ఒక సంగతులు…

హలో…

ఏంటి సంగతి?

ఒక సంగతి కాదు, వంద సంగతులున్నాయి… వెయ్యి సంగతులున్నాయి… కాని ఎవరు వింటారు?

‘ఏంట్రా సంగతి?’ అంటారా?, అలాగని చెపితే వింటారా?

వినరు!

వినరుగాక వినరు!

నాన్న బిజీ బిజీ?! ఆఫీసూ న్యూసూ! ఔను, ఆఫీసు నుండి ట్రాఫిక్లో అలసిపోయి వస్తారా? ముఖం కడిగి అలా లుంగీ మారుస్తారా? ఇలా టీవీ ముందు కూర్చుంటారా? ఆ చానెలూ ఈ చానెలూ మార్చి మార్చి చూసిన న్యూసే చూస్తుంటారా? మధ్య మధ్యలో ఫోన్లు వస్తే మాట్లాడుతుంటారా? రొట్టో అన్నమో యేది అమ్మ పెడితే అది… యేది తింటున్నామో తెలియకుండా తింటారా? ఆవలింతలు తీస్తారా? కునికిపాట్లు పడుతూ కూడా టీవీ చూస్తారా? చూసి చూసి సోఫాలోనే నిద్రపోతారా? ఇంక మన సంగతులు… ఇంతే సంగతులు!

పోనీ మనం మధ్యలో మాట్లాడడానికి ట్రై చేస్తే డిసిప్లిన్ బొత్తిగా లేదంటారు! డిసిప్లిన్ లేనివాళ్ళు అస్సలు పైకి రాలేరని కూడా అంటారు!

హు… నేను నాన్న దగ్గర డిసిప్లిన్ గానే వుంటా! లేకపోతే ఆయన డిసిప్లిన్ తప్పుతారు!

పోనీ అన్నయ్యతో మాట్లాడదామంటే… అన్నయ్య యెప్పుడూ పెదాలకు ఫెవికోల్ పెట్టుకొని వుంటాడేమో నోరు విప్పడు! వాళ్ళ కాలేజీ సంగతులూ చెప్పడు! అన్నయ్యని చూసి నేర్చుకోమని మాత్రం అమ్మానాన్నా చెపుతుంటారు!

నన్ను మాత్రం యేమీ చెప్పనివ్వరు!

ప్రతిరోజూ స్కూల్లో బోలెడన్ని సంగతులుంటాయి కదా?, స్కూలవగానే పరిగేత్తుకు వచ్చి- అమ్మ కాళ్ళని చుట్టేసి పట్టుకొని- అమ్మకు అన్నీ చెప్పాలనుకొని- ‘మరేమో… మరేమో…’ అని యింకా మొదలు పెట్టకముందే-

‘ముందీ కాంప్లెన్ తాగు… ముందీ స్వీటు తిను…’ అని యేదో వొకటి తినమంటుందే కాని వొక్క మాట కూడా వినదు! మాట్లాడనివ్వదు! ముందా కాళ్ళూ చేతులూ కడుక్కో… బట్టలు మార్చు… స్నానం చెయ్… హోమ్ వర్క్ చెయ్… తినేయ్… ఏయ్… నిద్రపో… తెల్లారిలేయ్… టైం లేదోయ్… బడికి బయల్దేరోయ్… ప్చ్…

పోని చెప్పినవన్నీ చేసేసి సంగతులు చెప్పబోతామా? కాస్త రెస్టు తీసుకో అంటుంది! మాట్లాడకు అంటుంది! బుద్దిమంతులైన పిల్లలు అమ్మానాన్నా చెప్పినట్టు వింటారంటుంది! నేనూ బుద్దిమంతుడ్ని అనిపించుకోవాలి కదా? అందుకే నోర్మూసుకుంటాను! స్కూల్లో నోటిమీద వేలేసుకున్నట్టే! ఇల్లు కూడా యెప్పటికప్పుడు స్కూలే?!

