రంగనాయకమ్మ చీవాట్లకు
హెచ్చార్కె జవాబు

గత సంచిక, ‘చర్చ’ శీర్షికలో… సికింద్రాబాద్, అల్వాల్ నుంచి వద్దిపర్తి బుచ్చి బాపూజీ వేసిన రెండు ప్రశ్నలకు రంగనాయకమ్మ జవాబిచ్చారు. ఆ ప్రశ్నకు, జవాబుకు రెండు మూలాలు.  ఒకటి రస్తా(ఫిబ్రవరి 16-28)లో ‘యాత్ర’ సినిమా స్పందనగా నేను రాసిన సంపాదకీయం. ఇంకొకటి… ఫేస్ బుక్ లో నేనే రాసిన రైటప్. తమ జవాబులో రంగనాయకమ్మ నాకు పెట్టిన ‘చీవాట్లకు’ ఇది జవాబు.

మొదట ముద్దు ముచ్చట.

బహిరంగ ప్రదేశంలోనైనా సరే, యువతీ యువకుల ముద్దు ‘మనోహరం’ అన్నాను నేను నా చిన్ని రచనలో. రంగనాయకమ్మ జవాబు చూస్తే… నేనేదో పోర్నో రచన చేశానని మీకు భ్రమ కలిగినా ఆశ్చర్యపడను. విమర్శలో యాక్యురసీ ఎంత ముఖ్యమో, దానికి నెగటివ్ వుదాహరణ రంగనాయకమ్మ జవాబు. బుచ్చి బాపూజీ ప్రశ్నలో గాని, నా ఫేస్ బుక్ రచనలో గాని ‘జంటలు నగ్నంగా ఆలింగనాలతో గడిపే దృశ్యం’ లేదు. దాని కోసం మీరు రంగనాయకమ్మ జవాబును చదువుకోవలసిందే. 

బహిరంగ నగ్న ఆలింగనం అనే మాట  ద్వారా రంగనాయకమ్మ ఆరుబయలు ‘సెక్సు’ స్ఫురణ ఇచ్చారు. ఇలాంటి విషయాల్లో ‘స్ఫురణ’ కేవలం స్ఫురణగా వుండదు. పాఠక మనో నేత్రం ముందు ‘దృశ్యం’ అవుతుంది. ఈ సంగతి రచయిత్రి రంగనాయకమ్మకు తెలుసు. తెలిసీ ఈ ‘అతిక్రమణ’ ఎందుకు చేశారు?

ఆరుబయట యువ జంట ముద్దు… అయితే మనోహరం అవుతుంది లేదా ఏమీ కాదు. అది బహిరంగ సెక్సు మాదిరి అసహ్యం కాదు. నా ‘మనోహరత్వం’ ప్రకటనను అక్కడ ఏముందో దానికి పరిమితం చేసి మాట్లాడితే పాఠకులకు ఆనదని ఆమె అనుకున్నట్లున్నారు. మ్యాగ్నిఫై చేసి, ఆ పైన ఖండించారు. ఇది తప్పుడు విమర్శా పద్ధతి.

మీరనొచ్చు ఆమె సెక్సు అనే మాట రాయలేదు కదా అని. ఆమె ఏమన్నారు? ‘నగ్న ఆలింగనం’ అన్నారు. ఆడ మగ బహిరంగంగా కౌగలించుకోడం పెద్ద విశేషం కాదు. దానికి చాటు అవసరం లేదు. ఇక్కడ యవ్వారం వుత్తి కౌగలింత కాదు. నగ్నమైన కౌగలింత. బట్టలు లేని కౌగలింత. ఆడ మగ బట్టలు లేకుండా కౌగలించుకోడం ఒకే ఒక సారి వుంటుంది. అది సెక్స్ యాక్ట్ మాత్రమే.  

