సంబరం 2

 

ఇది రెండో మేడే, ‘రస్తా’ లో మనకు.

సరిగ్గా నిరుడు ఇదే రోజు ‘రస్తా’ మొదటి సంచికను వెలువరించాం. భలే వుండింది మాకు ఆ రాత్రి. రచనలనైతే సేకరించుకున్నాం. టెక్నికల్ గా అనుకోని సమస్యలెదురయ్యాయి. పద ముందుకు నేనున్నానంది మమత. రాత్రంతా అన్య పాపను పక్కన పడుకోబెట్టుకుని, మాతో మా పనులు చేయిస్తూ… మమత డిడ్ ఇట్.

టెక్నికల్ పనులు పెద్దవేం కాదు. వయసు పెరిగే కొద్దీ, కొత్తవి నేర్చుకోడంలో తాత్సారం పెరుగుతుందనుకుంటా. నేను అంతకు ముందే చాల బద్దకిస్టును. ఆపైన పెద్దాడినయ్యాననే ఎక్స్కూజ్ ఒకటి.

గత ఏడాది కాలంగా, స్నేహితుల నుంచి అందిన సహకారం నా బద్ధకం దోషాన్ని సవరించింది. ఎదురు దెబ్బలు తగల్లేదని కాదు. ఫలానా వాళ్ళ నుంచి చాల ప్రోత్సాహం వుంటుందనుకున్న కొన్ని చోట్ల మనాళ్ళు భలే చెయ్యి ఇచ్చారు. కొందరు నోటితో ‘అన్నా’, ‘గురూజీ’ ‘సార్’ అనేసి, నొసటితో వెక్కిరించారు. అదే సమయంలో ఊహించని చోట్ల నుంచి వెన్ను తట్టే చేతులు దొరికాయి. పదండి ముందుకు లోకం గొడ్డు పోలేదని స్థైర్యమిచ్చాయి.

‘స్ట్రీట్ ఫైటింగ్’ అనేది… ఫేస్ బుక్ లో ఒక మిత్రునితో నా సంవాదంలో మొలిచిన ఆలోచన. దానికి, ఒక కాలమ్ నే రూపొందించి, తగిన సమాచారాల్ని సేకరించి అందించిన మా జయమ్మకు.. ఎస్. జయకు… మనసారా కృతజ్ఞతలు. చెప్పొద్దూ, మొదటి రెండు మూడు సంచికల్లో ఎడిట్ కోసం నేను మరెక్కడా చూడకుండా జయమ్మ కాలమ్ నుంచే ఉత్తేజాలు తీసుకున్నాను.

ఇలా మా టీమ్ లోని మిగిలిన ఇద్దరు ‘పదరా, నానిగా’ అనకపోతే ఈ పని జరిగేది కాదు. బండి ఇందాక నడిచేది కాదు.

ఎలాగైతేనేం ఇంత దూరం వొచ్చేం.

ఇంకా ముందుకు పోదాం.

ఈ మేడే ఒక చిన్న మైలు రాయి.

ఇప్పటికే కొన్ని వెబ్ పత్రికలున్నాయి. ఇంకా వుంటాయి. మళ్లీ ‘రస్తా’ ఎందుకు అనే ఆలోచన మాకెన్నడూ రాలేదు. ఇప్పటికే వున్న వాటిలా కాకుండా మరోలా… ఇంకా చెప్పాలంటే అచ్చం ఓ అచ్చు పత్రికలా వెబ్ పత్రిక వుండొచ్చని అనుకునే వాడిని. ‘రస్తా’ ను అలాగే నడపాలని శాయశక్తులా ప్రయత్నించాం. చాల వరకు కుదిరింది.

