కొన సాగుతున్న సంవాదం

‘రస్తా’ లో (ఏప్రిల్ 16-30 సంచికలో), హెచ్చార్కే,  నా వాదానికి ఇచ్చిన జవాబు చూశాను. ఆ జవాబు సారాంశం ఈ రకంగా ఉంది: (1) నా విమర్శలో, ‘యాక్యురసీ’ (ఉన్నదాన్ని ఉన్నట్టు తీసుకుని చెప్పడం) లేదు-అన్నారు.  (2) హెచ్చార్కే  చెప్పిన బహిరంగ ముద్దు దృశ్యాన్నే గాక, తాను చెప్పని ఆలింగనాల దృశ్యాన్ని కూడా నేను తెచ్చి, విమర్శలో పాటించవలసిన నియమాన్ని నేను అతిక్రమించానని అన్నారు.  (3) చిన్న విషయాన్ని, పెద్దదిగా చేసి (‘మాగ్నిఫై’ చేసి) చూపాను-అన్నారు.  (4) బహిరంగ   ముద్దుల్ని  మనోహరాలుగా  అర్ధం చేసుకోకుండా, వాటిని ‘ప్రదర్శనలు’ గా భావించడం, నా విమర్శలో”అతిశయోక్తి” అన్నారు. (5) రాజశేఖర రెడ్డిని హెచ్చార్కే మెచ్చుకున్న విషయంలో, నా “జడ్జిమెంటు, అర్ధ  రహితం” అనీ, నేను అలాంటి తీర్పు ఇవ్వడానికి కారణం, నాలో “శ్రామిక వర్గ దృక్పధం లోపించడం” అనీ, నా విమర్శకి కారణం “వొట్టి పెటీ బూర్జువా దృక్పధం” అనీ అన్నారు.  

మొత్తం మీద, ఈ చర్చలో నేను, రెండు చెడు విమర్శనా పద్ధతుల్ని పాటించాను -అని హెచ్చార్కే నా మీద విమర్శ. ఆ చెడు పద్ధతులు ఇవీ: (1) హెచ్చార్కే చెప్పని దాన్ని కూడా నేను చేర్చడం. అంటే, స్త్రీపురుష ఆలింగనాల్ని హెచ్చార్కే  చెప్పక పోయినా, దాన్ని నేను తెచ్చాను -అని.  (2) చెప్పిన దాన్ని తీసుకోలేదు-అని. అంటే, హెచ్చార్కే  చెప్పిన, రాజశేఖర రెడ్డిలో నిజాయితీని, నేను విస్మరించాను -అని! ఇంత స్పష్టం గా హెచ్చార్కే, నా చర్చలో 2 తప్పు విధానాలు ఉన్నట్టు తేల్చారు.   

నా విమర్శని ఇంత వ్యతిరేకంగా తీసుకున్న హెచ్చార్కే కి మళ్ళీ జవాబు ఇచ్చి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే, నా విమర్శ వివరంగానే ఉన్నా, దాన్ని ఆయన అర్ధం చేసుకోవడానికి నిరాకరించారు. అయినప్పటికీ, మళ్ళీ ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే, వాదనలు రెండు రకాలుగా జరుగుతున్నప్పుడు, అవి రెండు పక్షాల వారి కోసమే కాదు; వాటిని మూడో పక్షం అయిన పాఠకులు గమనిస్తూ ఉంటారు కాబట్టి. ముఖ్యం గా, మూడో పక్షం కోసం.  

‘వెబ్’ పత్రికలో చోటు సమస్య అంతగా ఉండదు కాబట్టి, హెచ్చార్కే జవాబులో కొన్ని వాక్యాల్ని అక్కడక్కడా, అవసరమైన చోట్ల, యధాతధంగా ఉంచి, వాటికి నా జవాబులు ఇస్తాను.  

(1) హెచ్చార్కే వాదం:“బహిరంగ ప్రదేశంలోనైనా సరేయువతీ యువకుల ముద్దు మనోహరం’ అన్నాను నేను, నా చిన్ని రచనలో. రంగనాయకమ్మ జవాబు చూస్తే… నేనేదో పోర్నో రచన చేశానని మీకు (పాఠకులకు) భ్రమ కలిగినా ఆశ్చర్యపడను. విమర్శలో, ‘యాక్యురసీ’ ఎంత ముఖ్యమోదానికి నెగటివ్ వుదాహరణ, రంగనాయకమ్మ జవాబు. బుచ్చి బాపూజీ ప్రశ్నలో గానినా ఫేస్ బుక్ రచనలో గాని, జంటలు నగ్నంగా ఆలింగనాలతో గడిపే దృశ్యం’ లేదు.”

