పాఠం

‘రెండు ప్లేట్లు ఆలు సిక్స్టీ ఫైవ్’ అడిగాను నేను.

‘రెండు ప్లేట్లు ఆలు 65 బదులు బేబీ కార్న్ ఒక ప్లేటు ఆలు 65 ఒక ప్లేటు తీసుకోండి. వెరైటీ ఎంజాయ్ చేస్తారు’ అన్నాడు అతను.

సన్నగా పొడుగ్గా  నమ్మకంతో చిన్నగా నవ్వుతున్నాడు. వంకీలు తిరిగిన జుట్టు పక్క పాపిడి. కళ్లలో పట్టుదల. వినయం. అతను చెప్పిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది.

చాలా రోజుల తర్వాత వచ్చిన బ్రేక్ ని సొంతం చేసుకునేందుకు ఫ్యామిలీతో డిన్నర్ కి వచ్చాను. కొంచెం ఖాళీగా ఉండడంతో చుట్టుపక్కల టేబుల్స్ కొన్ని నిండి కొన్ని కాళీగా ఉన్నాయి.

‘ఇంకేం ఆర్డర్ ఇస్తారు’ అడిగాడు చిన్నగా.  ‘హాట్ అండ్ సోర్ వెజ్ కార్న్ సూప్’.

‘అయితే కొంచెం టైం పడుతుంది’. అని చెప్పి వెళ్ళాడు.

మేమంతా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా మా వెనక వైపు టేబుల్ దగ్గరికి నలభైలలో ఉన్న ఇద్దరు యువకులు వచ్చారు. ఇందాకటి వెయిటర్ వెళ్లి ‘సార్ ఆర్డర్’ అన్నాడు. ‘మా ఫ్రెండ్స్ రావాలి. మేం 10 నిమిషాలలో చెప్తాం’ అన్నారు వాళ్ళు మాట్లాడుకుంటూనే.

మా దగ్గర సర్వ్ చేస్తుండగా నేను మళ్ళీ ‘కొత్తగా చేరావా? ఎప్పుడు చూడలేదు.’ ఆని అడిగాను.

‘సార్ నేను కిచెన్ లో సూపర్వైజర్ ని. ఈరోజు స్టాఫ్ తక్కువ ఉన్నారు. అందుకే ఇక్కడ అక్కడ’ అన్నాడు. అలసటని కనిపించకుండా నవ్వుతూనే ఉన్నాడు.

హిందీ లోనే సంభాషణ కొనసాగుతూ ఉంటే అడిగాను ‘పేరేంటి? ఏ ఊరు? అని.

‘సత్యదేవ్. రాజస్థాన్ . ఇక్కడికి వచ్చి రేపటితో ఐదేళ్లు ‘అన్నాడు.

ఇంతలో అవతలి టేబుల్ దగ్గరి ఇద్దరు యువకులు  మా పక్కనే ఉన్న పెద్ద టేబుల్ దగ్గరకు వచ్చారు. సత్య దేవ్ ఆర్డర్ తీసుకునేందుకు వెళ్ళాడు.

‘ఇంకా మా వాళ్ళు రాలేదు. కొంచెం ఆగు’ అన్నారు. ‘టిఫిన్ సెక్షన్ కింద. కొంచెం ఆలస్యం అవుతుంది. అందుకని అడుగుతున్నా సార్’ అన్నాడతను.

‘అరే చెప్తుంటే అర్థం కాదా?  ఇంకా ఇద్దరు రావాలి’ అన్నారు. అంత దురుసుగా మాట్లాడే అవసరమే లేదు.

‘సరే సార్’ అని మళ్ళీ మా దగ్గరకు వచ్చాడు. ఇద్దరు ముగ్గురు స్టాఫ్ తో హోటల్ నడుస్తున్నట్లుంది ఆరోజు.

పక్క టేబుల్ దగ్గర వేచి చూస్తున్న ఇద్దరు వచ్చేసినట్లు ఉన్నారు. నాలుగు ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేసి మళ్లీ మాటల్లో పడ్డారు వాళ్ళు. మాట్లాడుకుంటుంటే మమ్మల్ని పెద్ద పెద్ద కేకలు మళ్లించాయి. ‘వేర్ ఇస్ దట్ స్కౌండ్రల్ .ఆర్డర్ ఇచ్చి గంటయింది. ఎంతసేపు వెయిట్ చేయాలి? మేనేజర్ ని పిలవండి’ పెద్దగా గోల చేస్తున్నారా యువకులు.

మేనేజర్ రాగానే ‘ఇలాంటి సర్వర్లను హోటల్లో ఎందుకు పెట్టారు? తీసిపారేయండి’ అని తిడుతున్నారు. ఇంతలో వాళ్ళ ఆర్డర్ వచ్చింది. నాకెందుకో చాలా అసహనంగా అనిపించింది. వాళ్లతో మాట్లాడాక మేనేజర్ సత్యదేవ్ ని పక్కకి పిలిచి చూపుడు వేలుతో బెదిరిస్తూ వార్నింగ్ ఇవ్వడం గమనించాను. సత్యదేవ్ చాలా బతిమాలుతున్నాడు. బిల్ పే చేసే నెపంతో సత్యదేవ్ ని పిలిచి మేనేజర్ ని రమ్మని చెప్పాను. మేనేజర్ వచ్చాడు. ‘ఏమైంది రోజూ కనిపించే వాళ్ళు ఎవరూ కనిపించడం లేదు’ అన్నాను.

‘నిన్న సెలవు. ఈ రోజు కొందరు రాలేదు.’ అంటుండగా ఇతన్నేమనకండి. నేను ఇందాక నుంచి చూస్తున్నాను. టైం పాస్ చేస్తూ ఆర్డర్ ఇవ్వకుండా ఆలస్యం చేసింది వాళ్ళు  . ఇతను చాలా నిబద్ధత కలిగిన చురుకైన వ్యక్తి. ఇలాంటి ఓర్పు గలవాడు మీకు దొరకరు’ అన్నాను.

మేనేజర్ అవతలి టేబుల్ ను నన్ను చూసి సత్యదేవ్ వైపు మెచ్చుకోలుగా చూశాడు.

అవతలి టేబుల్ ఖాళీ అవుతోంది. ‘వరీ అవకు సత్య. ఇలాంటివన్నీ మామూలే’అని నేను చెప్పబోతుండగా ‘అవును సార్. ప్రతి రోజు ఇలాంటి వాడు రోజొకరు తగులుతూనే ఉంటాడు. ఇంకా ఒదిగి నిశ్శబ్దంగా బతకడం ప్రతిరోజు ప్రతి టేబుల్ నేర్పిస్తూనే ఉంటుంది. నన్ను వీళ్ళు తీసేయరు. ఎందుకంటే నామీద ప్రేమతో కాదు. నా లాగా పని చేసేవాడు వీళ్ళకి దొరకడు. ఒకవేళ తీసేసినా, ఇవాళ ఇక్కడ. రేపు ఇంకో హోటల్. చేతనైన పని ఇదే కదా! నవ్వడం మాత్రం మర్చిపోలేను సార్.’ అన్నాడు. అతడి కళ్ళల్లో సన్నగా మెరుస్తున్న తడి.

ఎవరి గోలలో వాళ్ళు నవ్వుతూ సరదాగా తింటున్నారు. గోడ మీద గడియారం కదులుతూనే ఉంది. ఇంకో గంటలో మరోరోజు మొదలవబోతోంది తన పాఠాలు తను చేతపట్టుకుని. అవును, ఆకలి విలువ తెలిసిన వాళ్ళకే కదా అది నేర్పగలిగేది!

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.