నోరున్నది తినడానికేనా? మాట్లాడడానికి కాదా? అందుకే మాట్లాడాలని చూసి చూసి- ‘మా స్కూల్లో…’ అని మొదలెడతానా? ఇలా మొదలెట్టక ముందే అలా ‘అలసిపోతావు… నీరసమయిపోతావు…’ అంటుంది అమ్మ!

ఆ మాటకు నిజంగానే యెక్కడలేని నీరసమూ వచ్చేస్తుంది!

ఎంత వద్దనుకున్నా స్కూల్లో జరిగిన సంగతులన్నీ గుర్తుకు వస్తాయి కదా? ‘అమ్మా… ఇవాళ స్కూల్లో యేమయిందో తెలుసా?’ అని అడగబోతానా?

అమ్మ పలకదు! పాపం అమ్మకీ పనులుంటాయ్! నాన్నలా కాదు! అమ్మకి తీరికుండదు! సెలవుండదు!

సరేనని అవకాశం చూసుకొని ‘అమ్మా మరేమో… గనిగాడు…’ నే చెప్పకముందే-

‘ఎవరి సంగతో నీకెందుకు? నీ సంగతేదో నువ్వు చూసుకో…’ అని అమ్మ యెప్పటిలానే అంటుంది!

‘అది కాదమ్మా… వాడికి జ్వరం కదా… స్కూలుకు రాలేదు కదా… అందుకని నోట్సు రాసుకోలేదు కదా…’ నేను చెప్పకముందే ‘నీ నోట్సులు యివ్వకు. ఇస్తే నువ్వేం చదువుతావ్?’ అమ్మ వొత్తినే కోప్పడిపోతుంది! అప్పటికీ ‘వేరే సబ్జెక్ట్ చదువుతా లేమ్మా’ అంటానా?, ‘అంత బాదెందుకూ?’ అంటుంది!

‘అమ్మా అందరికీ జ్వరం వస్తుందా?’ అడుగుతానా?, ‘భూమ్మీద పుట్టిన ప్రతివాడికీ జ్వరం వస్తుంది’ అంటుందా?, ‘సరే మరి నాకు జ్వరం వస్తే?’ అంటానా? ‘అవేం అపశకునపు మాటల్రా… వెధవ్వాగుడు ఆపేసి వెళ్ళి పడుకో’ అని కసిరేసి అప్పటికి సంగతులకి శుభం కార్డు వేసేస్తుంది అమ్మ!

అయినా యెప్పుడు పడితే అప్పుడు నిద్రెలా వస్తుంది?

హు… అమ్మలే కాదు, టీచరమ్మలూ అంతే! అఖిల్ గాడు మాట్లాడుతుంటే టీచరు డస్టరు విసిరేసింది! అదే విషయం దాచకుండా అమ్మకి చెపుతామా? ‘మంచి పని చేసింది’ అమ్మ మాటే నాన్నా అనేసి అవతలకు వెళ్ళిపోతారు- డిసిప్లెన్ లేదనుకుంటూ!

‘అఖిల్ గాడికి తల కన్నం పడింది…’ బాధగా అనిపించి చెప్తానా?

‘వాడికి జ్వరమూ- వీడికి తలకి కన్నం పడింది… యివేనా యెప్పుడూ? ఇవేనా పాఠాలు? ఇంకేం లేవా?’ అమ్మ రుసరుసలాడుతుంది!

నాకు బాధనిపిస్తుందా? కాని కాసేపటికి మర్చిపోతానా? మర్చిపోయి మళ్ళీ నోరు విప్పుతానా? విప్పి ‘అమ్మా… లిల్లీ యివాళ స్కూలుకు జడగంటలు వేసుకు వచ్చింది, యెందుకో చెప్పుకో?’ అడుగుతానా?

‘బుద్ది లేక’ అంటుంది అమ్మ! ‘స్కూలుకు సోకు చేసుకోవడానికి వస్తారో… చదువుకోవడానికి వస్తారో… తెలీదు’ అంటుంది!

