వ్యక్తివికాస పాఠాల గని అక్కినేని

నా కోరిక ఒక్కటే. నా శక్తిమేరకు ప్రపంచంలో నా బాధ్యత నిర్వర్తించాలి. మంచివాళ్ళందరితోటి మంచివాడనిపించుకోవాలి.   

         – జార్జ్ వాషింగ్టన్, 1789లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.

తెలుగువారి ఆరాధ్య నటుడు అక్కినేని జీవితానికి సూక్తి అక్షరాలా వర్తిస్తుంది. అక్కినేని కూడా జీవితాంతం, జీవితానంతరం కూడా అందరితో మంచివాడనిపించుకోవాలన్న నిరంతర తపనతోనే జీవించారనిపిస్తుంది. క్రమశిక్షణ, నిబద్ధత, అచంచలమైన మనోబలంతో అక్కినేని అస్థిరమైన సినిమా ప్రపంచంలో తనదైన శైలిలో జీవించి ఆదర్శంగా నిలిచారు. ప్రజాభిమానమే తరగని ఆస్తిగా వారి గుండెల్లో కొలువున్నారనడంలో అతిశయోక్తి లేదు. తెరమీద తన నటనతో, తెర ముందు తన ప్రవర్తనతో విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి హృదయాలను దోచుకున్న నిలువెత్తు తెలుగుదనం, తెలుగు ధనం అక్కినేని. సాధారణంగా మనకు నచ్చని పని ఎవరైనా చేస్తే వాళ్ళ మీద మనకంత సదభిప్రాయం ఉండదు. ముఖ్యంగా మధ్య తరగతి వారు విషయంలో మరీ పట్టుదలగా ఉంటారు. ఎంతటివారినైనా తీసిపారేయడానికి వెనుకాడరు. ఇసుమంతైనా ఎవ్వరూ తీసిపారేయలేని అత్యున్నత క్రమశిక్షణతో, అంతగా చదువుకోకపోయినా అత్యుత్తమ సంస్కారంతో, లోకాన్ని అనుక్షణం పరిశీలిస్తూ తన్ను తాను తీర్చిదిద్దుకున్న శిల్పి అక్కినేని. ఏనాడూ ఎవ్వరితోనూ చెప్పించుకోనంత ఉన్నత వ్యక్తిత్వంతో జీవించిన నిష్కామ యోగి అక్కినేని. తన బలమేమిటో, బలహీనతలేమిటో తెలిసి మసలుకున్న మామూలు మానవుడు అక్కినేని.  అనితరసాధ్యమైన క్రమశిక్షణతో అక్కినేని  విజయ శిఖరాలను అధిరోహించిన తీరును నేటి తరం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. తోటి నటుల్లో తన ప్రత్యేకతను నిలబెట్టుకోవడానికి అక్కినేని తన జీవన శైలిని, ప్రవర్తనా విధానాన్ని తీర్చిదిద్దుకున్న తీరుకు ఆయన బతుకు అద్దం పడుతుంది.

స్వీయ క్రమశిక్షణ: సినిమా రంగంలాంటి తళుకు బెళుకుల ప్రపంచంలో అక్కినేని క్రమశిక్షణ ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది. సుమారు 60 మంది హీరోయిన్లతో తెర మీద ఆడి పాడినా మచ్చలేని మనోహరుడిగా తెలుగువారి హృదయాల్లో నిలిచారు. నాటి కథానాయకులలో మచ్చలేని మహానటుడిగా వెలిగారు.

