తండ్రుల జాడకై పిల్లల అన్వేషణ: కాశ్మీర్

కాశ్మీరీ సామాన్యుడి జీవితాన్ని కన్నెత్తైనా చూడకుండా, కాశ్మీర్‌ సమస్యపై జాతీయ అవార్డు స్థాయి సినిమా ఎలా తీయవచ్చో నిరూపించాడొక దర్శకరత్నం. అందులో అగ్నిగుండం లాంటి సమస్యను ‘రోజా’ పువ్వంత సుకుమారంగా హ్యాండిల్‌ చేశాడు. సినిమాలోని ఆ రోజాకు టీ ఆఫర్‌ చేసే పోలిసధికారులుంటారు, ఎల్ల వేళల్లోనూ సహకరించే ఆర్మీ మేజర్లుంటారు. పౌరురాలి విన్నపాన్ని సానుకూలంగా వినే మంత్రుంటారు. అంతా సవ్యంగానే వుంటుంది. టెర్రరిస్ట్‌ బెడద తప్ప! చివరకు తనకూ మనసుందని రుజువు చేసుకుంటాడు ఒక ‘ముస్లిం’ టెర్రరిస్ట్‌!

గతంలో ‘కాశ్మీర్‌ కీ కలీ’, ‘ఆర్జూ’ వంటి హిందీ సినిమాలన్నీ కాశ్మీర్‌ అందాల్ని జుర్రుకున్నాయి తప్ప అక్కడ జనాలుంటారనీ, వారి జీవితాలకు సుఖదు:ఖాలుంటాయనీ పట్టించుకోలేదు. అప్పట్లో డిఫరెంట్‌గా వచ్చిన సినిమా కూడా, ఇండియన్‌ ఆర్మీ కోసం క్రిప్టాలజిస్ట్‌గా పనిచేస్తున్న కుర్రాడి ప్రేమ కథనే చెప్పుకొచ్చింది. ‘యహా’ లాంటి సినిమా నుండి మొన్నటి ‘నోట్‌ బుక్‌’ వరకూ ఈ తరహా సినిమాల్లో ఈ ట్రెండే కనిపించింది. మరోవైపు ఇంకొంత అసభ్యంగా ఇండియన్‌ మీడియాలానే కాశ్మీర్‌నూ, కాశ్మీర్‌ ప్రజలనూ స్టీరియోటైపుగానూ, అంతకంటే మరింత భయంకరంగానూ చూపే బాలీవుడ్‌ సినిమాలు వచ్చాయి. కాశ్మీరీలంటే ఆర్మీపై రాళ్ళు రువ్వేవాళ్ళు లేదా టెర్రరిస్ట్‌లు లేదా వారికి మద్దతు ఇచ్చేవారు అన్న కథనాలే ప్రధానంగా నడిచాయి ఈ సినిమాల్లో. ‘దూద్‌ మాంగోగే తో ఖీర్‌ దేంగే, కాశ్మీర్‌ మాంగోగే తో చీర్‌ దేంగే’ (పాలు అడిగితే పాయసమిస్తాం, కాశ్మీర్‌ అడిగావో, చీరేస్తాం) తరహా పతాకస్థాయి అసభ్యకర డైలాగుల్లో ఇండియా-పాకిస్తాన్‌ తగాదా కనిపిస్తుంది తప్ప కాశ్మీరోడి పట్టింపు వుండదు. కాశ్మీరు మనదైతే కాశ్మీరీలు కూడా మనవాళ్లన్న స్పృహ మనకుండాలి. కానీ, అందుకు భిన్నంగా సాధారణ కాశ్మీరీల పట్ల భారతీయుల వైఖరి ఎలా వుందో పుల్వామా తదనంతర కాలంలో కాశ్మీరీ విద్యార్థులపై జరిగిన దాడులే స్పష్టం చేశాయి. ఈ వైఖరి వారికీ, మనకీ మధ్య అగాధాల్ని పెంచుతోంది. ఈ దశలో కాశ్మీరును మానవీయ కోణంలో చూపే చిన్న బడ్జెట్‌ సినిమాలు కొన్ని వచ్చాయి ఇటీవలి కాలంలో.

