పాలెగాడు

మాయ్టాల బాయిబండల కాడ శ్యామన్న, సీనా(శ్రీను), మూలోల్ల రవన్న ఇంగో ఐదారు మంది కూచ్చోని యవారాలు సేచ్చనారు. అటుపక్క మన్నులో  పిల్ల పిసిక్య సేరి గోలుగుండ్లో, సిల్లాకట్టో యాదో ఒకాట ఆడుకుంటా ఎగులేచ్చనారు. ఆపక్క మూలనుండే యాపమాను మీదికి కాకులు, కొంగలు ఎగురుకుంటా వచ్చి గూల్లకు సేరబట్య. తల్లి కోల్లు పిల్లల్ను ఎంటేసుకుని ‘క్కొ…క్కొ…క్కొ…’ అనుకుంటా ఇంటి దావ పట్య. అంతలోకే అదే దావన పొట్టుజొల్ల భుజానేసుకొని కలంలోకి యలబారి పోతా బాయి బండలకాడికొచ్చి నిలబన్యాడు ఓల్రెడ్డి. ఆయబ్బి అసలు పేరు ఓబుల్ రెడ్డి.

‘యా సేనికి తోల్తనారుబ్యా.. ఈసారి సథవ’ అన్య మూలోల్ల రవన్నుండి- ఓల్రెడ్డి తిక్కు జూచ్చా.

‘తూర్పు సేనికి న్నా’ అన్య ఓల్రెడ్డి.

‘యాడ… కుమ్మరోల్ల బాయి కాన్నుంచా?’ అని అడిగ్య రవన్న.

‘ఔ న్నా…సౌడంబ( సౌడమ్మ ) పంపుల కాడ మండ్య కట్టి దానికిడుచ్చనాము ఇసిక్య. ఆన్నుంచి మల్ల సేనికి తిరగదోల్దామని’ అన్య ఓల్రెడ్డి.

‘రోజుకెన్ని తడవలు తోల్తారు బ్యా.. ?’

‘ఆరు తడవలు’ అన్య రోంతట్ల రొమ్ము సీల్చుకుంటా.

‘ఆరు?! ఆరా…ఐదా?’ అని మల్లా అడిగ్య రవన్న  నమ్మసక్యం గాక.

‘ఆరు తడవలు అలకాంగ తోల్తాం న్నా.  ఎద్దులు బాగుండ్ల్యా మాయి’ అన్య జమ్మం పడ్తా , భుజం పైనుండే జొల్ల దీసి అటుపక్క అరుగు పైన పెడ్తా.

‘యాడ బాగుండాయి బ్యా అయి…దాంట్లను మట్టగ పెరక్క తిన్యారే నువ్వూ మీయన్న గల్సి. పట్టకచ్చినప్పుడెట్లుండ్య ఇప్పుడెట్లుండాయి అయి’ అన్య నగుతా.

మల్లా రవన్నే ఉండి ‘మరి మొన్న మీయన్నతో మాట్లాడ్తాంటే యాడ రవీ ఐదు తడవలు తోల్యాలకే ఉరకై తలపానం తోక కొచ్చాది అన్యనే’ అన్య ఏదో మతికొచ్చినోని మాదిరి అనుమానపు సూపు సూచ్చా.

వార్నీ, సిక్కితినే ఈల్ల సేతల్లో ఈ పొద్దు అని రోంత తటపటాయిచ్చ ఓల్రెడ్డి.  మల్లా పురమాయించుకుని ‘యాదో ఒకనాడు ఒక తడవ అటోఇటో తోలింటాంలేన్నా, ఉసి కుదరనాపొద్దు. దాన్ని పట్టుకోని నీతో  ఆ మాటన్యాడేమో మాయన్న. యాదీ అంతే ఆ మనిసి’ అంటా బుజ్జగిచ్చినట్లు మాట్లాడ్య.

కుమ్మరోల్ల బాయి కాన్నుంచి సౌడంబ పంపుల కాడికి దండిగా మైలు దూరముంటాది. ఎద్దులు బాగుండి, బాగ ఉషారుగా నర్సేటైతే ఆరుతడవలు ఆడికాడికి తోలచ్చు. అది గూడా సీకట్లో బండి కడ్తేనే. కాదు కూడదు ఆరు నూరైనా ఆరు తడవలు తోలాలంటే మాత్రం అమ్మల్ల పొద్దు దాటి ఎండ పడ్తాది కాడిర్స్యాలకు. అందుకే ఐదు తడవలైతే మనుసులకు ఎద్దలకూ యాసిరిక్య కాకుండా బాగుంటాది. ముందే ఎండలు మండిపోతనాయి.

