ఫ్లవర్స్ అఫ్ ఈవిల్
సైదాచారి కవిత్వం

(మే 4 అయిల సైదాచారి మొదటి వర్ధంతి)

“ఆర్టిస్టు Félicien Rops తో పాటు తూగుతూ, బెల్జియం గల్లీలో Saint Loup చర్చి బైట మురికి కాల్వ పక్కన చిత్తుగా తాగిన మత్తులో పడిపోయాడు Charles Baudelaire…”

… చెప్పారు ఆర్టిస్ట్ మోహన్. కొన్ని ముచ్చట్లు పదే పదే చెప్పడం మోహన్ గారి అలవాటు. ఆ అలవాటు చొప్పున ఆయనలా పునశ్చరించినప్పుడల్లా, ఏదైనా ఒక్కసారి వింటే జీవితాంతం మర్చిపోలేని జ్ఞాపకశక్తిని వరంగానో, శాపంగానో పొందిన నేను- మొదటిసారి వింటున్నంత ఆసక్తినే ప్రదర్శించేవాడ్ని. అప్పుడు మాత్రం మోహన్ అలా చెప్పగానే, ఇలా అనకుండా ఆగలేకపోయాను:

“అలా Baudelaire పడిపోయినప్పుడు ఆ సందులో చెల్లాచెదురుగా పడిపోయిన ‘The Flowers of Evil (Les Fleurs du mal)’యే – సైదాచారి కవిత్వం!”

అయిల సైదాచారి గురించి అసందర్భ ప్రేలాపనగా అనిపించిన నా ప్రస్తావనకి ఒక నేపథ్యముంది.

సమకాలీన తెలుగు సాహిత్యజీవులంటే మోహన్ గారికి తగని ఏవగింపు, మరీ ముఖ్యంగా కవులంటే.

‘… తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచి మనుష్యులు…’ అని శ్రీశ్రీ అన్నట్టు, ఏ అదృశ్య హస్తాల దీవెనతో, కేవలం a fortunate stroke of serendipity కారణంగా నాలుగు చదివించదగ్గ వాక్యాలు పేర్చగలుగుతున్నారే గాని, ఆధునికమనో… ఆధునికోత్తరమనో claim చేసుకుంటున్న యుగపు కాలికస్పృహ, స్ఫూర్తి ఎవ్వరికీ లేవని ఆయన నిశ్చితాభిప్రాయం. నిగూఢమైన అటువంటి ఆయన నిశ్చల నిశ్చితాలు ఎప్పుడోగాని బైటపడవు. అలా బైటబడ్డ అరుదైన సందర్భాల్లో 2010 డిసెంబర్ 24వ తేదీ ఒకటి. మోహన్ గారికి 60 ఏళ్లు నిండిన సందర్భంగా జరిగిన వేడుకలో సోమాజీగూడ ప్రెస్ క్లబ్ కిక్కిరిసిపోయింది. కవులు, కథకులు, కళాకారులు, ముఖ్యంగా పాటగాళ్లు, ఆటగాళ్లు… పేట్రేగిపోయారు. కోలాహలం ఒక crescendo కి, పిచ్చి peaks కి చేరుకొని, మోహన్ గారి మీద ఆయన అభిమాన ఆత్మీయ అనుయాయుల liquorish affection and appetite అలసి, అణగారిపోయాక, ఒళ్లెరగని స్థితిలో ఒరిజినల్ మోహన్ బైటకి ఉబికి, ఉరికి, ఉద్రేకించి- కీర్తిశేషుడైన అజంతా నుంచి అడ్డంగా దొరికేసిన అయిల సైదాచారి వరకూ అందరు కవుల్నీ తిట్టిపోశారు. ‘అవార్డుల యావ.. పేరు కోసం వెంపర్లాట తప్ప మీ రాతల్లో కవిత్వమేదం’టూ రెచ్చిపోయారాయన, ఎవ్వరికీ ఏ మినహాయింపులూ ఇవ్వకుండా.  

