కుంక బొంకుడి గుడ్లు

రైలు ఎక్కడో ఆగింది. ఉక్కపోతగా ఉండడంతో అందరితో పాటు బయటకు దిగాను. ఒక చిన్న ఊరు. చిన్న ప్లాట్ ఫామ్. చాలా ఎత్తుగా ఉంది. దూరంగా ఒక పల్లె. ఇంకా దూరంగా పట్నం తాలూకు అపార్ట్మెంట్ లైట్లు పెద్ద స్తంభాలకు తళుకులు అంటించినట్లుగా మెరుస్తున్నాయి. చల్లటి గాలి వీస్తోంది. బయటకు దిగిన కొందరు మళ్ళీ లోపలికి ఎక్కేస్తున్నారు.

నిద్ర పడితే రైలు వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో నిద్ర ఆపుకునే ప్రయత్నం చేస్తున్నాను. తెల్లవారుజామున మూడున్నర అయింది. అనుకున్న సమయానికి వెళ్ళిపోతే నాలుగున్నరకల్లా నేను దిగాల్సిన చోటు వస్తుంది. వూరు ఇక్కడికి దగ్గరలోనే ఉన్నట్లుంది. ఇంకా గంట దాకా రైలు కదలదని చెప్తున్నారు. నాకేమీ లగేజ్ కూడా లేకపోవడంతో ప్లాట్ ఫామ్ మీద బెంచి మీద కూర్చున్నాను.

మెల్లగా కునుకు పడుతోంది. అప్పుడప్పుడు కన్ను తెరిచి రైలు ను చూస్తూ మళ్ళీ కునుకు తీస్తున్నాను. రైలు కదులుతున్నట్లుంది. కన్నులు తెరవ బుద్ధి కావట్లేదు. ‘లే రైలెక్కి వెళ్ళాలి కదామనసు చెబుతున్నా వినిపించుకోవడం లేదు. నిద్ర వస్తోంది. బలవంతాన లేచి నుంచున్నా. రైలు దాదాపు వెళ్ళిపోతోంది. మత్తు వదిలింది. ‘ఎలా ఇంకో రైలు ఉందా?’ వెళ్లి స్టేషన్ మాస్టర్ ని అడిగాను. ‘ఊరు చేరడానికి అడ్డదారి ఉంది. రెండు కిలోమీటర్లు. పొలం నుంచి వెళితే కాలిబాట ఉంది. వెళ్ళమన్నాడు.

బయల్దేరాను. కల్తీ లేని తెల్లటి వెన్నెల. పొలాలన్నీ కుప్పనూర్చి శుభ్రంగా ఉన్నాయి. అక్కడక్కడా గుమ్మడికాయలు వెన్నెల్లో ఎర్రగా మెరుస్తూ వున్నాయి. ఇంకా ముందుకు వెళ్ళాను. అన్నీ గుమ్మడికాయలే. అయితే ఇన్నా? రంగురంగులుగా? ఆశ్చర్యపోయాను. తెల తెల్లవారుతోంది. మసక వెలుతురు.

ఒక గుమ్మడికాయను పట్టుకుని పైకి లేపాను. గుమ్మడికాయ కాదు. అంత పరిమాణంలో ఉన్న పెద్ద గుడ్డు. జంతువు గుడ్డై ఉంటుందో? ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని గుడ్లా.  ఎర్రగా పచ్చగా నీలంగా. పొలం అంతా ఎలా పడగా పడి ఉన్నాయి.

పొలానికి దూరంగా ఒక కుంట దగ్గర ఒక లావుపాటి మనిషి కూర్చున్నాడు. దగ్గరికి వెళ్లాను. తను గుడ్లను కడిగి పక్కన పెడుతున్నాడు. ‘వెర్రివాడు గుడ్లు కడగడ మేమిటి?’ అనుకుంటూ దగ్గరికి వెళ్లాను.

ఏమయ్యా ఎవరు నువ్వు? గుడ్లు కడుగుతున్నావేంటి?’ అన్నాను. అతను నా వైపు తిరిగాడు. ఒక్కసారి దడుచుకున్నాను. రెండు కళ్ళుూ లేవు. నుదుటి మీద ఒక పెద్ద కనుగుడ్డు వేలాడుతోంది. అది లోపలి వైపుకు చూస్తోంది. చెవులు చాలా చిన్నగా ఉన్నాయి. ముఖమంతా మాస్క్ పెట్టినట్టు వుంది.  బాగా వాగుతాడేమో పెదవులు బాగా పెద్దగా ఉన్నాయి. బాగా తింటాడేమో పెద్ద నోరు.  నవ్వుతున్నా మాట్లాడుతున్నా చిన్న చిన్న రాళ్లు ఎగిరొచ్చి పడుతున్నాయి. పెద్ద బొర్ర. నడ్డి. కూచున్న చోటునుంచీ కదల లేకుండా ఉన్నాడు. కుర్చీలో అతుక్కుని కూర్చున్నాడుఎవరు నువ్వు?’ అన్నాను. ‘నా పేరు కుంక బొంకుడుఅన్నాడు. నవ్వాను. ‘అదేం పేరు?’ అన్నాను. ‘చిన్నప్పుడు బడిలోకుంకఅనేవారు. బొంకుతూ వుండే వాడిని. అందుకే రెండూ కలిపి ఇలా’. నవ్వాడు. ‘ఇక్కడ ఏం చేస్తున్నావు?’ అన్నా.  ‘ గుడ్లన్నీ కడిగిపెడుతున్నా’. ‘ఎందుకు?’ అన్నాను. ‘ గుడ్లు ఐదేళ్లకోసారి పిల్లలు పెడతాయి పిల్లల్ని సాకి మళ్లీ గుడ్లు పెట్టిస్తాను’. ‘ పిల్లలు, గుడ్లు ఎందుకు పనికి వస్తాయి?’ అన్నాను.  ‘వీటికి పెద్ద నోళ్లు ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడి భూములు లాగేస్తాయి. డబ్బులు తెచ్చిస్తాయి. నా వారందరికీ కోటానుకోట్ల డబ్బులు. అందర్నీ భయపెడతాయి. కాబట్టి నాకు అందరిమీద అధికారం’.

ఏం పిల్లలు పెడతాయిఅన్నాను. మళ్లీ నవ్వాడు. ‘ఒక్కొక్క గుడ్డులోంచి వందల వేల కొండచిలువలు. అనకొండలు. రంగురంగులుగా. చూడు కళ్ళు మెరిసిపోతాయ్. ఊరు నీది? ఒక్క వారం ఇక్కడే ఉండు. గుడ్లన్నీ పగులుతాయి. పొలమంతా కొండచిలవ పిల్లలతో నిండిపోతుంది. మళ్లీ  అంతా నాకే. నాకే. నాకే.’ అని అరుస్తున్నాడు. హా అంటూ నవ్వుతున్నాడు. చెవులు పగిలి పోతున్నాయి. ‘ఏమయ్యోయి రైలు, రైలు పోతోంది.లేఅరుస్తున్నారు ఎవరో. ‘ఆగు. ఒక వారం వుండి చూడు గుడ్లు పగులుతున్నాయిఅరుస్తున్నాడు కుంకబొంకుడు.

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.