ఇంతలోనే పక్కన కూకోనుండే సీనా అందుకొని ‘నీ పుచ్చకలే బ్యా. నువ్వూ నీ ఎచ్చల కూతలు. మంచి మంచెద్దులు ఐదు తడవలు తోలాలకు అర్సి పండుకుంటనాయి. మీ బిక్కిరి నాకొడకల్టి పంగ కాల్లేసుకుని ఆరు తడవలు తోల్నెంట. సెప్తే రోంతన్నా అర్థం పర్థం ఉండాల’ అని కట్టిర్సి పొయ్లో పెట్నెట్లు మాట్లాడ్య. మల్లా సీనానే ఎత్తుకుని ‘ పైటాల్దాక తోల్తానే ఉంటారా బ్యా…కాడిర్సకుండా?’ అంటా రెండు ఎత్తిపొడుపు మాటలు కూడా ఇసిర్య, మండే పొయ్ లోకి రోంత సిదుగేసి ఎగదోసినట్లు.

ఓల్రెడ్డితో ఎప్పుడ్జూసినా వాళ్లకు ఇదే సెలగాటమె. అతగాడు యాది మాట్లాన్యా బెత్తెడుంటే దాన్ని జానడు జంపనటం, జానడుండే దాన్ని మూరెడని సెప్పడం  అలవాటు. అది వీళ్లకు ఒప్పిందిల్యా. యాడన్నా అవసరమున్నె కాడంటే సరే. అవసరం ఉన్యా ల్యాకున్యా అబద్ధాల కూతలు, ఎచ్చల మాటలెందుకని సీనా మతం.

సీనా మాటలకు ఓల్రెడ్డి ఏందో అనబాయ. అంతలోకే ఇంటికాన్నుంచి ‘ఓబ్బీ సీనా …’ అంటా పిలుపు ఇనపచ్చ. సీనా లేసి లుంగీ ఎగ్గట్టుకుంటా ఇంటి దావ పట్య. ఓల్రెడ్డి కాలు గాలిన పిల్లి మాదిరి జొల్ల భుజాన్నేసుకుని కలం తట్టు కదిల్య. శ్యామన్న, రవన్న కూడా యాడోల్లాడపోతిరి.

*** *** ***

ఆ పొద్దు సందకాడ బువ్వ తిని మల్లా అంతా సావిడి కాడికి జేరుకుని అరుగు మీద కూకోని యవారాలు సెయ్యబడ్తిరి. ఎండలకాలం వచ్చిందంటే పొద్దు పొయ్యేదాక ఇదే తంతు. యాయో ఒకటి పొద్దుపోని మాటలు మాటాడ్తా కూచ్చుంటారు. ఆ పొద్దు ఎద్దల గురించి, సథవ గురించి, సేండ్ల గురించి, మట్టిబండ్ల గురించి మాట్లాడ్తా మాటాడ్తా , మాటకు మాట లంకెనేసుకుంటా పోతాంటే వాళ్ల మాటల సందుకు దయ్యాల కతలొచ్చి సేర్య. పూర్వం కొరివి దయ్యాలనేటి ఉండెనని, మాయ్టాల సీకటి పడ్యాలకు రెడ్డీ పల్లె సమాదుల తట్టు సూచ్చే అయి దీపాలు పెట్నెట్లు మండుతా కనపిచ్చేటని అనుకోబడ్తిరి.

