జలియన్ వాలా బాగ్ జ్ఞాపకాలు

ఏప్రిల్ 13, 2019

ఈరోజు భైశాఖి, పంజాబీ ప్రజల గుండె చప్పుడు. నూర్పిళ్లు మొదలయ్యే ఈ రోజు కోసం సంవత్సరమంతా ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటారు. ఎన్నెన్నో జాతర్లూ, పాటలూ, ఉత్సవాలు ఈ రోజున జరుగుతాయి. ఈ రోజు జలియన్ వాలా బాగ్ హత్యాకాండ శతాబ్ది కూడా. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలో పాల్గొనేందుకు వేలమంది జనం అక్కడ గుమిగూడారు. వాళ్లమీద బ్రిటిష్ సైన్యం జరిపిన కాల్పుల్లో వందలమంది చనిపోయారు. వేలమంది గాయపడ్డారు. ఆ సంఘటన జరిగిన చోటికి నేను ఎన్నోసార్లు వెళ్లాను. అమృత్ సర్ కు వెళ్లిన ప్రతిసారీ నేను అక్కడికి వెళ్తాను.

ఈ హత్యాకాండ గురించి నేను మొట్ట మొదటిసారి మూడో తరగతిలోనో, నాలుగో తరగతిలోనో ఉన్నప్పుడు విన్నాను. బడి మొదలయ్యే ముందు, స్కూల్ అసెంబ్లీలో జరిగే ప్రార్థన చేయించే ముగ్గురు విద్యార్థుల్లో నేను ఒకడిని. ఆ రోజు ప్రార్థన తరువాత మా ప్రిన్సిపల్ ఈ హత్యాకాండ గురించి మాట్లాడారు. ఆయన లాహోర్ నుంచి వచ్చారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఆ హత్యాకాండ జరిగినప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి జలియన్ వాలా బాగ్ లో ఉన్నానని చెప్పారు. అక్కడ ఎంతోమంది జనం ఉన్నారనీ, చాలామంది వక్తలు స్టేజి మీదకు వెళ్లి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాలని ఉపన్యాసాలు ఇచ్చారని చెప్పారు. హఠాత్తుగా బుల్లెట్ల వాన మొదలయ్యింది. ఎంతో మంది చనిపోయారు. తనకు చాలా భయమేసిందని ఆయన చెప్పారు. జనం మీదకు కాల్పులు జరిపేందుకు ఆజ్ఞ ఇచ్చిన జనరల్ ను ముప్పై ఏళ్ల తరువాత ఉద్దమ్ సింగ్ చంపేశాడని కూడా ఆయన చెప్పారు. బడి మొత్తం చప్పట్లు కొట్టారు.

ఉద్ధమ్ సింగ్

మా ప్రిన్సిపల్ చెప్పిన విషయం నామీద ఎంతో ప్రభావం చూపింది. అప్పటి దాకా అలాంటి సంఘటన జరిగిందని నాకు తెలీదు. ఆగస్టు 15 న జండా వందనం జరుగుతుంది కానీ, ఇలాంటి విషయం గురించి అప్పటిదాకా ఎవరూ చెప్పలేదు. చెప్పినా నాకు గుర్తులేదేమో.  కానీ ఆ స్కూల్ అసెంబ్లీ నాకు ఇప్పటికీ చక్కగా జ్ఞాపకం ఉంది. బడిపిల్లలతో ప్రార్థన చేయించిన మిగతా ఇద్దరు అబ్బాయిల పేర్లు జ్ఞాపకం కూడా లేవు.

ఆ రోజు ఇంటికి వెళ్లాక, మా ఇంటికి అప్పుడప్పుడు వచ్చే ఆంగ్లేయుడితో ఎందుకు కలిసే వాడివని మానాన్నను నిలదీశాను. అతను ఆంగ్లేయుడు కాదనీ, స్విస్ జాతీయుడనీ మా నాన్న నాకు సర్ది చెప్పాడు. అప్పట్లో నెస్ట్లే కంపెనీ మా టౌన్లో ఒక ఫ్యాక్టరీని ప్రారంభించింది. ఆ స్విస్ జాతీయుడు దానికి మేనేజింగ్ డైరక్టరుగా పని చేసేవాడు. అమ్మ ఇచ్చిన నిమ్మరం తాగుతూ నాన్నతో బాతాఖానీ కొడుతూ సాయంత్రాలు చాలాసేపు మా ఇంట్లో గడిపేవాడు.

