కొన్ని ఒంటరి నరకాలు

(రెక్విమ్ ఫర్ ఎ డ్రీమ్ – డ్రగ్స్ వర్సెస్ అబ్సెషన్స్)

ప్రపంచానికి నీవు చేసేదంటూ ఏమీలేదు. నిజానికి ప్రపంచమే నిన్ను చేస్తుంది. నిన్ను నడిపిస్తుంది. నవ్విస్తుంది. ఏడిపిస్తుంది. అంతేనా?. అదును చూసి అది నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. ఏకాకిని చేసి పోతుంది. జీవితం మొత్తం ఈ ఒంటరితనాన్ని దాటడానికి, నీవు ఒంటరిని కాదని నిరూపించుకోవడానికే సరిపోతుంది. అమెరికన్ డ్రీం,  ప్రపంచంలో ఒకడిగా నిన్ను నీవు చూపుకోవడానికి తయారు చేయబడి ఉంటుంది.

ఆమె ఒంటరిది. పేరు సారా. వయసు మీద పడింది. భర్త పోయాడు. కొడుకు పెద్దవాడై వాడి జీవితం వాడు చూసుకుంటున్నాడు. అంత పెద్ద ఇంట్లో ఆమెకు తోడుగా ఉండేది ఒక్కరే. ఒక మూలకు కూర్చుని ఇరవై నాలుగు గంటలూ ఏదో ఒకటి వదిరే టెలివిజన్ మాత్రమే. ఆమె టీవీకి అతుక్కుపోతుంది. టీవీ చూస్తూ చాక్లెట్లు తింటూ ఉంటుంది. బరువు పెరిగిపోతుంది.

అక్కడ టీవీలో ఆమెకు ఇష్టమన గేమ్ షో వస్తూ ఉంటుంది.  అందులో సూటూ బూటూ వేసుకుని నవ్వుతూ కనిపించే ఒక యాంకర్ కనిపిస్తాడు. తనలాగే జీవితంలో ఒంటరిగా మిగిలిపోయిన వ్యక్తులందరూ అక్కడ ప్రేక్షకులుగా కూర్చుని ఉంటారు. వాళ్ళందరినీ ఉద్దేశించి ఆ యాంకర్ ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు. అందరినీ ఉత్సాహవంతులుగా కావాలంటే అందంగా కావాలంటే ఏం చేయాలో చెబుతుంటాడు. “మీరందరూ మాంసాన్ని చక్కెరనూ తినటం మానేయాలి. మీలోనే అద్భుతమైన వనరులున్నాయి. మీరు వాటి వైపు మళ్ళాలి. ఆ లోపలి వనరులనే నేను juice అంటాను”. అని చెబుతూ ఉంటాడు. అతడితో పాటు వాళ్ళందరూ జ్యూస్ జ్యూస్ అని మంత్రోచ్ఛారణ చేస్తూ ఉంటారు. సారా ఆ గేమ్ షో లో పూర్తిగా మమేకమై పోతుంది.

