ఒక డూప్లికేట్…

మా తమ్ముడు యేమడిగాడో తెలుసా?

చాక్లెట్ కాదు!

చందమామా కాదు!

వాడు అడిగింది విన్న అమ్మానాన్నలకే కాదు, అందరికీ గుండె ఆగిపోయింది!

ఇదేదీ తెలియని తాతయ్య “అడిగిందేదో ఆడి చేతిలో పెట్టీవొచ్చు కదా?!” అన్నారు!

“వాడేమడిగినాడో తెలుసునా? ఏనుగుని తెచ్చి అడ్డల అడిసీమన్నాడు… నీ మనవడు” అని నాయినమ్మ పల్లు పటపట కొరికింది!

నాన్న తలపట్టుకు కూర్చుండిపోయారు!

అమ్మ మూగదయిపోయిది!

ఇరుగూ పొరుగూ యిదెక్కడి చోద్యమని నవ్వుతున్నారు!

ఎవరు యెన్ని చెప్పినా తమ్ముడు వినడే?!

వాడిగోల వాడిదే! పట్టిన పట్టు వదలడే! మంకు పట్టు! ఒకటే యేడుపు!

“ఏమయిందిరా?” అని తాతయ్య నిదానించి నెమ్మదిగా అడిగారు!

తమ్ముడు తలడ్డంగా వూపాడు! పాము బుసలా వూపిరి వదిలాడు!

“సాయీ…” అని తాతయ్య అన్నారో లేదో అంతెత్తున లేచాడు! నన్నలా పిలవొద్దన్నాడు! ఆ పేరు నాకు నచ్చలేదన్నాడు!

“పోని నీకేపేరు యిష్టమో చెప్పు… ఆ పేరే పెట్టేస్తాం… శ్రీనివాస… కేశవ… నారాయణా… గోవింద… ఈశ్వరూ పరమేశ్వరూ…” తాతయ్య దేవుళ్ళకుండే సర్వనామాలూ చెప్పారు!

“చి… ఛీ… నాకా పేరులొద్దు…” అని తమ్ముడు!

“మరేం పేర్లు కావాలి? చిరంజీవీ? నాగార్జునా? మహేషు బాబూ? ప్రభాసూ?…” మావయ్య చెప్పకముందే “నాకవేవీ వద్దన్నానా?” అని యేడుపందుకున్నాడు! దొర్లి దొర్లి యేడ్చాడు!

నాలుగు రోజులుగా యిదే తంతు! తంతే కాసేస్తున్నాడు! కొడితే వొళ్ళిచ్చేస్తున్నాడు! అన్నం పెట్టకపోయినా అడగడం లేదు గాని, అడిగింది మాత్రం మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు!

ఇప్పుడూ అంతే!

“మీరేపేరు పెట్టినా వోకే…” తమ్ముడు చెప్పకముందే, విషయం తెలియని తాతయ్య “నీ పేరుకేం? బంగారం… సాయిరాం…” అన్నారు!

కోపంగా చూసిన తమ్ముడు “సాయిరాం అంటే సరిపోద్దా? పేరు చివర యింకేం వుండక్కర్లేదా?” గొంతు పట్టేలా కయ్యిమన్నాడు!

అందరూ తమ్ముడి వంక వెర్రిగా చూశారు!

వాడు మాత్రం “సాయిరాం రెడ్డి పెడితే యేం?” అన్నాడు!

తాతయ్య అర్థం కానట్టు చూస్తే-

“అది కాదురా కన్నా…” అని నాయినమ్మ అంటే-

“కన్నా కాదు, కన్నారెడ్డి” తమ్ముడు సరి చేశాడు, సీరియస్సుగా!

“ఒరే బుల్లి…” మావయ్య ముద్దుగా యెప్పుడూ పిలిచినట్టే పిలిచాడు!

“బుల్లి కాదు, బుల్లి రెడ్డి” అన్నాడు తమ్ముడు!

“ఏం పిచ్చిరా యిది చిన్నా…” అమ్మ లాలనగా చెప్పబోతే-

“చిన్నారెడ్డి అని పిలువ్” కళ్ళు బిగించి గట్టిగా అన్నాడు!