  1. విడో ఆఫ్‌ సైలెన్స్‌ (2018): కాశ్మీరులో మిలటరీ అర్ధరాత్రి పూట ఎత్తుకుపోగా శాశ్వతంగా ‘మిస్సింగ్‌’ లిస్టులోకి చేరిపోయే అమాయకులెందరో! తమ భర్త జాడ తెలీక ఏళ్ల తరబడి గవర్నమెంటు ఆఫీసుల చుట్టూ తిరిగే వారిని ‘హాఫ్‌ విడో’లంటారు. 11 ఏళ్ళ పాపతో, అనారోగ్యంతో బాధపడే అత్తతో బ్రతుకీడ్చుతూ వారానికోరోజు రిజిస్టరాఫీసు చుట్టూ తిరిగే ఒక హాఫ్‌ విడో కథ ఈ సినిమా. కనీసం భర్త డెత్‌ సర్టిఫికేట్‌ అయినా ఇప్పించండని ప్రాధేయపడుతుంది. హోటల్లో ఒక రాత్రి తనతో గడిపితే సర్టిఫికేట్‌ ఇస్తానంటాడు రిజిస్టరాఫీసరు. నిరాకరించిన ఆమెపై కక్ష సాధిస్తాడు. బ్యాంకుకు వెళితే ఆమె చనిపోయినట్టు ధృవీకరించే పత్రాలు రిజిస్టరాఫీసు నుండి అందాయనీ, బతికున్నట్టు లైఫ్‌ సర్టిఫికేట్‌ జమకడితేనే డబ్బు విత్‌డ్రా సాధ్యమనీ బ్యాంకు వాళ్ళు చెబుతారు. బతికున్నా ఇక చచ్చినట్టే! ‘నన్ను కాదన్నావ్‌, ఇక బతికినన్నాళ్ళూ లైఫ్‌ సర్టిఫికేట్‌ కోసం తిరుగు’ అని సవాలు చేస్తాడు ఆ ఆఫీసురు. చివరికి ఆమె లొంగుతుంది. చెప్పిన హోటలుకి వెళుతుంది. హోటల్‌ గదిలో ఆ అధికారిని హత్య చేస్తుంది. ఇప్పుడు చట్టం ముందు చిక్కు ప్రశ్న. ఆల్రెడీ చనిపోయిన వ్యక్తి వేరొకర్ని చంపగలదా? కాశ్మీరులో వందల కొలది అనామక శవాలను పాతిపెట్టిన స్థలాలు బయటపడ్డాయనీ, అమాయకుల్ని చంపి టెర్రరిస్టులను చంపామని లెక్కచూపితే ప్రమోషన్లు రావడం వలన ఇటువంటి ‘మిస్సింగు’ ఉదంతాలు ఎక్కువయ్యాయనీ, తను టూరిస్టుగా వెళ్లి సీక్రెట్‌గా సినిమా తీశాననీ దర్శకుడు ప్రవీణ్‌ మొర్చాలే కోల్కతా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌ స్క్రీనింగ్‌ అనంతరం ఈ సమీక్షకుడికి ఇష్టాగోష్టిలో చెప్పాడు. ఈ సినిమా ఈ చిత్రోత్సవంలో భారతీయ భాషల విభాగంలో ఉత్తమ సినిమా అవార్డు గెల్చుకుంది.
  2. హమీద్‌ (2019): ఎనిమిదేళ్ళ హమీద్‌ తల్లి ఇష్రత్‌ మరో హాఫ్‌ విడో. నాన్న ఎక్కడ అనడిగిన పిల్లాడికి ‘దేవుడి దగ్గరకు వెళ్ళాడు’ అని చెప్పి సమాధానపరుస్తుంది. దేవుడి ఫోన్‌ నెంబర్‌ ఏమిటని ఒక మతగురువును అడుగుతాడు హమీద్‌. ‘786’ అని బదులిస్తాడు మతగురువు. ఆ నెంబరుకు చాలాసార్లు ఫోన్‌ కలుపుతాడు. ఓ రోజు అవతలి ఫోన్‌ రింగవుతుంది. ‘హలో’ చెబుతాడు అభయ్‌ అనే ఒక సీఆర్‌పీఎఫ్‌ జవాను. కాశ్మీర్‌ను మిగతా భారతదేశపు దృష్టితో చూస్తున్నవాడే అభయ్‌ కూడా. ‘ఆజాదీ’ అన్న ప్రతి నినాదమూ పాకిస్తాన్‌ ప్రేరిత ఉగ్రవాదమేనని నమ్మి భారత సైన్యం తరుపున యుద్ధం చేస్తున్నాడతడు. సెలవు కూడా మంజూరు కాని స్థితిలో సొంతింటికి వేల మైళ్ళ దూరంలో వున్నాడు.