అది దృష్టిలో పెట్టుకునే అన్నాను మోహన్ గారితో-

“అలా Baudelaire పడిపోయినప్పుడు ఆ సందులో చెల్లాచెదురుగా పడిపోయిన ‘The Flowers of Evil (Les Fleurs du mal)’యే – సైదాచారి కవిత్వం!”

‘జీవితపు సన్నని సందులకే/ ఆకర్షణ మాకు..’ అన్నారే శ్రీశ్రీ, ఆ సన్నని సందులో, కన్నీళులు ప్రవహించే కాల్వ పక్కన పడిపోయిన, సుప్తచేతనలోకి జారిపోయిన Baudelaire- Flowers of Evil- సైదాచారి కవిత్వం. ఆ మాట మోహన్ గారితో అనేనాటికి సైదాచారి Baudelaire లానే అర్థాంతరంగా వెళ్లిపోతాడని పీడకలైనా కన్నానా?

అయితే, బోదెలేర్ ప్రస్తావన వచ్చినప్పుడు చప్పున సైదాచారిని మధ్యలోకి లాక్కురావడం వెనక తీవ్ర అధ్యయనం, తులనాత్మక పరిశీలన ఏమీ లేదు; బోదెలేర్ కవిత్వమంటే పిచ్చి, సైదా కవిత్వమంటే ప్రేమ ఉండటం తప్ప, Flowers of Evil అనే పదబంధానికి సైదాచారి కవిత్వసారాంశానికీ సరిపోతుందని అనిపించడం తప్ప. ఇప్పుడు ఈ వర్తమానపు పీఠాన్ని ఎక్కి, ఇంతకు ముందు అన్నట్టు- బోదెలేర్ మల్లే సైదా కూడా అర్ధాంతరంగా పోయాడని, కవిత్వ సంకలనాలు కూడా ఇద్దరూ ఆలస్యంగా తెచ్చారని, బోదెలేర్ బోలెడు కబుర్లు ఉత్తరాలుగా తల్లికి రాసుకున్నట్టే, సైదా కూడా కవితలుగా అమ్మకి చెప్పుకున్నాడని, తన Venus Noire- Jeanne Duval తో బోదెలేర్ కి జాత్యంతర సంబంధం ఉన్నట్టే, సైదాచారి కూడా కులాంతర వివాహం చేసుకున్నాడని, కాల్పనిక కవిత్వాల వీడ్కోళ్లలో ఒక నవ్య నాగరీక వైయక్తిక వైరుధ్యాల్ని, జీవితపు భ్రష్టత్వాన్ని, దౌష్ట్యాన్ని కవితలుగా మలచడంలో కూడా ఇద్దరికీ సామ్యాలున్నాయని వాదించి, నిరూపించే అగచాట్లు పడొచ్చు. అలా మోకాలికీ బట్టతలకీ ముడేసే పనులు చేయాలంటే, కవిత్వేతర అంశాల చుట్టూ గిరికీలు కొట్టాలి. కానీ, కవిత్వాలే (రచనలే) తప్ప, ఆయా కవుల జీవితాల గురించి ఆసక్తి చూపించను కాబట్టి, ఆత్మకథలైనా, జీవితచరిత్రలైనా పాక్షికాలుగానే చూస్తాను గనక అటువంటి తులనాత్మకత జోలికి పోను.