ఒకరోజు ఒక ఫోన్ వస్తుంది. ఆ గేమ్ షోలో పాల్గొని తనలో ఉన్న జ్యూస్ ని ప్రపంచానికి చూపించమని ఆ టీవీ ఛానల్ వాళ్ళనుంచి ఫోన్ వస్తుంది. సారా ఉబ్బితబ్బిబ్బైపోతుంది. ఎవరికీ ఎవరూ కాని తాను ఇపుడు ఆ ప్రోగ్రాం లో గెస్ట్ గా పోవటం వలన తాను కూడా కొంతలో కొంత విలువైన వ్యక్తిలా మారబోతున్నానని సంతోషపడుతుంది. రోజూ ఎండలో తనతోపాటు కూర్చునే ఒంటరి ముసలి ఆడవాళ్ళతో ఈ విషయం పంచుకుంటుంది. ఆ ప్రోగ్రాం కి వెళ్ళడానికి ఒక డ్రెస్ ను చూసుకుంటుంది. అది ఒక ఎరుపు రంగు గౌను. తన కొడుకు డిగ్రీ పాసైనపుడు జరిగిన కాన్వొకేషన్ కి వేసుకున్న డ్రెస్. అది చూసి ఆమె భర్త ఆమె అందాన్ని తదేకంగా చూసిన డ్రెస్. అదిప్పుడు ఒంటరిగా అల్మారాలో పడివుంది. ఆ రెడ్ డ్రెస్ ను బయటకు తీస్తుంది. వేసుకుంటుంది. కానీ లావై పోవడం వలన పట్టడం లేదని గ్రహిస్తుంది. ఆ డ్రెస్ లో పట్టడం కోసం తానిప్పుడు సన్నగా కావాలి. డాక్టర్ ను సంప్రదించి ఆకలిని తగ్గించే డైట్ పిల్స్ ని వాడటం మొదలు పెడుతుంది.

ఇక సారా కొడుకు హార్రీ, డ్రగ్ అడిక్ట్ అవుతాడు. ఇంట్లో ఉన్న ఒక్క టీవీ సెట్ ని వాళ్ళమ్మ సారా దగ్గరినుండి బలవంతంగా తీసికెళ్ళి పచారీ కొట్టులో అమ్ముకుని వచ్చిన డబ్బుతో తన మిత్రుడు టైరోన్ తో కలిసి హెరాయిన్ కొనుక్కుంటాడు. సారా తర్వాత వెళ్ళి టీవీ విడిపించుకుని వస్తుంటుంది. ఇటువంటిది వాళ్ళిద్దరికీ తరచూ జరిగే వ్యవహారమే. హార్రీ జీవితానికి ఉన్న ఏకైక కల తన గర్ల్ ఫ్రెండ్ మారియో తో కలిసి జీవించటం. జీవితం ఆమె వెనుకాల పరిగెత్తుతున్నట్టే ఉంటుంది. మారియో కూడా అంతే. తన హార్రీతో కలిసి ఉండాలి. తను సొంతంగా ఒక బట్టల దుకాణం పెట్టాలి అని కలలు కంటూ ఉంటుంది. నల్లజాతీయుడైన టైరోన్ ని ఎప్పుడూ ఒక కల వెంటాడుతూ ఉంటుంది. అది తను చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు తల్లి ఒడిలో ఒదిగిపోయి ఉన్నప్పటి అందమైన కల. కానీ వీళ్ళందరూ డ్రగ్ అడిక్ట్ లు ఐపోతారు. సరదాగా తీసుకునే దశనుంచి పోయి, తీసుకోకపోతే పిచ్చెక్కిపోయే దశకు చేరుకుంటారు.

హార్రీ, టైరోన్లు డ్రగ్ పెడ్లర్లుగా మారి సంపాదిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పోలీసులకు దొరికిపోతూ ఉంటారు. టైరోన్ ఆ సమయంలో తాను చచ్చిపోతానేమో భయపడిపోతాడు. కానీ బయటకు వచ్చాక తానింకా చచ్చిపోలేదేమిటని బాధపడుతూ ఉంటాడు. డ్రగ్ పెడ్లర్లుగా సంపాదించిన డబ్బుతో హార్రీ తన తల్లికి టీవీ సెట్ కొనివ్వాలనుకుంటాడు. టీవీ సెట్ ఆర్డర్ ఇచ్చి ఇంటికి వెళ్ళి తన తల్లికి చెబుతాడు. సారా తనలో వచ్చిన మార్పేమిటో గుర్తించమంటుంది. తాను ఐదు పౌండ్లు బరువు తగ్గానని సంతోషపడుతూ చెబుతుంది. తాను రెడ్ డ్రెస్ వేసుకుని టీవీ షోకి వెళ్ళాలని చెబుతుంది. ఆ సమయంలో ఆమె మాటల్లోంచి, ఆమెలోని భయంకరమైన ఒంటరితనం ఉబికివచ్చి ప్రేక్షకుడి ముందు వికృత రూపం దాల్చి అతడిని  వెక్కి వెక్కి ఏడ్చేలా చేస్తుంది.