ఊరికి, దేశానికి దూరంగా వుండడం, ‘వూరి’ పరిణామాలకు ‘ఐ’-విట్నెస్ కాకపోవడం… ఆ పరిస్థితి విధించే పరిమితులను అధిగమించడానికి సోషల్ మీడియా మాకు బాగా వుపయోగపడింది. ముఖ్యంగా ‘యూ ట్యూబ్’ లో వార్తా కథనాలు అందించే ‘ఛానెళ్ళ’ మీద ఆధారపడ్డాం. ఫేస్ బుక్ లో కొందరి పోస్టులు కూడా  మాకు సాయపడ్డాయి. యూ ట్యూబ్ ఛానెళ్లు చాల వరకు చాపకింద నీరు వంటి చెల్లింపులు పొందేవే, ఫేస్ బుక్కర్లకూ అలాంటి చెల్లింపులు, లాయల్టీలు వుంటాయి. ఈ సంగతి మేము మరిచిపోలేదు. ఇన్నేళ్ళ జీవితానుభవం ఆధారంగా ఏ మాట వెనకాల ఏ ‘అర్థం’ దాగివుందో విశ్లేషించుకో గలిగామనే అనుకుంటాను.

తప్పు చేసిన సందర్భాలు దాదాపు లేవు. దానిక్కారణం ఒక్కటే. ముగ్గురమూ ప్రజా పోరాటాలతో వుత్తేజితులం. జార్జి రెడ్డి, జంపాల ప్రసాద్, మధుసూదన్ రాజ్ యాదవ్, సీపీ, ఎన్నార్ వంటి జనం మనుషుల ఆశల్ని, నిజాయితో కూడిన వారి ఆచరణలను దగ్గరగా చూసిన వాళ్ళం. గడిచిన ప్రజా పోరు నిమ్నోన్నతాల్ని, దిగుళ్ళను, సంతోషాల్ని అనుభవించిన వాళ్ళం. నిప్పులు ఎలా వుంటాయో చూసి వూరుకోకుండా, నడిచి చూసిన వాళ్ళం. అందువల్ల మాకు ఎదురయ్యే ప్రతి రాజకీయార్థిక పరిణామాన్ని ప్రజా ప్రయోజానాల నేపధ్యం లోంచే చూశాం. ఇక ముందూ మాకిది అనివార్యం.

మనలో ఎవరం పుట్టినప్పుడెలా వున్నామో అలాగే లేం. ప్రతి ఒక్కరం పుట్టాక ‘తయారైన’ వాళ్లమే. ‘తయారు కావడం’లో మన సబ్జెక్టివ్ (ఐక్యూ, జెనెటికల్ లక్షణాల వంటి) గుణ దోషాల ప్రమేయం ఉంటుంది. కాని అది మాత్రమే వుండదు. మనం నడిచి వొచ్చిన సొరంగాలు, గడిచి వొచ్చిన లోయలూ శిఖరాలు, మన ప్రమేయం లేకుండా మనం పుట్టి పెరిగిన జీవనావృతాలు… అన్నీ కలిసి మనల్ని తయారు చేస్తాయి.

అంటే ఇందులో మన ప్రమేయం ఏమీ లేదని కాదు. మన జీవితాల్ని మరీ అంత ఫేటలిస్టిక్ గా… మరీ అంత నుదుటి వ్రాతలుగా… చూసుకోనక్కర్లేదు. మన జీవితాల్ని మనం మార్చుకోగలం. అయితే, అప్పటికి మన చేతుల్లో ఏ జీవితం వున్నదో, ఆ జీవితాన్ని ఎన్నెన్ని ‘విధాలు’గా మార్చగలమో చూసి, వాటిలో మనకు అనువైన, ఇష్టమైన ‘విధాన్ని’ ఎంచుకుని… అలా మార్చుకోగలం, బద్ధకించకపోతే.

ఔను. బద్ధకించకపోతేనే. బద్ధకించి రక రకాల ‘మాదకద్రవ్యాల’లో ఓలలాడకపోతేనే.

ఆ మాదక ద్రవ్యాలెలా వుంటాయి? మాదక ద్రవ్యాలు ఏవేవి?