‘మీరు అల్లానా?’- హమీద్‌.

‘అల్లాకు ఫోన్‌ చేశావుగా? అయితే అల్లానే! చెప్పు’ – అభయ్‌.

‘మా నాన్న మీ దగ్గర ఉన్నాడుగా?’  – హమీద్‌.

కాశ్మీర్‌ మొత్తం తనను అమాయకంగా ప్రశ్నించినట్టనిపిస్తుంది అభయ్‌కి. ఒకరంటే మరొకరికి అంతుపట్టని రెండు వేర్వేరు ప్రపంచాలు సంభాషించుకుంటాయి. కాశ్మీరుకూ, మిగతా భారతానికీ మధ్య ఏనాడో జరగాల్సిన ఈ సంవాదాన్ని దర్శకుడు ఐజాజ్‌ ఖాన్‌ ఇరాన్‌ సినిమా మాదిరిగా, చిన్నపిల్లల దృక్కోణంలో ప్రారంభిస్తాడు.

అసలు మాజిద్‌ మజిది వంటి ఇరాన్‌ దర్శకులు చిన్న పిల్లల కథల ద్వారానే పెద్ద వారికీ, దేశాధినేతలకూ సందేశం ఇవ్వాలని ఎందుకనుకుంటారు? దీని వెనుక కథ వుంది. 1979 లో ఇరానియన్‌ విప్లవం జరిగింది. షా మొహమ్మద్‌ ఓడిపోయాడు. ఆయతుల్లా ఖుమేనీ అనే సనాతనవాది రాజ్యాధికారంలోకి వచ్చాడు. అతడికి సినిమాలంటే ఇష్టమున్నా సినిమాల కోసం చాలా కట్టుదిట్టమైన సెన్సార్‌ నియమాలు ప్రవేశపెట్టాడు. అంచేత ప్రగతిశీల ఇరాన్‌ దర్శకులు మార్గాంతరం యోచించి, చిన్న పిల్లల ఇతివృత్తాలతో ఇరాన్‌ సమాజాన్నీ, రాజకీయాల్నీ పరోక్షంగా విమర్శిస్తున్నారు. (ప్రత్యక్షంగా విమర్శించే జాఫర్‌ పనాహీ లాంటి వాళ్ళు అంక్షలూ, నిర్బంధాలూ ఎదుర్కొంటున్నారు.) మనదేశంలో కాశ్మీరును కొంత వాస్తవంగా చూపానుకునే దర్శకుల సంగతీ అలానే వుంది. ఉదాహరణకి అశ్విన్‌ కుమార్‌ అనే దర్శకున్నే తీసుకుందాం. కాశ్మీరును నిశితంగా పరిశోధిస్తూ గతంలో రెండు డాక్యుమెంటరీలు తీశాడు. ఒకటోది ‘ఇంషాల్లా ఫుట్బాల్‌’ (2010), రెండోది ‘ఇంషాల్లా కాశ్మీర్‌’ (2012). చాలా రిస్కుతో కాశ్మీర్‌ ఫుట్బాల్‌ను చిత్రిస్తున్న వ్యక్తిలా సాధారణ కాశ్మీరీలతో, గ్రామీణులతో, రాజకీయవేత్తలతో, హాఫ్‌ విడోలతో, లోయను విడిచివచ్చిన, విడిచిరాని కాశ్మీరీ పండిట్లతో, చిత్రకారులతో, టెర్రరిస్ట్‌లతో, సరెండర్‌ అయ్యాక ఇన్ఫార్మర్లుగా మార్చబడ్డ వారితో, డబల్‌ ఏజెంట్లతో మాట్లాడి వారి ఇంటర్వ్యూలతో ఈ సినిమాలు తయారుచేశాడు. సెన్సార్‌ ఈ రెండింటినీ మొదట్లో అడ్డుకుంది. విడుదలైన తర్వాత అదే భారత ప్రభుత్వం జాతీయ అవార్డులు ప్రకటించింది. ఈయన తీసిన మరో సినిమా ‘లిటిల్‌ టెర్రరిస్ట్‌’ (2004) ఆస్కార్‌కి నామినేట్‌ అయింది. కాశ్మీర్‌ నేపథ్యంలో అశ్విన్‌ కుమార్‌ తీసిన తాజా సినిమా ‘నో ఫాదర్స్‌ ఇన్‌ కాశ్మీర్‌’.

