ఇందిర దారిలో మోదీ ?

 తమ తరఫున ఒక బలమైన నాయకత్వం ఉండి, ఆ నాయకత్వం ప్రజల అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చగలదు అన్న నమ్మకం కుదిరిన రోజున ప్రజల అభిప్రాయాల్ని రాజకీయ పార్టీలు పట్టించుకోవడం మానేస్తాయి. ఎందుకంటే పార్టీగా, ప్రభుత్వ పరంగా, ఇతరత్రా తాము చేసే తప్పులను ఆ బలమైన నాయకత్వం కప్పిపుచ్చగలదనే ప్రగాఢమైన నమ్మకం వారికి ఆ అలుసైన భావనను కలిగిస్తుంది. భారత రాజకీయ చరిత్రలో మొన్న మొన్నటివరకు అత్యంత బలమైన నాయకురాలిగా ఇందిరా గాంధీ ఉండేవారు (తానున్న రోజుల్లో). ఇందిరా గాంధీ హయాంలోనే ప్రజాభిప్రాయాలకు పాతరవేసి, ‘అధిష్టానం నిర్ణయం ప్రకారం’ అన్నటువంటి దుస్సంప్రదాయానికి బాటలు వెయ్యటం జరిగింది. దేశం మొత్తం మీద స్థానికంగా నాయకులను ఎదగనివ్వకుండా, పార్టీని తన చెప్పు చేతల్లో పెట్టుకోవటానికి ఇందిరా గాంధీ అనుసరించిన విధానమది. రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినపుడు, గెలిచిన తరువాత అసలు ఆ ఎన్నికలతో ఏమాత్రం సంబంధం లేకుండా వ్యవహరించిన వారు కూడా ముఖ్యమంత్రి కాగలిగేవారు. ‘ఇందిరయే ఇండియా, ఇండియాయే ఇందిర’ గా నడిచిపోయిన రోజులవి. కానీ, అదంతా ఇందిర సమ్మోహన శక్తి అని తెలుసుకోలేని కాంగ్రెస్ అధినాయకత్వం ఇందిర తరువాత కూడా అవే పద్దతులను అనుసరిస్తూ చివరికి పార్టీని ఈనాటి పరిస్థితికి తెచ్చారు. ఈనాడు కనీసం ఈపాటి స్థాయిలోనైనా కాంగ్రెస్ ఇంకా బతికి ఉంది అంటే అది తమ గతకాలపు బలమైన నాయకత్వపు ఘనతే తప్పించి వీరి గొప్పతనమేమీ లేదు.

ఇన్నాళ్ళూ ఇతర జాతీయ రాజకీయ పార్టీలకు ఆ దౌర్భాగ్య స్థితి ఉండేది కాదు. ఉదాహరణకు గతంలో భాజపా హిందుత్వ, కాంగ్రెసేతర రాజకీయాలు అని; వామపక్షాలు తమ సిద్ధాంత ప్రాతిపదికన; ఇక ఎప్పటికప్పుడు పుట్టుకువచ్చే మూడో కూటమి కొన్ని ప్రాంతీయ పార్టీల రాజకీయ అవసరాలననుసరించి – ఇలా ఉండేది పరిస్థితి. కనీసం వామపక్షాలు, భాజపా తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవి. అప్పట్లో కాంగ్రెస్ కు ఇందిర లాంటి నాయకత్వం ఇవ్వాళ (అంటే 2014 ప్రాంతం నుండి) భాజపాకు మోడీ రూపంలో లభించింది. సరిగ్గా నాడు కాంగ్రెస్ గమనం ఎలా వుండిందో ఇపుడు భాజపా గమనం అలానే వుంది, ఆనాడు ఇందిరిగా చుట్టూ ఉన్నవారు ఎలా నడిపారో ఇపుడు అలానే జరుగుతోంది; ఇందిరా మీద ఈగ వాలినా రెచ్చిపోయే సామాజిక మాధ్యమాలు ఆనాడు లేవు కానీ ఉండి ఉంటే ఈనాటి అంధ సమూహాల్లానే ఉండేవేమో. ఇందుకు తార్కాణాలు… గోవాలో మనోహర్ పారిక్కర్ నియామకం; ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ నియామకం, నోట్ల రద్దు చర్య. ఇవి ఆనాటి ఇందిర చర్యలకు నకలులే. అదే మార్గంలో వీరు సాగుతున్నారనటానికి ఋజువులే. ఉత్తర ప్రదేశ్ విషయంలో ఒక పార్టీగా భాజపాకు 312 స్థానాలు వస్తే అంతమందిలో కనీసం ఒక్కరిని రాష్ట్రాన్ని నడిపించే నాయకుడిగా నియమించలేని దుస్థితిలో ఉన్నారా!? వారందరిలో రాష్ట్రాన్ని నడిపించే స్థాయి ఎవరికీ లేదని అనుకుంటే అటువంటి వారికి అసలు టికెట్ ఎందుకు ఇచ్చారు!? ఇక్కడ ప్రశ్న యోగి ఆదిత్యనాథ్ లేదా మనోహర్ పారిక్కర్ ల అర్హతానర్హతలో, మంచితనం/నాయకత్వ పటిమలో కాదు. సాంకేతికంగా భాజపా చేసింది తప్పేమీ కాదు, అలాగే ఆనాడు కాంగ్రెస్ చేసింది కూడా సాంకేతికంగా తప్పేమీ కాదు. కాంగ్రెస్ అటువంటి చర్యలకు పాల్పడినప్పుడు అందులో అధినాయత్వపు అహంకార ధోరణి కనబడిన వారికి ఇపుడు అలా అనిపించకపోటం విచిత్రం.

