బహుముఖ పోటీ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయా?

           2009 ఎన్నికల తరువాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభకు మళ్ళీ బహుముఖ పోటీ జరిగినట్టు కనీసం కాగితాల మీద కనబడుతోంది. 2009 నాటి ఎన్నికలలో బహుముఖ పోటీ వల్ల నాడు అధికారంలో ఉన్న వైఎస్ లాభపడ్డారు, మళ్ళీ అధికారంలోకి రాగలిగారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి ప్రభంజనం సృష్టిస్తారనుకుంటే, చతికిల పడ్డారు. ఇక మిగిలిన అన్ని పక్షాలను కలుపుకుని మహాకూటమిని ఏర్పరచిన చంద్రబాబు కూడా వైఫల్యాన్ని ఎదుర్కొనక తప్పలేదు. 2019 ఎన్నికల్లో బహుముఖ పోటీ గురించి చర్చించుకునేముందు, 2009 బహుముఖపోటీ గురించి కొంత ప్రస్తావించుకుందాం.

మొదటగా ఆనాడు అధికారంలో ఉన్న వైఎస్ తెలుగు రాజకీయాలు ఇటీవలి కాలంలో చూసిన అత్యంత ప్రజాబలం కలిగిన/సాధించుకున్న నాయకులలో ఒకరు. 2009 ఎన్నికల నాటికి వైఎస్ ప్రభుత్వంపై అంతటి తీవ్ర వ్యతిరేకత లేకపోవడం, అదే సమయంలో 2004 నాటికి చంద్రబాబుపై ఏర్పడిన వ్యతిరేకత తగ్గకపోవడం ప్రధాన భూమిక పోషించాయి. వైఎస్ తన పాలన మొదటి దశలో ఆరోగ్య శ్రీ, ఉచిత కరెంట్, రుణ మాఫీ, ఫీజు రీ ఎంబర్సుమెంట్ వంటి ప్రజాకర్షక పథకాలను పటిష్టంగా అమలు పరచడంతో ధనయజ్ఞంగా మారిన జలయజ్ఞపు లోపాలు ఎవరికీ పట్టలేదు. అందునా ధనయజ్ఞంగా పేరొందినప్పటికీ ప్రాజెక్టులు త్వరిత గతిన పురోగతి సాధించడం జనాలలో నమ్మకం ఏర్పరచింది. ఇక అటు చంద్రబాబు ఆధ్వర్యంలో ఏర్పడిన మహాకూటమి పట్ల జనాలలో నమ్మకం ఏర్పడకపోవటానికి ప్రధాన కారణం – అందులో ఉన్న ప్రతి ఇతర పార్టీ ప్రతి నిత్యం సైద్ధాంతిక/రాజకీయ వ్యతిరేక కారణాలతో కలహించేవే. దాంతో, జనాలలో కేవలం అధికార సాధన లక్ష్యంగా ఏర్పడిందే తప్పించి, కొనసాగగలిగే బంధంగా నమ్మకం కలిగించలేకపోయారు. ఇక మరోవైపు సినీ ఇమేజ్ తో పాటు సామాజిక సేవకుడిగా, సౌమ్యుడుగా, అందరివాడుగా ఇమేజ్ సంపాదించినా చిరంజీవి రాజకీయ ఆరంగేట్రం అటు వైఎస్ ఇటు బాబు ఇద్దరిలో కాస్త గుబులు రేపిందన్నది నిజం. కానీ, నాయకత్వలక్షణాలు లేకపోవటం, పార్టీలో సమస్యలను వ్యక్తులను హేండిల్ చేసే బలమైన నాయకత్వం లేకపోవడం వంటివి దెబ్బ తీశాయి. మొత్తమ్మీద 2009 లో బహుముఖ పోటీ అధికారంలో లాభించటానికి ప్రధాన కారణాలు వైఎస్ మీద వ్యతిరేకత బలంగా ఉండకపోవటం, చంద్రబాబు మీద వ్యతిరేకత పూర్తిగా తగ్గకపోవడం, చిరంజీవి నమ్మకం కలిగించలేకపోవటం వంటివి.

