ఇకనైనా….

 

‘నాకు ప్రజాస్వామ్యం కావాలి. ప్రజాస్వామ్యం నన్ను కాపాడాలి.

నేను ప్రజాస్వామికంగా వుండను. నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడను.’

ఈ మాట వింటానికి కష్టంగా వుందా? అట్టెట్టా అని ఆడగాలనిపిస్తోందా?

నిజానికి చాల ఏళ్లుగా జరుగుతోంది ఇదే.

కొండొకచో దీన్ని మావోయిజమని కూడా అంటారు. నిజానికి, కాదు.

మావో కాలంలో మావో దేశంలో ఇప్పుడు మనకున్న ప్రజాస్వామ్యం లేదు. పార్లమెంట్లు అసెంబ్లీలు లేవు. ఇది ఎవరి ప్రవచనమో ఆ లెనిన్ కు ఎదురైన విప్లవ విజృంభణ మన వద్ద లేదు. ఆ పొటెమ్కిన్ తిరుగుబాటు ఇప్పుడిక్కడ అనూహ్యం. ఎప్పుడు ఎవరు తోస్తారా ఎప్పుడు కూలిపోదామా అని ఎదురు చూచిన జారిజమూ ఇక్కడ లేదు.

సో, ఇది మార్క్సిజం లెనినిజం కాదు. మావోయిజం కూడా కాదు.

ఉన్నవన్నీ…

చాల చక్కని వూహలు. రంగులు వేసుకున్న కలలు.

ఇప్పుడు ఇక్కడ కాదు. ఎప్పుడో ఎక్కడో వుటుంది ‘స్వర్గం’. దాని కోసం ఇప్పుడు నువ్వు చచ్చిపో. దాని కోసం నీ బతుకును తగలెట్టుకో.

నిష్టూరమని కోపం వొద్దు. నిజమో కాదో చూద్దాం.

మనం వున్నచోట, మనం వున్న కాలంలో మనల్ని మనం పాలించుకోడానికి దారి ఏమైనా వున్నదా? మన నిర్ణయం చెప్పడానికి… నిర్ణయంలో మనం ఒక్కొక్కరం, లేదా సమూహాలం మన మాట చెప్పడానికి, మన్లాంటి వాళ్లను మనతో తీసుకెళ్ళడానికి దారి… ఎన్నికలు, వీధిపోరాటాలు కాకుండా… ఇంకేమైనా వున్నదా?

సాయుధ పోరాటమా? సరే,

ఉన్న కట్టడాన్ని ఒక్కుమ్మడి కూలదోద్దాం. నెత్తురు నెత్తురయితేనేం, దేహాలు గాయాల పొలాలయితేనేం, ఈ కట్టడాన్ని కూలదోద్దాం. ఈ కట్టుబాట్లను కూలదోద్దాం.

అది జరిగే పని కాదని కాలం మన చెవి మెలిపెట్టి చెబుతోంది. అయినా సరే, ఆ వైలెంట్ ప్రయత్నం సాధ్యమే అనుకుందాం. ఆ తరువాతేం చేద్దాం?

అప్పుడిక మనం ఏ ఇల్లు లేకుండా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ బజాట్లో నిలబడుదామా?

కాదు కదూ!

ఆ శిధిలాల్లోంచి మన ఇల్లు మనం కట్టుకుందాం కదూ.

అప్పుడు మనం కట్టుకునే ఇల్లు ఎలా వుంటుంది. ఎనీ బ్లూ ప్రింట్?! ఎనీ ఐడియా?!

అది నువ్వు చెప్పినట్టే వుంటుందా? స్థల కాలాలు మన పంజరంలో చిలుకలా? అప్పటికి నేనూ నువ్వు వుంటామో వుండమో? ఆ ఇల్లు మనకు ఆవాస యోగ్యంగా వుంటుందో వుండదో?

ఏమిటి హామీ? ఎక్కడ హామీ పత్రం? మంచితనమా? నీ మంచి తనమా? నా మంచి తనమా?

ఔన్నిజమే, మంచి తనమే మనిషి తనమే మనిషి మనుగడకు హామీ…. కాని….

ఏది మంచి ఏది మనీష, ఓ మాహాత్మా! ఓ మహర్షీ!!