మధ్యలో సీనా ఉండి ‘మొన్నీమధ్య పూసలోల్లాయిబ్బి ప్యాక్టరీకి పొయ్ అర్ధరాత్రి వంక దావన నర్సుకుంటా వచ్చాంటే, కుమ్మరోల్ల బాయికాడికొచ్చాలకు మ్యాకపిల్లొకటి ఎనకమ్మడి అర్సుకుంటా వచ్చెనంట. వార్నీ పాసుగుల ఎవర్దో గొల్లొల్లది తప్పోయ్నట్లుండాదే అని ఆయబ్బి దాన్ని భుజానేసుకుని నర్సేకొద్దీ అది బో తూకమైతా వచ్చెనట. ఊరి పొలిమేరల కాడికొచ్చాలకు అది దెగుమాల్ల బరువాయనంట. బీడీ ముట్టిచ్చామన్జెప్పి ఆయబ్బి నిలబడి దాన్ని కిందికి దించి జోబిలో నుంచి బీడి దీసి నోట్లో పెట్టుకుని అగ్గిపుల్ల ముట్టిచ్చినాడో లేదో,  అది ఆన్నుంచి కుప్పట్లు తీచ్చా పరిగెత్తెనంట. బాగ ఇంతదూరం పొయ్నాక ఎనిక్కి మల్లి ‘తప్పిచ్చుకున్న్యావ్ పోరా నా కొడకా. దొరుకుతావ్ లే మల్లా ఎప్పుడో ఒకతూరి’ అనుకుంటా ‘ , మల్లా అదే ఉండి ‘బెదురుకుని సలిజర్రం గనక పట్టుకుంటే నా బండారం (యాపాకు, పసుపు, రోంత ఉప్పు వేసి నూరిన మిశ్రమం ) తిని ఒళ్ళంతా పట్టిచ్చుకొని ఉడుకుడుకు నీళ్లుపోసుకో పోతాది అన్నెంట.. సెప్పలేంబ్యా కాలం బాగలేనపుడు ఎప్పుడు ఏం జరుగుతాదో అని, ఏం ఓల్రెడ్డి! ‘ అని ఓల్రెడ్డి పక్క జూచ్చా గిలి లేప్య.

ఆ మాటాలకు ఓల్రెడ్డి అదిరిపడ్య. లోపలెట్లున్యా బైటకు మాత్రం అలివిగాని ధైర్యం ఉలకబోచ్చా ‘ఆ…యాడుండాయ్ బ్యా…దెయ్యాలు గియ్యాలు. ఐనా మట్టి బండికాడ సేతిలో పారుంటాన్ల్యా. ఇంగాడికయ్యి దగ్గరికొచ్చేది . పారదీసుకుని దెంగితే గెర్రున తిరిగిపడ్తాది దయ్యమైనా గియ్యమైనా! రమ్మను మా బండి కాడికి తెలుచ్చాది దానికి’ అంటా పూరా పరాక్రమాలు జేస్య. మల్లా ఓల్రెడ్డే ఉండి ‘మొగ పుట్టుక పుట్టుండుకోని దయ్యాలకు భయపడ్తాంరేంది బ్యా…మీరు థూ..’ అని మీసం మీద సెయ్యేసి దుగబట్య పెద్ద పోటు మొగోని మాదిరి.  అక్కడ్తో ఆయబ్బి సల్లుకోల్య . దాన్ని ఇంగా సాగబెరిక్య. పిల్లప్పుడెప్పుడో కలంలో ఒక్కడూ కాయలి పండుకున్యట్లు, సీకట్లో గండి బండికి రోడ్డుకాడ దిగి ఒక్కడే అయ్యాలప్పుడు ఊర్లోకి నర్సొచ్చినట్లు, యాన్నో వాళ్లత్త గారి ఊర్లో అమాస నాపొద్దు పందెమేసుకుని సమాదుల్లో నిమ్మకాయ పెట్టొచ్చినట్లు ఇట్లా పట్ట పగ్గాలు ల్యాకుండా ఉన్నెయి లేనియన్నీ కలిపి దయ్యాలే అతగాని ఏటుకు భయపడి ఉచ్చ పోసుకుంటాయన్నెట్లు బో జంపు మాటలు మాట్లాడ్య.

ఒల్రేడ్డి మాటలకు సీనా , శ్యామన్న, రవన్న ‘అవునా బ్యా…అట్లనా బ్యా…తక్య నువ్వు ఉండాల్సినోనివి బ్యా…’ అంటా తలూపుకుంటా తప్పెట కొడ్తా తాలమేస్య,  సేసేది ల్యాక.

