తలపుల తోవ

షౌకత్ హైదరాబాదు నిజాం నవాబు రాజ్యం లో ఒక ఉన్నతోద్యోగి కూతురు. అభ్యుదయ భావాలు కల్గి, కవిత్వం అంటే అభిమానం, తెగింపు, మొండి పట్టుదల గల యువతి. తన కష్టాలను ఇష్టాలు గా మార్చుకుని, సమస్యలకే ధైర్యం చెప్పే వసంత పుష్పం లాంటి అందమైన అమ్మాయి.
ఉత్తరప్రదేశ్ జమీందారీ కుటుంబం లో పుట్టిన కైఫీ, పుట్టినిల్లు వదిలి, బొంబాయిలో కార్మికులను సంఘటితం చేసే కమ్యూనిస్టు పార్టీ పూర్తికాల కార్యకర్తగా, ఇరవయో ఏటికే తన అభ్యుదయ కవిత్వంతో సుప్రసిద్ధ కవి లోకాన్ని ఉర్రూతలూగించి అభ్యుదయానికి చిహ్నంగా నిలిచిన వ్యక్తి.

అభ్యుదయ కవుల ముషాయిరా కోసం హైదరాబాదు వచ్చి, షౌకత్ ప్రేమలో పడి,తన భవిష్యత్తు అంతా షౌకత్ కళ్ల లోనే దాగుందని, తన ప్రేమని తెలియజేయడానికి కైఫీ పడే వేదన కవిత్వమయమై షౌకత్ లో నిగూఢంగా దాగిన ప్రేమను తట్టి లేపడం చాలా అద్భుతమైనది.

షౌకత్-కైఫీ ల ప్రేమను అర్థం చేసుకున్న షౌకత్ తండ్రి, కూతురు ప్రేమను గెలిపించడానికి, కుటుంబ సభ్యులకు తెలియకుండా షౌకత్ ను బొంబాయి కి తీసుకెళ్లి, ఇరువురు సున్నీ-షియా వంశాలకు చెందినప్పటికీ మతచాందస భావాలను పక్కకి పెట్టి, తన కూతురు భవిష్యత్తు జీవితానికై ప్రతి క్షణం తాపత్రయ పడుతూ షౌకత్-కైఫీ ల పెళ్ళి చేయడం చూస్తే…నిజంగా ఈనాటి ప్రతీ తండ్రి, తన కూతురు పట్ల షౌకత్ తండ్రిలా ఆలోచిస్తే నేటి సమాజంలో పరువు హత్యలకు ఆస్కారమే ఉండదేమో…!

ఈ పితృస్వామ్య సమాజంలో ఏ స్త్రీ కలిగి ఉండని స్వేచ్చ, స్వాతంత్ర్యాన్ని కైఫీ తన భార్య షౌకత్ కు కల్పించడం చూస్తే..కైఫీ కి తన భార్య పట్ల, ఒక స్ర్తీ పట్ల ఉన్న గౌరవానికి తార్కాణం అని చెప్పవచ్చు. భార్యభర్తలంటే ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాకుండా, ఇష్టాలను ,కష్టాలను ఒకరి పట్ల ఒకరు ప్రేమతో స్వీకరించినప్పుడే ఎలాంటి గొడవలు జరగడం గానీ,విడాకులతో విడిపోవటం గాని జరగదని ఈనాటి సమాజానికి సందేశాన్ని ఇస్తూ, షౌకత్-కైఫీలు నిజమైన ప్రేమకు చిరునామగా నిలిచిపోయారు.

కైఫీ కమ్యూనిస్టు కార్యకర్తగా ఎన్నో చీకటి రోజులను అజ్ఞాతంలో గడిపినప్పుడు,భార్యగా షౌకత్ అందించిన సహకారం చాలా గొప్పదని చెప్పవచ్చు. బొంబాయిలోని మురికి వాడల్లో,ఇరుకైన గదుల్లో దుర్భర జీవితాన్ని గడుపుతూ కూడా, చెరగని చిరునవ్వుతో జీవించడమనేది చూస్తే… సంతోషమనేది డబ్బుతో సంబంధం లేకుండా మనసులో అంతరంగా …ఇష్టమైన వారితో నడిచే సహజీవన ప్రయాణంలో ఉంటుందని అర్థమవుతుంది.