ఎవరు నిర్ణయిస్తారు? చేసిన నిర్ణయం మన్నిక ఎంత? ఎంత డ్యూరబుల్?

కామ్రేడా చెప్పు.

ఇవాళ వీవీ ని , సుధా భరద్వాజ్ ని, సాయిబాబా ను ఎంత తప్పుడు ఆరోపణలతో చెరసాల పాలు చేశారు.

రేపు… శ్రామిక వర్గం ప్రతినిధులమని పుట్టుకొచ్చే అధికారులు అప్పటి వీవీ ని, అప్పటి సుధా భరద్వాజ్ ని,  అప్పటి సాయిబాబా ని చెరబట్టరని ఎందుకు నమ్మాలి?.

వీళ్ళు మనుషులే, వాళ్ళూ మనుషులే. వీళ్ళకు చోదక శక్తి పవర్, వాళ్ళకూ చోదక శక్తి పవరే.

మరెలా? ఏది దారి? శాశ్వతమైన దారి ఏదీ లేదని తేలిపోడం లేదా?

శాశ్వతత్వం ఏదుందో అది దేవుని వలెనే నియంత.

వొద్దు. లేని శాశ్వతత్వం కోసం వున్నది పోగొట్టుకుని అంగలార్చడం వొద్దు.

మనకేం కావాలనేది ఎప్పటికప్పుడు తేలాల్సిందే. మనకు కావలసిన దాన్ని ఎప్పటికప్పుడు తోడుకోవలసిందే.

లేదు శాశ్వతం, దేవుడి వలెనే.

శాశ్వతం కాని దాని కోసం, అది ఇది గా ఎప్పుడైనా మారిపోగల దాని కోసం, పీడక పాలన గా మారిపోగల పీడిత పాలన కోసం నెత్తురుటేళ్ళు పారాలా?

రేపటి కోసం ఇవాళ మరణించాలా?

బతికితే రాజ్యం, చస్తే సొర్గం…

వావ్. ఎక్కడి నుంచో గీతా వాక్యం మోగడం లేదా?

నేను చెబుతున్నదీ ఆఖరి మాట కాదు. ఈవెన్ మైన్ ఈజ్ నాట్ లాస్ట్ వర్డ్.

ఏం చేయాలో… ఎప్పటికప్పుడు తేలవలసిందే. ఏది సత్యమో ఏదసత్యమో ఎప్పటికప్పుడే.

అందుకే ఎన్నికలు. అందుకే వీధిపోరాటాలు.

సిద్ధాంతాలు వాటికవే సమస్యలూ కావు సొల్యూషన్లూ కావు. సిద్ధాంతాలు మెదళ్ళను నడిపించే మార్గదర్శకాలు. కరదీపికలు.

సరే, ఏవి సమస్యలు? ఏవి పరిష్కారాలు?

జరగనీ డిబేట్. రోడ్ల మీద కూడా.

ఎత్తిన పిడికిళ్ల సంభాషణ. నొక్కిన ఈవీఎం ల సంభాషణ.

పోలింగ్ బూత్ వద్ద ఘర్షణ.

ఈ ఘర్షణల్లో నువ్వు లేవు.

ఉండాలి. మనం వుండాలి.

ఈ మాట చెబితే పారిపోయాడంటావు. పాచిపోయిన పడికట్టు పదం. క్లిషే.

పారిపోయిందెవరు? రోజువారీ ఘర్షణ  నుంచి పారిపోయిందెవరు? పారిపోతున్నదెవరు?

ఒక మూలన ముడుచుకోవద్దు. మందు పాతర్ల కందకాల వెనుక, ప్రాకృతిక ప్రాణుల ప్రాణాల కోటల్లో దాక్కోవడం దానికదే యుద్ధం అవదు.

ఆ బ్యారికేడ్ అనుమతించబడినది మాత్రమే. అనుమతించబడిన హింస. సేఫ్టీ వాల్వ్.

మనది అనుమతించబడిన యుద్ధం. కంట్రోల్డ్ వైలెన్స్.