ఇక 2019 లో అంటే సరిగ్గా దశాబ్దం తర్వాత మళ్ళీ బహుముఖ పోటీ పరిస్థితి ఏర్పడింది. కానీ, పలువురు విశ్లేషకులు మరియు ఇతర అనేకమంది అభిప్రాయం ప్రకారం ఇది బహుముఖ/త్రిముఖ పోటీగా కనబడుతున్నప్పటికీ ద్విముఖ పోటీ మాత్రమే. ఒకవైపు జగన్, మరవైపు మిగతా అందరూ అనే భావన కలగటంలో చంద్రబాబ మరియు పవన్ ల తీరు ప్రధానం – మిగతా అందరూ కలిసి లేదా విడివిడిగా జగన్ ను విమర్శించటం మరియు జగన్ కేంద్రంగా విమర్శలు/ఆరోపణలు చేయటం. అసలు వీరి తీరు చూస్తోంటే గత అయిదు సంవత్సరాలు అధికారంలో ఉన్నది చంద్రబాబా లేక జగనా అన్న అభిప్రాయం కలుగుతోంది. ఈ బహుముఖ పోటీలో లాభపడేది ఎవరు అన్నది ఒకింత సంక్లిష్టంగానే కనబడుతున్నప్పటికీ వోటింగ్ కు ముందు, తరువాత సరళిని విశ్లేషిస్తే అది జగన్ కే లభించేలాకనిపిస్తోంది. దానికి కారణాలు – ప్రధానంగా చెప్పాలంటే 2014 లో తనకు వోట్ వేసిన వర్గాలను (లేదా తన వోట్ బ్యాంకును) అందరినీ తనతోనే నిలబెట్టుకోవడంలో జగన్ విజయం సాధించారు. కొన్ని నియోజకవర్గాలలో నేతలు పార్టీ మారినప్పటికీ క్యాడర్ ను నిలబెట్టుకోగలిగారు మరియు ప్రత్యామ్నాయ నేతలను తయారు చేసుకోగలిగారు. దానికి అదనంగా ప్రభుత్వ వ్యతిరేక వోట్ లో అధికభాగం బలమైన ప్రత్యామ్న్యాయంగా ఎదిగిన వైఎస్సార్సీపీ వైపు మళ్లే అవకాశం ఉంది. చంద్రబాబుకు ధీటైన ప్రత్యామ్నాయ నేతగా జగన్ ప్రజలలో గుర్తింపు పొందారు. సుదీర్ఘ పాదయాత్ర అతడిని ప్రజలు తమలో ఒకడిగా భావించే అభిప్రాయం కలిగించింది, ఇక 2014 నుండి ఇప్పటివరకూ ప్రత్యేక హోదా వంటి కొన్ని కీలక అంశాలపై స్టాండ్ మార్చకుండా, ఒకే మాటపై నిలబడటం అతడి తీరుపై నమ్మకం పెంచిందని చెప్పవచ్చు.

