నాలుగు కన్నీటి బొట్ల తోడు

నువ్వూ వస్తే బాగుండు అన్నాడు తను రాళ్లను రాపాడిస్తూ మత్తుగా
వచ్చే వీలుంటే రానా అందామె గాలిలోకి పరిమళాన్ని ఊదుతూ పిచ్చిగా

ఏమైనా ఈ మధ్య నా మీద చిన్నచూపు నీకు అన్నాడు
తనలో అలముకున్న నిశబ్దాన్ని నిమురుతూ
అర్ధం చేసుకోవూ అందామె
అతని నిరసన గొంతుకు ఊపిరి పోస్తూ

నువ్వెప్పుడూ ఇంతే రమ్మంటే రావు
ఏవో కథలు చెబుతావు అన్నాడతను
పొగకమ్మిన ఆకాశంలో ఆమెను వెతుకుతూ
ఎప్పుడూ నీతోనేగా ఉండేది సరిగ్గా చూస్తే కనపడుతా
అందామె అతని గుండెలపై పచ్చబొట్టును గుర్తుచేస్తూ

ఎపుడనగా వెళ్ళావ్
చిన్నమాటకు అలిగావ్
ఆ నేలలో దాక్కున్నావ్
నన్ను రావొద్దని మాటతీసుకున్నావ్
నువ్వొస్తానని మాటిచ్చావ్
ఇంకెంతకాలం ఇలా అన్నాడతను
చేతిలో ఉన్న గాజు బాటిల్ ను మోదుతూ కచ్చగా

అబ్బా వదిలేయ్
ఇంకేంటి సంగతులు
వెళ్లెప్పుడు జాగ్రత్త చిమ్మచీకటి
దీపాన్ని నా దగ్గరే వదిలెళ్తావ్ ఎలానో నువ్ అందామె
అతనికి వీడ్కోలు పలుకుతూ

నాలుగు కన్నీటి బొట్ల తోడు తీసుకొని
ఈ సారికి తూరుపువైపు కదిలాడు తను ఎప్పటిలానే

సుభాషిణి తోట

అసలు పేరు భాష్య కార్ల సౌజన్య. పుట్టింది 1983 లో, ఖమ్మం.. ఎమ్మెస్సీ బీ ఈడీ చదివారు. ప్రభుత్వ పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం..కవిత్వం రాయటం, పుస్తక సమీక్షలు హాబీ... పలు కవితలకు బహుమతులు అందుకున్నాను. గతంలో మరొక కవి భాగస్వామ్యంతో థర్డ్ జెండర్ ల సమస్యలపై ది థర్డ్ వాయిస్ పేరుతో కవితా సంకలనం వేశారు. ప్రత్యామ్నాయం చూపకుండా మా ఊర్లో పేదల నివాసాల కూల్చివేతను నిరసిస్తూ శిథిలాల్లో మొలిచిన అక్షరాలు పేరుతో సహ కవిమితృలను కలుపుకొని ఒక కవిత సంకలనం వెలువరించాను, మిర్చి రైతులను దళారులు దోచుకోవటాన్ని నిరసిస్తూ 'మండుకొస్తుంది' అనే కవిత్వ సంకలనాన్ని ఇతర కవులతో కలిసి ప్రచురించారు. త్వరలో వ్యక్తిగత కవితా సంపుటి అచ్చువేయించబోతున్నారు.

1 comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.