శ్రీకాకుళంలో చెలరేగాం. గోదావరిలోయ లోనూ. అయితే అనుమతించబడిన మేరకే, శత్రువు డెసిసివ్ దాడికి దిగనంత వరకే. దిగిన తరువాత మనం వొట్టి చరిత్రలం. ఏమిటి ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం? లాభసాటి కాని భూస్వామ్యాన్ని వొదిలి కేపిటలిజాన్ని కావిలించుకున్న దొరలకా? ఆ ఆకస్మిక మార్పు అసలు భారం భరించిన శ్రామిక జనావళికా? ఎవరికి ప్రయోజనం జరిగింది? బిడ్డల్ని పోగొట్టుకున్న కుటుంబాలకు ఏం వొరిగింది?

అడివిలోనికి చొచ్చుకు వస్తున్నది సైన్యం కాదు. చొచ్చుకు వస్తున్నది యుద్ధ ట్యాంకు కాదు. చొచ్చుకు వస్తున్నది ఆధునిక జీవితం. అనివార్యమైన మార్పు.

గిరిజనులు ఆధునికులయిపోకుండా ఎవరాప గలరు? ఎందుకు ఆపాలి? మానవ పరిణామాన్ని ఎవరాపగలరు? ఎందుకు ఆపాలి?

వాళ్ళలా వుండిపోవాలా విల్లమ్ములతో వేటాడుతూ, చెక్క నాగళ్లతో దున్నుకుంటూ.

బడి కావాలంటే ఆధునికత. ఆసుపత్రి కావాలంటే ఆధునికత. వీటి కోసం రోడ్డు కావాలంటే ఆధునికత. ఎక్కడో సంక్షేమ హాస్టళ్ళలో చదువుకునే గిరిజన బాలలు సెలవుల్లో ఇంటికి రావాలన్నా మందుపాతరల భయమే అయితే, భయం కాపలాలో ఎన్నాళ్ళు ఆ చిన్న రాజ్యంలో వొదిగిపోవాలి?

అసలెందుకది, విస్తరించడం అసాధ్యమైనది.

తిరుగుబాటు విస్తరించాల్సింది కేవలం భూమ్మీద కాదేమో. మానవ మస్తిష్కాలలోనేమో ఒకసారి ఆలోచించారా? దానికి కావలసింది ఆయుధం కాదు. కొద్ది స్థలంలో స్వీయ రక్షణ కాదు. అడుగడుగున పోరాటం.

చిన్న పిల్లలు ఆడుగులో అడుగేసి నడక నేర్చుకున్నట్టు మనం అడుగు అడుగు పోరాటాల లోనే పోరాటం నేర్చుకోకతప్పదు. వేరే దారి లేదు.

మనమంటే నువ్వు నేనే కాదు. నువ్వో, నేనో తానా అంటే తందాన అనేసి తమ వినోదాల్లో తాము పడే వాళ్లు కూడా కాదు. మనకు ఇంకా తెలీని వాళ్ళెందరో కలిస్తేనే మనం మనమవుతాం. కలుపుకోడానికి, కలిసిపోడానికి పనికొచ్చేది మందుపాతర్ల టెక్నాలజీ కాదు.

ఆ టెక్నాలజీని అందించిన వీత్నాం, చైనా దాన్ని వొదిలేసి ముందుకు నడిచాయి. ఆధునికమయ్యాయి,

మరి మనం?

ఇంకా అక్కడే వుందామా?

ఎప్పుడేనా ఒక ఎన్నికల వాహనాన్ని పేల్చేసి రాజ్యాలు గెలిచినట్లు సంబరపడదామా?

లేక మనల్ని నమ్ముకున్న వాళ్ళతో కలిసి కొండలు కోనలే కాదు పట్టణాలు, మైదానాలంతటా మనమే అవుదామా?

ఒకరం చెరబడితే వందల మందిమి కదిలే ప్రజాపోరు వినా నిర్బంధానికి నిజమైన పరిష్కారమేదీ లేదు.

ఇది జరిగే వరకు మనం ప్రజా సమస్యల పరిష్కర్తలం కాదు. మనమే ప్రజలకు సమస్యలం.

ఇండియాలో ఎన్నికలయిపోతున్నాయి. మన ప్రమేయం లేకుండానే… కనీసం మరి ఐదేళ్ళ కోసం దేశ గతి నిర్ణయమవుతోంది.

