సామాన్యుడిని హీరో చేసిన
నవ్య కవిత్వ యుగం-1

(విలియం బ్లేక్, కోలరిజ్, వర్డ్స్ వర్త్)

పారిశ్రామిక విప్లవం తర్వాత చాలామంది పల్లె వాసులు, రైతులు పట్టణాల్లో కార్మికులుగా మారిపోయారు. నగరీకరణ క్రమంలో జరిగిన ఆక్రమణలతో మనిషి ప్రకృతికి దూరమైపోయాడు. ఒక కృత్రిమత్వం, అసహజత్వం సమాజమంతా అల్లుకుపోయింది. అమెరికన్ ఫ్రెంచి విప్లవాలు సాహిత్యాన్ని తత్వశాస్త్రం, కళలు, మతం, రాజకీయాలను ప్రభావితం చేశాయి. ముందు తరం కవులంతా ప్రాచీన ధోరణులతో కవిత్వాన్ని పునరుద్ధరించాలని ప్రయత్నించారు. జర్మన్ తత్వవేత్తల, విమర్శకుల ప్రభావం ప్రపంచమంతా విస్తరిస్తున్న తరుణంలో ఇంగ్లాండ్ లోని లేక్ ప్రాంతంలోని ముగ్గురు కవులు ఒక నూతన దృక్పథంతో ఆంగ్ల సాహిత్య చరిత్రను – ఒక రకంగా చెప్పాలంటే, ప్రపంచ సాహిత్య చరిత్రని ఒక కొత్త దారిలోకి మళ్లించారు. వారిని అనుసరించి వచ్చిన మరో ముగ్గురు ఆంగ్ల కవిత్వానికి కొత్త జీవం పోశారు.  తొలి అడుగులు వేసింది వర్డ్స్ వర్త్, కోలరిజ్, సదె అయితే, ఆ మార్గాన్ని కొనసాగించింది మాత్రం కీట్స్, షెల్లి,  బైరన్.

ఫ్రెంచ్ విప్లవాన్ని స్వాగతించిన కవులు ‘సమాజంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తాయ’ని కలలుగన్నారు. నూతనమైన భావ వ్యక్తీకరణకు, నూతన కవిత్వ వస్తువులకు, ముఖ్యంగా సగటు మానవుని స్వేచ్ఛకు, అతని భావాలకు ప్రాధాన్యం ఇచ్చారు. వస్తువుని ఎన్నుకోవడంలో, వ్యక్తీకరించడంలో వెనకటి కవుల మార్గాన్ని వదిలి కొత్త పంథాని ఎన్నుకున్నారు. దీన్నే ‘రొమాంటిసిజం’ (నవ్యత) గా  పేర్కొని ఇలాంటి మార్గాన్ని అనుసరించిన కవులను ‘రొమాంటిక్ పొయేట్స్’ లేదా ‘నవ్య కవులు’ గా పేర్కొన్నారు. అందరూ భావించిన విధంగా ‘రొమాంటిక్ పోయెట్స్’ అంటే ప్రణయ కవిత్వం రాసే కవులని మాత్రం కాదు. వీరిది కేవలం ‘భావవాదం’ మాత్రమే కాదు.

1770 నుండి 1870 వరకు నవ్య కవులు సమాజం కన్నా వ్యక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అలాగని సమాజాన్ని పక్కనపెట్టి కాదు. ఈ నవ్య వాద కవులు ఫ్రెంచ్ విప్లవం పట్ల ఎన్ని ఆశలు పెట్టుకున్నారో అంత నిస్పృహకు కూడా గురయ్యారు. ‘నియోక్లాసికల్’ కవులు అంటే ‘నవ్య ప్రాచీన’ కవులు కవులను వ్యాఖ్యాతలుగా, అనుకరణ కర్తలుగా భావిస్తే, నవ్య కవులు మాత్రం కవిని సృజనాత్మక జీవిగా, ఊహాత్మక కళాకారుడిగా, విప్లవవాదిగా, మేధావిగా భావించారు. విలియం బ్లేక్ వంటి కవులైతే  కవిని ఒక ‘స్రష్ట’ గా భావించారు. ఏ కట్టుబాట్లు లేని సహజమైన వ్యక్తి స్వేచ్ఛను కోరుకున్నారు. సాధారణ జీవితంలోని సంఘటనలు, నిత్యజీవిత భాష, కొత్త బంధాలు, వ్యక్తీకరణలు – ఇవీ నవ్య కవిత్వ లక్షణాలు. ఒక రకంగా 1726 నుంచి    1730 వరకు థామ్సన్  వ్రాసిన ‘సీజన్స్’ అనే కవితలు, 1751లో థామస్ గ్రే రాసిన ‘ఎలిజీ’, అంతకు ముందు తరాల కవిత్వాన్ని వ్యతిరేకిస్తూ నవ్య కవిత్వ లక్షణాలకు ముందుగా బీజం వేసింది అని చెప్పాలి.  థామ్సన్ మానవ నైజం గురించి ఇలా చెప్తాడు:

“The obdurate human heart has no flesh at all
It doesn’t feel for man.”