ఆర్టిస్టుని ఆవిష్కరించేది అతని సృజనే అని కచ్చితంగా నమ్ముతాను కానీ, ఆ నాటి మోహన్ గారి నిందలన్నీ కవిత్వాలకి సంబంధంలేని వ్యక్తిగతాల్లోకి చొచ్చుకుపోయాయి కాబట్టి, నేను కూడా ఆ తలం మీద నిల్చొని నా వాదన వినిపించానప్పుడు. బోదలేర్ తొలుత కవిగా కంటే ఆర్ట్ క్రిటిక్ గా పరిచయమయ్యినట్టు, సైదాచారి కూడా నాకు కవిగా కంటే  సంగీత జ్ఞానమున్న ఓ సాహిత్యాభిమానిగానే తెలుసు. వైయక్తిక వ్యామోహాల మూలుగే కవితావస్తువైన కారణం వల్ల అంటరానిదిగా చూడబడుతున్న నా ‘నీడల్లేని చీకట్లో ’ కవిత్వాన్ని, అట్ట మీద ‘అశ్లీలత ‘తో సహా మెచ్చుకోవడం ద్వారా మిత్రుడయ్యాడు సైదాచారి. మొలగుడ్డ జారి కీగడుపు బైటపడుతున్న స్పృహేలేకుండా Lyre మీటుకుంటున్న Orpheus ని కవితాసంకలనానికి కవర్ పేజీగా వేయడాన్ని మెచ్చుకున్నాడు తాను. అప్పుడే- తతముల (అంటే తీగలున్న వాయిద్యాల) మధ్య ప్రాక్పశ్చిమ భిన్నత్వాలు, ఏకత్వాలు ఏకరువు పెట్టాడు; ఫిడేల్ రాగాల డజన్ కూడా సోదాహరణంగా వినిపించాడు, వయోలిన్ ని పట్టుకునే విధానంలో హిందుస్థానీ, కర్ణాటక సంప్రదాయ వైవిధ్యాలు ప్రదర్శిస్తూ. సితారని ఏడేళ్లపాటు సాధన చేసిన కవి సిద్ధార్థ కూడా సైదాచారి నిశిత సంగీత అవగాహనకి ఆశ్చర్యపోయాడు.

ఇక, నా కవిత్వం స్త్రీ కేంద్రకం కావడం వల్ల మోహించానని చెప్పడం దగ్గరే ఆగాడే తప్ప, ‘ఆమె నా బొమ్మ..’ అని గానీ, ఆమె చుట్టే తాను జీవితాన్ని కవిత్వం చేసి అల్లుకున్నానని గానీ అప్పట్లో చెప్పనే లేదు సైదా. దానికి కారణం- కవిత్వం పూర్తిగా సొంత గొడవని, నిజంగా ఆంతరంగిక మిత్రుడితో వెళ్లబోసుకునే గోడే కవిత్వమని నమ్మడం ఒక్కటే కారణం కాదు,

“కవిత్వోపాసన, సౌందర్యశోధనా జీవితం
కవిత్వీకరించడం, స్కలించడం రెండూ మృత్యువు…” అని తను నమ్మడం కూడా మరో ముఖ్యకారణం.

రాసుకున్నవి కంటే కొట్టేసుకున్నవి, చెరిపేసుకున్నవి ఎక్కువ కావడమనే పెనుగులాట ప్రపంచ ఆధునిక కవితావరణంలో అడపాదడపా కనిపించే, వినిపించే సందర్భమే. కానీ, ‘కవిత్వీకరించడం- మృత్యువు…’ అని, అసలు కాగితం మీదకే దించుకోకుండా గుండెలో గుప్తంగా మూసి, కవిత్వాన్ని ఉపాసించిన కవి నా ఎరుకలో సైదాచారి ఒక్కడే. అటువంటి అరుదైన కవిని గుర్తించకుండా, వడ్డించిన విస్తరిలో అవార్డులు… సన్మానాలూ…. తక్షణ కీర్తి వంటి అదనపు భక్ష్యాల కోసం అంగలార్చే అక్షర బేహారుల గాటన కట్టేసినందుకు మోహన్ గారి మీద కోపం రాదూ!