పాఠాలు తీసుకుందామా? చలన గతి మార్చుకుందామా?

ప్రజా మైదానంలో, కాంక్రీటు అరణ్యాలలో రాజ్యమేలే అబద్ధాల్ని సవాలు చేద్దామా?

ప్రజల చొరవకు దారిని శుభ్రం చేద్దామా?

మందుపాతర్లతో కాదు, ప్రజల నిండు చొరవతో ఏమి సాధిస్తామో అదే నిలుస్తుంది.

మందుపాతర్లు దేన్నైనా కాసేపు ఆపగలవు. దేన్నీ ముందుకు తీసుకెళ్ళవు.

12-4-2019

తాజా కలం: ఈ సంపాదకీయం మొదట్లో వున్న ఫోటో: దంతెవాడ వద్ద ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బిజెపి ఎంఎల్ఏ జీపును ‘మావోయిస్టులు’ మందుపాతరతో పేల్చివేసి, ఆపైన ఎమ్మెల్యేను, తన భద్రతా సిబ్బందిని కాల్చి చంపారు. ఇది విప్లవమని, వీరొచితమని కొందరు భావించొచ్చు. కాని, కాదు. మనందరం ఏ ప్రజాస్వామ్యం కావాలని కోరుకుంటున్నామో దానికి విరుద్ధమైన చర్య.

14-4-2019

 

హెచ్చార్కె

12 comments

 • సంపాదకీయం కవిత లా అనిపించింది. ఇక మీ సందర్భ సంభాషణ అనేక దిక్కుల్ని సూచిస్తోంది. ఏకీకృతంగా చదవాలి..మీరు ఎలక్షన్ సిస్టం ని సమర్ధిస్తున్నారా ? లేదా ? నో అయితే పర్లేదు. యస్ అయితే ఇంకాస్త క్లారిటీ తో చెప్పండి….వాహనాలు పేల్చడం సంగతి, చంపడం గురించి మీరు చెప్పింది ఓకే. మరే కార్యాచరణ కావాలని మావో చెప్పాడు ?

  ఇప్పుడేది శరణ్యమని మీ ఊహ ?

  • థాంక్స్ శ్రీరామ్. ఒకే సారి ఇన్ని ప్రశ్నలు. అదే వరుసలో జవాబులివి: నాకు చాల ఇష్టమైన మూడు ప్రోజ్ పుస్తకాలు కమ్యూనిస్టు మేనిఫెస్టో, రెక్కవిప్పిన రెవల్యూషన్, దస్ స్పేక్ జరతుష్ట్రా… వచనానికి కవనానికి మద్య రేఖ మీదనే నడుస్తాయయినా అవి గొప్ప రాజకీయ పుస్తకాలే. నేను ఎన్నికల్లో అందరూ సీరియస్ గా పాల్గినాలని కోరుకుంటాను గాని ఇప్పుడున్న ఎలక్టొరల్ ‘సిస్టం’ ఇంకా చాల అభివృద్ధి చెందాలంటానది వేరే డిబేట్. కార్యాచరణ గురించి మావో చాల చెప్పాడవి ఒక్క వాక్యంలోనికి కుదించలేని అసమర్థుడిన్నేను.. ఇప్పుడైనా ఎప్పుడైనా ప్రజల నిర్ణయాన్ని తెలియజేసే ఎన్నికల విధానం ఏదో ఒక విధంగా వుండాలి, లేకుంటే నిరంకుశత్చమే. 🙂

 • మీ ఆలోచనతో ఏకీభవిస్తున్నాను. భారత దేశంలో ప్రస్తుతానికి ఎన్నికల ప్రజాస్వామ్యం ద్వారానే (అది ఎంత లోపభూయిష్టమైనా) మార్పు సాధ్యం. ఆయుధ పితూరీలు గమ్యం చేర్చవు.

  • థాంక్స్ ఎ లాట్ ప్రసాద్ గారు. అవి గమ్యం చేర్చకపోగా దారి తప్పిస్తాయి, అందువల్ల పేచీ పడకతప్పదు.