జగన్ వ్యతిరేక వర్గం లేదా జగన్ పై విమర్శలు చేసే వర్గాన్ని మూడు రకాలుగా విడగొట్టవచ్చు. చంద్రబాబు/తెదేపా, జనసేన కూటమి మరియు ఇతరులు (కాంగ్రెస్, భాజపా తదితరులు). మొదటగా  చంద్రబాబు మరియు తెదేపా శ్రేణుల ప్రచారం అంతా జగన్ – తెరాస – భాజపా లోపాయికారి ఒప్పందం ఉందని నమ్మించాలన్న ప్రయత్నమే లక్ష్యంగా సాగుతోంది. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఫాక్టర్ పనిచేసిన విధంగా ఆంద్ర ఎన్నికల్లో కెసిఆర్ అంశం పని చేస్తుందనిభావించారులా ఉంది. కానీ, కెసిఆర్ తదితరులు ఎన్నికల తరుణంలో పెద్దగా వ్యాఖ్యలు చేయకపోవడం, కల్పించుకోకపోవటం వంటివి జగన్ – కెసిఆర్ బంధం అన్న ప్రచారం పట్ల నమ్మకాన్ని కలిగించలేకపోయాయి. భాజపా ఫాక్టర్ కూడా అంతే. గత అయిదేళ్ళలో ఏమి చేశారు, ఇపుడు మళ్ళీ అధికారం ఇస్తే ఏమి చేస్తారు అనేది చెప్పేకంటే ఎక్కువగా జగన్ పై విమర్శలే లక్ష్యంగా సాగుతున్న ప్రచారం విమర్శలపాలవుతోంది. ఇక జనసేన తీరు కూడా అలానే ఉంది. ప్రజలలో వ్యతిరేకత ఉన్నది ప్రభుత్వం మీద ఎందుకంటే గత అయిదేళ్లుగా జరిగిన మంచి లేదా చెడుకు బాధ్యత అధికారంలో ఉన్న తెదేపాదే అవుతుంది తప్ప వైఎస్సార్సీపీది కాదు. కానీ, పవన్ ప్రచారంలో 90% కేవలం జగన్ లక్ష్యంగా విమర్శలు/ఆరోపణలుగా మాత్రమే సాగింది. ఇక జనసేన కూటమి ప్రధాన లక్ష్యం ప్రభుత్వ వ్యతిరేక వోట్ చీల్చటంగా అనిపిస్తోంది. తద్వారా తెదేపా లాభపడటం ధ్యేయం అయితే అది తప్పేమో. ఎందుకంటే వైఎస్సార్సీపీ గతంలో ఉన్న వోట్ బ్యాంకును నిలబెట్టుకుంది; గత ఎన్నికలలో తెదేపా, భాజపా, పవన్ ఫాక్టర్ కలిపితే వచ్చిన వోట్లు ఇపుడు తెదేపా, జనసేన మరియు భాజపా వోట్లుగా విడిపోతే నష్టం తెదేపాకే కాగలదు. ఇక కాంగ్రెస్ పోటీ చేయటం కూడా కేంద్రంలో కాంగ్రెస్ కు మద్దతిస్తాం అన్న లోపాయికారి ఒప్పందం కోసం ఇక్కడ వోట్లు చీల్చటానికే తప్పించి, వారు సాధించేదేమీ లేదని తెలిసినదే. భాజపా తమసాంప్రదాయక వోట్లు అంటే గతంలో తెదేపాకు పడినవి చీల్చటం ద్వారా తెదేపాకు దెబ్బ కాగలదు.