  1. నో ఫాదర్స్‌ ఇన్‌ కాశ్మీర్‌ (2019): ‘నో ఫాదర్స్‌ ఇన్‌ కాశ్మీర్‌’ కోసం కూడా సెన్సార్‌తో పది నెలల యుద్ధం చేయాల్సి వచ్చింది దర్శకుడికి. చాలా నరికివేతల తర్వాత, సంభాషణల తొలగింపు తర్వాత సినిమాను విడుద చేశారు. ఇలాంటి సినిమాలకు హాళ్ళు కేటాయించరు. ఒకటి రెండు హాళ్ళిచ్చినా అసదుపాయకరమైన టైమింగులు పెట్టి సినిమాను ఎవరూ చూడకుండా అడ్డుపడతారు. ఈ సినిమా ఇంగ్లీష్‌-హిందీ-ఉర్దూ భాషల్లో సాగుతుంది.

కాశ్మీర్లో పుట్టి, బ్రిటన్లో ఉంటున్న పదహారేళ్ళ ముస్లిం యువతి నూర్‌ (జారా వెబ్బ్‌). తను కాశ్మీర్‌ వెళుతున్నట్టు తన లండన్‌ మిత్రుడికి చెబుతుంది. ‘అయితే అక్కడొక టెర్రరిస్ట్‌తో కూల్‌గా సెల్ఫీ తీసుకుంటే భలేగా వుంటుంది. ట్రై చెయ్‌. కాశ్మీర్‌ నిండా టెర్రరిస్ట్‌లు వుంటారు. అల్కైదా, తాలిబాన్‌, ఐసిస్‌ ఎవరైనా దొరుకుతారు.’ – ఆ ఫ్రెండ్‌ నూర్‌కు ఉసిగొల్పుతాడు. నూర్‌ తల్లి  జైనాబ్‌ (నటాషా మాగో). లండన్‌లో చదువుకున్న ఆమె భర్త కాశ్మీర్లో మిలటరీ ద్వారా ‘మిస్సింగ్‌’ కాబడ్డాడు. లండన్‌లో ప్రస్తుతం ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ అధికారిగా పనిచేస్తున్న వాహిద్‌ మీర్జా (సుశీల్‌ దహియా)తో తిరిగి పెళ్లి చేసుకోవాలంటే తన భర్తకు సంబంధించిన కేసు క్లోజ్‌ చెయ్యాలి. అతడు చనిపోయినట్టు చూపే పత్రాల్లో అత్తమామల సంతకాలు కావాలి. అందుకని కూతురు నూర్‌, వాహిద్‌లతో బయల్దేరి కాశ్మీర్లో ఇండియా పాకిస్తాన్‌ బోర్డర్‌కి దగ్గర్లోని అత్తగారింటికి వస్తుంది.