రంగనాయకమ్మ జవాబులోని రెండో అతిశయోక్తి… ‘ప్రదర్శన’ అనేది. “తల్లిదండ్రులు, తమ ముద్దుల్నీ, ఆలింగనాల్నీ పిల్లల ముందూ, ఇంట్లో ఉండే వృద్ధుల ముందూ ప్రదర్శించడం ఇంకెంత మనోహరం!” అని కోప్పడ్డారామె. నేను యువ జంట ముద్దును ‘ప్రదర్శన’ అనుకో(డం) లేదు.  అది యిద్దరి మధ్య తమకం తో, మైమరుపుతో జరుగుతుంది. ఒక క్షణమో కొన్ని క్షణాలో వాళ్ళు పరిసరాల్ని మరిచి పోతారు. ఆ పారవశ్యం నా మట్టుకు నాకు మనోహరమే. ప్రదర్శన కాదు. అమ్మ నాన్న ప్రేమగా కౌగలించుకుంటే పిల్లలకు ఏమీ కాదు. వృద్ధులకూ ఇబ్బంది వుంటుదని అనుకోను, వాళ్ళు మరీ చాదస్తులు కాకపోతే.

కొన్ని క్రైస్తవ వివాహాల్లో ముద్దు పెళ్లి క్రతువులో భాగం. ప్రేమ కథా నాటకాల్లో ముద్దు పెట్టుకోడం వుంటుంది. అవి కాకుండా మిగతా సమయాల్లో అది ‘ప్రదర్శన’ కాదు. ముద్దు పెట్టుకునే వారికి గాని, ‘ఈ జంట ఇంత మనోహరంగా ఎప్పుడూ వుండాలి’ అని కోరుకునే నా బోటి వారికి గాని… ఎవరికీ ఆ ముద్దు ‘ప్రదర్శన’ కాదు. ఆ జంట తమ ముద్దుతో ఎవరికీ దేన్నీ రుజువు చేయడం లేదు. డెమాన్ స్ట్రేట్ చేయడం లేదు. ఆ క్షణంలో వాళ్లు బియాండ్ ఆల్ దట్. అందుకే అది మనోహరం.

నాకు మనోహరం అయిన ముద్దు కొందరికి అసహ్యం ఎందుకయ్యిందో నాకు అర్థం కాని విషయం. ఈ సందేహాన్ని మార్క్సిజం తీర్చలేదు. అది అనుభవజ్ఞుడైన సైకియాట్రిస్టు పని.

***

రెండో ప్రశ్న:

రాజశేఖర రెడ్డి హయాంలో అమలు జరిగిన రెండు సంక్షేమ పథకాలను నేను మెచ్చుకున్నాను. అవి విద్యార్థుల ఫీజ్ రీఎంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ. తదనంతర పాలకవర్గ నేత (నాయుడు) వాటికి తూట్లు పొడిచిన నేపధ్యంలో అవి నాకు మెచ్చుకోదగిన సంస్కరణలుగా కనిపించాయి. వాటిని మెచ్చుకోడం వెనుక నాలో పని చేసినది శ్రామిక వర్గ దృక్పథమే. అందువల్ల “ఆ యోగ్యతా పత్రం ఇచ్చిన వ్యక్తికి బొత్తిగా శ్రామిక వర్గ దృక్పధం లోపించిందని అర్ధం” అనే రంగనాయకమ్మ జడ్జ్మెంటు అర్థరహితం.

ఆ పథకాలు పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ప్రజాధనం దోచి పెడతాయని నాకూ తెలుసు. ఆ విషయం అక్కడే చెప్పాను. అయినా, వాటి ద్వారా పేదలకు జరుగుతున్న అత్యవసర మేలును మెచ్చుకున్నాను. అది తప్పు కాదు. విద్యా, వైద్యాలను ప్రజల పోరాట అజెండా లోనికి చేర్చినందుకు వయ్యెస్సార్ ను మెచ్చుకున్నాను.