ఇటువంటి ఒక ప్రశ్న లేవనెత్తగానే వెంటనే బదులు వచ్చేది ‘కాంగ్రెస్ చేసింది కదా’ అని. కాంగ్రెస్ అలా చేసింది కాబట్టే ఇపుడు దాని పరిస్థితి ఇలా ఉంది. అంతేకాదు, కాంగ్రెస్ అలా చేసింది కాబట్టే జనం భాజపాకు అవకాశం ఇచ్చారు అని తెలుసుకోవాలి. ఉత్తరప్రదేశ్ ప్రజానీకానికి కూడా ఆదిత్యనాథ్ నాయకత్వం అలాగే గోవా ప్రజానీకానికి మనోహర్ పారిక్కర్ నాయకత్వం ఒప్పు కావచ్చు, కానీ, అది ఇలా కాంగ్రెస్ దారిలో కాకుండా సక్రమమైన దారిలోనే  జరగాలి. వారిని శాసనసభ్యులుగా పోటీ చేయించి ఉండాలి.

దారి కాంగ్రెస్ ది అయినపుడు భవిష్యత్తు కూడా కాంగ్రెస్ దే అవుతుంది. కాంగ్రెస్ ను వదిలించుకోవాలనుకుంటుంటే పేరు మార్చుకుని మళ్ళీ అదే జబ్బు ఈ దేశపు ప్రజాస్వామ్యానికి పట్టకూడదని ఆలోచన. అంధసమూహం ఎలా అనుకున్నా సరే … భాజపా చర్యలు నైతికంగా సరైనవి కావు; దాన్ని సమర్థించుకోవటానికి కాంగ్రెస్ చర్యలను ఉదాహరణలుగా చూపడం మరింత దిగజారుడు చర్య. ఇవ్వాళ సమర్థవంతమైన, ప్రజాకర్షక వ్యక్తి ఉన్నాడని మురిసిపోయి చిత్తం వచ్చినట్టు ఆడితే – మలుపు దారిలో గతుకులు, గుంతలు ముందుగానే పలకరిస్తాయి.