దీనికి ఒక ‘వస్తుగుణ దీపిక’ (మెటీరియా మెడికా) ఏదీ సిద్ధంగా లేదు. వున్నది చాలదు. చర్చ, ప్రయోగం… వినా దారి లేదు. కొన్ని క్యాజువాలిటీస్ తప్పవు. ఆ క్యాజువాలిటీ మనం కూడా కావొచ్చు. భయపడితే మిగిలేది… ఏదో ఒక మత్తులో వూగుతూ వుండి పోవడం లేదా పుట్టలోని చెదలులా పుట్టి చావడం.

అక్కర్లేదు. మనల్ని మనం చర్చల్లోకి, చర్యల్లోకి… ఎన్నింటిలోకి వీలయితే అన్నింటిలోకి విసిరేసుకుందాం. ఏ ఒక్క దాని పట్లా ‘పాతివ్రత్యం’ వొద్దు. పాతివ్రత్యం అనే పాత విలువ ఎలా స్త్రీ హననమో, అలాగే ‘నిబద్ధత’ అనే విలువ ఒక మస్తిష్క హననం. మెదడుకు సంకెల. ఫ్యూడల్ లాయల్టీ కి ఆధునిక రూపం.

ఏదైనా నీకు బాగుందా? అయితే, ఆ మాట ఇతర్లకు చెప్పి నువ్వు సేఫ్ గా అరుగుమీద కూర్చోకు. నువ్వు బాగుందనే దానిలో నువ్వు ప్రవేశించి, దానిలో నిమగ్నం అవ్వు. నిమగ్నమయి అనుభవించి పలవరించు, కవివై, కథకుడివై, రాజకీయ కార్యకర్తవై.

చైనా మహాకవి లూ సున్ చెప్పిన కథలోని ఒక ఇనుప గృహం లో వున్నాం మనమిప్పుడు. ఇదొక చీకటి గృహం. ఇలాగే నిద్దర పోవచ్చు. నిద్దట్లో చచ్చిపోవచ్చు హాయిగా. కాని వొద్దు. డిస్టర్బ్ అవుదాం. దీన్నుంచి నిద్దర లేపే డిస్టర్బెన్సే విప్లవ కవిత్వం.

నిద్దట్లో మరణించొద్దు. మెలకువలో జీవిద్దాం. మన చేతులతో, చేతుల్లోని అన్ని పనిముట్లతో చీకటి ఇనుప గృహాన్ని కూలదోద్దాం. కూల్చివేసే ప్రయత్నంలో మరణిస్తామా, పోనిద్దురూ, ఫరవాలేదు, ప్రయత్నించని నిద్దర మరణాల కన్న అదే మేలు.

చేస్తున్న ప్రతి ప్రయత్నాన్నీ తర్కిద్దాం.

గొర్రెల్లా నడవడం కాదు. గొర్ల కాపరి కృష్ణుడు కావొచ్చు,  క్రీస్తు కావొచ్చు. కాపరి గొర్రెల్ని ఎందుకు కాస్తాడు, కోసుకు తింటానికి కాకపోతే? కాపరి దృష్టిలో గొర్రెలకు వేరే విలువ ఏం వుంటుంది, కోసుకు తినే సరకులుగా కాకుండా?

మనక్కావల్సింది కాపరులు కాదు. మనక్కావలసింది మనమే. మనల్ని కనుక్కోడానికి సాయపడేది కూడా మనమే.

మన చర్చే. చర్చలోని మన మాటే.

అదిగో

అలాంటి చర్చకు

దోహదం చేసిందా ‘రస్తా’?

మీ అభిప్రాయం నిర్మొహమాటంగా చెప్పండి.

అబ్యూజివ్ గా వుండనంత వరకు… వాదం గెలవడం కోసం కుల, మతాల వంటి విషయేతర కొండ గుండ్లు ఎదిరి నెత్తి మీదికి దొర్లించి వికటాట్టహాసం చెయ్యనంత వరకు… మీ ప్రతి మాటకు ఇదే మా ఆహ్వానం.