పిల్లప్పుడు ఎప్పుడన్నా రాత్రి బూ తిన్యాక రొంటాలకొచ్చే ‘బ్యా… సీనా తోడొచ్చావ్ బ్యా…అట్ల బైటికి పొయ్యొజ్జాం’ అనుకుంటా  వాళ్లింటికాడికొచ్చేటోడు, తాటికాయలకు పొయ్ నీళ్లు దప్పికై వంకలో సెలంలోకి వంగి నీళ్లు తాగేటప్పుడు ‘సీనా నడ్డీపున రోంతట్ల ఇసిక్య బెయ్, ల్యాకుంటే పట్టపైటాల దయ్యమొచ్చి గుద్దుతాదని’ బెదురుకునేటోడు ఇన్ని శిఖరాలు ఎక్కెనని, అన్ని పరాక్రమాలు సేసే సరికి ఆడందరికీ అది బో నగులాటాయ. సీనా ముందే అవులేయ మనిసి. ‘ఆహా…పారదీసుకోని దెంగుతావా. బలె పాలెగానివి గదూ నువ్వు. నీ కత సెప్తాంలే’ అనుకున్య మనసులో.

సందకాడ బాగ పొద్దుపాయ. అందరూ ఎవరి ఇండ్ల దావ వాళ్లు పడ్తిరి. శ్యామన్నదీ సీనాది పక్క పక్కిండ్లే. ఇంటికి పొయ్యే దావలో సీనా ఉండి శ్యామన్న తో  ‘అన్నా… కోడ్య కాలు దువ్వుతా బో రంకెల మీదుండాది గానీ..దాన్ని ఒకతూరన్నా బిర్రు బండికి( గాన్లు తిరక్కుండా గడార్లేసి, మోకులేసి బిగిచ్చి ఎద్దల్ను ఎగదోల్తారు) కట్టి దాని పరాక్రమమేందో, దాని బిసెంతో సూడలన్నా’ అన్య.

‘అవ్ బ్బీ ఈయబ్బి ఎచ్చల కూతలు ఈ మధ్య ఇన్లాక సచ్చనాము’ అంటా సీనాకు వంత పాడ్య శ్యామన్న . బలనిరూపణ యాడ , ఎట్లనేది మాత్రం ఏమనుకోల్య.

వారం దొర్లిపాయ. ఒకనాడు శ్యామన్న సేనికాన్నుంచి నర్సుకుంటా ఇంటికొచ్చాంటే ఒక పిచ్చాయ్మ అదాటై ‘పావలా ఇచ్చావ్’ అని అడిగ్య. ‘లేదుపోమ్మా…’ అన్య శ్యామన్న. అట్లా రోంత దూరం నర్సినాక శ్యామన్న మెదడులో యాన్నో కరెంటు బల్పెలిగినట్లాయ. ఆమెకు ఇయ్యడానికి పావలా సిల్లరైతే ల్యాకపాయ గాని వారం రోజుల నుంచి లోపల నలిగే సిక్కుముడి వీడినట్లాయ. ఆమైన ఇంటికొచ్చి రాగానే ‘సీనా…బ్బీ సీనా అంటా క్యాకేస్య. సీనా కనపచ్చానే ‘బ్బీ…ఆయబ్బికి మోటింపు పెడదాంలే బ్బీ ఇంగ’ అన్య బో ఉషారుగా, సైగ్గాకుండా,    ఎవ్రూ ఇనకుండా.

అప్పట్లో మా ఊరికి పక్కూరు నుంచి యాకసా ఓ పిచ్చాయమ వచ్చాండ్య. ఎవరు యాడ అదాటుపన్యా ‘పావలా ఇచ్చావ్?’ అంటా అడుక్కుంటాండ్య. ఆయమ్మ పిచ్చిదో కాదో కనుక్కుందామని సెప్పి ఒగోరు ఆమెకు పది, ఇరవై నోట్లు ఈజూపుతాండ్రి. ఐనాగానీ ఆయమ్మ పావలా తప్ప ఇంగోటి తీసుకోక పోతాండ్య. అట్లా ఆయమ్మ మంచుల్యాడున్యా సరే ఆడికి పోయి,  యాలపాలా ల్యాకుండా ‘పావలా ఇచ్చావ్’ అంటా అడుగుతాండ్య. మనం ‘లేదు పోమ్మా’ అంటే ఏమనకుండా ఆన్నుంచి ఇంగోసాటికి దాటి పోతాండ్య.