సదా సరదాగా వుండే తన ఈడువాడైన మాజిద్‌ (శివం రైనా) అనే లోకల్‌ కుర్రాడు నూర్‌కి పరిచయమౌతాడు. టెర్రరిస్ట్‌తో సెల్ఫీ అన్న కోరికను అతడే తీరుస్తాడు. ముఖానికి ముసుగు వేసుకుని, పక్కనున్న సెక్యూరిటీ గార్డ్‌ తుపాకీతో ఫోజిస్తాడు. టెర్రరిస్ట్‌కీ, మిలిటెంట్‌కీ తేడా ఏమిటో కూడా చెబుతాడు ఆమెకి. ‘మిలిటెంట్‌ అంటే ఆజాదీ కోసం పోరాడుతున్నవాడు, టెర్రరిస్ట్‌ అంటే నేరస్తుడు!’ నాన్న తన చిన్నప్పుడు తమని విడిచి ఎక్కడికో వెళిపోయాడని మాత్రమే తెలుసు నూర్‌కి. కానీ అసలు విషయం ఇక్కడికొచ్చాక తెలుస్తుంది. మాజిద్‌ తండ్రీ, తన తండ్రీ ఒకప్పుడు మంచి స్నేహితులనీ, వారిద్దర్నీ మిలటరీ అపహరించిందనీ, ఆ తర్వాత వారెన్నటికీ తిరిగిరాలేదనీ చెబుతుంది మాజిద్‌ తల్లి పర్వీనా (మాయా సరావ్‌).  ఇక తండ్రి వివరాల కోసం ఆరాటపడుతుంది నూర్‌.

నాన్నకు సంబంధించిన ఒక్క ఫోటో అయినా చూపమని తాతయ్య అబ్దుల్‌ రషీద్‌ (కుల్భూషన్ ఖర్బండా), నాన్నమ్మ హలీమా (సోనీ రజ్దాన్‌)లను  ప్రాధేయపడుతుంది. తమ బిడ్డ ఫోటోలను తమ చేతులతోనే నాశనం చేశామని చెబుతారు ఆ అసహాయ వృద్ధులు. మిలిటరీ వారి అదనపు వేధింపుల నుండి కాపాడుకోవాంటే జ్ఞాపకాల్ని చెరిపేసుకోవాలి. ఇదీ కాశ్మీరీల  వ్యధ. జ్ఞాపకాల నుండి విముక్తం కావాలనే తన తల్లి కూడా వచ్చిందిక్కడికి. కానీ నూర్‌ మాత్రం తండ్రి జ్ఞాపకాల గుర్తులు వెతకాలని కంకణం కట్టుకుంటుంది. ఆమెకు తనలాంటి బాధితుడు మాజిద్‌ తోడుగా దొరికాడు. నూర్‌, మాజిద్ల మధ్య కౌమారపు తొలిప్రేమ చిగురిస్తుంది. తమ తండ్రులిద్దర్నీ మిలటరీ వారు చంపేసి పాకిస్తాన్‌ బోర్డర్‌కు దగ్గరలోని అనామక శ్మశానంలో పాతేశారని మాజిద్‌ పినతండ్రి అర్శిద్‌ లోనె (దర్శకుడు అశ్విన్‌ కుమార్‌) చెబుతాడు. చిత్రహింసలకు తట్టుకోలేక తనే వారి తండ్రుల వివరాలను ఆర్మీకి అందించాననీ అంగీకరిస్తాడు.