 *నా జవాబు:  చర్చల్లో, మొదటి వ్యక్తికి, ఎదటి  వ్యక్తి జవాబు ఇవ్వాలంటే, అది మొదటి వ్యక్తి చూపించే సరిహద్దుల్లోనే ఆగదు. ‘నేను ముద్దుల వరకే చెప్పాను, నగ్న ఆలింగనాల్ని చెప్పలేదు. చెప్పిన దాని వరకే మాట్లాడాలి. అదే ‘యాక్యురసీ’ అంటున్నారు హెచ్చార్కే. మొదటి వ్యక్తి చెప్పిన దాని మీద ప్రశ్నించడానికి, అదే రకపు ఇతర విషయాల్ని కూడా ప్రస్తావించవలిసి వస్తుంది. “మీరు ఇలా అన్నారు. మరి ఇలాంటిదే ఇంకోటి ఉంది. దాని సంగతి ఏమిటి?” అని అడగవలిసి రాదా? ‘యాక్యురసీ’ అంటే, చెప్పిన దాని దగ్గిరే ఆగడం కాదు.  చెప్పిన మాటని బట్టి, అదే స్వభావం గల ఇతర విషయాల్ని గురించి కూడా అడిగే వాదం సాగుతుంది. బహిరంగ ముద్దులు ‘మనోహరం’ అయితే, ఎవరికి ఆ మనోహరం? –ఆ ఇద్దరికే. దాన్ని చూసే మూడో మనిషికి కాదు. చూసే వాళ్ళకి కూడా అది మనోహరం అయితే, ఆ ముద్దు అందరికీ సంబంధించిన విషయం అవుతుంది గానీ, ఆ జంటకి మాత్రమే సంబంధించిన ‘ప్రైవసీ’ విషయం అవదు. జంటల ముద్దులకూ , ఆలింగనాలకూ, ‘ప్రైవసీ’ అనేది ఎప్పుడు?      

2)హెచ్చార్కే వాదం:“నేను యువ జంట ముద్దును ‘ప్రదర్శన’ అనుకో(డం) లేదు.  అది యిద్దరి మధ్య తమకం తోమైమరుపుతో జరుగుతుంది. ఒక క్షణమో కొన్ని క్షణాలో వాళ్ళు పరిసరాల్ని మరిచి పోతారు.”

*నా జవాబు: ఏంటి? వీధుల్లో నడిచిపోతున్న వాళ్ళు, అక్కడే “తమకంలో, మైమరుపులో” పడి పోతారా? ఆ జంట ముద్దుల్ని చూసే వాళ్ళకి మనోహరం అయినట్లే, ఆ జంట తమకమూ, మైమరుపూ కూడా, చూసే వాళ్ళకి కూడా జరగవలిసిందే కదా? ఆ జంట, నడి వీధిలో, తమకంతో, తమని తాము మరిచిపోయే మైమరుపులోకి పోతే, ఆ జంటకి తర్వాత ఏం జరుగుతుందో, చూసే వాళ్ళకేం జరుగుతుందో కూడా, హెచ్చార్కే చెప్పాలి. లేదా పాఠకులే ఉహించాలి. స్త్రీ పురుషుల శారీరక సంబంధాల్లో ఏది అయినా, ఏకాంతం లో (ప్రయివసీ) లో కాకుండా, ఇతరులముందు చేసేది ఏదైనా, అది ప్రదర్శనే. పరస్పరం ఇష్టం ఉన్న ఇద్దరు స్త్రీ పురుషులికి  ఏకాంతం లో సహజంగా కలిగే  ‘తమకం’, ‘మైమరపు’, అందరి ముందూ, బహిరంగ స్థలాల్లో రావడం అంటే,అది ప్రదర్శన కోసమే! ‘ప్రదర్శన’ కాకపోతే, ఏకాంతానికీ, బహిరంగానికీ, తేడాయే తెలియని పాగల్ లక్షణాలు అవి ఆ ఇద్దరికీ.            

3) హెచ్చార్కే వాదం: “బహిరంగ నగ్న ఆలింగనం అనే మాట  ద్వారా రంగనాయకమ్మ ఆరుబయలు సెక్సు’ స్ఫురణ ఇచ్చారు. ..  ఈ అతిక్రమణ’ ఎందుకు చేశారు?” 

*నా జవాబు: బహిరంగ ముద్దుల తమకాలూమైమరుపులూఆ యువ జంటనేఆ అతిక్రమణకు ప్రోత్సహించవచ్చు. లేదాఆ మైమరుపు ఆ జంటకీఆ దృశ్యాన్ని మనోహరంగా భావించే చూపరులకూ కూడాఆ అతిక్రమణ స్పృహ‘ కలిగించవచ్చు.       

 4) హెచ్చార్కే వాదం:“ఆరుబయట యువ జంట ముద్దు… అయితే మనోహరం అవుతుంది, లేదా ఏమీ కాదు.”

*నా జవాబు: ‘ఏమీ కాదు’ అనేది దాటవేత. ఎదరగా జరిగే యువ జంట ముద్దుని, హెచ్చార్కే  ప్రకారం మనోహరంగా భావించే  వాళ్ళు  కొందరైతే, ‘ఏమిటా బుద్ధిలేని ప్రవర్తన?’ అని చీదర పడే వాళ్ళు కొందరుంటారు. ఎదరగా కనపడే ఒక దృశ్యం, చూసే వాళ్ళకి ఏ కదలికా ఇవ్వనిదిగా, ‘ఏమీ కానిది’ గా ఎక్కడా ఉండదు.   