మనం దేన్ని విమర్శిస్తున్నామో దానిలో లేనివి చేర్చడం (పై టాపిక్), వున్నవి విస్మరించడం (ఈ టాపిక్) రెండూ చెడు విమర్శా పద్ధతులే. ‘కార్పొరేటైజేషన్’ కారణంగానే..  రాజశేఖర రెడ్డి చనిపోకపోయి వుంటే… ఆ పథకాల అమలు ఆయనకు సమస్య అయ్యేదని నేను చెప్పాను. దానికి పరిష్కార మార్గం ప్రజా పర్యవేక్షణలో విద్యా, వైద్య శాలలు సక్రమంగా నడిచేట్టు చేయడమే. ఇది చెప్పడానికే ‘మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్’  అనుసరిస్తున్న తాత్వికతను కోట్ చేశాను.

ఇంతకీ… శ్రామిక దృక్పథం అంటే ఏమిటి? పెట్టుబడి దారీ విధానాన్ని కూలదోసి శ్రామిక వర్గ ప్రభుత్వం ఏర్పడే వరకు… ఈలోగా బూర్జువా డెమొక్రసీ పరిథిలో  ప్రభుత్వాలను ఏమీ డిమాండ్ చేయకుండా ప్రజలు మగ్గిపోవాలని కోరుకోడమా? కాదు. ఇంతకన్న వున్నతమైనది ఒకటుందని గుర్తు చేస్తూనే, పాలక వర్గాలు ఇంతకు మించి చేయలేవని హెచ్చరిస్తూనే… ‘ఇప్పుడు ఇక్కడ’ వున్న దాన్ని శుభ్రం చేసుకుని వాడుకోవాలనడం తప్పు కాదు. అవసరం.

సోషలిజం అనేది పెట్టుబడిదారీ విధానం కడుపులో పెరుగుతున్న శిశువు. అది అమ్మ పొట్ట లోనూ పెరుగుతుంది, అమ్మ పాలు తాగుతూనూ పెరుగుతుంది. పిండ దశ పరిణామాలు అల్పమైనవి కాదు. ఈ శిశువు పెరగడానికి మన సాహిత్య, సామాజిక విమర్శ వుపయోగపడాలి.

మార్పుకు తగిన పోరాట రూపం: ఇస్యూ, ఇస్యూ గా ప్రజల కదలిక.

దోపిడి వ్యతిరేక ప్రజా కదలికలను ప్రోత్సహించడం, అడివి సాయుధ చర్యల కన్న మైదాన వీధిపోరాటాల వల్ల ఎక్కువ మేలని పదే పదే గుర్తు చేయడం… ఇవాళ అత్యవసరమని అనుకుంటున్నాను.

ఇందులో భాగంగానే వయ్యెస్సార్ రెండు పథకాలు ముందుకు తెచ్చిన కొత్త డిమాండ్లను… విద్యా, వైద్య డిమాండ్లను… సమర్థించాను. వాటిని అజెండా మీదికి తెచ్చినందుకు వయ్యెస్సార్ ను మెచ్చుకున్నాను.

చిట్టచివరగా నక్సలైట్లతో వయ్యెస్సార్ ప్రభుత్వం చర్చల సంగతి.

ఆ చర్చలు ప్రభుత్వం వైపు నుంచి అర్థవంతమే. చర్చలలో ప్రభుత్వ ధ్యేయం శాంతి మాత్రమే. ఇది నిజాయితీ వున్న ఏ బూర్జువా ప్రభుత్వానికైనా వుండే ధ్యేయమే.

వాటిలో పాల్గొన్న నక్సలైటు పార్టీల వైపు నుంచి చూస్తే ఆ చర్చలు అర్థరహితం. నక్సలైట్లు ఈ వ్యవస్థను పూర్తిగా తీసేసి తాము సరైంది అనుకుంటున్న మరో వ్యవస్థను నిర్మించాలనుకుంటున్నారు. ఇది వారి దీర్ఘకాలిక దృక్పథం కాదు, తక్షణ కార్యక్రమం. ఈ పనిలో తమకు ఈ ప్రభుత్వం ఏ సాయమూ చేయదు. చేస్తే ఇది బూర్జువా ప్రభుత్వం కాదు.