అన్ని అంశాలను సమీక్షించిన మీదట 2019 లో బహుముఖ పోటీ, 2009 లో లాగా అధికార పక్షానికి లాభించేదిగా ఏ విధంగానూ అనిపించటం లేదు. రాష్ట్ర విభజన సమయంలో అనుభవం ఉన్న నేతగా (అది కూడా కూటమి ద్వారా అంటే మోదీ మరియు పవన్ లు తమవారిని నమ్మించటం వలన) ప్రజలు నమ్మిన చంద్రబాబు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు. అదే సమయంలో అప్పటినుండి హోదా వంటి కీలక అంశాలలో ఒకే తీరున ఉంటూ ప్రజలలో తనపట్ల నమ్మకాన్ని కలిగించడంలో జగన్ విజయం సాధించారని చెప్పవచ్చు. ఇక రాజధాని నిర్మాణంలో గ్రాఫిక్స్ కే పరిమితం కావడం, తాత్కాలిక నిర్మాణాలకే వందల కోట్లు ఖర్చు చేయడం, ప్రతి చిన్నదానికి విపరీతంగా ఖర్చు చేయడం, హామీల అమలులో నిర్లక్ష్యం, అధికార వ్యవస్థల దుర్వినియోగం వంటివి చంద్రబాబు గారి ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి. ఇపుడు ప్రభుత్వ వ్యతిరేక వోట్ ని చేల్చి లాభపడాలన్న ధ్యేయంతో పవన్ ద్వారా త్రిముఖ/బహుముఖ పోటీతో లాభపడాలన్న ఆలోచన ఎంతవరకూ ఫలిస్తుందన్నది మే 23 వ తేదీన కానీ తెలియదు. ఈలోగా అన్ని రకాలుగా పయత్నించి వీలయితే గెలుపు లేకపోతే ఓటమి అంతరాయాన్ని తగ్గించటం, ఒకవేళ హంగ్ వచ్చేట్టయితే కింగ్ మేకర్ అయ్యే అవకాశం కోసమే జరిగిన పోరాటం ఇది అని చెప్పవచ్చు. జగన్ – చంద్రబాబుల మధ్య జరుగుతున్న ఈ అస్థిత్వ పోరాటంలో పవన్ ఆటలో అరటిపండుగా మిగులుతారేమో. ఇప్పటికే పలు సర్వేలలో పేర్కొన్నట్టు ఫలితాలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి, ఇపుడు కృత్రిమంగా ఏర్పడిన బహుముఖ పోటీపై 2009 లో మహాకూటమిపై ఉన్నట్టుగానే అభిప్రాయం ఉన్నట్టుంది. అపుడు మహాకూటమి పేర కలవడం, ఇపుడు (పవన్) ఇలా విడివిడిగా పోటీ చేయడం కేవలం ఒక్కరిని దెబ్బ తీయటానికే అన్నది సుస్పష్టం. కాగా ఇందులో రెండు విశేషాలు ఏంటంటే 2009 లో వైఎస్ ఇలాంటి బహుముఖ పోటీ ఎదుర్కొని విజయం సాధించగా, 2019 లో ఆయన తనయుడు వైఎస్ జగన్ బహుముఖ పోటీని ఎదుర్కొంటూ దాదాపు అన్ని సర్వేల అంచనాల ప్రకారం విజయం సాధించబోతున్నాడు, మరో విశేషం ఏమిటంటే తెదేపా పుట్టుక నుండి ఇప్పటివరకూ ఒంటరిగా పొటీ చేసింది లేదు. చూద్దాం, నా అంచనాలో అయితే ఎటువంటి అనూహ్య ఫలితాలూ ఉండే అవకాశం లేదని అనిపిస్తోంది. కానీ, వోటర్ మదిలో ఏముందో అన్నది ఇప్పటికే ఈవీఎంలలో నిక్షిప్తమైంది, ఫలితం మే 23 న తెలుస్తుంది. అంతవరకూ ఎవరికీ వారు ఇలాంటి విశ్లేషణలు చేసుకోవడమే …

వంశీ కలుగొట్ల

వృత్తి: సాఫ్ట్వేర్ ఇంజనీర్; వ్యావృత్తి: రచనలు, కవిత్వం; నివాసం: బెంగుళూరు; పుట్టిన ఊరు: గని, కర్నూలు జిల్లా; తల్లిదండ్రులు: కలుగోట్ల విజయాత్రేయ, విజయలక్ష్మి. రచయిత/కవిగా : బృందావన చరితం - విద్వత్ ఖని కథనం, భారతీయం, సుప్రసిద్ధ భారతీయ కళాకారులు, సుప్రసిద్ధ భారతీయ క్రీడాకారులు, భారతీయం, భారతరత్నాలు, ఆంధ్రప్రదేశ్ జనరల్ నాలెడ్జి తదితర పది పుస్తకాలు (మొదటిది మినహా మిగతావి ఆదెళ్ళ శివకుమార్ గారితో కలిసి). ఇవి కాక జాగృతి మాసపత్రికలో సంవత్సరం పాటు అసోసియేట్ సబ్ ఎడిటర్ గా, శ్రీ దత్త ఉపాసన మాసపత్రికకు ఆరు నెలలపాటు సబ్ ఎడిటర్ గా పని చేశాను. దాదాపు 500 కవితలు; 120 కు పైగా రాజకీయ, సినీ, సామాజిక అంశాలకు సంబంధించిన వ్యాసాలు; 20 కి పైగా కథలు; రెండు బుర్రకథలు రాశారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.