5) హెచ్చార్కే వాదం: (ఆ యువ జంట, ముద్దులతో) “ఒక క్షణమో, కొన్ని క్షణాలో, పరిసరాల్ని మరిచిపోతారు. ఆ పారవశ్యం, నా మట్టుకు నాకు మనోహరమే. ప్రదర్శన కాదు.”   

*నా జవాబు: ఒక జంట ముద్దుల తమకాన్నీ, మైమరుపునీ , పారవశ్యాన్నీ, మనోహరంగా చూడగలగడం, ‘పోర్నో’నిచూడడం గాక, ఇంకేమవుతుంది?   

6) హెచ్చార్కే వాదం: “అమ్మ నాన్న ప్రేమగా కౌగలించుకుంటే పిల్లలకు ఏమీ కాదు. వృద్ధులకూ ఇబ్బంది వుంటుందని అనుకోనువాళ్ళు మరీ చాదస్తులు కాకపోతే.”  

నా జవాబు: పిల్లలు ఎప్పుడూ చంటి పిల్లలుగా ఆగిపోరు. ఎదిగే పిల్లల ముందు తల్లిదండ్రుల కౌగిలింతలా? ఇంట్లో వృద్ధులు ఉంటే,  వాళ్ళ ముందు, కొడుకూ కోడళ్ళ, లేదా కూతురూ అల్లుళ్ళ కావిలింతల్ని ఆ వృద్ధులు చీదరించుకుంటే వాళ్ళు చాదస్తులా? అయితే, ‘చాదస్తం’ అనేది ఎంత సంస్కారమో ఇప్పుడు అర్ధమవుతోంది. ‘ప్రేమల’ పేరుతో, నగ్న ప్రదర్శనల్ని చూపే సినిమాలూ, టీవీలూ, పెచ్చుపెరిగిపోతూ ఉన్నప్పుడు, చాదస్తాల్ని నిలబెట్టుకోవడమే, చెయ్యవలిసిన మంచి పని !       

7) హెచ్చార్కే వాదం: “నాకు మనోహరం అయిన ముద్దు కొందరికి అసహ్యం ఎందుకయ్యిందో నాకు అర్థం కాని విషయం. ఈ సందేహాన్ని మార్క్సిజం తీర్చలేదు. అది అనుభవజ్ఞుడైన సైకియాట్రిస్టు పని.”

*నా జవాబు: ‘ముద్దు’ ని విడిగా, అసహ్యం అనడం లేదు. బట్టబయలు ముద్దుల్నే  అసహ్యం అనడం! ఏ సందేహాన్ని అయినా మార్క్సిజం తీర్చగలదు. ఎలాగంటే, ఆ సిద్ధాంతంలో, మొట్టమొదటి పాఠంలోనే, సహజత్వాలూ, అసహజత్వాలూ అనే విభజన ఉంటుంది. అది ‘మారకం విలువ’ విషయంలోనే కాదు. మానవ జీవితంలో, ఏ కోణాన్ని తీసుకున్నా, ‘సహజం-అసహజం’ అనే తేడాలతోనే చూడాలనేది ఆ సిద్ధాంతం. దీని కోసం సైకియాట్రిస్టులెందుకు? ఆ ఫీజు దండగ! ఆ టైమూ, ఆ శ్రమా దండగ!

8) హెచ్చార్కే వాదం: “విద్యావైద్యాలను ప్రజల పోరాట అజెండా లోనికి చేర్చినందుకు వయ్యెస్సార్ ను మెచ్చుకున్నాను.” 

*నా జవాబు: ఈ మెచ్చుకోలు (“ప్రజల పోరాట అజెండా లోనికి చేర్చినందుకు” అనే మెచ్చుకోలు), ‘యాత్ర’ సినిమా మీద చేసిన సమీక్షలో లేదు. ఇప్పుడు రాసిన జవాబులోనే ఉంది.  ఈ మెచ్చుకోలు, బూర్జువా ప్రతిపక్ష నాయకుడికి, అతడి కోరికపై, బడ్జెట్ ప్రసంగం రాసిపెట్టడం కన్నా దారుణం. ఎలాగంటే, పాలక పక్ష నేతనే ‘ప్రజల పోరాట అజెండాకి’ రూపకర్తగా ప్రశంసించడం ఇది. సాధారణంగా, ఇలాంటి ప్రశంసల్ని పాలక పక్షం వాళ్ళే పత్రికల వాళ్ళ చేత రాయించుకుంటారు.(పెయిడ్ న్యూస్ అంటారే అలాగ.) హెచ్చార్కే ఎటువంటి ప్రతిఫలమూ ఆశించకుండా ఈ ప్రశంసలు చేశారంటే, దానికి కారణం ‘శ్రామిక వర్గ ధృక్పధం’ గురించి ఆయనకు ఉన్న అవగాహన ఆ స్థాయిలో ఉందన్నమాట! ఇలాంటి మెచ్చుకోళ్ళు ప్రజల్ని మరింత భ్రమల్లో ముంచుతాయి! అది ప్రజలకి సిద్ధాంత పరంగా ద్రోహం చెయ్యడమే!  రాజశేఖర రెడ్డి, విద్యకీ, వైద్యానికీ సంబంధించి పధకాలు ప్రవేశ పెట్టక ముందు, ప్రజలు గానీ, వారి తరఫున కమ్యూనిస్టులు గానీ, వారి ప్రజా సంఘాలు గానీ,  విద్యా వకాశాల కోసమూ, మెరుగైన వైద్య సదుపాయాల కోసమూ పోరాడనే లేదా? ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంతో కొంత పోరాడింది కమ్యూనిస్టు పార్టీలు కాదా? ప్రజల అజెండాలో లేకుండానే, ప్రజల అవసరాల్ని పాలకుడే గుర్తించి రూపొందించిన పధకాలు కావు ఇవి. ఓట్ల కోసం, మరి కొన్నాళ్ళు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడం కోసం వేసిన ఎత్తుగడ ఇది. ఈ పని, రాజశేఖర రెడ్డే కాదు, చంద్రబాబు నాయుడూ, చంద్రశేఖర రావూ వంటి ముఖ్య మంత్రులు కూడా చేస్తారు, చేస్తున్నారు.               