ఈ నలుగురూ తమ కలలను పండించుకోవాలనుకుంటారు. కానీ డ్రగ్స్ వాళ్ళ జీవితాన్ని మరో వైపుకు మారుస్తుంది. హార్రీ, టైరోన్, మారియోల జీవితం అందరి డ్రగ్ అడిక్ట్ ల లాగే రాను రానూ భ్రష్టు పట్టి పతనం చెందుతుంది. సారా జీవితం కూడా డైట్ పిల్స్ చుట్టూ తిరుగుతూ అందులోని యాంఫీటమైన్ లకు బానిసైపోతుంది. చివరికి నలుగురి జీవితం ఎలా పతనం చెందుతూ పోతుందనేదే మిగిలిన సినిమా అంతా.

రెక్విమ్ ఫర్ ఎ డ్రీమ్. పూర్తిగా కళాత్మక దృష్టితో, కళాత్మక విలువలతో తీసిన సినిమా. అమెరికన్ నవలాకారుడు హ్యూబర్ట్ సెల్బీ జూనియర్ రాసిన నవల ఆధారంగా తీసిన సినిమా. డార్రెన్ అరానోస్కీ దర్శకత్వంలో నభూతో న భవిష్యతి అన్న చందంగా తెరకెక్కిన సినిమా. క్లోస్ అప్ షాట్లతో, స్ప్లిట్ స్క్రీన్ షాట్లతో కొత్తరకమైన కెమెరా పరిభాషలో చెప్పబడిన సినిమా. చూసిన తర్వాత విమర్శకులకూ, సగటు ప్రేక్షకులకూ గుండె నలిపేసేంత గంభీరమైన  మౌనం తప్ప మరో దిక్కు తెలియనీయని సినిమా.

సారా గా  ఎలిన్ బర్స్టిన్ నటన బహుశా మరొకరు చేయలేరేమో. కనీసం అనుకరించలేరేమో. తన అరవై ఐదేళ్ళ వయసులో నడుముకు బరువైన కెమెరా కట్టుకుని ఆమె చేసిన నటనకూ ఆ తపనకూ చేతులు జోడించి మొక్కాలనిపిస్తుంది. (ప్రస్తుతం ఆమె  ఎనభై ఐదేళ్ళ వయసులో కూడా ఇంకా ప్రధాన పాత్రలలో నటిస్తోంది. ఐతే ఆమెకు ఆస్కార్ అవార్డు ఇప్పటికీ దక్కక పోవటం ఆస్కార్ చేసుకున్న దురదృష్టం అని సినీ విమర్శకుల అభిప్రాయం).

మిగిలిన ముగ్గురు పాత్రధారులూ అంతే అద్భుతమైన నటనను ప్రదర్శించినా ఎలిన్ నటన మనల్ని వెంటాడుతుంది. ఒక రకంగా పిచ్చి లేపుతుంది. అంతటి నటనను చూడగలిగినందుకు ఒకింత గర్వంగా కూడా అనిపిస్తుంది. అరనోస్కీ కూడా అదే చెబుతాడు. ఏమంటే..”ఈ సినిమా ద్వారా నేను చేసిన గొప్ప పని ఏమంటే,  ఎలిన్ బర్స్టిన్ నటనును కెమెరాలో బంధించగలగటమే” అని. క్లింట్ మార్సెల్ మ్యూజిక్ మరో బాధాతప్త లోకంలో మనల్ని పడేస్తుంది. “లక్స్ ఏటర్నా” అనబడే ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేల సార్లు వెంటాడి వేటాడి ఏడిపిస్తుంది. (ఐతే, ఈ మ్యూజిక్ ను మన అతి తెలివి న్యూస్ ఛానళ్ళు బ్రేకింగ్ న్యూస్ కోసమని బ్యాంక్ గ్రౌండ్ స్కోర్ గా వాడుకుంటూ ఉంటాయి. ప్రపంచంలో ఇంతకు మించిన కళా చౌర్యం, కళా విహీనత్వం, లేకితనం మరొకటి ఉండదేమో!)