‘పాషాణయుతమైన మానవ హృదయాన సున్నితత్వంలేదు, అది తోటి మనిషి పట్ల స్పందించదు.’ ఇలాంటి సున్నిత భావన, సహానుభూతి ఇంతకుముందున్న తరం కవులలో కనిపించలేదు.

‘మనిషి జన్మతః మంచి వాడని, అతని భావావేశాల్ని అర్థం చేసుకోవడం ముఖ్యమ’ని భావించారు నవ్య కవులు. విప్లవవాది రూసో లాగా వర్డ్స్ వర్త్ కూడా ‘ఆధునిక మానవుడు తన సహజ ఆత్మకు దూరమై పారిశ్రామికీకరణకు గురైన నగర జీవితం చేత చెడగొట్ట పడ్డాడు’ అని భావించాడు. వర్డ్స్ వర్త్,  కోలరిజ్ కలిసి వ్రాసిన ‘లిరికల్ బాలడ్స్’ నవ్య ప్రాచీనుల రచనా సంప్రదాయాన్ని పక్కకుపెట్టి జానపద గీతశైలిని ఆహ్వానించింది. అవి ఇప్పటి కవులకు కూడా స్ఫూర్తినిస్తూనే ఉంది.

నవ్య కవులు ఊహాత్మక సృజన, భావన, అనుభూతి, ప్రకృతి, ప్రతీకలకు  ప్రాధాన్యం ఇచ్చారు. ‘కవి చేయగల ఊహ దైవత్వాన్ని కలిగి ఉంటుందని, మానవునికి గల అన్ని శక్తులలో అత్యుత్తమమైనద’ని భావించారు. ‘అన్ని కళలకూ మూల శక్తి అదేనని, మనకు కనిపించే ఈ దృశ్య ప్రపంచం లోని  విరుద్ధమైన శక్తుల్ని ఒకటిగా చేసే శక్తి కూడా కేవలం ‘వూహ’కు మాత్రమే ఉంటుంద’ని నిరూపించారు. ఊహాత్మక శక్తి తోనే మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సరిగా చూడడమే కాక, దాని సృష్టించడం కూడా చేస్తామని తెలిపారు. విలియం బ్లేక్ లాంటి కవులు దార్శనికతకు కూడా ఇదే మూలమని చూపారు.

ఇలాంటి శక్తితోనే విలియం బ్లేక్, వర్డ్స్ వర్త్ వంటి కవులు ప్రకృతిని పంచేంద్రియాలతో పలు విధాలుగా అనుభవించి పలవరించి తమ కవితల్లో ప్రతిష్టించారు.  ప్రతి మనిషి ప్రకృతిని ఒక సజీవమూర్తిగా చూసి దానిలో తన ప్రతిబింబాన్ని చూసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నవ్య కవులు ‘లిరిక్’ లేదా పాటను తమ కవితా రూపంగా చేసుకొని, భావ ప్రవాహానికి సంకెళ్లు వేసి ఛందో ప్రక్రియను పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. భాషను కవిత్వీకరించే సూత్రాన్ని కనిపెట్టి అసాధారణ కవులుగా నిలిచారు.

వీరిలో మొదటివాడైన విలియం బ్లేక్ (1757 – 1827)కవి, చిత్రకారుడు కూడా. తన ‘సాంగ్స్ అఫ్ ఇన్నోసెన్స్’, ‘సాంగ్స్ అఫ్ ఎక్స్పీరియన్స్’,  ఇంకా ఇతర కవితలలో వ్యక్తిని, సమాజాన్ని సమానంగా ప్రతిబింబించాడు. చిన్న కవితలతో పాటు దీర్ఘ ఐతిహాసిక కవితలను, పద్య నాటకాలను రాశాడు. లలితమైన, సందర్భోచితమైన పదాలతో లోతైన కవిత్వాన్ని రాశాడు. అందరూ భావించినట్లు నవ్య కవులు సమాజాన్ని, సమాజ సమస్యలను విడిచి తమ ఊహాలోకాల్లో వివరించలేదు.  బ్లేక్ రాసిన ‘లండన్’ అనే ఈ కవిత చూడండి:

నేను వర్గీకరింపబడిన ప్రతి వీధిలో
నిర్బంధీకరింపబడిన థేమ్స్ నది
ప్రవహించే చోట తిరుగుతాను
నేను కలిసిన ప్రతి ముఖంలోనూ
నిస్సత్తువ, బాధల చిత్రాలను చూస్తాను.