కొన్ని రోజుల తరువాత మా తాత ఊరినుంచి మమ్మల్ని చూడడానికి వచ్చాడు. ఆయన కనిపించకుండాపోయి, 20-25 సంవత్సరాల తరువాత ఈ మధ్యనే వచ్చేశాడు. ఆయనిప్పుడు ‘సాధువ’య్యాడు. “తాతా, జలియన్ వాలా బాగ్ జరిగిన రోజున నువ్వు ఎక్కడున్నావు?” అని నేను ఆయనను అడిగాను. ఏదో చెడ్డ కలను గుర్తు చేసుకుంటున్నట్లు ఆయన నా ముఖంలోకి తేరిపారా చూశాడు. “ఆ రోజు బైశాఖి. నేను అప్పటికి యువకుడిని. గదరైట్లతో, బాబర్లతో తిరిగేవాడిని. బైశాఖి జాతర్లలో జనాలకు బ్రిటిష్ వారిని దేశం నుంచి గెంటెయ్యాలని చెప్పేవాళ్లం. లాలా (లాలా లజపతిరాయ్), ఇంకొంత మంది మన ఊరివాళ్లం కలిసి ‘పగర్డి సంభాల్ ‘ ఉద్యమంలో పాల్గొన్నాం. జీత్ (అజిత్ సింగ్ – భగత్ సింగ్ మామయ్య) గొప్ప కవి. తను రాసిన గొప్ప పాట ‘పగర్డి సంభాల్ జట్టా’ పాడినప్పుడు జనాలు ఉప్పొంగి పోయేవాళ్లు. ఆ తరువాత, సరభ, జైవండా, బాబర్లు వంటి బృందాలు ఊళ్లోకి వచ్చారు. ఎక్కడో విదేశాల్లో యుద్ధం మొదలైనప్పుడు, బ్రిటిష్ వాళ్లు ఇబ్బందుల్లో ఇరుక్కున్నప్పుడు వాళ్లను ఎదుర్కొనడానికి అదే అదను అని మేము అనుకున్నాం. ఆంగ్లేయులు ఇబ్బందుల్లో ఉన్నారనీ, వాళ్ల మీద తిరగబడమని ఊర్లల్లో జనాలకూ, కంటోన్మెంట్లకు వెళ్లి  ఆంగ్లేయులు ఇచ్చిన తుపాకులను వాళ్ల మీదే ఎక్కుపెట్టమని అక్కడి సైనికులకు పిలుపునిచ్చాం”, అంటూ ఆయన ఇంకా చెప్పాడు, “ఆ యుద్ధంలోకి తమ ఊరి నుంచి ఒక్కరిని కూడా పంపకూడదని ఎన్నో ఊర్ల ప్రజలు ప్రతిజ్ఞ చేశారు.” ఆయన ఒక నిమిషం ఆగి, తను చెప్పేది నేను వింటున్నానో లేదో రూఢి చేసుకుంటున్నట్లు నన్ను చూసి, మళ్లీ మొదలెట్టాడు, “ఆంగ్లేయుల, జాగిర్దారుల బూట్లు నాకే వాళ్లు కొంతమంది, సాహిబ్ కు ఈ కష్టకాలంలో సహాయపడాలని ప్రజలకు చెప్పడం మొదలుపెట్టారు. కాంగ్రెస్, ముస్లిం లీగ్ వంటి సంస్థల నాయకులను కలిసి ప్రజలు ఆంగ్లేయుల తరపున యుద్ధం చేయాలని వాళ్లతో చెప్పించారు. ఆ నాయకుల ప్రయాణాలకు కావలసిన సౌకర్యాలనూ, బందోబస్తులనూ బ్రిటిష్ ఆఫీసర్లు సమకూర్చే వాళ్లు. కొంతమంది నాయకులు ఎంత మోసగాళ్లంటే, యుద్ధానికి వెళితే అక్కడ తుపాకులు ఉపయోగించడం నేర్చుకోవచ్చనీ అప్పుడు బ్రిటిష్ వాళ్ల మీద తిరగబడవచ్చనీ చెప్పి ఒప్పించారు.  కానీ ఆ సైనికులతో తిరుగుబాటు చేయించే ఉద్దేశం వాళ్లకేం లేదన్న విషయం యుద్ధం ముగిసిన తరువాత అర్థమయింది. వాళ్లు పచ్చి మోసగాళ్లు.”

ఆయన కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా ఉన్నాడు. నాకు యుగాలు గడిచినట్లనిపించింది. మళ్లీ అందుకుని, “సైన్యంలో చేరితే ఆంగ్లేయులు యుద్ధం తరువాత స్వాతంత్రం ఇస్తారని ఆ నాయకులు మాకు అబద్ధాలు చెప్పారు, జనాన్ని అమాయకులను చేసి మోసగించారు. అది అబద్ధం. ఆంగ్లేయుల కోసం పని చేసే ఇన్ఫార్మర్లు ఎంతోమంది ఊర్లల్లో ఉన్నారు. పంజాబులో ఉన్న ఇన్ఫార్మర్లను బాబర్లు ఒక రాత్రి చంపేశారు. దానివల్ల మేం ఊర్లల్లో పనిచెయ్యగలిగాం. ఆ బైశాఖి రోజున మా ఊరివాళ్లతో ఆంగ్లేయులను తరిమెయ్యడం గురించి మాట్లాడాను. జలియన్ వాలా బాగ్ గురించి మాకు రెండు రోజుల తరువాత తెలిసింది. ఈ కాంగ్రెస్ నాయకులు అప్పుడూ అబద్ధం చెప్పారు, ఇప్పుడూ అబద్ధం చెప్తున్నారు. ఈ ముఖ్య మంత్రి, మీ మామయ్య స్నేహితుడు, పెద్ద అబద్దాలరాయుడు. అందరూ అబద్ధాలు చెప్పేవాళ్లే, పొరపాటున కూడా నిజం చెప్పలేరు.”