ఆలోచనా శీలి:  నాలుగో తరగతిలోనే స్కూలు చదువుకు దూరమైన అక్కినేని, తనకు మాట్లాడటం కూడా రాదని, కనీసం నమస్కారం చెయ్యడం కూడా రాదని చెప్పుకున్నారు. స్థాయిలో చలనచిత్ర రంగానికి వచ్చిన అక్కినేని లోకం పోకడను కాచి వడపోశారు. తాను నటించిన పాత్రల ద్వారా తన ఆలోచనలకు పదునుపెట్టుకుని, తన జీవిత కాలపు అనుభవాలనుఅక్కినేని ఆలోచనలుగా పుస్తకబద్ధం చేశారు.   మానవ నైజం, లోకం తీరును సకలజన మనోరంజకంగా పుస్తకంలో ఆవిష్కరించారు అక్కినేని.  1960 ప్రాంతాల్లోడాక్టర్ చక్రవర్తి’ విడుదలయ్యాక చిత్ర బృందం అమెరికా పయనమైంది. అక్కడ అందరూ ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతుంటే, ఇంగ్లీషు రాని తాను బాత్ రూంలోకెళ్ళి కళ్ళనీళ్ళు పెట్టుకున్నానని అక్కినేని చెప్పుకున్నారు. తర్వాత అక్కినేని ఆంగ్ల భాషను వశం చేసుకున్న తీరు, ఆయన స్టయిలిష్ గా మాట్లాడే విధానం ఆయన పట్టుదలకు, ఆత్మ విశ్వాసానికి అద్దం పడుతుంది. బి.టెక్కులు పాసయినా ఇంగ్లీషు రాదంటూ ఆత్మవిశ్వాసరాహిత్యంతో బాధపడే నేటి యువత అక్కినేని పట్టుదలను ఆదర్శంగా తీసుకోవాలి.

అసాధారణ ప్రజ్ఞా నైపుణి:   కళారూపమయినా ప్రేక్షకులతో సంభాషించడమే పరమావధిగా సాగుతుంది. వారిని ఆకట్టుకోవడం, అసంకల్పిత కరతాళధ్వనులను ఆకర్షించడమే లక్ష్యంగా సాగుతుంది. అందమైన పల్లెటూరి యువకుడిగా చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టిన అక్కినేనికి మాట్లాడటమే సరిగా రాదు. నటన కూడా అంతంత మాత్రమే. ఇక ఆంగ్ల భాషా పరిజ్ఞానం అసలే లేదు. చుట్టూ ఉన్నవాళ్ళతో ఎలా మసలుకోవాలో తెలీదు. ఇన్ని రకాల బలహీనతలతో ఆయన నటుడిగా తన అవిశ్రాంత ప్రయాణాన్నికీలుగుర్రం లాంటి చిత్రసీమలో  రేసు గుర్రంలా పరుగెత్తించారు. నటనలో సమ్రాట్ అయ్యారు. ‘నటసమ్రాట్అనిపించుకుని తెలుగు జాతి జేజేలందుకున్నారు. తనదైన శైలిలో ఆయన ఆంగ్లం మాట్లాడే తీరు అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ‘పద్మభూషణ్ ‘  అందుకున్నారు. చలచిత్ర సీమలో అత్యున్నతమైన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. అక్కినేని  అవిరళ కృషికి, పట్టుదలకు ఆయన సాధించిన విజయాలే తిరుగులేని ప్రమాణాలుగా నిలుస్తాయి. ఒక పల్లె పిలగాడు ఆత్మ విశ్వాసంతో, శీలనిర్మాణంతో ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించగలడో నిరూపించిన ధీశాలి అక్కినేని.  తనలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితెచ్చుకుని, బలహీనతలకు పాతరేసి, అవహేళనలన్నీ అవకాశాలుగా మలచుకుని,  తనకు నచ్చిన రంగంలో శిఖరాయమానంగా నిలచిన ఆదర్శమూర్తి  అక్కినేని.

సానుకూల వైఖరి: జీవితంలోను, చలచిత్ర రంగంలోను ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన వారు అక్కినేని. 70 ఏళ్ళ చలనచిత్ర జీవితంలో సుఖ దు:ఖాలు, హిట్లు, ఫట్లు ఎన్నో చూసిన ధీరోదాత్తుడు. ‘ఇంక నా పనయిపోయిందిఅని ఏనాడూ నిరాశపడలేదు. ‘నాకు క్యాన్సర్ వచ్చింది. ఎన్నాళ్ళుంటానో తెలీదు. చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటాను’  అని ప్రకటించిన ధీరమూర్తి అక్కినేని.  ఆయన ప్రగతి శీల వైఖరి, ఎవ్వరు, ఎప్పుడు కదిపినానేను నాస్తికుణ్ణిఅని చెప్పే నిజాయితీ ఆయన సొంతం. ఒక యోగిలా, తాను చేసే పనికి ఫలితాన్ని ఆశించకుండా సాగిపోయేబాటసారిలా తన జీవితాన్ని గడిపిన కారణజన్ముడు అక్కినేని. తామరాకు మీద నీటిబొట్టులా, తెలుగు జాతి కంట్లో ఆనంద బాష్పాల చిరునామాలా ఆయన గడిపిన జీవితం గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు గుర్తుకు తెస్తాయి. ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ‘. ‘నీ కర్తవ్యం చిత్తశుద్ధితో నిర్వర్తించు; ఫలితాన్ని ఆశించకుఅన్న గీతాచార్యుల బోధను వంటబట్టించుకున్న ధన్యజీవి అక్కినేని.