ఒకప్పుడు ఎన్నికల సమయంలో రాజకీయ పక్షాల మేనిఫెస్టో అనేది ప్రధానంగా ఉండేది. ఆయా రాజకీయ పక్షాల ప్రచారం కానీ, విమర్శలు కానీ మేనిఫెస్టో ఆధారంగానే ఉండేవి. ఒకరి మేనిఫెస్టో లో ప్రస్తావించిన పథకాల ఆచరణీయత గురించి విమర్శలు, సమర్థనలు ఉండేవి. అప్పట్లో ఇప్పటిలా సమాచార విప్లవం లేదు, సామాజిక మాధ్యమాలు లేవు – అయినా ప్రజలకు మేనిఫెస్టో లోని అంశాలు తెలిసేవి, అర్థమయ్యేవి. అంతేకాక అప్పట్లో మీడియా ఏ ఒక్క పార్టీకి అను’కులం’గా ఉండేది కాదని చెప్పవచ్చు. ఎమర్జెన్సీ వంటి క్లిష్ట పరిస్థితులలో కూడా మీడియా సమాజం వైపే నిలబడింది కానీ, రాజకీయ/అధికార వర్గాలకు అడుగులకు మడుగులొత్తలేదు. నా అభిప్రాయంలో ఇటువంటి ధోరణి ప్రాంతీయ మీడియా గ్రూప్స్ తోనే మొదలయిందని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా, 90 వ దశకం ప్రారంభం నుండి ఈనాడు అనుసరించిన ధోరణి దీనికి ప్రారంభం అని చెప్పవచ్చు. ఈనాడు మీడియా గ్రూప్స్ అంటే ఏదో ఒక పార్టీకి బాకాగా మాత్రమే ప్రజలు అనుకుంటున్నారు.

ఒక రాజకీయ పార్టీల మేనిఫెస్టోల విషయానికి వస్తే – సమాచార, సాంకేతిక విప్లవం కారణంగా ఇపుడు ప్రతి పార్టీ మేనిఫెస్టో ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నప్పటికీ అటు సమర్థకులకి, ఇటు విమర్శకులకు ఎవరికీ అందులో అంశాలు సరిగా తెలియవు. ప్రచారం కూడా మేనిఫెస్టో లోని అంశాలకంటే ఎక్కువగా వ్యక్తిగత దూషణలు, సవాళ్ళ రూపంలోనే జరుగుతోంది. వ్యక్తి ఆధారంగా ఉంటోంది తప్పించి, సిద్ధాంతపరంగా ఉండట్లేదు. ఇలాంటి వ్యక్తులతో ప్రభావితమైన రాజకీయం నుండి మార్పు ఆశించడం అత్యాశేనేమో. జాతీయస్థాయిలో ఇందిర, మోదీ; స్థానికంగా వైఎస్, కెసిఆర్, బాబు, జగన్, ములాయం, మాయావతి, మమత, నవీన్, జయ, కరుణ ఇలా వ్యక్తుల ప్రభావం నుండి బయటపడగలిగినపుడు మాత్రమే రాజకీయాల్లో మార్పు ఆశించవచ్చేమో. “అది సాధ్యమా?” అన్నది ఒక భేతాళప్రశ్న. ఎప్పుడైతే మన దేశ రాజకీయం వ్యక్తుల ప్రభావం నుండి బయటపడి, సిద్ధాంతాల ప్రాతిపదికన సాగుతుందో అపుడే మార్పు సాధ్యం.

వంశీ కలుగొట్ల

వృత్తి: సాఫ్ట్వేర్ ఇంజనీర్; వ్యావృత్తి: రచనలు, కవిత్వం; నివాసం: బెంగుళూరు; పుట్టిన ఊరు: గని, కర్నూలు జిల్లా; తల్లిదండ్రులు: కలుగోట్ల విజయాత్రేయ, విజయలక్ష్మి. రచయిత/కవిగా : బృందావన చరితం - విద్వత్ ఖని కథనం, భారతీయం, సుప్రసిద్ధ భారతీయ కళాకారులు, సుప్రసిద్ధ భారతీయ క్రీడాకారులు, భారతీయం, భారతరత్నాలు, ఆంధ్రప్రదేశ్ జనరల్ నాలెడ్జి తదితర పది పుస్తకాలు (మొదటిది మినహా మిగతావి ఆదెళ్ళ శివకుమార్ గారితో కలిసి). ఇవి కాక జాగృతి మాసపత్రికలో సంవత్సరం పాటు అసోసియేట్ సబ్ ఎడిటర్ గా, శ్రీ దత్త ఉపాసన మాసపత్రికకు ఆరు నెలలపాటు సబ్ ఎడిటర్ గా పని చేశాను. దాదాపు 500 కవితలు; 120 కు పైగా రాజకీయ, సినీ, సామాజిక అంశాలకు సంబంధించిన వ్యాసాలు; 20 కి పైగా కథలు; రెండు బుర్రకథలు రాశారు.

1 comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.