9) హెచ్చార్కే వాదం: “రాజశేఖర రెడ్డి హయాంలో అమలు జరిగిన రెండు సంక్షేమ పథకాలను నేను మెచ్చుకున్నాను. అవి విద్యార్థుల ఫీజ్ రీఎంబర్స్మెంటుఆరోగ్యశ్రీ. తదనంతర పాలకవర్గ నేత (నాయుడు) వాటికి తూట్లు పొడిచిన నేపధ్యంలో, అవి నాకు మెచ్చుకోదగిన సంస్కరణలుగా కనిపించాయి. వాటిని మెచ్చుకోడం వెనుక నాలో పని చేసినది, శ్రామిక వర్గ దృక్పథమే. అందువల్ల, ఆ యోగ్యతా పత్రం ఇచ్చిన వ్యక్తికి బొత్తిగా శ్రామిక వర్గ దృక్పధం లోపించిందని అర్ధం” అనే రంగనాయకమ్మ జడ్జ్మెంటు అర్థరహితం.” 

*నా జవాబు: శ్రమ దోపిడీని కొనసాగించే ఏ పాలక వర్గ నేత అయినా, ఏ పధకం ప్రవేశపెట్టినా, తమ దోపిడీ వర్గ దృష్టితో చేస్తాడా, శ్రామిక వర్గ దృష్టితో చేస్తాడా? రాజశేఖర రెడ్డి పెట్టిన ఆ రెండు పధకాలూ, బూర్జువా పారిశ్రామిక వేత్తల సరుకుల అమ్మకాల కోసమే! (కాలేజీల్లో ‘విద్య’ అనే సరుకూ, ఆసుపత్రుల్లో ‘వైద్యం’ అనే సరుకూ, అమ్మకానికి ఉంటాయి.) దానివల్ల, శ్రామిక ప్రజలకు మేలు జరిగినట్టు కనపడితే, అందులో ఉన్న నిజం, ఆ ప్రజల్ని భ్రమల్లో ముంచి ఉంచడమే! రెడ్డి తర్వాత వచ్చిన నాయుడు, ఆ గొప్ప పథకాలకు ‘తూట్లు పొడిచాడని’  హెచ్చార్కే ఆరోపణ! చంద్ర బాబు నాయుడి సమర్ధకులు చెప్పుకునేది ఏమంటే: “మా పధకాలు గొప్పవి. విస్తృతమైనవి. ఉదాహరణకి, రాజీవ్ గాంధీ ఆరోగ్య శ్రీ పధకం పేరుని, తెలుగు తేజమైన ‘ఎన్టీయార్ వైద్య సేవ’ అని మార్చాము; రెడ్డి గారి ఆరోగ్య శ్రీ లో, 938 జబ్బుల చికిత్సకు వీలుంటే, మేము ఆ జబ్బుల సంఖ్యని 1038కి పెంచాము; అలాగే ఇన్స్యూరెన్స్ మొత్తాన్ని 2 లక్షల నుంచీ రెండున్నర లక్షలకు పెంచాము”వగైరా! కాబట్టి,  గమనించాల్సింది ఏమిటంటే, పధకాల గొప్పతనాలలో తర తమ భేదాలు కాదు చూడవలిసింది. శ్రామిక వర్గ దృక్పదమైన మార్క్సిజం ప్రకారం చూడాల్సింది, పాలక వర్గం లో రెండు ముఠాల నాయకులూ ఒకడిని మించి ఒకడు జనాల్ని మోసగించడానికి వేసిన ఎత్తుగడలే ఈ పథకాలన్నీ– అని. ఆ పథకాలకు కావలిసిన డబ్బంతా ఎక్కడిదో పట్టించుకోకుండా, బూర్జువాల పథకాల్ని మెచ్చుకోవడం ఏ రకం దృక్పధం ? నేను నా మొదటి విమర్శలో చాలా స్పష్టం గా, ఆ మూలం చెప్పాను, ఇలా: ఆ డబ్బంతా ఎక్కడిదిశ్రామిక జనాల నుంచి పెట్టుబడి దారులు దోచిన అదనపు విలువ లోంచిపన్నుల పేరుతో వచ్చిన ఆదాయం కాదూఈ దృష్టిహెచ్చార్కే సమీక్షలో ఎక్కడా కనబడదు.”-అని.  