తమ్ముడి మాటలకు అందరూ నవ్వుతున్నా అమ్మానాన్నా యేడ్చారు! కళ్ళు తుడుచుకున్నారు!

“నువ్వెప్పటినుంచిరా సమరసింహారెడ్డివయిపోయావ్?” మావయ్య కోపాన్ని ఆపుకొని నవ్వుతూ అడిగాడు!

“సమరసింహారెడ్డి… ఆదికేశవరెడ్డి… చెన్నకేశవరెడ్డి… యేదయినా రెడ్డే కావాలి” వుడుం పట్టు పట్టాడు తమ్ముడు!

“మన రెడ్డీలం కాదురా…” తాతయ్య చెప్పబోతే, “అదంతా నాకు తెలీదు, నాకు యేదో వొక రెడ్డి పేరు పెట్టండి” భీష్మించుకు కూర్చున్నాడు!

“నువ్విప్పుడు చిన్నవాడివి కదా? పెద్దయితే యెంచక్కా నీకు నచ్చిన పేరు నువ్వే పెట్టుకుందువులే…” మావయ్య సముదాయించబోతే-

“హు…” అని యెగా దిగా చూసి “మా క్లాసులో సమీరా రెడ్డి, శోభా రెడ్డి, ఈశ్వర్రెడ్డి, వినయ్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, ఫణికుమార్రెడ్డి…” పేర్లన్నీ చదివి “చిన్న పిల్లలకూ రెడ్లు వుంటాయి” అని గుర్తు చేశాడు తమ్ముడు!

ఇంటందరూ వెర్రిగా చూస్తే “పోనీ చౌదరీ అనయినా పెట్టండి… హరీష్ చౌదరి, కుసుమా చౌదరి, అంకితా చౌదరి, రాజ్ కుమార్ చౌదరి, మహిమా  చౌదరి…” పేర్లన్నీ చదివి, ఆ సౌండ్ని తన్మయంగా గర్వంగా పలికాడు తమ్ముడు!

పిచ్చి ముదిరిపోయిందని డాక్టరుకు చూపించమని తమ్ముడ్ని చూసిన వాళ్ళంతా సలాహా యిచ్చారు! ఔను మరి… యీ మధ్య అలిగి అన్నం తినడం మానేస్తున్నాడు! నేనూ నచ్చజెప్పబోతే- “అన్నయ్యా నువ్వు కూడా జగదీషూ జగదీశ్వరరావూ కాదు, ‘జగదీశ్వర్రెడ్డి’ పెట్టుకో” అని సలహా యిచ్చాడు!

మేము అనిల్ రెడ్దని సైక్రియాటిస్టుకు చూపించాము! తమ్ముడి కథంతా విని డాక్టరు ముందు షాకయ్యాడు! తరువాత చాలా సేపటికి తేరుకున్నాడు! రాజశేఖర్రెడ్డి డెత్తుకీ జగన్ ముఖ్యమంత్రి కాకపోవడానికీ దీనికీ యే సంబంధమూ లేదన్నాడు! అంత వయసుకూడా లేదన్నాడు! ఆ సైక్రియాటిస్టు తన జోకుకు తనే నవ్వాడు! నవ్వకపోతే బాగోదన్నట్టు అమ్మా నాన్నా కూడా నవ్వారు!

“రెడ్డీల గురించి యెప్పుడైనా గొప్పగా మాట్లాడారా?” అని అమ్మనీ నాన్ననీ అడిగాడు డాక్టరు! లేదన్నారు!

“గొప్పవాళ్ళందరూ… ఐ మీన్ హై పొజిషన్లో వున్న వాళ్ళందరూ అయితే రెడ్లూ కాకపోతే కమ్మలూ కదండీ… ఐ మీన్ యెవరు అధికారంలోకి వస్తే వాళ్ళే కదండీ…”మావయ్య మాటకు సైక్రియాట్రిస్టు యెగా దిగా చూశాడు! మావయ్యని వొక వేస్టు ఫెలోని చూసినట్టు చూశాడు!