 • ఐతే, “ఇప్పుడిక సీపీఐలోనో సీపీఎంలోనో సభ్యత్వం పుచ్చుకోకుండా మా మడి బట్టలనెందుకు మైల పరుస్తారు?” అంటూ ‘గడిచిన అనుభవసారం లోంచి వస్తున్న ఇలాంటి ప్రశ్నలను’ ఆ కాలానికి తీసుకెళ్లి కట్టేసి వస్తారు.

  ఏ సమాజంలోనైనా మానవ మనస్తత్వంపై, మానవ ప్రవర్తనలపై, మనిషుల వ్యక్తిగత చింతనపై తగినంత అవగాహన అవసరం. అదిలేకుండా పట్టుకున్న ఎర్రజెండా చేయి మోడీకంటే చెడ్డగా ఉండదని గ్యారంటీ ఏమీలేదు. విప్లవ సూక్తులు నేర్పిన అనేకమంది వాటిని వల్లెవేయడం కళ్లారా చూసిన అనుభవాలు ఎన్నో. వాటిని నిజంగా నమ్మినవాడూ ఉంటాడు. నమ్మినట్టు నటిస్తూ ఎదురయ్యే ప్రతి ఘటననీ తన వ్యక్తిగత ప్రయోజనానికి బాటగా వేసుకునేవాడూ ఉంటాడు.

  చాలా ప్రశ్నలు ధైర్యంగా వేశారు. మీకు అభినందనలు.
  విప్లవం ఇల్లు కూలగొట్టి కొత్త ఇల్లు కట్టుకున్న విధంగా ఉండడం అసాధ్యం. ఇటుక ఇటుక రీప్లేస్మెంట్ చేసుకుంటూ ఉన్న ఇటుకలన్నీ మార్చి కొత్త నిర్మాణం చేసుకోవడం ఒక్కటే మార్గం. ఇంటికి జీవం ఉండకపోవచ్చు. కానీ మానవ సమూహాలకి ఉంటుంది. ప్రతి ప్రాణమూ విలువైనదే.

  విప్లవ వ్యాఖ్యానాలు విని బూర్జువా చదువులని ఒకరు తుపాకీ పట్టవచ్చు. వ్యాఖ్యానించినవారు మాత్రం లాయరుగానో ఇంజనీరుగానో జర్నలిస్ట్ గానో అమెరికాలోనో సెటిలవ్వచ్చు.

  చిన్నప్పుడు డ్రామా గురించి తెలియని straight forward characters యవ్వనంలో ఉపదేశాలు విని చివరకి బలవుతాయి.

  ఇప్పటికే చాలా రాయించాయి సార్ మీ మాటలు.

  • థాంక్యూ సో మచ్ దగ్గుమాటి పద్మాకర్ గారు!
   సిపిఐ సిపిఎం ప్రజాపోరు దారి మరిచాయి, చేసిన పోరాటాల్ని కూడా ఎన్నికల ఎత్తుగడల రాటకు కట్టేశాయి. అందులోనూ కులమతాల గోల. ఆ సభ్యత్వం మనకొద్దు. ప్రజల నిర్ణయీకరణ ప్రక్రియ అయిన ఎన్నికలను ఆ పనికి వినియోగించని నిష్కృయకు బహిష్కరణ అనే పేరు ఒక అబద్ధం. దాన్ని విమర్శించకుండానూ వుండలేమని మనాళ్ళకు చెబుదాం. మన దారిలో మనం స్ట్రగుల్ కొనసాగిద్దాం.

 • చాలా నిర్మొహమాటంగా ఉంది. విప్లవశక్తులతో సహా ఎవరినీ వదల్లేదు.

  • థాంక్స్ రవి, విప్లవశక్తులంటే మనమే, మనం కూడా.

   మనతో సహా ఎవరినీ విమర్శించాల్సినప్పుడు విమర్శించకుండా వదలొద్దు.

   మనల్ని మనమే సరి చేసుకోవాలి, మన బతుకుల్ని మనమే సరిచేసుకోవాలి. కొంచెం బాధ, అయినా తప్పదు.

