముద్దులు పక్కనో పిచ్చుకకి దొరుకుతుంటే ఎందుకు పిచ్చుకలు పట్టించుకోకుండా తలగోక్కుంటాయి? పిచ్చుకలు ముక్కులతో పొడుచుకుంటే చూసి ఆహా అనుకునే మనుషులు కుక్కల్ని చిత్తకార్తెలో చూసి ఎందుకు తోలేస్తారు, పక్కకు తప్పుకుపోతారు? ఒకవేళ అందుకే బహిరంగ ముద్దులు చాటు ప్రదేశాల్లో పెట్టుకుంటారు కానీ, చాటు సెక్స్‌ని బహిరంగ ప్రదేశాల్లో జరుపుకోరంటారా? జనానికి కామన్ సెన్స్ చట్టాలు నేర్పాలా? చట్టాల్లో కామన్ సెన్స్ లేనప్పుడు జనం పాటించాలా? ఇంతకీ బహిరంగంగా బిడ్డకి పాలివ్వటం గురించి చట్టమేమంటుంది? ఎప్పుడు ఇవ్వాలీ ఎప్పుడు ఇవ్వకూడదన్నది బిడ్డ ఏడ్పు తీవ్రతని బట్టి నిర్ధారించుకోగల తల్లి కామన్ సెన్స్‌కే వదిలేస్తే ప్రమాదకరం కాదంటారా?

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.