అడిగితే స్పందించిన వారు కొందరు, అడగకుండానే రచనలు పంపిన వారు కొందరు. తమ అమూల్య రచనలతో (అవి నిజంగానే అ-మూల్యం, మేము వారి శ్రమకు టోకెన్ గా ఒక్క రూపాయి ఇవ్వలేదు, లేము) ‘రస్తా’ను సంపన్నం చేసిన కలం జీవులకు (వాళ్లిప్పుడు కీ బోర్డు జీవులే అనుకోండీ)… మరి మరి మరి కృతజ్ఞతలు. పేర్లు పేర్కొంటే చిన్న జాబితాయే అవుతుంది. ఒకటి రెండు పేర్లు జాబితాలో చేరక తరువాత గుర్తొచ్చి ‘అర్రే’ అనిపించొచ్చు కూడా. రచయితలే గాక, వాళ్ళ బొమ్మల్ని యధేఛ్ఛగా వాడుకుంటే చిర్నవ్వుతో ‘ఓకే’ అన్న రాజశేఖర చంద్రం, కిరణ్ కుమారి వంటి చిత్రకారులకు కూడా చాల చాల కృతజ్ఞులం. ఇలాంటి ఉచిత బోయినాలు, దొంగతనాలు ఇక ముందు కూడా చేస్తాం. వారికి ముందస్తు కృతజ్ఞతలు. బిచ్చమెత్తడం, దొంగతనం… పేదరికానికి ఆభరణాలు కదా?!

మాకు తెలీకుండానే రచనల్ని చదివి అవసరమైనప్పుడంతా కామెంట్లతో మమ్మల్ని హెచ్చరిస్తున్న, ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ జేజేలు.

రాత్రి ఇంకా చాల వుంది. నడవాల్సిన దూరమూ వుంది. ఈ చిన్ని సెలబ్రేషన్ తో ఇంకొన్ని అడుగులు…

28-4-2019    

తా.క. మరే చెప్పడం మరిచా, పైన బొమ్మ అన్యది. తన గదిలో గోడకు అతికించి వుండింది. నేను అడిగితే తను సంతకం చేసింది గాని, మరీ పప్పైన, అదీ పెన్సిల్తో. నా మొబైల్ కు చాతకాలేదు సంతకాన్ని చూపించడం. 🙂

హెచ్చార్కె

12 comments

 • హేపీ బడ్డే రస్తా…ఈ పత్రిక నాలాంటి వాడికి వచన రచన చేయగలననే ధైర్యాన్నిచ్చింది… నాకే కాదు. నాకు తెలిసి చాలా మందికి….కొత్త కుర్రాళ్ళకి.

  అందుకు టీం రస్తా కి కృతజ్ఞతలు..అభినందనలు….

  • థాంక్యూ శ్రీరామ్! కలిసి పని చేయడంలో చాల అనందం వుంది. వయసులేవైనా స్బేహాలలో మాధుర్యముంది. కొత్త తరానికి మనసారా సలాం.

 • రస్తా కు హర్ధిక జన్మదిన శుభాకాంక్షలు అలాగే మేడే గ్రీటింగ్స్ కూడా

 • Congatulations , HRK ! No mean achievement this. Read most of the content. I found a lot of it to be of great interest. Particularly your edits. Pl continue this mission. My best wishes to Jaya and Mammatha and also to the ‘ little one ‘ ! Love you all.

  • దేవీ! కాలుష్యమంటని మీ ప్రేమకు సదా కృతజ్ఞతలు. ఈ ప్రేమే నా దిగుళ్ళు అన్నింటి నుంచీ నాకు రక్ష. సమతను, ఇవా ను అడిగానని చెప్పండి.

 • రస్తాకు జన్మదిన శుభాకాంక్షలు .మీకు హార్దికాభినందనలు సర్..

 • తయారవుతూ తయారు చేస్తున్నారు కూడా. అభినందనలు.కృతజ్ఞతలు.

  • థాంక్స్ విజయ్! తయారవడం నిరంతర ప్రక్రియ. ప్రజల్ని ప్రేమించే రచయితలం, మనం కలాలు నూరుకునే యాన్విల్ కాగలిగితేనే ‘రస్తా’ సార్థకం.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.