 • హెచ్చార్కె గారూ మన బోటి చాలామంది ప్రశ్నలివి. లోపలనున్నవి పైకి చెప్పటానికే మనని మనం దోషులుగా చూసుకునే పరిస్థితి. ఒక తరమంతా ఒక విశ్వాసంతో బ్రతికేంత సమయం లేని కాలం మనది. ఎన్నో ఎంతో చదువుకుని ఇదే మార్గమని ఒక నిశ్చయానికి వచ్చిన వాళ్లం మనం. మనం నడిచొచ్చిన ఆలోచనామార్గం మన ఊపిరి మనకీ రోజున ఊపిరి ఆడనివ్వటం లేదు. మనం కాదనుకున్నవారు మన ఆలోచనలను మార్పుగా -అవునా కళ్లు తెరుచుకున్నాయా- ముందే చెప్పలేదా- తీర్పు ఇస్తుంటే డిఫెన్సులేని వాళ్లం. మన డిఫెన్సే మనమీద అఫెన్సుకి ఆయుధంగా అయిపోయినవాళ్లం. ఎర్రజెండా చేతబట్టి కుర్రకారుని వెంటబెట్టీ ఓటులడిగే నీటుకాడా ప్రతీఓటూ విప్లవానికి వెన్నుపోటేరా అంటూ రాసిన చేతులివి. ఈ చేతులకి ఓటు సిరా అంటకుండా ౫౦ ఏళ్లు గడిచాయి. ఇది ప్రజాస్వామ్యమా.. అసలు ప్రజాస్వామ్యం అనేదే ఒక కపటవ్యూహం కదా.. మరైతే ఏది సరైనది.. సరే ఇల్లు పడగొట్టాం .. కొత్త నిర్మాణానికి నమూనా ఏమిటి? ఇప్పటివరకూ జరిగిన నిర్మాణాలలో ఎందరు సాయిబాబాలు వీవీలు బందీలు అయారు.. అవరని గారంటీ ఇచ్చే నమూనా ఏది.. ఇంత వయసొచ్చినా ఇంకా ఏదో చెయ్యాలనే తపన తోటివారికి ఉపయోగపడుతూ జీవిస్తూ పోదామన్న ఆరాటం ఉన్న మనలాంటి వాళ్లకు డెడ్ ఉడ్ అయే అవకాశం కూడాలేదు. మనం రాసుకునే అక్షరాలే మనకి శత్రువులై మనల్ని బోనులో నిలబెడుతూంటే ఏం చెయ్యాలి? ఏమైనా మనం మాటలాడదాం.. మనది ఆఖరుమాట కాదు.. మనది ప్రశ్చాత్తాపం కాదు.. ఇది ఆఖరుదశ కాదు.. ఆలోచిద్దాం.. ఎందుకంటే మా వల్లంపాటీ నేనూ అనుకున్నట్టు ఇప్పుడే మనం మాటాడాలి.. హెచ్చార్కే గారూ మనం ఒక్కటి మాత్రం ఒప్పుకోవాలి. ఆవేశం సత్యానికి సంకేతమనే భావన మనలో చాలాకాలంగా ఉంది. అది మనలని అడ్డదిడ్డంగా కొంతకాలం మాటాడించింది. మనమిప్పుడు సత్యాలు చెప్పటం లేదనీ.. ఆలోచనలు చేస్తున్నామనీ.. ఆలోచించమంటున్నామనీ మనకి మనం నచ్చజెప్పుకోవాలి.

  • మూర్తి గారు, మీ వాక్యాలు చదువుతుంటే కళ్ళలో చిన్ని తడి జీర. తప్పు కావొచ్చు. తప్పులు చేయనిదెవ్వరు? ఎన్ని తప్పులు చేయలేదు తప్పులెన్ను వారు. కేర్ చెయ్యొద్దు సర్. మన మాట మనం చెబుదాం. అన్ని నటనల్ని, వాటి మూలమైన అబద్ధాన్ని ఓడించకుండా ఎన్ని త్యాగాలయినా వ్యర్థమే. మనతో కలిసి నడిచి మన కళ్ల ముందే ఒరిగిపోయిన మన అన్నదమ్ములకు, మన ఆక్కచెల్లెళ్ళకు మనం ఇచ్చే కానుక… అసత్యానికి తల వంచకూడదనే మాటను చివరివరకు చెప్పడమే. ఆ మాటనే ఒక కాగడాగా తరువాతి పరుగుల వాడికి ఇచ్చి వెళ్లడమే. మరో సారి మీకు మనసారా కృతజ్ఞతలు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.