అసమాన సమర్ధత: తాను చేసే పనిలో లగ్నమై, నిమగ్నమై అనుకున్నది అనుకున్నట్టునటనను అందించగల ఆంగిక, వాచిక నిపుణాల గని అక్కినేని. తాను అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోని పట్టుదల ఆయన సొంతం. తొలి చిత్రంధర్మపత్నినుండి చివరి చిత్రంమనంవరకు మొక్కవోని దీక్షతో, పనియే ప్రత్యక్ష దైవంగా పూజించి, పాటించిన నిలువెత్తు క్రమశిక్షణ అక్కినేని. తాను నమ్ముకున్న పని, తన కుటుంబాన్ని నడిపించే పని, అభిమానులను సంపాదించిపెట్టే పనినటనఅని నిరూపించిన శ్రమైకజీవన సౌందర్యారాధకుడు అక్కినేని. నేటి తరం ఆయన నుంచి నేర్చుకోవలసిన లక్షణాల్లో ఇది ఎన్నదగినది.  

ఉత్థాన పతనాలకు అతీతుడు: సినిమా రంగం సాఫల్యాలు,  వైఫల్యాలను సమానంగా ప్రసవించే విచిత్ర రంగం. ఎప్పుడు విజయం లభిస్తుందో, సినిమా పరాజయం పాలవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అనుభవాలకందని అంచనాలకు ఆలవాలం చిత్రరంగం. కొందరికి సినిమాలు పాకుడు రాళ్ళు. కొందరికి విజయాలకు మెట్లు. ‘బాటసారిచిత్రం చూసి ప్రపంచమంతా కన్నీళ్ళు పెట్టుకుంది. అక్కినేని నటనకు జోహార్లు పలికింది. కాసులు మాత్రం రాలలేదు. ‘దేవుణ్ణి నమ్మను నేను‘  అని చెబుతూనే ఎన్నో భక్తిరస ప్రధాన పాత్రలలో నటించి మెప్పించి కాసులు కురిపించిన అరుదైన నటశేఖరుడు అక్కినేని. కింద పడి ఉండిపోయినవాడు జడుడు. దులుపుకుని లేచి నిలబడినవాడు అజేయుడు అవుతాడని నిరూపించిన ధీశాలి అక్కినేని.  

పోటీలేని అక్కినేని: తనకు తానే సాటి; తనకు తానే పోటీ. తన సామర్ధ్యాలను, అంచనాలను తానే అధిగమిస్తూ ఎవ్వరితో పోటి పడకుండా తనదైన శైలిలో శిఖరాన్ని చేరుకున్న మొక్కవోని పనిమంతుడు అక్కినేని. ‘పౌరాణిక పాత్రలలో మాత్రం ఎన్.టి.ఆర్. తో పోటి పడకు నాయనాఅని కన్న తల్లి చెబితే అర్ధం చేసుకుని తన ఆంగికానికి, వాచికానికి తగిన సాత్విక పాత్రలు ఎన్నుకుని ఔచిత్యంతో నట జీవితాన్ని తీర్చిదిద్దుకున్న నటుడు అక్కినేని. తన బలాలను, బలహీనతలను తెలుసుకుని నాటి సాటి నటులలో మేటి అనిపించుకుని, దేవానంద్, దిలీప్ కుమార్ వంటి నటులతో సైతం శభాష్ అనిపించుకున్న మహానటుడు అక్కినేని. ‘స్వీయలోపంబెరుగుట పెద్ద విద్యఅని తెలిసిన జ్ఞాని అక్కినేని.    

బృంద నటుడు: తెర మీద కనిపించే దృశ్యంలో నటులందరూ ఒకటీంలా ఉంటేనే దృశ్యం పండుతుంది. తాను ఉన్న దృశ్యంలో నటులంతా సమన్వయంతో ఉండి దృశ్యాన్ని పండించాలని అక్కినేని తపించేవారు. చుట్టూ ఉన్న అందరినీ చిన్న, పెద్దా తారతమ్యాలు లేకుండా ప్రోత్సహించేవారు. ఒక మంచిటీం ప్లేయర్లా అందరినీ కలుపుకునిపోయేవారు. నాయకత్వం వహించాలనుకునేవారికి లక్షణం ఎంతైనా అవసరం.

