భిన్నమైన అత్తా కోడళ్ళ కథ
‘ముఖర్జీ గారి భార్య’

కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియో కన్పించింది. ‘పెద్దయాక నువ్వేం చేస్తావ్?’ అని నాలుగేళ్ళ పాపను అడిగితే ‘పెద్దయితే పెళ్లి చేసుకుని అత్తను చంపేస్తా’ అని తడుముకోకుండా సమాధానమిస్తుంది ఆ పాప ఆ విడియోలో. చిన్న పిల్లలపై కూడా టీవీ సీరియళ్ళ ప్రభావం అలా వుందన్నమాట. పురుషుడ్ని పంచుకోడానికి  అత్త-కోడలు, అక్క-చెల్లెలు, తోటికోడళ్ళు, వదిన-ఆడపడుచులు – ఇలా ఆడాళ్ళు ఒకరికొకరి శత్రువులుగా మారిపోతూ, అక్రమ సంబంధాలను కూడా సహజంలా చూపే కంగాళీ కథలతో కంపుగొడుతున్నాయి బుల్లితెరలు. సమస్యను కొంత వాస్తవంగా చిత్రించినా, సమస్యకు గల పితృస్వామ్య మూలాల్ని తెలుసుకోనీయకుండా జాగ్రత్త పడుతున్నాయి ఈ కథలు.  ఇటువంటి స్థితిలో ఈ మహిళా దినోత్సవం రోజు విడుదలైన ‘ముఖర్జీ దార్ బొవ్’ సినిమా అత్తాకోడళ్ళ సమస్యకు హృద్యమైన పరిష్కారమిచ్చింది.  సంతోషకర విషయమేమిటంటే, బెంగాలులో అత్తాకోడళ్ళు కలిసొచ్చి చూస్తూ సినిమాను భారీ విజయం వైపు పరుగులు పెట్టిస్తున్నారు.

కథ విషయానికొస్తే అది కోల్కతాలోని మధ్య తరగతి ముఖర్జీ పరివారం. ముసలాయన చనిపోయాడు. ముఖర్జీ గారి భార్యకు ఇక కొడుకే ఆధారం. కాబట్టి ఆమె తన కోడలు అధితిని పోటీగా భావిస్తుంది. కోడలితో ఆమె ప్రవర్తన వింతగా మారిపోతుంది. మార్నింగ్ టీ ఎన్ని గంటలకు చేయాలి దగ్గర్నుంచి కూరలో ఉప్పెంత వేయాలి వరకు ప్రతిచోటా తంటా తెచ్చే విధంగా వుంటుంది ఆమె ప్రవర్తన. భయం, జ్వరం అన్న నెపంతో కోడల్ని తన గదిలో పడుకోమని బలవంత పెడుతూ, ఆ భార్యాభర్తల్ని కలవనీయకుండా చేస్తుంది. భర్త బరువు తగ్గాలని పంచదార తక్కువ వేస్తే, అత్త మధ్యలో కల్పించుకుని ఎక్కువ చెక్కెర పోస్తుంది. పోస్టు గ్రాడ్యుయేషన్ చదివిన కోడలు (ఆమె భర్త మాటల్లో)  ‘కొంచెం మేధావి టైపు’. ఆమెకు నచ్చని టీవీ సీరియళ్ళను పెద్ద సౌండ్ తో చూస్తుంది అత్త. పూజ గదిలో ఉండాల్సిన బాబాజీ ఫోటోను హాలులో పెట్టించాలంటుంది. కోడలు ఎంతో సహనంగా వ్యవహరించినా అత్తలో మార్పు రాదు. అత్త కోపం వలన అనుకోకుండా పాపతలకు గాయమౌతుంది. ఇక లాభం లేదు, ఈ సమస్యకు తప్పనిసరిగా సమాధానం అవసరమనుకుంటుంది కోడలు అధితి. అరిత్రికా భట్టాచార్య అనే సైకలాజిస్టును ఆశ్రయిస్తుంది. ‘సైకలాజిస్టు అంటే పిచ్చివాళ్ళ డాక్టర్’ అని సమాజంలో తప్పుడు అవగాహన వుంది. అత్త మొదట్లో ఒప్పుకోకపోయినా, తర్వాత కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకోడానికి అంగీకరిస్తుంది. ఆ సైకలాజిస్టు అత్తాకోడళ్ళ మధ్య ఎలా సఖ్యతను కుదిర్చిందన్నది మిగతా సినిమా.

మొదటి భాగంలో సమస్యను, సమస్య తీవ్రతను చిత్రించిన సినిమా ‘విశ్రాంతి’ అనంతరం సమస్యకు పరిష్కారం వెదుకుతుంది. చిన్న చిన్న సందర్భాల ద్వారా అత్తాకోడళ్ళ మధ్య అగాధాలు ఎలా ఏర్పడ్డాయో విశ్లేషిస్తుంది. సమస్యను అత్త కోణం నుండి, కోడలి కోణం నుండి విడివిడిగా వింటుంది సైకలాజిస్టు.