ఫీలయిన మావయ్య “అంటే మావాడు న్యూసదీ చూస్తాడండి, వాళ్ళ నాన్నగారితో. ఏ గవర్నమెంటు వొచ్చినా వాళ్ళేకదండీ? రెడ్డి గవర్నమెంట్లో రెడ్లూ- కమ్మల గవర్నమెంట్లో కమ్మలూ- నేచురల్ కదండీ? మంత్రులూ ఆఫీసర్లూ వాళ్ళే కదండీ? పైగా వాళ్ళ ప్రిన్సిపాల్ కూడా! ప్రిన్సిపాల్ రెడ్డయినప్పుడు జనరల్ గా టీచర్లందరూ రెడ్లే కదండీ? బాపన ప్రిన్సిపాల్ వుంటే టీచర్లందరూ బాపనోళ్ళే కదండీ? క్వయిట్ నేచురల్ కదండీ? అందుకని మావాడు అలా యినుఫ్లయన్సయ్యి…” అని టేబుల్ మీద ‘అనిల్ రెడ్డి’ నేమ్ ప్లేట్ చూసి మావయ్య నీళ్ళు నమిలి గుటకలు మింగాడు! “అంటే… ఐ మీన్… పేరు చివర అలా వుండడం రిచ్ గా ఫీలయి… నేచురల్ గా ప్రౌడ్ గా ఫీలయి…” మావయ్య యింకా చెప్పబోయే వాడే, ‘నేనా నువ్వా డాక్టరు?’ అన్నట్టు చూసిన చూపుకి సైలెంటయిపోయాడు!

“నీపేరు?” అడిగాడు సైక్రియాటిస్టు!

“ఐ యామ్ రెడ్డి” అన్నాడు తమ్ముడు!

“సాయిరామ్ పేరు బాగుంది కదా?” అన్నాడు సైక్రియాటిస్టు!

“అందులో రెడ్డి లేదు కదా?” అన్నాడు తమ్ముడు!

“రెడ్డి అంత గొప్ప పేరేం కాదు, ప్చ్…” పెదవి విరుస్తూ అన్నాడు సైక్రియాటిస్టు!

“మరి మీరెందుకు పెట్టుకున్నారు- ‘రెడ్డి’ అని?” తమ్ముడు అడిగేశాడు!

అమ్మ కంగారు పడి తమ్ముడి నోరు మూసేసింది! నాన్న చెయ్యత్తబోయి కంట్రోలు చేసుకొని నోటి మీద వేలేసుకోమన్నట్టు చూపిస్తూ- “వాళ్ళంటే రెడ్డీలు” అన్నారు బుద్ది చెబుతున్నట్టుగా!

“అయితే మనమూ రెడ్డీలమే” తమ్ముడు చెప్పబోతే-

అమ్మ బతిమలాడుతూ- “అలా కాదు నాన్నా… మన కులం వేరురా చిన్నా…”

“చిన్నారెడ్డి అని చెప్పానా? మళ్ళీ అలాగే పిలుస్తావేం?” తమ్ముడు చాలా బాధ పడ్డాడు, అంత కోపంలోనూ!

“అంటే… కులం బట్టి శర్మ… శాస్త్రి… రాజు… రెడ్డి… నాయుడు… చౌదరీ అని వస్తుందన్న మాట…” అని డాక్టరుగారు వివరించబోయారు!

“పోనీ యెట్ లీస్ట్ నాయుడయినా పెట్టండి…” అడ్జెస్ట్ అయిపోతున్నట్టు కళ్ళలో నీళ్ళు తిప్పుకున్నాడు తమ్ముడు!

తమ్ముడిని చూసి అంతా ముఖాముఖాలు చూసుకున్నారు!

“నాకు నా యిది నచ్చలేదు…” తలెత్తకుండా చెప్పినా తెగేసి చెప్పినట్టు చెప్పాడు తమ్ముడు!

“ఇదంటే యేది? కేస్టా?” అడిగాడు మావయ్య!

ఔనన్నట్టు తలూపి “పోనీ మనం కేస్టు మారిపోదామా?” తలెత్తి గొప్ప ఐడియాగా ఆశగా చూశాడు తమ్ముడు!