‘చాలా బావుందమ్మా’ అంటే-

‘నోరు మూస్తావా? వేస్టు విషయాల మీద టైం వేస్టు చెయ్యకూ’ అంటుంది!

‘నువ్వు కూడా జడగంటలు వేసుకోవామ్మా…’ అమ్మని అడిగితే-

‘నీకేమన్నా పిచ్చా’ అంటుంది!

నవ్వితే, ‘చదువు తప్ప అన్నీ వున్నాయి నీ దగ్గర’ అంటుంది!

పోన్లే అని ఆ విషయం వదిలేస్తానా?-

సిద్దూ వాళ్ళ టామీ జూలుతో తెల్లగా భలే బావుంటుంది కదా… మనమూ వొకటి పెంచుకుంటే?-

‘ఒఖటేమి నాలుగు పెంచుకుందాం… కుక్కలూ కోళ్ళూ పెంచుకుందాం… ఆవులూ గేదెలూ పెంచుకుందాం… పాలూ పెరుక్కి డోఖా వుండదు…’ అంటుంది!

పోని అని వూరుకుంటుందా? ఊరుకోదు! నోటిమీద వేలేసుకొని కూర్చోమంటుంది! వేలు తియ్యొద్దు అంటుంది!

వేలు తియ్యకుండా ‘అమ్మా మరేమో…’ మాట్లాడబోతానా?-

‘కాస్త నోరు మూస్తావా?’ అమ్మ గొంతు మారిపోతుంది! మాట్లాడితే వీపు మీద పడిపోతుంది!

అందుకే సైలెంటు అయిపోతాను! స్కూల్లో పిండ్రాప్ సైలెన్స్ అంటారే… అచ్చం అలాగన్నమాట!

స్కూల్లో యేడు పిరియడ్లు! ఏడు క్లాసులు! ఇంట్లో యిరవైనాలుగు పిరియడ్లు! అరవైనాలుగు క్లాసులు!

అది కాదు విచిత్రం?! విచిత్రమేమిటంటే అన్నయ్య యెప్పుడూ సైలెంటుగా వుంటున్నాడంట! ఇంట్లో అమ్మతో నాన్నతో యెవరితో యేమీ మాట్లాడడం లేదంట! కాలేజీలో చేరిన దగ్గర్నుంచి వాడి లోకం వాడిదట?!

‘కాస్త మాతో మాట్లాడరా… అమ్మా నాన్నలతో ఫ్రెండ్లీగా వుండరా… మూడీగా వుండకురా… అని అమ్మానాన్నా కలిసి సంగతులు అడుగుతారు! చెప్పాగా… అన్నయ్య పెదాలకు ఫెవికాల్ వుంటుందని! ఒక సంగతులూ చెప్పడు?!

అన్నయ్య లేనప్పుడు అమ్మానాన్నా రహస్యంగా అన్నయ్య సంగతులు మాట్లాడడం నాకు తెలుసు! అన్నయ్య టీనేజ్ లో వున్నాడంట! అదేంటో చాలా డేంజరంట! చెడిపోవడానికయినా బాగుపడడానికయినా అదే యేజట?!

ఆ యేజు నాకెప్పుడు వస్తుందో యేమో?

అమ్మనడిగా! అన్నయ్య చిన్నప్పుడు… అంటే నా అంతప్పుడు మాట్లాడేవాడు కాదా? స్కూలు సంగతులు చెప్పేవాడు కాదా?-

అమ్మ మాట్లాడకుండా నన్నలాగే చూసింది! ఎందుకలా చూసిందో నాకర్థం కాలేదు?!

‘చెప్పమ్మా’ అంటే-

‘పోరా పో…’ అంది!

అన్నయ్య సంగతులు అమ్మ యెందుకు నాతో చెప్పలేదు?

చెపితే- నా సంగతులు వినాల్సి వస్తుందనా?

ఏమో? ఏమీ అర్థం కాలేదు?!