అత్త చెప్పిన సంగతులు – “శైశవంలోనూ, కౌమారంలోనూ చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేక పోయింది. తన అన్నయ్యలతో పాటు తోక కప్పలను వేటాడాలనుకుంటే ఇంటివారు వెళ్ళనివ్వలేదు. స్టేజి మీద డాన్సు చేయాలనుకుంటే ఆఖరు క్షణంలో అమ్మ తన ఎర్రరంగు చీరను దాచేస్తుంది. (కోడలు ఇంట్లో లేనప్పుడు బీరువాలోని ఎర్ర చీరను తీసి సుతారంగా ఎందుకు నిమిరిందో మనకప్పుడు అర్ధమవుతుంది.) తను ఇష్టబడిన కుర్రాడిని అన్నయ్యలు చితకబాదారు. పెళ్లయిన కొత్తలో తన అత్త తనకు పాచి రొట్టె పెట్టింది. మొదట్లో బాధనిపించినా క్రమంగా అలవాటు పడింది. కొడుకు పుట్టాక అతడే తన సర్వస్వం అయిపోయాడు.”

కోడలు చెప్పిన విషయాలు – “తను ఇంటిలో ఒకే బిడ్డ. చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెరిగింది. తను ఇష్టపడిన వ్యక్తీ ఎదుట తన ప్రేమను వ్యక్తపరిచి భంగపడింది. ఆడాల్లెపుడూ తమ ప్రేమను తెలపకూడదని స్నేహితులు అన్నారు. పెళ్లయిన కొత్తలో తన అత్తయ్య తనకు అన్నింటిలోకీ చిన్న సైజు చేప ముక్క వేయడం తనకు బాధ కలిగించిన ఎప్పటికీ మరిచిపోలేని విషయం.”

‘నీకు చిన్న ముక్కవేసి తను పెద్ద ముక్క తిన్నదా?’ – సైకలాజిస్టు.

‘అలాని కాదు, అన్నింట్లోకీ పెద్దది నా భర్తకు వడ్డించింది’ – కోడలు.

‘ఈ వ్యత్యాసం సమాజంలోంచి వచ్చింది. మగవారికే మంచివన్నీ. మిగతావే ఆడవారికి.’  పాచి రొట్టె తినడం నేర్చుకున్న అత్త కోడలికి చిన్న చేపముక్కను వేయడంలో తప్పు లేదనుకుంది.

‘కోడలులో నచ్చని విషయం?’ – సైకలాజిస్టు అత్తతో.

‘నన్ను మొదటి సారి అమ్మ అని పిలిచినపుడు అయిష్టంగా పిలిచింది’ – అత్త. (బెంగాలీలు అత్తమ్మను అమ్మ అనే పిలుస్తారు.)

’26 సంవత్సరాలు తన తల్లిని అమ్మ అని పిలిచిన తర్వాత మరొకరిని హఠాత్తుగా అలా పిలవడంలో ఇబ్బంది ఉండదా?’ – సైకలాజిస్టు.

‘కోడలు వేరేగా కొత్త టీవీ కొనడం నచ్చలేదు’ – అత్త.

‘నాకు సీరియళ్ళు నచ్చవు. నేను కొత్త టీవీ కొన్నాను గానీ కొత్త ఇల్లు కొనలేదుగా?’ – కోడలు.

‘నేనొక టీవీ కొనుక్కున్నాను అనే కంటే మన కోసం ఒక కొత్త టీవీ వస్తోంది అని చెప్పొచ్చుగా. కొన్నిసార్లు మనకు తెలీకుండానే మనం ప్రయోగించే మాటలు పూడ్చలేని అగాధాల్ని సృష్టిస్తాయి’ – సైకలాజిస్టు.

సైకలాజికల్ కౌన్సిలింగ్ ద్వారా అత్తాకోడళ్ళ సంబంధంలో గణనీయమైన మార్పు వస్తుంది. ఇద్దరూ స్నేహితుల్లా మారిపోతారు. కలిసి ఐసుక్రీములు తింటారు. ఒక పెగ్గు వేయాలన్న రహస్యకోరిక కూడా తీర్చుకుంటారు. ఆడవాళ్ళిద్దరి అనూహ్యమైన స్నేహం పురుషాధిక్యతను దెబ్బతీస్తుంది. ‘తను ఇంటికి ఆదాయం తెస్తున్న యజమానిని’ అన్న విధంగా ప్రవర్తిస్తాడు కొడుకు. ‘ఇంటి పనిని శ్రమగా మార్చి వెలకడితే నా జీతం ఎంతున్నట్టు?’ అని ఎదురు ప్రశ్నించే కోడలిని సమర్ధిస్తుంది అత్త.

సినిమా క్లైమాక్సుకు చేరేసరికి, తనకు వచ్చిన ఉద్యోగ పత్రాలు దాచేసింది తన అత్తయ్యే అని తెలుస్తుంది కోడలికి. ఉద్యోగం చేయాలన్న తన చిరకాల కోరికను తను తల్లిగా భావించిన అత్తే చిదిమేసిందని బాధపడుతుంది కోడలు.