తాను కవి అని తెలియని తొలినాళ్లలోనే ఉద్యోగరీత్యా నేను మద్రాసు వెళ్లిపోయాను. తర్వాత ఏ మూడేళ్ళకో తిరిగి హైదరాబాద్ వచ్చిన (1997) తర్వాతే మా స్నేహం ప్రగాఢమయ్యింది. తనకి దగ్గరయ్యాను కాబట్టే, తన కవిత్వానికి తొలి శ్రోతనయ్యాను. ల్యాండ్ లైన్ ల కాలంలో కూడా ఏ అపరాత్రో ఫోన్ చేసి వినిపించేవాడు, ఇంకా పూర్తిగా ఫెయిర్ చేయని పచ్చి కవిత (బహుశా శుద్ధప్రతి అంటూ తర్వాత మరొకటేమీ ఉండేది కాదనుకుంటా). అసలు ఆ కాగితం కూడా ఒక నెపమేమో అన్నట్టుగా, దాచేస్తే దాగని విస్ఫోటనలా సరాసరి ఆత్మలోంచి పలికినట్టు చదివేవాడు కవితని. తాగి ఉన్నప్పుడే కవిత్వం వినిపించేవాడు. అయితే, మితిమీరి తాగేవాడని ఒక ఫిర్యాదులా అన్న మోహన్ గారితో, ఆయనకి బాగా అలవాటైన పాన పరిభాషలోనే సైదా తాగుబోతుతనపు తేడాని చెప్పాను, బోదెలేర్ తో కొన్నిసామ్యాలు తెస్తూ.

తాగుడు బోదెలేర్ జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం; అదొక ప్రత్యేక అధ్యాయం. అతని అతి సన్నిహిత మిత్రుడు, ప్రఖ్యాత చిత్రకారుడు Edouard Manet కి తొలినాళ్లలో పేరు తెచ్చిన -The Absinthe Drinker పెయింటింగ్ – బోదెలేర్ కోసమే వేశాడని మోహన్ గారే అన్నారు. Absinthe- అంటే మన దవనం… మరువం వంటి వొక మొక్కనుంచి తీసే ఆకుపచ్చ మద్యం. “Flows the green water of Lethe in place of blood (Spleen)”- అంటూ మరపు మైకాల గ్రీకు సురగంగా ప్రవాహం Lethe గురించి రాస్తాడు బోదెలేర్, ఆకుపచ్చని Absinthe ని తలుచుకుంటూ.

“కల్లు ముంతల మీద ఈతపరకల శిబ్బి, నరాల మీదికి వడపోతల నిషామృతాల పోత, తాగితందనాలాట. ఒక్కొక్క నరాన ఏకునాదం మోత…” అంటాడు సైదాచారి, తన ‘మహాముద్ర’ని తలపోస్తూ.

బోదెలేర్ ప్రసిద్ధ కవితల్లో ఒకటి- Envirez-vous (Be Drunk/ Get Drunk గా పలు అనువాదాలున్నాయి).

“And if sometimes, on the steps of a palace or the green grass of a ditch, in the mournful solitude of your room, you wake again, drunkenness already diminishing or gone, ask the wind, the wave, the star, the bird, the clock, everything that is flying, everything that is groaning, everything that is rolling, everything that is singing, everything that is speaking. . .ask what time it is and wind, wave, star, bird, clock will answer you: “It is time to be drunk! So as not to be the martyred slaves of time, be drunk, be continually drunk! On wine, on poetry or on virtue as you wish.”  

తార స్వర మూర్ఛనలో భీంసేన్ జోషి
కళ్ళు మూసుకొని దేన్ని చూస్తున్నాడో
అదే జారిపోతుంది నాలోంచి
తుది వాక్యంతంలో నా కవిసమయాన
అదే ఆనందపు లోలకం వెంట
వూగుతూ తూలుతూ
నవ్వుతాడు నా మీద తాగుబోతు…

…. అంటూ ‘ఒక అఖండ సృజనలో కొన్ని క్షణాలు..’ గురించి చెప్పుకుంటాడు సైదా, బోదెలేర్ Envirez-vous కి ఒక కొనసాగింపుగా. సైదాచారి వ్యక్తిగతంగా నాకు తెలియడం అనే అదనపు అర్హత వల్ల మోహన్ గారితో వాదనలో తన తాగుబోతుతనం గురించి చెప్పగలిగింది – బోదెలేరుని చదవకపోయినా సైదాలో జరిగిన ఆ భావ, సార ప్రసారం ప్రస్తారాల గురించే!