మరి ఏమి డిమాండ్ చేద్దామని వీళ్ళు చర్చలకు వెళ్ళారు? చర్చల వల్ల ప్రజలకు ఏ పొలిటికల్ అడ్వాంటేజ్ వుంటుందని వెళ్ళారు?

ఆ కాలంలో నేనిలా భావించాను. నక్సలైట్లు ప్రభుత్వంతో చర్చించడానికి ఏముంటుంది? వాళ్ళు ప్రజలతో చర్చించాల్సింది చాలా వుంది. తాము చేస్తున్న రకం సాయుధ పోరాటాన్ని ఇంకా కొనసాగించాలా? తాము అధికారానికి వొస్తే రాజ్యం ఎలా వుండాలి? రాజ్యం అలా వుండటానికి ఇప్పుడున్న పార్టీ యంత్రం సరిపోతుందా? ఆ రాజ్యం జనాన్ని అణిచివేసేది కాదనే ఇన్ బిల్ట్ హామీ మన కార్యక్రమంలో వున్నదా?… ఈ విషయాల్ని నక్సలైట్లు ప్రజలతో చర్చించాలి. అది మానేసి, ప్రభుత్వంతో ఏం చర్చిస్తారు? ఈ అవగాహనతోనే ఆ సంపాదకీయం రాశాను.

నక్సలైట్లను ‘జన జీవన స్రవంతి’ లోనికి తీసుకొచ్చే సదుద్దేశం వయ్యెస్సార్ కు వుండింది. ఇక్కడ జన జీవన స్రవంతి అంటే, నేటి వ్యవస్థే. నక్సలైట్లు కోరుకున్న రకం సోషలిజం కాదు. వాళ్ళకు రాజ్యాధికారం ఇచ్చేసి బూర్జువా వర్గం స్వచ్చంద పదవీ విరమణ చేస్తే తప్ప అది సాధ్యం కాదు. ఆ పని చేయనందుకు వయ్యెస్సార్ కు నిజాయితీ లేదని అనలేను.

రంగనాయకమ్మ శైలిలో చెప్పాలంటే ‘ప్రభుత్వమా! ప్రభుత్వమా! భూస్వాముల భూములను ప్రజలకు పంచెయ్, పెట్టుబడిదారుల ఆస్తులను ప్రజలకు పంచెయ్, ఈ రాజ్యాంగాన్ని తీసేసి మేము చెప్పే మా రాజ్యాంగాన్ని ఆమోదించు…’ అని అడగడం కుదరదు.

ఇక ముందైనా నక్సలైట్లు చర్చించాల్సింది ప్రజలతోనే.

స్టేట్ కు సంబంధించి… పాలక వర్గాన్ని శ్రామిక వర్గం రిప్లేస్ చేయడం… ఒక్కుమ్మడిగా ‘ఇన్సరెక్షన్’ రూపంలో జరగొచ్చు లేదా ఒక్కొక్క ఇస్యూ మీద పోరాటాలుగాను జరగొచ్చు. రెండోది… ఇస్యూ తరువాత ఇస్యూ గా పని చేయడం… వొద్దనే వారి లోనే శ్రామిక వర్గ దృక్పథం లోపించిందంటాను. వారిని నడిపిస్తున్నది వొట్టి పెటీ బూర్జువా దృక్పథం అంటాను.

రంగనాయకమ్మ నాకు పెట్టిన చీవాట్లను ప్రతిధ్వనిస్తూ, తామూ కొన్ని చీవాట్లు పెడుతూ కొందరు స్నేహితులు రాసిన వ్యాఖ్యలకు కూడా ఈ జవాబులో జవాబులు దొరికాయనుకుంటాను.

14-4-2019

హెచ్చార్కె

Add comment

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.