“అలా అవదు కదా?” నాన్న హాస్పిటల్ కాబట్టి వోపిక తెచ్చుకున్నారు, అదే యింట్లో అయితే యిరగ కుమ్మేసేవారే!

“ఎందుకవదు? అన్నికులాలూ సమానమేనని స్కూళ్లో చెపుతున్నారు కదా? చిన్న పేరుకి కూడా సమానం లేదా?” మానాన్న కళ్ళలోకి చూస్తూ కళ్ళ నీళ్ళు తిప్పుకుంటూ అడిగాడు!

“అది కాదురా…” అమ్మ చెప్పబోయింది!

“ఏది కాదు? నేనంటే యిష్టం అంటావు, నాకిష్టమైన పేరు పెట్టమని అంటే మాత్రం…” అని యేడవబోతూ- తననే చూస్తున్న సైక్రియాట్రిస్టుని చూసి కళ్ళు తుడుచుకొని కంట్రోల్ చేసుకున్నాడు తమ్ముడు! “మారొచ్చు… యెవరు యెందులోకయినా మారొచ్చు… మా ఫ్రెండు వాళ్ళు క్రిష్టియన్స్ లోకి మారిపోయారు” చెప్పాడు తమ్ముడు!

సైక్రియాట్రిస్టు వేళ్ళతో జుట్టు దువ్వుకున్నాడు!

“మతం మారిపోవచ్చు, కాని కులం మారడం కుదరదు…” అన్నాడు మావయ్య!

“ఎందుకు కుదరదు?”

తమ్ముడి ప్రశ్నకు సమాధానం లేనట్టు యెవ్వరూ మాట్లాడలేదు!

కొంచెం సేపు తర్వాత, సైక్రియాట్రిస్టు తెలివైన వుపాయం చెప్పాడు!

“మీ యింటి పేరు నీ పేరు చివర పెట్టుకో” అని, “మీ యింటి పేరేంటి?” అడిగాడు!

“పీనాసి” చాలా అసహ్యంగా పలికాడు తమ్ముడు!

“కన్జ్యూస్” అని గొణిగి “సాయిరాం పీనాసి బాగుందా? సాయిరాం రెడ్డి బాగుందా?” గట్టిగానే అడిగాడు!

“నువ్వు పిసనారి కాదు కదరా?” అన్నాడు మావయ్య!

“అందరూ నన్ను పీనాసీ పిసినారీ అనే పిలుస్తున్నారు…” మండిపోతున్నట్టు అన్నాడు తమ్ముడు!

సైక్రియాట్రిస్టు తలదించి వాచ్ చూసుకున్నాడు!

“మన యింటి పేర్లు పంది, నక్క, డొక్కా, బమ్మిడి, హనుమంతు, కణితి, యలంకాయలు, యెండ, మండ, కొసర, పిసర, బురద…” అన్నీ చదివేసి అలసిపోయి ఆపైన వూపిరి తీసుకొని “వొక్కటయినా బాగుందా?” నిలదీసినట్టు చూస్తూ అడిగాడు తమ్ముడు!

ఎందుకో అమ్మా నాన్నా మావయ్యా అందరూ తలలు దించుకున్నారు!

“మా టీచర్లు యింటి పేర్లతో వెక్కిరిస్తారు. అదే చౌదరీ రెడ్డీ అయితే గొప్పగా పిలుస్తారు…” తమ్ముడు వున్న విషయం మా స్కూళ్లో జరిగిన విషయమే చెప్పాడు!

సైక్రియాట్రిస్టు సైలెంటయిపోయాడు!

అమ్మ తమ్ముణ్ణి తీసుకు బయటకు వెళ్ళింది!

నిట్టూర్చిన నాన్న “యిదండీ సంగతి… పుస్తకాల మీద కూడా తన పేరు సాయిరాం రెడ్డి అనే రాసుకుంటున్నాడు…” బాధగా చెప్పారు!