ఇండో-పాక్‌ బార్డర్‌కు సమీపాన తమ తండ్రుల శవాలను పాతిపెట్టిన చోటును వెతికేందుకు ఒక రాత్రి పూట బయలుదేరుతారు నూర్‌, మాజిద్‌లు. సీక్రెట్‌ ఇంటరాగేషన్‌ స్థలాలు, అనామక శవాల శ్మశానాలు – ఇలా కాశ్మీరు గుండెల్లో దాగిన రహస్యాలెన్నో నూర్‌ తన మొబైల్‌లో బంధిస్తుంది. చివరికి వారిద్దరూ గస్తీ సైనికులకు దొరికిపోతారు. బ్రిటిష్‌ నేపథ్యం, కాబోయే సవతి తండ్రి పలుకుబడి కారణంగా నూర్‌ సులువుగా విడుదలవుతుంది. కానీ మాజిద్‌ చిక్కుకుంటాడు. అతడ్ని విడుదల చేయించందే అక్కడ్నించి కదలనంటుంది నూర్‌. ఆర్మీ రహస్యాల మొబైలును అప్పగిస్తేనే మాజిద్‌కి విముక్తి అని షరతు విధిస్తాడు మేజర్‌ మనోజ్‌ పాండే (అంశుమాన్‌ ఝా). ఆమె అందించిన మొబైలు సరికొత్త చిక్కు తెస్తుంది. ఆకతాయిగా తీసిన టెర్రరిస్ట్‌ సెల్ఫీ మాజిద్‌కి మెడతాడుగా మారుతుంది. చివరికి అర్శిద్‌ ప్రయత్నంతో మాజిద్‌ విడుదలౌతాడు.

దర్శకుడు అశ్విన్ కుమార్

ఇది ఫీచర్‌ ఫిల్మ్‌ కాబట్టి కాశ్మీర్‌ సమస్యలోని ఎన్నో కోణాలను పైపైనే తడిమాడు దర్శకుడు. నూర్‌ తండ్రి, మాజిద్‌ తండ్రి లౌకిక, ప్రజాతంత్ర కాశ్మీర్‌ వాదులకు ప్రతీకలు. అర్శిద్‌ ఇస్లామిక్‌ సనాతన వాదానికి ప్రతినిధి. ఇతడు ఒక వైపు ఇస్లామిక్‌ దళం కోసం పనిచేస్తూ, మరోవైపు ఆర్మీ ఇన్ఫార్మర్‌గా డబల్‌ ఏజెంట్‌గా వ్యవహరిస్తుంటాడు. తన ఆశ్రయంలో వున్న గాయపడిన టెర్రరిస్ట్‌ను అప్పజెప్పి, మాజిద్‌ విడుదలను సాధిస్తాడు. మిలటరీ వారు ఆ టెర్రరిస్ట్‌ను ఎన్కౌంటర్లో చనిపోయినట్టు చూపి, పనిలో పనిగా మానవత్వంతో వ్యవహరించిన పంజాబీ సైనికుడ్ని ఎదురుకాల్పుల బలిపశువుగా చూపిస్తారు. మీడియా వారు ‘అపహరించబడ్డ తండ్రుల’ కోసం జరుగుతున్న జనాందోళనను ఏ మాత్రం పట్టించుకోకుండా, చనిపోయిన సైనికుడి మొహంపై కెమెరాలు ఫోకస్‌ చేస్తూ తమ స్వభావాన్ని నగ్నంగా ప్రదర్శిస్తారు.