10) హెచ్చార్కే వాదం:“ఆ పథకాలు, పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ప్రజాధనం దోచి పెడతాయని నాకూ తెలుసు. ఆ విషయం అక్కడే చెప్పాను. అయినావాటి ద్వారా పేదలకు జరుగుతున్న అత్యవసర మేలును మెచ్చుకున్నాను. అది తప్పు కాదు.” 

*నా జవాబు: అది ముమ్మాటికీ తప్పే. ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులకు దోచి పెట్టడానికి గాక; ప్రజలకు మేలు జరగాలంటే ప్రభుత్వ ఆస్పత్రుల్ని గానీ, ప్రభుత్వ కాలేజీల్ని గానీ అభివృద్ధి చేసే పధకాలు చేయకూడదా? వాటి వల్ల ‘అత్యవసర మేలు’ జరగదా? మరి, ఈ పధకాలు కార్పొరేట్లకు ప్రజా ధనం దోచిపెడతాయని తెలిశాక, పేదలకు మేలు జరుగుతుందని ఎలా మెచ్చుకుంటారు? ‘ప్రజల్ని మరింతగా మోసపుచ్చడానికి పన్నిన దొంగ పధకం’ అని దాన్ని స్పష్టం గా ప్రజలు గ్రహించేలా చెప్పడమే అసలు చెయ్యవల్సిన పని.  

11) హెచ్చార్కే వాదం: “కార్పొరేటైజేషన్’ కారణంగానే..  రాజశేఖర రెడ్డి చనిపోకపోయి వుంటే… ఆ పథకాల అమలు ఆయనకు సమస్య అయ్యేదని నేను చెప్పాను.” 

*నా జవాబు: బూర్జువా ముఖ్యమంత్రికి  కార్పొరేటైజేషన్  అంటే వ్యతిరేకత ఉన్నట్టూ; అతడు శ్రామిక ప్రజల ప్రయోజనాల దృష్టితోనే, నిజాయితితో ప్రవేశ పెట్టిన  ప్రజానుకూల పథకాలకు సమస్య అయ్యేదన్న ట్టూ; ఇలాంటి అర్ధాలు చెప్పడం అంటే, ఇదా శ్రామికవర్గ దృక్పధం?  

12) హెచ్చార్కే వాదం: “దానికి పరిష్కార మార్గం, ప్రజా పర్యవేక్షణలో విద్యావైద్య శాలలు సక్రమంగా నడిచేట్టు చేయడమే. ఇది చెప్పడానికే మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్’  అనుసరిస్తున్న తాత్వికతను కోట్ చేశాను.”  

*నా జవాబు: ఇది, ఒక బూర్జువా సంస్కరణవాద స్వచ్చంద సంస్థను పట్టుకుని, దాని ‘తాత్వికత’ ని పొగడడం! బూర్జువా ప్రభుత్వం ఎప్పుడూ చెప్పేది ఏమిటి? ‘ప్రభుత్వం ఒక్కటే అన్ని సమస్యల్నీ పరిష్కరించలేదూ; స్వచ్చంద సంస్థల పాత్ర ఎంతో అవసరం – అనే.  అందుకే గదా స్వచ్చంద సంస్థల వారికి నిధులూ, రాయితీలూ, ‘పద్మశ్రీ’ లూ, వగైరాలు గుప్పించడం ! ప్రభుత్వ-ప్రైవేటు రంగాలు కలిసి కట్టుగా కృషి చెయ్యాలని బూర్జువా పాలకులు చెప్పే దానికీ, అదే రకపు సంస్కరణల్ని మెచ్చుకుంటూ హెచ్చార్కే చెప్పేదానికీ, తేడా ఏమైనా ఉందా? ‘పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్ షిప్’ అనే దొంగ నినాదం ఎప్పుడూ వినలేదా? ఇది నిజానికి, హెచ్చార్కే నా గురించి చెప్పిన ‘ఒట్టి పెటీ బూర్జువా దృక్పధం’ అయినా కాదు. హెచ్చార్కేది, ‘పెటీ’ కాదు, ఒట్టి, కల్తీలేని, స్వచ్ఛమైన ‘బూర్జువా దృక్పథమే’ అవుతుంది.      

13) హెచ్చార్కే వాదం: “ఇంతకీ… శ్రామిక దృక్పథం అంటే ఏమిటిపెట్టుబడి దారీ విధానాన్ని కూలదోసి, శ్రామిక వర్గ ప్రభుత్వం ఏర్పడే వరకు… ఈలోగా ‘బూర్జువా డెమొక్రసీ’ పరిథిలో  ప్రభుత్వాలను ఏమీ డిమాండ్ చేయకుండా ప్రజలు మగ్గిపోవాలని కోరుకోడమాకాదు. ఇంతకన్న వున్నతమైనది ఒకటుందని గుర్తు చేస్తూనేపాలక వర్గాలు ఇంతకు మించి చేయలేవని హెచ్చరిస్తూనే… ‘ఇప్పుడు ఇక్కడ’ వున్న దాన్ని శుభ్రం చేసుకుని వాడుకోవాలనడం తప్పు కాదు. అవసరం.” 

