ప్రాచీనుల సాహిత్య శాస్త్ర సామగ్రి

అలంకారశాస్త్రాలలో విషయవిస్తృతి, విశ్లేషణ ఎలా ఉంటుందో చూడడానికి ఒకటి రెండుదాహరణలు చాలు.

కావ్యంలో ఇతివృత్తం ప్రఖ్యాతం, ఉత్పాద్యం, మిశ్రం అని మూడు రకాలు. ప్రఖ్యాతం అంటే పురాణేతిహాసాలలో ప్రసిద్ధమై ఉన్న కథ. ఉత్పాద్యం అంటే పూర్తిగా కల్పితం. మిశ్రం అంటే ప్రఖ్యాతమైన ఇతివృత్తానికి కల్పన జోడించడం. ఇతివృత్తం ఇప్పుడైనా ఇటువంటి విభాగానికి లొంగుతుంది. అనంతర చారిత్రక పురుషేతి వృత్తాన్ని కూడా ప్రఖ్యాత, మిశ్రాలలో చేర్చవచ్చు. ప్రాచీన సాహిత్యంలో కేవల కల్పిత ఇతివృత్తానికి అంత గౌరవం లేదు. నేటి సాహిత్యంలో కల్పితేతివృత్తానికి కూడా ప్రాధాన్యం ఉంది, అంతే తేడా.

కావ్యనాయకుడు సమాజంలోని అన్యులకు ఆదర్శంగా ఉండాలనేది ఆశయం. అందువల్ల కూడా ప్రఖ్యాత ఇతివృత్తానికి ప్రాధాన్యం కలుగుతుంది. ఈ కారణం చేతనే కావ్యనాయకుడి లక్షణాలు నిరూపితమయ్యాయి. కావ్యకథ నాయకుణ్ణే ఆశ్రయించుకొని ఉంటుంది. కావ్యఫలాన్ని అనుభవించేవాడు నాయకుడు.

అందుకే నాయకుడు దాత, కులీనుడు, శ్రీమంతుడు, రూపయౌవనోత్సాహ సంపన్నుడు, దక్షుడు, లోకంచే ప్రేమింపబడేవాడు, తేజస్సు, వైదగ్ధ్యం, శీలం కలవాడు అయి ఉండాలి. ఇవి నాయకుడి సామాన్య లక్షణాలు.

ఈ నాయకుడు ధీరోదాత్తుడు, ధీరోద్ధతుడు, ధీరలలితుడు, ధీరశాంతుడు అని నాలుగు రకాలు.

ధీరోదాత్తుడు తననుతాను పొగడుకొనే లక్షణం లేనివాడు, క్షమాగుణం కలిగినవాడు, అతి గంభీరుడు, మహాశక్తిమంతుడు, శోకసంతోషాల వల్ల చెదరనివాడు, అతని గర్వాన్ని వినయం ఆవరించి ఉంటుంది, దృఢవ్రతుడు, ఆడితప్పనివాడు.

ధీరోద్ధతుడు మాయలాడు, ప్రచండుడు, చంచలుడు, అహంకారమూ దర్పమూ కలవాడు, తనను తాను పొగడుకొనేవాడు.

ధీరలలితుడు నిశ్చింతాపరుడు, మృదువైనవాడు, కళలపై అభిరుచి కలవాడు.

ధీరశాంతుడు నాయకసామాన్యలక్షణాలచే గొప్పవాడు, ద్విజాదికుడు.

ఈ నలుగురు నాయకులలో శృంగార రసపరంగా అనుకూలుడు, దక్షిణుడు, ధృష్టుడు, శఠుడు అని నాలుగు రకాలు. అంటే 4×4 = 16 రకాలు.

ఏకనాయిక యందే అనురక్తి కలవాడు అనుకూలుడు.

బహునాయికల యందు సమానమైన అనురక్తి కలవాడు దక్షిణుడు.

తప్పుచేసి కూడా భయపడనివాడు, అదలింపబడి కూడా సిగ్గు పడనివాడు, తన తప్పు చూడబడి కూడా అసత్యమాడేవాడు ధృష్టుడు.

ఇద్దరు నాయికలతో ప్రేమ నటిస్తూ ఒకరికే అనుబద్ధుడై మరొకరికి అప్రియం చేసేవాడు శఠుడు.

వీళ్లు మళ్లీ ఉత్తమ, మధ్యమ, అధములని మూడు విధాలు. అంటే 4×4×3 = 48 రకాలయ్యారు.

సాధారణంగా కావ్యాలు శృంగారరస ప్రధానమైనవి కాబట్టి శృంగారరసపరమైన వివరణలే అధికం. అన్ని రసాల విషయంలోనూ ఇటువంటి భేదప్రభేదాలుంటాయి.

ఇక నాయిక విషయానికి వస్తే స్వీయ, అన్య, సామాన్య అని మూడు రకాలు. నాయికకు నాయకుడిలాగానే సామాన్య లక్షణాలన్నీ ఉంటాయి. వినయం, ఋజువర్తన, పాతివ్రత్యం, ఇంటిపనులలో ఆసక్తి స్వీయ లక్షణాలు. స్వీయ ముగ్ధ, మధ్య, ప్రగల్భ అని మూడు విధాలు. ఈ మధ్యాప్రగల్భలు ధీర, అధీర, ధీరాధీర అని మూడు రకాలు. అంటే ముగ్ధ+మధ్య మూడు రకాలు +ప్రగల్భ మూడు రకాలు. ఈ మధ్యా ప్రగల్భాలు మళ్లీ కనిష్ఠ, జ్యేష్ఠ అని రెండు రకాలు. అంటే స్వీయనాయిక మొత్తం 13 రకాలు. అన్య పరకీయ, కన్య అని రెండు రకాలు. సామాన్య ఒక్కతె. మొత్తం 16 రకాల నాయికలు. శృంగార రస ప్రధానంగా ఈ నాయికలలో 8 అవస్థా భేదాలున్నాయి.