కైఫీ ‘కాగజ్ కే ఫూల్’ లాంటి ఎన్నో గొప్ప హిందీ సినిమాలకు పాటలు, సంభాషణలు అందించడమే కాకుండా మంచి ప్రతిస్పందన కలిగిన సామాజిక కార్యకర్తగా పేరు తెచ్చుకోవడం… షౌకత్ తన గాత్ర మాధుర్యంతో మంచి వక్తగా, ఇప్టా లో సభ్యురాలిగా ఎన్నో నాటకాలను ప్రదర్శించి,ఉమ్రాన్ జాన్,అంజుమన్ లాంటి ఎన్నో హిందీ చిత్రాలలో జీవించి మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందడం…నిజంగా వీరి ప్రభావం తమ పిల్లలపై ఉందని చెప్పవచ్చు. వారి వారసులే కూతురు షబానా ఆజ్మీ, కుమారుడు బాబా ఆజ్మీ.తన మొదటి చిత్రం “అంకురం” తోనే జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డును పొందడం, ఎన్నో సవాళ్లను అధిగమించి గొప్ప సామాజిక కార్యకర్తగా,రాజ్యసభ మాజీ సభ్యురాలిగా షబానా అజ్మీ మంచి పేరు తెచ్చుకున్నది. బాబా ఆజ్మీ కూడా తండ్రి కి తగ్గ కుమారుడుగా ఒక గొప్ప ఛాయాచిత్రగ్రాహకుడుగా గుర్తింపు పొందారు.

1948 నుండి కైఫీ మరణించే వరకు 2002 దాకా, అర్థ శతాబ్దికి పైగా సాగిన షౌకత్-కైఫీల అన్యోన్య ప్రేమల సహజీవన తలపుల సమాహారమే ఈ “తలపుల తోవ”. వీరి తోవ నేటి సమాజానికి ప్రేమమయమైన జీవితం, దాంపత్య జీవితం, పిల్లల పెంపకం, సాంఘిక పరిస్థితుల పట్ల ప్రతి స్పందనలు ఎలా ఉండాలో తెలియజేసే ఒక దిక్సూచి అని చెప్పవచ్చును.

‘వీక్షణం’ మాసపత్రిక సంపాదకుడు  N.వేణుగోపాల్ గారు “తలపుల తోవ” పుస్తకంను ఇంగ్లీష్ నుండి తెలుగు భాషలోకి అనువదించారు.

రచయిత్రి షౌకత్, ఆమె కూతురు షబానా అజ్మీ

వెంకి, హన్మకొండ

అసలు పేరు గట్టు రాధిక మోహన్. హన్మకొండలో నివాసం. వృత్తిరీత్యా మ్యాథ్స్ టీచర్. పుస్తకాలు చదవడం ఒక అలవాటు. అడపాదడపా "వెంకి" కలం పేరుతో కవిత్వం రాస్తుంటారు. కవిత్వం మీద "ఆమె తప్పిపోయింది" పేరుతో పుస్తకం వెలువరించారు.

2 comments

  • ఈ పోస్ట్ చూడగానే ఎంతో ఎగ్సైట్ అయ్యానమ్మా ఆత్రంగా చదివాను నీ ప్రోజ్ మీద నాకు చాలా నమ్మకం ఎన్నో అద్బుతంగా రాశావు..కానీ ఇది నేను ఆశించిన స్థాయికి తగ్గింది…ఈ పుస్తకంలోని ఫీల్ ను పట్టుకోకుండా కేవలం పాత్రల్ని పరిచయం చేశావ్..ఇంకోసారి డెప్త్గా రాసేందుకు యత్నించు..ముఖ్యంగా కైఫీ, షౌకత్ ల మధ్య సముద్రంలాంటి ప్రేమను ఒడిసిపట్టు..అతను వెళ్ళిపోయాక ఆమెంత తపించిందీ విషదీకరించు..

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.