నాకు మనసంతా గందరగోళంగా అనిపించింది. తాత చెప్పిన విషయాలు నన్ను కదిలించేశాయి. కానీ మా బడి గోడల మీద వేళ్లాడుతున్న చిత్రపటాల్లోని నాయకులు ఎన్నో గొప్ప పనులు చేశారని విన్నాం. వాళ్లే జనాన్ని మోసగించే అబద్ధాలు చెప్పారంటే నమ్మబుద్ది కాలేదు. ముఖ్య మంత్రి సామాన్యుడిగా ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చేవాడు. ఆయన మా మామయ్య స్నేహితుడు. ఆశ్చర్యంతో మా తాతను అడిగాను, “అందరూ అబద్ధాలు చెప్పేవాళ్లేనా?” తిరస్కారంగా ఆయన జవాబిచ్చాడు, “అందరూ. ఎవ్వరినీ నమ్మకు.”

జలియన్ వాలా బాగ్ సంఘటన జరిగిన నూరేళ్ల తరువాత కూడా, ఆ కాంగ్రెస్, BJP, CPI ఇంకా మిగతా పార్టీలు   జననికి ఇంకా అబద్ధాలు చెప్పి మోసగిస్తూనే ఉన్నారు. వాళ్ల ఎన్నికల మానిఫెస్టోలనూ, వాళ్ల ట్రాక్ రికార్డ్లనూ కొంచెం నిశితంగా పరిశీలిస్తే తెలిసిపోతుంది. తప్పుడు సమాచారమూ, దగా, వంచనా పెచ్చరిల్లిపోయాయి.

వంద సంవత్సరాల తరువాత భారత సైన్యంలో వలస పాలన స్వభావం  చెక్కు చెదరకుండా ఉంది. ఏ మార్పూ లేదు. జలియన్ వాలా బాగ్ తరహాలోనే ప్రజలమీద యుద్ధం కోసం సైన్యాన్ని ఉపయోగిస్తోంది అధికారంలో ఉన్న ఉన్నతవర్గం. ఈశాన్యం, పంజాబ్, కాశ్మీర్, ఇంకా ఎన్నో చోట్ల అమాయకులను హతమారుస్తూ డజన్ల కొద్దీ జలియన్ వాలా బాగ్ లను సృష్టిస్తోంది.  డయ్యర్, నాజీలు ప్రజలతో ఎట్లా వ్యవహరించాలని మాట్లాడుకునేవాళ్లో అలా భారత సేనాధిపతులూ, అధికారులూ మాట్లాడుకుంటున్నారు.

ఆదేశాలను పాటించాం అనేది నేరానికి సమర్థన కాదనీ, సాధారణ పౌరుల మీద  కాల్పులు జరపాలన్న ఆదేశాలను సైనికులు ధిక్కరించాల్సిందనీ న్యూరెంబర్గ్ ట్రిబ్యూనల్ లో తేల్చి చెప్పారు. శిక్ష పడుతుందన్న భయాలేమీ లేకుండా  భారత సైన్యం సాధారణ పౌరుల హక్కులను కాలరాస్తోంది. భారత సేనాధికారులు నాజీ అధికారుల్లాగే తాము కేవలం ఆదేశాలను అమలు చేస్తున్నామని చెబుతున్నారు.

ఒక కవిత జ్ఞాపకం వస్తోంది.:

నాదిర్ షా, డయ్యర్ అనుయాయులూ, మోసగాళ్లూ ఢిల్లీలో అధికారం చెలాయిస్తున్నారు
వాళ్లు నగరాలను జలియన్ వాలా బాగ్ లను చేశారు,మట్టిని అమాయకుల రక్తంతో తడిపేశారు
యమునా నది మరోసారి ఎర్రబడ్డది. కొత్త ముఖంతో వచ్చాడు కసాయివాడు.

(తెలుగు: కొడిదెల మమత)

జస్పాల్ సింగ్

జస్పాల్ సింగ్ పంజాబులో, ఉత్తరాఖండ్ లో చదువుకున్నారు. అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఫిలాసఫీ చదువుకుని బోధకుడిగా పనిచేశారు. ఆయన పంజాబ్ వేదిక్ స్కాలర్ కూడా. 'పంజాబ్ దర్షన్ తే ఏక్ ఝాట్'( A Look at Punjab Philosophy) అనే పుస్తకాన్ని వెలువరించారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.