స్వాధీనపతిక, ఖండిత, అభిసారిక, కలహాంతరిత, విప్రలబ్ధ, ప్రోషిత భర్తృక, విరహోత్కంఠిత. ఈ అష్టవిధ శృంగారనాయికల భావన ఎందరో కవులను ఆకర్షించి ప్రత్యేక కావ్య ఖండికలకు ప్రోత్సాహమిచ్చింది.

మళ్లీ జాతిని బట్టి నాయికలు హస్తిని, చిత్తిని మొదలైన విధంగా వర్గీకరింపబడతారు.

ఇప్పటికి మనం చూసింది రెండు పాత్రలు మాత్రమే. కావ్యనాయకుడు, నాయిక. వీళ్లకు సహాయకులు, దూతలు, దూతికలు, ప్రతినాయకుడు ఇలా ఇంకెన్నో పాత్రలుంటాయి. వీళ్లందరి గుణగణాలు, చేష్టలు, హావభావాలు అన్నీ అలంకారశాస్త్రాలలో నిర్వచించినవే.

ఇదంతా ఎందుకంటే ఒక కావ్యంలో నాయకుడు ఎవరు అంటే, అతని గుణగణాలేమిటి అంటే, అతను అడుగడుగునా చేసిన చేష్టలేమిటంటే వాటి ఔచిత్యానౌచిత్యాలేమిటంటే చెప్పడానికి కావలసిన సామగ్రి సిద్ధంగా ఉన్నదనడానికి. ఆ పాత్ర ప్రతిచర్యను, ప్రతి సంభాషణను విశ్లేషించే సామగ్రి ఉన్నదనడానికి.

ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది ప్రధానంగా శృంగారరస సంబంధి. తక్కిన అన్నిరసాల విషయంలోనూ ఈ సామగ్రి ఉంటుంది.

కవి వర్ణనలు, కవి ఉపమానాలు, కవి సమయాలు అన్నిటికీ సంబంధించిన విశ్లేషణ సామగ్రి ఉంటుంది.

కావ్యరచన ప్రారంభమైన తర్వాత ఆ కావ్యాలలోని సామాన్య లక్షణాలు ఆధారంగా లక్షణశాస్త్ర రచన జరుగుతుంది. బహుశా సుదీర్ఘ సాహిత్యచరిత్రలో లక్ష్యాన్ని బట్టి లక్షణమూ, మళ్లీ ఆ లక్షణాన్ని బట్టి లక్ష్యమూ ఏర్పడుతూ పోయింది. లక్ష్యంలో నవ్యలక్షణం చోటు చేసుకున్నప్పుడు, దాన్ని లోకం అంగీకరించినప్పుడు అది లక్షణమై పోయింది.

అలంకారశాస్త్రాన్ని ప్రమాణంగా తీసికొని కావ్యాల గుణాగుణాలను చర్చించవచ్చు. అయితే అలంకార శాస్త్ర ప్రమాణాలకు మరీ దూరంగా జరిగిన ప్రాచీనకావ్యాలు అరుదు కాబట్టి మన విమర్శలు ప్రధానంగా వ్యాఖ్యానరూపంగా వెలువడ్డాయి.

నిజానికి ఈ అలంకారశాస్త్ర సామగ్రినంతా చూస్తే అటు సిద్ధాంతపరంగానూ, ఇటు అన్వయపరంగానూ కూడా మనకు ఆశ్చర్యం కలుగుతుంది.

కాలంమారి సాహిత్య స్వభావం మారినప్పుడు ఇదంతా ఎంతవరకు ఉపయోగపడుతుందంటే దాన్ని గురించి ఆలోచించవలసే వస్తుంది.

మనకు విపులమైన ప్రాచీన సాహిత్యం ఉంది కాబట్టి కనీసం దాన్ని అర్థం చేసుకోవడానికి, విశ్లేషించుకోవడానికి ఈ సామగ్రి ఉపయోగపడుతుంది. కనీసం నాటి దృష్టితోనయినా పరిశీలించడానికి తోడ్పడుతుంది. నేటి మన దృష్టితో ఏ ప్రమాణాలు అనువర్తిస్తాయో అది తరువాతి మాట.

ఇప్పటి సమకాలీన సాహిత్య విశ్లేషణకు మన దగ్గర ఉన్న సాధనాలేమిటన్నది పరిశీలించాల్సిన విషయం.

డి చంద్ర శేఖర రెడ్డి

ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో చదువుకున్నారు. అదే కళాశాలలో లెక్చరర్ గా, ప్రిన్సిపాల్‌గా పనిచేసారు. తెలుగు కావ్య పీఠికలపై పరిశోధన చేసారు. ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించి పలు గ్రంథాల అనువాదాలలో పాలుపంచుకున్నారు. ప్రస్తుతం ఎమెస్కో ప్రచురణ సంస్థ సంపాదకులుగా ఉన్నారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.