*నా జవాబు: ‘పాలక వర్గాలు ఇంతకు మించి చెయ్యలేవు’ అని ప్రజలకు చెప్పారా? అది ప్రజలకి చెపితే, ఇంకా పాలక వర్గాల మీద ఆధార పడి ప్రజల్ని భ్రమల్లో ముంచే ఆ పథకాల్ని మెచ్చుకోవడం ఎందుకు? ‘పాలక వర్గాలు ఇలాంటి పధకాల ద్వారా శ్రామిక ప్రజల్ని మోసపుచ్చుతార’ ని, వారు గ్రహించేలా ఎప్పుడు చెపుతారు?  మన అదనపు విలువలోనుంచే, పన్నుల పేరుతొ లాగిన దానిలోనుంచే, ప్రైవేట్ పెట్టుబడిదారుల్ని పోషించడానికి, మన మొహాన కొంత బిచ్చమ్ పడేస్తున్నారని ప్రజలకి చెప్పారా? ఈ రకపు ధోరణి ఏమైనా ఉందా ‘యాత్ర’ సమీక్ష లో?   

14) హెచ్చార్కే వాదం: “దోపిడి వ్యతిరేక ప్రజా కదలికలను ప్రోత్సహించడంఅడివి సాయుధ చర్యల కన్నా మైదాన వీధిపోరాటాల వల్ల ఎక్కువ మేలని పదే పదే గుర్తు చేయడం… ఇవాళ అత్యవసరమని అనుకుంటున్నాను.” 

*నా జవాబు: అడివి సాయుధ చర్యల్నీ, మైదాన పోరాటా ల్నీ  ఒక దానితో ఒక దాన్ని, ఏది ఎక్కువో, ఏది తక్కువో, పోటీ పెట్టనక్కరలేదు. రెండూ జరగవలిసినవే. అడవి సాయుధ చర్యలు, అక్కడి ప్రజల ప్రయోజనాల కోసం జరిగేవా కాదా? అడవి సాయుధ చర్యలకూ, మైదాన చర్యలకూ మధ్య సంబంధాలు ఉండాలనీ, మార్క్సిస్టు  సిద్ధాంతావగాహనలతో ఉద్యమాల్ని నడపాలనీ, అనుకోవడం జరగాలి. రాజశేఖర రెడ్డీ, చంద్రబాబు నాయుడూ  వంటి బూర్జువా హంతక పాలకుల పధకాలను మెచ్చుకునే వారి కన్నా; బూర్జువా పధకాలు మోసపూరితమైనవని (వాటి గురించి తగినంత సిద్ధాంతపరమైన వివరణ లేక పోయినా), ఆ పథకాల్ని కొట్టి పారేసే అడివి ఉద్యమకారులే విప్లవకారులు.   

15) హెచ్చార్కే వాదం: “ఇందులో భాగంగానే వయ్యెస్సార్ రెండు పథకాలు ముందుకు తెచ్చిన కొత్త డిమాండ్లను… విద్యావైద్య డిమాండ్లను… సమర్థించాను.” 

*నా జవాబు: అవి కొత్త డిమాండులా? దోపిడీ సమాజంలో, ప్రజలకు విద్యా, వైద్యాలు అందకపోవడం, వాటి కోసం ప్రజలు అడగడం ఎప్పుడూ ఉన్నదే! ఇప్పుడీ పధకాల వల్ల కూడా, ఆ అవసరాలు అందరికీ తీరేదేమీ జరగదు. ఆ పథకాల్ని రాజశేఖర రెడ్డి పార్టీ వాళ్ళు కూడా ఇంతగా మెచ్చుకోరు! “ఈ పథకాలే మనల్ని మరో అయిదు పదేళ్ళు అధికారంలో ఉంచుతాయి, భలే ఆలోచనలే” అనుకుంటారు గానీ, “మనం ప్రజలకు మేలు చేయాలి” అని మాత్రం అనుకోరు. ఏ బూర్జువా పార్టీ వాళ్ళైనా అలాగే అనుకుంటారు. ‘మా సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని గెలిపించాయని’ టీఆర్ఎస్ వాళ్ళు ఇటీవల చెప్పుకున్నారు. ‘మా సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయని’ తెలుగు దేశం పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ‘మమ్మల్ని గెలిపిస్తే తెలుగు దేశం సంక్షేమ కార్యక్రమాల కన్నా మెరుగైన పధకాలు ప్రవేశ పెడతామని’ వయ్యెస్సార్ పార్టీ వాళ్ళు చెప్పుకున్నారు.   