సుట్టు పక్కల పల్లెలన్నిటికీ ఆయమ్మంటే బాగ తెలుసు. ఎవరికీ ఏ హానీ తలపెట్టని పిచ్చి మాతల్లి. అందుకే ఆయమ్మను ఎవ్రూ ఏమీ అనేదిల్యా.  పాపం పున్నెం అనేటోల్లు ఆయమ్మ యాలకు వచ్చినప్పుడు కడుపుకు ఇంత పిడస పెడ్తే నగ్గుంటా తిని యలబారి పోతాండ్య.

ఆపొద్దు మాయ్టాల సీనా , శ్యామన్న ఇద్దరూ కలిసి సౌడంబ పంపులకాడికి పొయ్ ఓల్రెడ్డి వాళ్ళ మండ్య యాడుండేదీ, మండ్య కాడ దాపుకు సెట్టో పుట్టో  ఏమన్నా ఉందో లేదో అని వాళ్ల ‘ఎత్తు’కు తగిన పరిస్థితి ఉందా లేదా అని సూసుకొని వచ్చిరి. ఇంగో రెండు మూడ్రోజుల్లో మోటింపు పెట్టాలని తీర్మానించుకుంటిరి. మూర్తం నాపొద్దు తెల్లార్జామున కతెట్ల నడిపియ్యాల్నో పథకం సిద్ధం సేసుకోబడ్తిరి. సీనాకు అనుమానమొచ్చి ‘ఆ సాధు జీవికి ఆయబ్బి భయపడ్తాడంటావా న్నా..’అన్య అనుమానంగా. ‘ఏం పరవాల్య బ్బీ . వట్టి బెదురు గొడ్డు’ అని ధైర్యం జెప్య.

అది మొదలు సీనా ‘పావలా ఇచ్చావ్, పావలా ఇచ్చావ్’ అని రోంత కీచు గొంతు పెట్టి రామకోటి సదివినట్లు సదువబట్య. శ్యామన్న కనపచ్చినప్పుడల్లా ఆయన్నను ‘పావలా ఇచ్చావ్ ‘ అంటా గిల్లడం మొదలు పెట్య. ‘బ్రమ్మాన్నం పోబ్బి, అస్సలు కనుక్కోలేడు’  అంటా ఆయన్న గురి కుదినట్లు సంబరపడబట్య.

ఆ రోజు రానే వచ్చ. సీనా, శ్యామన్న తెల్లార్జామున్నే లేసి అగ్గిపెట్టె, బీడీలు కట్ట, ఒక పాత చీరె, ఒక టవాల తీసుకొని , ఎవ్రూ సూడకుండా ఇద్దరూ ఓల్రెడ్డి ఇంటిపక్క పోయి కాడి పోయిందా లేదా అనేది వాకబు జేచ్చిరి. కాడి పోయిందని తీర్మానించుకున్యాక మండ్య దావ పడ్తిరి. మండెకాడ సుట్టూ సూచ్చిరి. అంతా సీకటి. ఆ పక్క నుండే సీకిసెట్టును దాపు జేసుకొని, బండి ఎప్పుడెప్పుడొచ్చాదా అని ఎదురుజూచ్చా కూకుంటిరి. సీనా పాతచీరె కట్టుకోని కొంగు నోట్లో పెట్టుకుని ‘పారతో దెంగుతాడంట న్నా మన పాలెగాడు’ అన్య గుసగుసలాడ్తా.

బండి రానే వచ్చింది. కానీ బండ్లో వాళ్లన్న , ఓల్రెడ్డి ఇద్దరూ ఉండ్య. వార్నీ యవ్వారం సెడెనే అనుకుంటిరి. వాటం కుదరలేదే అనుకుని నీరుగారి పోతిరి. సరె మల్ల బండికొచ్చాడు లే ఒక్కడు . యాడికి పోతాడు ఈ పొద్దు సిక్కకుండా అనుకుంటా మొండిగా ఎదుర్జూడబడ్తిరి బీడీలు తాగుతా, మాట్లాడుకుంటా.