ప్చ్… నా సంగతులు యెవరికీ అక్కర్లేదు! చిన్నవాణ్ణి కదా?-

అన్నయ్య సంగతులు అందరికీ కావాలి! పెద్దవాడు కదా?

అయినా… నోరు విప్పి సంగతులు చెపితే చాలు… యెవరి సంగతో నీకెందుకు? నీ సంగతేదో నువ్వు చూసుకోమంటారే? వస పిట్టలా వాగొద్దు అంటారే? వేస్టు విషయాల మీద టైం వేస్టు చెయ్యొద్దు అంటారే? ఊరి రామాయణాలు నీకెందుకు అంటారే? డిసిప్లిన్ లేదంటారే? మనం చిన్నపిల్లలం యేదన్నా అంటే నోరు ముయ్యమంటారే?

నోర్ముయ్… నోర్ముయ్… నోర్ముయ్…

అన్నయ్య అమ్మానాన్నా చెప్పినట్టు యెంచక్కా ఫివికాల్ పెట్టుకొని నోర్మూసుకొని డిసిప్లిన్ గా వుంటే తప్పేంటి? భయం దేనికి? బాధ దేనికి?

నన్నిప్పుడు నోర్మూసుకోమని చెప్తే- పెద్దయితే నోరు తెరుస్తానా?

నా సంగతులు నే చూసుకుంటే- స్కూలు సంగతులూ కాలేజీ సంగతులూ అందరి సంగతులూ యింక నేనెందుకు చెపుతాను?

నేనూ అన్నయ్యలా సైలెంటు అయిపోతానా?

నన్ను సంగతులు చెప్పకుండా సైలెంటు చేసింది అమ్మానాన్నే!

మరి అన్నయ్యా అందుకే అలా తయారయ్యాడా?

అమ్మానాన్నలకి ఈ సంగతులు తెలీవా?

అసలు సంగతులే తెలీవా?

-తేజ,

5వ తరగతి,

మహాబోధి స్కూల్.

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

6 comments

  • ఒక సంగతులు…పేరులోనే వ్యంగ్యం..విషాదం.పిల్లలెన్ని సంగతులు మాట్లాడాలి అనుకుంటారు…బడి నుంచి ఎంత ఉద్వేగంతో ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తారు అమ్మతో చెప్పెదమనుకొని?కానీ.. శిక్షణ పేరుతో పిల్లల భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ను తల్లిదండ్రులు ఎలా హరించి పిల్లలను మూగ వాళ్ల లాగా మా ర్చి వేస్తారో చాలా బాగా చెప్పారు.ప్రతి పేరెంట్ చదవాల్సిన కథ.నేను మా ఫామిలీ అండ్ కాలనీ గ్రూపులో పోస్ట్ చేసాను.అభినందనలు బజారు గారు.ఈ కథ ఇంగ్లీష్ లోకి ఎవరైనా అనువాదం చేస్తే బాగుంటుంది.

  • చాలా బాగుంది. తల్లిదండ్రులకు పిల్లలకు మద్య ఉన్న గేప్ ను కళ్ళకు కట్టినట్లు చెప్పారు. మనము దేనికోసం కష్ట పడుతున్నామో చివరకు దాన్ని మిస్సవు తా మనే విషయం గమనించాలి.
    బొంగు వేణు గోపాలరావు
    హైదరాబాద్

  • బజరా‌ , సున్నితమైన విషయాలు ,మనుషులు కోల్పోతున్న మానవీయత ను గురించి హెచ్చరిస్తున్నావు. బాగున్నాయి. ప్రతి సంచిక లోనా చదువుతున్నాను. అభినందనలు

  • డియర్ బజరా! ప్రతిసంచికలోనా మీ శీర్షిక చూస్తున్నాను.చదువుతున్నాను.మనిషి తనని తనని తాను కోల్పో వడాన్ని గురించి హెచ్చరిస్తూ బాగా రాస్తున్నారు. అభినందనలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.