16) హెచ్చార్కే వాదం: “చిట్టచివరగా నక్సలైట్లతో వయ్యెస్సార్ ప్రభుత్వం చర్చల సంగతి. ఆ చర్చలు ప్రభుత్వం వైపు నుంచి అర్థవంతమే. చర్చలలో ప్రభుత్వ ధ్యేయం శాంతి మాత్రమే. ఇది నిజాయితీ వున్న ఏ బూర్జువా ప్రభుత్వానికైనా వుండే ధ్యేయమే.” 

*నా జవాబు: ఇక్కడ ‘శాంతి’ అనేది, కమ్యూనిస్టు తిరగబాట్లు లేని శాంతే! రాజశేఖర రెడ్డి పాలనలో కూడా — చంద్ర బాబు నాయుడూ, వెంగళ రావూ కాలాల లో లాగా– ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినా, హెచ్చార్కేకి అది నిజాయితీ ఉన్న ప్రభుత్వమే! ఈ నిజాయితీ ఏమిటంటే, కమ్యూనిస్టులు లేకుండా, ప్రజల తిరుగుబాట్లు లేకుండా, చేసుకోవాలనే! అదే, బూర్జువా పాలకులకు కావలిసిన ‘శాంతి’.  హెచ్చార్కే ఈ విషయం గ్రహించక పోవడం వల్లనే ‘హెచ్చార్కేకి ఏమైంది?’ అని అడగవలిసి వచ్చింది? .  

17) హెచ్చార్కే వాదం: “నక్సలైట్లను జన జీవన స్రవంతి’ లోనికి తీసుకొచ్చే సదుద్దేశం వయ్యెస్సార్ కు వుండింది. ఇక్కడ జన జీవన స్రవంతి అంటేనేటి వ్యవస్థే. నక్సలైట్లు కోరుకున్న రకం, సోషలిజం కాదు. వాళ్ళకు రాజ్యాధికారం ఇచ్చేసి బూర్జువా వర్గం స్వచ్చంద పదవీ విరమణ చేస్తే తప్ప అది సాధ్యం కాదు. ఆ పని చేయనందుకు వయ్యెస్సార్ కు నిజాయితీ లేదని అనలేను.” 

*నా జవాబు: ‘జనజీవన స్రవంతి’ అనేది నేటి వ్యవస్థే అయితే, ఈ నేటి దోపిడీ వ్యవస్థను వ్యతిరేకించేవారు, తిరగబాటు దార్లు అవరా?  దోపిడీ వర్గం స్వచ్చంద పదవీ విరమణ చేస్తుందా? ఆ విరమణని, దోపిడీ దారులు న్యాయంగా చేస్తారని, మార్క్సిస్టులు చూస్తున్నారా? హెచ్చార్కే   విప్లవ భావాలు ఇలా ఉన్నాయి! మార్క్సిజం చెప్పేది, దోపిడీ దారులు, వారికి వారే దోపిడీ నించి స్వచ్చందంగా విరమించుకుంటారని కాదు. కార్మిక వర్గం, తమ చైతన్యం తో, వర్గ పోరాటాలద్వారా, దోపిడీదారుల అధికారాన్ని తీసివెయ్యాలని. వాళ్ళని కూడా శ్రమలు చేసే వారిగా మార్చాలని, దాని కోసమే శ్రామిక పోరాటాలు ! కానీ, హెచ్చార్కే ప్రకారం, జరగవలిసింది, బూర్జువా స్వచ్చంద విరమణ! మరి బూర్జువాలు అలా చెయ్యకపోతే, అది వాళ్ళు తమ దోపిడీని నిలబెట్టుకోవాలని చూడడమే కాదా? దాన్ని హెచ్చార్కే ‘నిజాయితీ’ అనే అంటారట! దోపిడీని వదలని దృష్టిని, ‘నిజాయితీ’ అని ఎలా అనగలరు?     పైగా, ఎన్కౌంటర్లు చేయించిన పాలకుడికి ‘సదుద్దేశం’ ! ‘నిజాయితీ’! జనజీవన స్రవంతి అంటే, విప్లవకారులు ఎలా భావించాలని హెచ్చార్కే అర్ధం? విప్లవకారులు ఇలా అనుకోవాలని: ‘ఇంతకాలం మేము జనాలలో లేము. బుద్ధిలేక, అడవులలో జంతువులతో బతుకుతున్నాము. అక్కడ మానవులు ఎవరూ లేరు. ఇప్పుడు మాకు ఎంతోకొంత ముష్టి పడేస్తే, అణిగి మణిగి ఉంటాము ‘ అని చెప్పాలని.  ‘జన జీవన స్రవంతి’ అనేది, వేతన బానిసత్వ జీవితాలే. అది  ‘లొంగుబాటు స్రవంతే’. పాలకులే, జనాల నుంచి (జనాల ప్రయోజనాల నుంచి) దూరంగా ఉన్నారు. అడివిలోని విప్లవకారులు ఉన్నది అక్కడి ప్రజలతోనే. కాకపొతే, ఆ ఒక్క సెక్షన్ తోనే. ఆ పరిమితి లోనే . ఆ విప్లవకారుల పంధాపరిమితమే అయినా, వాళ్ళు మోసపూరిత పథకాలతో, అడవి ప్రజలను తప్పుదోవ పట్టించడం లేదు. రాజశేఖర రెడ్డీ, చంద్ర బాబు నాయుడూ, చంద్ర శేఖర రావూ వంటి బూర్జువాలు చేసే మోసాలు, ఆ విప్లవకారులు చేయడం లేదు.            