తూర్పున సుక్క పొడిసింది. మల్ల బండి రానే వచ్చింది. ఈసారి బండ్లో ఓల్రెడ్డి ఒక్కడే ఉండ్య. సీనా శ్యామన్న పక్క జూసి ‘సిక్కినాడు న్నా’ అన్య సంబరంగా. ఓల్రెడ్డి బండి తిప్పి, ఎనక కొడాలు మండె సాయికి ఉండేటట్లు పెట్టి ఎద్దల్ను నిలబెట్టి నగల్లో నుంచి కిందికి దిగినాడు. ఎద్దల ముందుకు పొయ్ దాంట్ల మొగదాడు పట్టుకున్ని బండిని ఇంగరోంత ఎనిక్కి కొట్టి గాన్లు మండెకానిచ్చి నిలిపి ఎద్దల పట్టేండ్లు తప్పిచ్చి ‘అయ్ పా..’ అంటా దాంట్లను పక్కకదిలిచ్చి నగలు కర్సుకుని బండిని పైకి లెవనెత్తి నగల్లకు పైన యాలాన్నాడు.

అంతే, అదే అదునుగా పక్కన చెట్టు సాట్న ఉన్య సీనా  ఒక్క ఊపున నగల్ల కిందికొచ్చి ‘ఓల్రెడ్డిని తట్టడ్సి ‘ పావలా ఇచ్చావ్’ అన్య చీర కప్పుకొని, కొంగు నోట్లో దోపుకుని, కీసు గొంతు పెట్టుకోని. ‘సచ్చిరా దేవుడా’ అనుకుంటా ఓల్రెడ్డి బెదుర్కొని నగల్లకట్లనే లౌసుకుని గట్టిగ కర్సుకుండ్య,  కుయ్ కయ్ మనకుండా.

ఆపక్క సీకిసెట్టు సాటునుంచి ‘మ్మీ… బెరీన రామ్మీ. ఆకలేచ్చాంది… మ్మీ…’ అనుకుంటా ముసలి ఆడమనిసి మాట్లాన్నెట్లు,  వనుకుడు గొంతుతో శ్యామన్న పిల్సబట్య.

సీనా ఒకపారి తలెత్తి ఓల్రెడ్డి పక్క జూసినాడు. ఆ మనిసి గజగజ గజ పదురుకుంటనాడు. ఆయబ్బిని జూసి కొంపదీసి గుండ్యాగి జరగరానిది జరిగితే మొదటికే మోసమొచ్చాదని భయపడ్య. అదృష్టం కొద్దీ అంతలోకే ఎవర్దో ఎద్దలనదిలిచ్చా అటుపక్క సేండ్లల్లో నుంచి రిక్కెల శబ్దమాయ. బతికిచ్చినావ్రా దేవుడా అనుకోని ఆన్నుంచి లేసి ‘తప్పిచ్చుకున్యావ్ పోరా నా కొడకా ఈ పొద్దు’ అనుకుంటా ఆన్నుంచి పరుగెత్తా పాయ. సీనా ఎనకమ్మడే శ్యామన్న గూడా పరుగెత్తె. ఊరి పొలిమేరల కాడ సెర్రుకట్ట మీద ఇద్దరూ ఆగి, ఒకర్నొకరు పట్టుకుని పడిపడి నగబడ్తిరి. మన పాలెగాడు అలవిగాని పరాక్రమవంతుడు అనుకుంటా.

ఆ పొద్దు సందకాడ సీనా, శ్యామన్న సావిడి కాడ అరుగు మీద కూకోని మాట్లాడ్తాంటే ఓల్రెడ్డి కి సలి జరమొచ్చిందని ఎవ్రో అనంగా ఇంటిరి.

మర్సటి రోజు సీనా, శ్యామన్న ఓల్రెడ్డి వాళ్లింటికి పోతిరి. ‘జరం జోలికెందుకు పొయ్నావ్ బ్యా…’ అన్య సీనా. బెట్టగొట్టిందిలే సీనా అన్య మెత్తని గొంతుతో. ఆయబ్బిని అట్ల సూసి సీనా, శ్యామన్న బాధపడ్య. ‘సూపిచ్చుకున్యావ్ బ్యా…’ అని అడిగ్య. రేపు పొద్దుటూరుకు పదాం పా బ్యా, మేమొచ్చాము’ అన్య. పొద్దుటూరు ఆస్పత్రికి తీసకపొయ్ ఆయబ్బికి సూపిచ్చ.