‘నాకొక స్పష్టమైన యుద్ధం కావాలి. శత్రువెవరో కనిపించాలి. ఇక్కడ ప్రతి గ్రామస్తుడూ శత్రువులానూ, దేశపౌరుడిగానూ కన్పిస్తున్నాడు. ఎవరితో యుద్ధం చేయాలి, ఎవర్ని కాపాడాలి?’ – అని ఒక సైనికుడు చెప్పే డైలాగు కాశ్మీర్లోని సైనికుల అసహాయతకు అద్దం పడుతుంది. ఈ దర్శకుడి మరో డాక్యుమెంటరీలో కూడా ‘రెస్పెక్ట్‌ ఎవ్రీబడీ – సస్పెక్ట్‌ ఎవ్రీబడీ’ (అందర్నీ గౌరవించు, కానీ అందర్నీ సందేహించు) అన్న రాత ఒక సైనిక స్థావరంపై కనిపిస్తుంది. ఈ సినిమాలో హీరోలు, విలన్లు అంటూ ఎవరూ వుండరు. అందరూ నేటి కాశ్మీర్ పరిస్థితుల్లో అసహాయులుగా మారిన పాత్రలే. సినిమాలో జీన్‌ మెర్క్‌ సెల్వా కెమెరా పనితనం గురించి ప్రశంసించాలి. జ్ఞాపకాలు – జ్ఞాపకాల నిర్మూలన అన్న అంశాలు కథలో, పాత్ర జీవితాల్లో అంతర్లీనంగా వుంటాయి. లండన్‌లో బయల్దేరినప్పటి నుండీ నూర్‌ ప్రతి సందర్భాన్నీ తన మొబైల్‌లో ఫోటోలు తీస్తూవుంటుంది. ఆమె ఫోటో తీసే ప్రతిసారీ సినిమా ఫ్రేము మొబైల్ స్క్రీన్‌ రేషియోకి మారిపోతూ వుంటుంది. జ్ఞాపకాలు భద్రపరుచుకున్న మొబైల్‌ మిలటరీ బూట్ల కింద పచ్చడయ్యే దృశ్యం ఇటీవలి కాలంలో అత్యుత్తమ ఎడిటింగ్‌కి మచ్చుతునక అన్పిస్తుంది.

ఒక మొత్తం జనసముదాయానికి సంబంధించిన సమస్యను దీర్ఘకాలంగా అలక్ష్యం చేయడం వల్ల, కాశ్మీరీల ప్రజాస్వామ్య ప్రయత్నాలన్నిటినీ ఇరు దేశాలూ కాలరాయడం వల్ల రోజురోజుకీ జటిలంగా మారుతోంది కాశ్మీరు సమస్య. పాక్-ఇండియా పొట్లగిత్తల నడుమ నలుగుతున్న లేగదూడలా కాశ్మీరు విలవిల్లాడుతోంది. చిత్తశుద్ధి గల సినిమాలవాళ్ళు కాశ్మీరీల బాధల్ని సానుభూతితో గుర్తిస్తున్నామని సంకేతం ఇచ్చినా, అవతలి వారికి ఎంతో ఊరట కలిగి సమస్య సమాధానం దిశగా ఒక ముందడుగు వేసే పరిస్థితి ఏర్పడుతుంది.

[ఆసక్తి వున్నవారి కోసం కాశ్మీర్ పై మరో రెండు మంచి డాక్యుమెంటరీలు – జశ్నే ఆజాదీ (2007; సంజయ్ కాక్); ఖూన్ దియ్ బరవ్ (2015; ఇఫ్ఫత్ ఫాతిమా). విశాల్ భరద్వాజ్ ‘హైదర్’ (2014) కథాచిత్రం కూడా చూడొచ్చు. కాకపొతే ఇది కాశ్మీర్ నేపథ్యంలో షేక్స్‌పియర్‌ ‘హేమ్లెట్’ అనుకరణ.]

 

బాలాజి (కోల్ కతా)

ఐకా బాలాజీ: చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్థాపక సంపాదకులు. సాహిత్యం సినిమా విమర్శలు రాస్తుంటారు. ‘ముందడుగు' తరుఫున టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, సినిమా పాఠాలు, లఘు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతి శీల విమర్శకులు. ప్రస్తుతం కోల్ కతాలో నివసిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సింగిల్ విండో ఆపరేటర్ గా పని చేస్తున్నారు.
మొబైల్: 9007755403

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.