18) హెచ్చార్కే వాదం: “రంగనాయకమ్మ నాకు పెట్టిన చీవాట్లను ప్రతిధ్వనిస్తూతామూ కొన్ని చీవాట్లు పెడుతూ కొందరు స్నేహితులు రాసిన వ్యాఖ్యలకు కూడా ఈ జవాబులో జవాబులు దొరికాయనుకుంటాను.”

నా జవాబు: హెచ్చార్కే జవాబులో, నాకు, అన్నీ తప్పుడు జవాబులే దొరికాయి. ఇతరులకూ అదే జరిగి ఉండాలి. హెచ్చార్కే జవాబు ఎలా ఉందంటే, రాజశేఖర రెడ్డి వెచ్చని కర స్పర్శని ఆస్వాదించిన విప్లవ రచయిత, ‘క్షమాపణ ముసుగులో దబాయింపు’ చేశాడే, అలా ఉంది.

(హెచ్చార్కె మాట వొచ్చే సంచికలో …. ఎడిటర్) 

రంగనాయకమ్మ

3 comments

 • Fashion కోసమూ passion కోసమూ మార్క్సిస్టులమంటూ విప్లవకారులమంటూ వయసులో ఉండగా విప్లవాలంటూ దూకి – ఎటువంటి ఆచరణ
  అధ్యయనం లేక వేడి దిగిపోగా – వాటికి వ్యతిరేక
  బూర్జువా గాలిలో కలిసిపోయి దుష్ప్రచారం
  చేసేవారెక్కువయిపోయారీమధ్య – వీరికి కలం “పాండిత్యం” ఎక్కువే!! “పండిత భావనలూ ఎక్కువే!!” వీరిలో కొందరు వివిధ విప్లవ పత్రికలకు సారధ్యం వహించడమో, వాటిలో పనిచేయడమో కూడా చేసిన వారుంటారు – వీరు అపుడూ ఇపుడూ కూడా కోడిగుడ్డు మీద ఈకలు లెఖ్ఖపెట్టే రకాలే!! వీరు ఏవిషయాన్నయినా తమ భాషా పాండిత్యాలతో – ఎటుది “ఎటైనా తిప్పి రాయగల సమర్ధులు – వారి భావనల్లో వారు అపుడూ కరెక్టే – ఇపుడూ కరెక్టే (అపుడూ సరైనవారే-ఇపుడూ సరైనవారికిందే లెఖ్ఖేసుకుంటారు- బతకనేర్చినవారు)
  “అపుడేమో ఆవేశమెక్కువ!!
  ఇపుడేమో నిర్వేదమూ
  నిరాశా ఆవకాశవాదమూ
  వ్యతిరేకవాదమూ…అన్నీ
  ఎక్కువే”!!”

  • బూతులు లేకుంఢా అబ్యూజ్‍ వుంటుంది. దానికి చ‍క్కని వుదాహ‍ర‍ణ ఈ వ్యాఖ్య. దీనికి జ‍వాబు రాయ‍డ‍ం లేదు. దీనికి జ‍వాబు ఏముంటుంది మరింత అబ్యూజ్‍ ని నేనూ పోగు చేయ‍డం మిన‍హా. చర్చ దేని మీద‍ జ‍రుగుతున్నదో దాని మీద‍ చెప్పఢానికి ఈ సారు దగ్గర ఏమీ లేదు, నా మీద‍ క‍సి త‍ప్ప. ఇలాంటి డొల్ల మనుషుల‍ వ్రాత‍ల‍తో ‘ర‍స్తా’ స్పేస్‍ క‍రాబు కావ‍డాన్ని ఇక‍ అనుమ‍తించ‍ం.

 • బాపూజీ చెప్పినా చెప్పక పోయినా నేను చెప్పగలను.ఆ అబ్బాయి అమ్మాయి,బహిరంగ ప్రదేశంలో ముద్దు పెట్టుకొనే స్వభావాన్ని (tendency ని )exhibitionism అంటారు.
  అది చాలా మనోహరంగా కనిపించే స్వభావాన్ని (tendency ని)voyeurism అని అంటారు.ఈ స్వభావాలు (tendencies)neurosis కిందకు వస్తాయి తప్ప psychosis కి రావు.ఈ చర్చలోకి psychiatrist ని లాగడం అనవసరం.వాళ్ళిద్దరూ ఆపని వీధిలో చేసినట్లయితే ఆ అమ్మాయి పైన ఏ విధమైన జెండర్ వయొలెన్స్ ఉండదని హెచ్చార్కే చెప్పగలరా.?రంగనాయకమ్మ గారి అభిప్రాయంలో ఆ పిల్లగురించిన concern
  స్పష్టంగా కనిపిస్తోంది.నాదీ అదే ఉద్దేశం అని హెచ్చార్కే చెప్పగలరా?

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.