**      ** **

ఇక ‘స్త్రీ’ కేంద్రకంగా, ప్రేమ… మోహం… వియోగం వంటి కవితావస్తువులంటే మోహన్ గారికి మహా చులకన. కాలం చెల్లిన కవితగా కూడా కృష్ణశాస్త్రిని అంగీకరించలేనంత ప్రగతికాముక పెడసరితనం ఆయనది. అటువంటిది, 20వ శతాబ్దం చివరి దశకంలోని నన్ను, 21వ దశాబ్దపు తొలి దశకంలోని సైదాచారినీ ఎలా ఉపేక్షిస్తారు? కాబట్టి, స్త్రీ- కవిత్వానికి కంటెంట్ కావడం విషయంలో ఏ సమర్థనలూ పనిచేయవని తెలుసు నాకు. నిజానికి అదే నా వాదనకి బలం; ఎలాగంటే-

రూప… సారాలతో సంబంధం లేకుండా, కేవలం (అభ్యుదయ, దళిత, మైనారిటీ వగైరా సమకాలీన) ‘వస్తువు’ మెరమెచ్చుల కారణంగా కీర్తి కొట్టేసే మహదవకాశాన్ని వదిలేసుకొని, రుక్మిణీనాథ శాస్త్రి చెలాన్ని అన్నట్టు ‘ఈ మూల స్త్రీ కోసం మూలగడం ఎందుకు ‘?

ధగద్ధగాయమానమైన ఒక స్త్రీమూర్తి కావాలి నాకు…
స్త్రీని తప్ప దేన్నీ ప్రేమించలేదు…
స్త్రీ ముందు మోకరిల్లుతూనే ఉన్నాను…
స్త్రీ అర్థమయ్యేందుకు స్త్రీని ఆవాహన చేశాను…

…. ఇలా సైదాచారి కవిత్వం నిండా స్త్రీలే… కారుణ్య స్త్రీలు… కన్నీటి స్త్రీలు… బలహీన స్త్రీలు… దృఢమైన స్త్రీలు… ఒంటరి స్త్రీలు… గాజుపలకలాంటి స్త్రీలు… చవిటి నేలలాంటి స్త్రీలు.. అగ్నిపర్వతం లాంటి స్త్రీలు.. మంచుముత్యంలాంటి స్త్రీలు… అమ్మోరు మచ్చల స్త్రీలు… స్కిజోఫ్రినియా స్త్రీలు… వ్యాపారులైన… పొదుపరులైన… వ్యసన రహితులైన… దుఃఖ్ఖోత్ప్రేరకులైన… నిర్దయులైన స్త్రీలు…

నా శవాన్ని పాతిపెట్టుకోడానికి ఒక నేల లాంటి స్త్రీ
నన్ను నేను కడుక్కునేంద్కు నదీజలంలాంటి స్త్రీ….
అన్నింటికంటే ముఖ్యం తనివిదీరా రమించే ఒక స్త్రీ- కావాలంటాడు.

ఆమె ఎలా కావాలంటే-

“నగ్న సౌందర్యాన్ని చిత్రించే చిత్రకారుడి ముందు నిలబడే న్యూడ్ మోడల్ లా
నా పద్యం ముందు నిలబడాలి
అప్పుడే పుట్టిన పసికందుకు పాలిస్తున్న బాలింత తల్లిలా
నా శైశవం ముందు నిలబడాలి
అజ్ఞానంతో, వ్యసనంతో, అర్ధాయుష్షుతో నేను చచ్చిపోతే
నన్ను గంగలో కలుపుతూ దీవించే
ఆకాశంలా నా ముందు నిలబడాలి”