ఓల్రెడ్డి తిరుక్కోని తిరగబట్య . మల్ల మట్టిబండి కట్య. తూర్పు సేనికి నిండుగా మట్టి ఇర్స్య. కాలం దొర్లిపాయ. దయ్యం చేసిన గాయం ఆయబ్బి మర్సిపాయ. గండికి తాయత్తు కట్టిచ్చుకోను పొయ్యొచ్చాంటే ముందు పక్క ఎవ్రో ‘మనం అబద్ధం సెప్తే అదే నిజమై మనకు కొట్టుకుంటాదని’ అనుకుంటాంటే ఇని ఇంగ ఎచ్చలకు పోయి అబద్ధాలాడగుడ్దని అనుకుండ్య ఓల్రెడ్డి.

ఆ సమత్సరం వానలు బాగ కురిస్య. అదునులో ఇత్తనం పడి సేన్లన్లీ పచ్చని పరుపు పర్సినట్లుండ్య. సథవ బాగ తోలిందాన ఓల్రెడ్డి వాళ్ల తూర్పు సేను నల్లగ బలుండ్య పైరు. సెట్టు నిండా ఊడలు పెట్టి బో పిచ్చి కాపు గాసిండ్య. కట్టె పెరికి , పొలం మీద బాగ ఆర్న్యాక దాన్ని తోలి కలంలో వాములేస్య. కలంలోకి సందకాడ బూతిని కాయలి పండుకోనని ఓల్రెడ్డి , సీనా, శ్యామన్న పాయ. కలంలో బాగ పెద్ద ఓద్య మైన కట్టెను తీసుకుని కాయలు కాల్చనని వంకలోకి పాయ. కాయలు కాల్చుకోని తింటా సీనా ఉండి ‘ఎకరాకు ఎన్ని మూటెలైతాయి ఓల్రెడ్డి’ అన్య. ‘25 నుంచి 30 మూటెలు కావచ్చు సీనా’ అన్య. నిజానికి ఈసారి ఊర్లోకెల్లా ఓల్రెడ్డి వాళ్ల తూర్పు సేనే మించుగా ఉందంటాంటిరి. ఎకరాకు ముప్పై మూటెలు అడ్డం అయితాయని సావిడి కాడ అనుకుంటే ఇంటిరి.

కాయలు కోసేది అయిపాయ. నెల్లూరు నుంచి దళారీలొచ్చి ఓల్రెడ్డి వాళ్ల కాయలు బ్యారమాడి తూకమేస్య. మూడెకరాల సేను 118 మూటెలాయ. అంటే ఎకరాకు నలబై మూటెల లెక్క. ఆ పొద్దు ఊర్లో యా అరుగు కాడ ఇన్యా అదే మాటే. ఆ పొద్దు సందకాడ సావిడికాడ అరుగు మీద సీనా, శ్యామన్న ఉండి ‘ఓ బ్యా…ఓల్రెడ్డి , నువ్వు ఈ పొద్దుట్నుంచి అసలు సిసలైన పాలెగానివి బ్యా ‘ అన్య సిక్కెంగ నగుతా.

సొదుం శ్రీకాంత్

శ్రీకాంత్ సొదుం: పనిచేసేది కంప్యూటర్ పైన అయినా పుస్తకాలతో పెంచుకున్న అనుబంధం తెంచుకోలేక చదవడం, అప్పుడప్పుడు రాయడం చేస్తుంటారు. ఇప్పటి వరకు పర్యావరణం మీద యురేనియం మైనింగ్ ప్రభావం, నోట్లరద్దు, నగదు రహిత సమాజం వెనుక అసలు రహస్యాలు, అమెరికాలో నల్లజాతీయులపై జాతి వివక్ష, పెద్ద వ్యాసాలు, రెండు పుస్తక సమీక్షలు ఇలా మొత్తం ఏడెనిమిది  పరిశోధన వ్యాసాలు వివిధ సామాజిక రాజకీయ మాసపత్రికలలో ప్రచురిచితమైనాయి. కొన్ని కవితలు కూడా ప్రచురితమైనాయి. ప్రస్తుతం ‘పిల్లప్పటి’ పల్లె అనుభవాలను రాయలసీమ యాసలో కతలు పనిలో ఉన్నారు.

5 comments

    • ధన్య వాదాలు అన్నా. అవును అన్నా. యర్రగుంట్ల, పులివెందుల తాలూకాలలో ముఖ్యంగా ఈ యాస కనపచ్చాది. నేను పిల్లప్పుడు పెరిగిన ఈ ప్రాంతాల నుంచి పట్టుకున్య కత ఇది.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.