“నేచురల్ గా రెడ్డీ చౌదరీ నాయుడూ శర్మా శాస్త్రీ రాజూ లాంటి కేస్టు పేర్లు మావి కాదు కదండీ… మేం మీలా పెట్టుకోలేం కదండీ… పెద్దవాళ్ళమయినా మేమే మా కేస్ట్ పేరు చెప్పాలంటే చెప్పకేం సిగ్గుపడతాము కదండీ… పిల్లలు షై ఫీలవారాండీ… మా నాయకుల్లా మాలా మాదిగా అని పేరు చివర తగిలించుకోనేంత ధైర్యం మాకు లేదు కదండీ… మా పిల్లల్ని ఆ పేరు పెట్టి పిలిస్తే అది తిట్టవుతుంది గాని గౌరవం కాదు కదండీ…” అని మావయ్య చెప్తూ వచ్చీరాని గెడ్డాము గోక్కుంటూ వుంటే-

“నువ్వు బయటకు నడరా…” అన్నారు నాన్న! మావయ్య అవతలకు వెళ్ళాడు!

ఆ తర్వాత- మంచి మందులుంటే రాయమన్నారు నాన్న!

సైక్రియాట్రిస్టు “బాడీ అంటే ఫిజిక్సే కాదు, కెమిస్ట్రీ కూడా. అంచేత మందులు వాడండి. ఈ జబ్బు తగ్గుతుంది. కాకపోతే టైం పడుతుంది… ఒకే…” అని చీటీ రాసి-

“సాయీ”

“సాయిరామ్”

సైక్రియాట్రిస్టు పిలుపు విన్నా విననట్టే వున్నాడు! అందుకే పిలిచినా పలకలేదు! రాలేదు! తనకు సంబంధం లేనట్టే వున్నాడు!

నాకు తెలుసు కదా, వాడికి మందు- అందుకే- “ఒరే సాయిరాం రెడ్డీ” అని పిలిచానో లేదో-

తమ్ముడు పరిగెత్తుకు వచ్చాడు!

సైక్రియాట్రిస్టు నవ్వుతూ తమ్ముడ్ని దగ్గరకు తీసుకొని “ఈ మందులు క్రమం తప్పకుండా వేసుకుంటే- నా పేరులోని రెడ్డి తీసి నీ పేరుకి తగిలించేస్తానన్నమాట…” అని షేక్ హేండ్ యిచ్చారు! తమ్ముడు సంబరంగా ‘థాంక్స్’ చెప్పాడు!

తమ్ముడు రోజూ ఆ మందులు వేసుకుంటూనే వున్నాడు!

కాని వాడికి రెడ్డి పిచ్చి పోలేదు!

ఆమధ్యనయితే ‘ఐ యామ్ అర్జున్ రెడ్డి’ అని అడిగిన వాళ్ళకీ అడగని వాళ్ళకీ చెప్పుకున్నాడు!

ఇప్పుడు అందరూ మా తమ్ముణ్ణి ‘డూప్లికేట్ రెడ్డి’ అనే పిలుస్తున్నారు!

డూప్లికేట్ అన్నా సరే- చివర్న ‘రెడ్డి’ వుండడంతో తమ్ముడు కూడా సంతోషంగా అలాగే పిలిపించుకుంటున్నాడు!

నీపేరేమిట్రా?- అని అడిగిందే చాలు ‘ఐ యామ్  డూప్లికేట్ రెడ్డి’ అని గర్వంగా గౌరవంగా చెప్పుకు తిరుగుతున్నాడు!

-సాయిరాం రెడ్డి,

(తమ్ముడి వంతు రాశాగా, అందుకే తమ్ముడి పేరే పెట్టేశా)

రెండవ తరగతి,

ఓబుల్ రెడ్డి స్కూల్.

(తమ్ముడు చదివేది నిజంగా యీ స్కూల్ కాదు, వాడు యిలా అయితే హేపీ ఫీలవుతాడని)

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

3 comments

  • మీతమ్ముడు చాలా తెలివైనవాడు ఈదేశంలో అసమానతలు ఎలాఉన్నాయి.ప్రాథమికంగా గుర్తింపు నిచ్చేపేరులోని మర్మమేంటి అని గ్రహించిన మహాజ్ఞాని.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.