స్త్రీ గురించి కవిత్వమంతా ఇంత ఇంద్రియలోలత్వంతో తపించిన సైదాచారిలో అటువంటి వెంపర్లాట నాకు తను తెల్సిన పాతికేళ్లలో ఎప్పుడూ కనిపించలేదు. ఒళ్ళెరగని మత్తులో కూడా తీరని వాంఛలు ఒక బూతుకూతగా ఉద్గారించడం గానీ, అందని ఆడ ద్రాక్ష పుల్లదనాలు ఒక చాటుచాడీగా వంకర తిరగడం గానీ నేను వినలేదు. సంగీతాభిలాషకి, మంచి గాత్రం తోడైనా, మీదుమిక్కిలి  సందర్భశుద్ధి ఉండటం వల్ల చాలా అరుదైన ఏకాంత వేళ మాత్రమే పాడేవాడు, భావరాగతాళాలకి తనని తాను ఇచ్చేసుకుంటూ. అగ్రికల్చర్ బీయస్సీ చదవడం వల్ల, జీవిక కోసం ఇష్టమున్నా, లేకున్నా ఏవేవో ఉద్యోగాలు చేశాడు గానీ, ప్రవృత్తిగా చేపట్టిన హోమియో వైద్యాన్ని కూడా తన సహజమైన మమేకతతో… తత్పరతతో చేశాడు. సైదాచారిలోని ఇన్ని పార్శ్వాల్లో ఎక్కడా కవిత్వంలో పొంగిపొర్లే వాంఛాగ్రస్తత కనిపించేది కాదు.

అందుకే, ఆ మధ్య ఒక వ్యాసంలో ఇలా రాశాను:

“స్త్రీ మూర్తిమత్వాన్ని సౌజన్య శిఖరాల మీద సౌందర్యభరితంగా ప్రతిష్ఠించిన బుచ్చిబాబు గారి నుంచి, ఎత్తైన కొండలవంటి ఆడవారి పట్ల ఆరాధనని దాచుకోని ఇస్మాయిల్ గారి నుంచి, ‘ఆమె నా బొమ్మ’ అంటూ కవితలల్లుకున్న నేటి అయిల సైదాచారి వంటి నేటి తరం కవులు రచయితల వరకూ, వారి జీవితాల్లో ‘ఆమె’ ప్రత్యక్ష ప్రమేయం ఏ మేరకు అన్నది రహస్యమే……. ఈ గుట్టుమట్టులకి మించిన మర్యాదకరమైన మోసం, సాహిత్య ద్రోహం మరొకటి లేదని నా ఉద్దేశం”

నా ఆరోపణకి చికాకు పడ్డమో, కుపితుడు కావడమో కాదు, చాలా దిగులు పడ్డాడు!

‘ఎవరెవరా స్త్రీలు అనే బయోడేటాలు కావాలా? ఏ వోటర్ ఐడీయో… ఆధార్ కార్డో ఇవ్వడానికి కూపీ తీసినట్టు పేర్లూ- ఊర్లు… ఎత్తూ- బరువూ… ఎరుపు- నలుపు… అసలు వివరాలంటూ ఏవైనా ఉంటాయా స్త్రీకి?’ – అని దుఃఖ్ఖపడ్డాడు.

“జయదేవుడిలా శుద్ధ సౌందర్య లోలుడివై ‘ఆమె’ని పారవశ్య గానం చేసుకుపోయే నీ నుంచి అస్సలు రావల్సింది కాదీ నేలబారు వ్యాఖ్య,” అన్నాడు.

“అనిలతరళ కువలయనయనేన/ తపతి న సా కిసలయ శయనేన/ యా రమితా వనమాలినా…. “

భక్త జయదేవుని పదానికి సాక్షాత్తూ పరంథాముడే పరవశిస్తాడు (అక్కినేని- ‘భక్త జయదేవ’). ఓ ముముక్షువు వేషంలో మైమరచిపోయిన జగన్నాథుడ్ని జయదేవుడు అడుగుతాడు, స్వామీ తమరెవరని.

“నీలాగే ఓ రసపిచ్చగాడ్ని…” అని బదులిస్తాడు జగన్నాథుడు.
నేటి కాలం భక్త జయదేవుడి అంశగా తరచూ నన్ను ఎక్కువ చేసే సైదా కూడా నాతో అనేది కూడా అదే-
“నేను నీలాగే ఓ రసపిచ్చగాడ్ని…”

నరేష్ నున్నా

సుప్రసిద్ధ కవి, విమర్శకులు, పాత్రికేయులు

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.