ఐతే ఈ సినిమా డ్రగ్ అడిక్ట్ లకు సంబంధించినదా?. హాలీవుడ్ సినిమా విమర్శకులు దీనిని ‘డ్రగ్ అడిక్ట్ జోనర్’ సినిమా అని అన్నారు. ఈ సినిమా మన తెలుగు అర్జున్ రెడ్డి సినిమా లాగా డ్రగ్స్ వాడకాన్ని గ్లోరిఫై చేయలేదు. అలాగని డ్రగ్స్ వాడకం మహాపాపమనే తెలుగు బీ గ్రేడ్ పార్న్ వంటి అంత్య శుద్దులూ చెప్పలేదు. అసలిది డ్రగ్ అడిక్ట్ కి సంబంధించిన సినిమా కానేకాదు. ఆధునిక మానవ సమాజాన్ని పట్టి పీడిస్తున్న మెటీరియలిస్టిక్ అబ్సెషన్స్ గురించిన సినిమా ఇది. సమాజం మనుషులను వారి అబ్సెనన్సునూ కూడా నిర్ణయించి శాసించగలుగుతున్నప్పుడు దానిలో పడి నలిగిపోతున్న నలుగురు వ్యక్తుల సినిమా. వాళ్ళు వాళ్ళ కలలను అందుకుందామని నిర్ణయించుకునేలోపే ఈ సమాజం వాళ్ళని ఎలా పతనం చెందిస్తుందో చూపే సినిమా. చివరి సీన్లో పతనం చెందిన మానవులు తాము అందుకోలేని కలలను మళ్ళీ మళ్ళీ కంటూ తాదాత్మ్యం చెందుతుంటే అది చూచే మనం గుండె లోతుల్లోంచి మౌనంగా రోదించే సినిమా.

మళ్ళీ ఇటువంటి సినిమా రాకపోవచ్చు. తప్పక చూడవలసినది.

గమనిక: పద్దెనిమిది యేళ్ళు ఆపై వాళ్ళకు మాత్రమే

డాక్టర్ విరించి విరివింటి

డాక్టర్ విరించి విరివింటి: ఎంబీబీఎస్ చదివిన తరువాత ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో ఐదేళ్ళకు పైగా పనిచేశారు. ఆ తరువాత క్లినికల్ కార్డియాలజీ లో పీజీ డిప్లొమా చేసి స్వంతంగా ప్రాక్టీసు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ భారతంలో గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక సాహిత్య కళా రంగాల్లో ఆసక్తి మీకు తెలియంది కాదు. కవిత్వం, కళలపై ఆయన ఆసక్తి అందరికీ తెలిసినదే. ‘రెండో ఆధ్యాయానికి ముందుమాట’ పేరుతో కవితా సంపుటి ప్రకటించారు.

‘పర్స్పెక్టివ్స్’ అనే షార్ట్ ఫిల్మ్ తో సినిమా దర్శకత్వం రంగంలో ప్రవేశించారు. తన 'ఇక్కడి చెట్ల గాలి'కి తెలంగాణ ఫిలిమ్ ఫెస్టివల్ అవార్డ్ లభించింది. 'షాడోస్', 'డర్టీ హ్యాండ్స్', "ఫ్యూచర్ షాక్' లఘు చిత్రాలు ఎడిటింగ్ దశలో వున్నాయి.

2 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.