ఆహారం, ఆహార్యం: అక్కినేనిని సినిమాలోనైనా పొట్టతో చూశారా మీరు! His lifelong flat belly was amazing! మితాహారం, పల్లెటూరి అలవాట్లు, త్వరగా నిద్రించడం, త్వరగా నిద్ర లేవడం, ఎవరి మీద ద్వేషం పెంచుకోకపోవడం, మనసు నిర్మలంగా ఉంచుకోవడం, ఎప్పుడూ చిరునవ్వుతో ఉండటం, తన చుట్టు ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచడం అక్కినేని అలవాట్లలో చెప్పుకోదగ్గవి. రజనీకాంత్ నిరాడంబరంగా విగ్గు లేకుండా, వేదికలమీద ప్రత్యక్షమవుతారని తరం అంటారు కానీ, ఇంతటి నిరాడంబరతకు ఆద్యులు అక్కినేని. చక్కని పంచెకట్టుతో, తెలుగుదనం ఉట్టిపడుతూ, విగ్గు లేకుండా, హాయిగా అందరినీ నవ్విస్తూ ఆయన సభల్లో నిలువెత్తు హుందాతనంలా పాల్గొనేవారు. ఇటువంటి నిరహంకార వర్తనను నేటి తరం అలవరచుకోవాలి.

మార్గదర్శకుల మనోహరుడు; మార్గదర్శి కూడా: తన నటజీవన మార్గదర్శకులైన ఘంటసాల బలరామయ్య, దుక్కిపాటి మధుసూదన రావు వంటి పెద్దల మాటను ఆయన ఎన్నడూ కాదనలేదు. వారికి తన ‘Mentors’ గా ఎంతో గౌరవమిచ్చారు. ఎందరో యువ నటులకు తర్వాతి కాలంలో తాను మార్గదర్శకుడుగా నిలిచారు.

ఆచరణాత్మక నాయకుడు: అక్కినేని ఆలోచనాత్మక నాయకుడే కాదు; ఆచరణాత్మక నాయకుడు కూడా. చలనచిత్రసీమలో తొలి తరం నాయకుడిగా ఆయన ఎంతో చొరవ తీసుకుని పరిశ్రమ అభివృద్ధికి నిర్ణయాలు తీసుకోవడంలో ముందున్నారు. మద్రాసునుండి ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు చలన చిత్ర రంగం తరలి రావడానికి స్ఫూర్తినిచ్చేందుకు, ఒక ఆచరణవాదిగా ఆయనే ముందడుగేశారు. తాను నడచిన బాటలో నలుగురూ నడిచేందుకు ధైర్యాన్ని నింపారు. ఎన్.టి.ఆర్.కూడా అక్కినేని ఆలోచనలను ఆమోదించి, భాగ్యనగరానికి తరలివచ్చారు. చలనచిత్ర రంగంలో అక్కినేని ఏకైక Action Leader.  

కట్టుబడి ఉన్న పెట్టుబడిదారుడు: తాను సంపాదించినదంతా చలనచిత్ర రంగంలోనే పెట్టుబడి పెట్టిన నిబద్ధత కలిగిన వ్యాపారి అక్కినేని. He is a great Investmentor. అక్కినేని నిబద్ధతకు అన్నపూర్ణా స్టూడియోస్ సజీవ సాక్ష్యం. ఎందరికో ఉపాధి కల్పిస్తూ నేడు చలనచిత్ర వ్యాపారానికి, కార్మికులకు అండగా ఉన్న ఏకైక చలనచిత్ర వాణిజ్య కేంద్రం, శిక్షణా కేంద్రం అన్నపూర్ణా స్టూడియోస్.

అక్కినేని భావి తరాలకు మార్గదర్శకుడు. తన స్వీయ క్రమశిక్షణతో, నిబద్ధతతో, నాయకత్వ లక్షణాలతో, నిరాడంబరతతో, వ్యాపార దక్షతతో, సృజనాత్మకతతో భావి తరాలకు మార్గం చూపిన తెలుగుజాతి కీర్తి కిరీటంలో కలికి తురాయి అక్కినేని. నిరంతర స్ఫూర్తినిచ్చే వ్యక్తిత్వ వికాస పాఠాల గని అక్కినేని.

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

3 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.