సైకలాజిస్టు ప్రోద్బలంతో మహిళా దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తుంది అత్త. తన జీవితంలోని లేమిని తన కోడలి జీవితంలోకి బదలాయించానని బాధపడుతుంది. ‘మన ఆడాళ్ళమంతా వేరొక మగాడి పరిచయం కింద బ్రతుకుతున్నాం. నేను కూడా ముఖర్జీ గారి భార్యగానే బ్రతికానిన్నాళ్ళు. భర్త తర్వాత కొడుకు ద్వారా పరిచితమవ్వాలని ప్రాకులాడాను. ఈ మహిళా దినోత్సవం రోజు మన పేర్లను మనం మనకు బహుమానంగా ఇచ్చుకుందాం. నా పేరు శోభారాణి. ఈమె నా కోడలు అధితి’ – అని సభకు పరిచయం చేస్తుంది. అధితి పేరును మనం సినిమాలో ఒకటి రెండు సార్లు విన్నా, ‘ముఖర్జీ గారి భార్య’గా ముసలమ్మ పేరును సినిమా ఆఖర్లోనే వింటాం. తన మానసిక సమస్యకు పురుషాధిక్య వ్యవస్థే కారణమని తెలుసుకున్న తర్వాత తన పేరును తానే ప్రకటించుకుంటుంది శోభారాణి. సామ్రాజ్యవాదంతో మనువాదం కుమ్ముక్కై సాగుతున్న వ్యవస్థను సమర్ధించే టీవీ వాళ్ళు ఆడవారికి ఇటువంటి చైతన్యం కలగాలని కోరుకోరు.

అత్తగా అనశువా మజుందార్, కోడలిగా కోనీనికా ముఖర్జీ, సైకలాజిస్టుగా రితుపర్ణ సేన్ గుప్తా అద్భుతంగా నటించారు. చిన్న పాత్ర అయినా పొరుగింటి ‘పుతుల్’ పాత్రలో అపరాజితా అధ్య బాగా నటించింది. పుతుల్ కూడా తన భర్త దౌష్ట్యాన్ని భరిస్తోంది. ఈ నరకం నుండి బయటపడమని ఆమెకు అధితి చెపుతున్నపుడు నేపథ్యంలో రవీంద్రుని ‘ఆకాశపు పక్షి- పంజరపు పక్షి’ కవితను వినిపించడం బాగుంది. భర్తతో గొడవ పడిన కోడలిని ఇంటి డాబాపై అత్త ఓదార్చే దృశ్యం హృద్యంగా వుంటుంది.

అత్తకు డాన్సు చేయాలన్న కోరిక తీరలేదు. కోడలికి కరాటే నేర్చుకోవాలని వున్నా, తల్లిదండ్రులు డాన్సు నేర్పిస్తారు. అందుకని కోడలు తన కూతుర్ని కరాటే నేర్పిస్తుంటుంది. ఆడపిల్లలకు సొంత ఇష్టాలూ, కోరికలు తీరేదెన్నడో! భర్త (విశ్వనాథ్) ఆఫీసులో సంభాషణ ఆడవాళ్ళను ఎందుకు ఉద్యోగానికి పంపించకూడదు అన్న విషయంపై సాగుతుంటుంది. వారి బాస్ మాత్రం ఆడదే కావడం చాలా ఇబ్బందిగా వుంటుంది వారికి.

సుప్రియా దత్తా సినిమాటోగ్రఫి, ఇంద్రదీప్ దాస్ గుప్తా సంగీతం బావుంది. కొత్త దర్శకురాలు ప్రీతా చక్రవర్తితో పాటు, కథా రచయిత్రి సామ్రాజ్ఞి బందోపాధ్యాయను కూడా ప్రశంసించక తప్పదు. అత్తాకోడళ్ళ సమీకరణాన్ని మార్చేసే ఇటువంటి సినిమాలు మరిన్ని రావాలి. మరిన్ని భాషల్లో రావాలి

బాలాజి (కోల్ కతా)

ఐకా బాలాజీ: చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్థాపక సంపాదకులు. సాహిత్యం సినిమా విమర్శలు రాస్తుంటారు. ‘ముందడుగు' తరుఫున టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, సినిమా పాఠాలు, లఘు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతి శీల విమర్శకులు. ప్రస్తుతం కోల్ కతాలో నివసిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సింగిల్ విండో ఆపరేటర్ గా పని చేస్తున్నారు.
మొబైల్: 9007755403

3 comments

  • If this movie is available in English subtitles, I will watch it.
    Forwarding this review to many.

  • సినిమా చూడాలని పించేలా రాసారు బాలాజీ గారూ…

    • Thank you మిత్రులారా. సినిమా ఇంగ్లీష్ subtitles తో నడుస్తోంది. బెంగాల్ కు బయట కూడా బెంగాలీలు అధికంగా వున్న నగరాల్లో మల్టీ ప్లెక్సుల్లో వుండొచ్చు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.