ప్రతి మనిషి ఆక్రందన లోను
ప్రతి చిన్నారి భయోద్వేగపు కేకలోను
ప్రతి గొంతుకలోను, ప్రతి నిర్బంధంలో
మనసు వేసిన సంకెలల శబ్దాన్ని వింటాను

నల్ల పడుతున్న చర్చి
ఎలా బాల చిమ్నీ  కార్మికుల కేకలకు భయపడుతోందో
భవంతుల గోడలమీదగా నిస్సహాయ సైనికుల నిట్టూర్పు
ఎలా రక్తదారలై కారుతోందో చూస్తాను

అర్ధరాత్రి వీధులలో యువ వేశ్యల శాపం
ఎలా శిశువుల కన్నీటిని విచ్చిన్నం చేస్తోందో
వివాహ మృత్యు శకటాన్ని కుళ్లిపొమ్మని శపిస్తోందో విన్నాను.”

అంటూ బాల కార్మిక వ్యవస్థలను , సగటు మనిషి కష్టాలను, మతం చేసే దౌష్ట్యాలను, యుద్ధ పరిస్థితులను, స్త్రీల కష్టాలను, చెడిన వివాహ వ్యవస్థను చిత్రిస్తాడు. సరళమైన భాష వాడుతూనే విప్లవ కవిత్వాన్ని బ్లేక్ పునర్నిర్వచిస్తాడు .

బ్లేక్ తర్వాత వచ్చిన  కోలరిజ్, వర్డ్స్ వర్త్ ప్రకృతిని ఒక స్వాస్థ్య పరిచే శక్తి గా,  దైవ శక్తి గా చూశారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, విమర్శకుడు అయిన శామ్యూల్ టేలర్ కోలరిజ్ 1720 లో లండన్ లో జన్మించాడు.  ఇమాన్యుయల్ కాంట్ ను, ష్లీగల్ ను  ఆంగ్ల సాహిత్యానికి పరిచయం చేశాడు. తాను వ్రాసిన ‘బయోగ్రఫీ లిటరేరియా’ లో ప్రాథమిక, ద్వితీయ స్థాయి ఊహాత్మక గురించి, కాల్పనిక శక్తి, గురించి వివరించాడు. వర్డ్స్ వర్త్ అతని సోదరి  డరతికి మంచి స్నేహితుడు అవడమే కాక వర్డ్స్ వర్త్ కు మార్గదర్శకుడయ్యాడు. వారిద్దరూ కలిసి వ్రాసిన ‘లిరికల్ బాలడ్స్’ లో ‘సాధారణమైన విషయాలను అసాధారణంగా, అసాధారణ విషయాలను సాధారణంగా’ చూపాలనే ఒక ఒడంబడిక చేసుకున్నారు. విభిన్నమైన కవితాశైలి, పదచిత్రాలు, ప్రతీకలు, కోలరిజ్  కవిత్వంలో కనిపిస్తాయి. అనేక దీర్ఘ కవితలతో పాటు ‘ద రైం ఆఫ్ ద ఏన్సియంట్ మారినర్’ అనే జానపద కవితను అద్భుతంగా వ్రాశాడు. తరచూ అనారోగ్యంతో బాధ పడి ఓపియం కు బానిసగా  కన్నుమూసాడు. ఆయన అర్ధాంతరంగా వదిలివేసిన ‘కుబ్లాఖాన్’ అనే కవిత అసంపూర్ణంగానే మిగిలిపోయింది.

నవ్య కవులలో దిగ్గజంగా చెప్పుకోదగిన కవి విలియం వర్డ్స్ వర్త్. బాల్యంలోనే తల్లిని, తన 13వ ఏట తండ్రిని కోల్పోయి, ఎంతో ప్రేమించిన చెల్లి కి దూరంగా పెరిగిన ప్రకృతి పూజారి విలియం వర్డ్స్ వర్త్. అందమైన ప్రకృతి లోకం గా పేరుపొందిన లేక్ డిస్ట్రిక్ట్ లో 1770 లో పుట్టి పెరిగిన వర్డ్స్ వర్త్,  ప్రకృతిని దైవంగా, తల్లిగా పూజించాడు. తన 20వ ఏట ఫ్రాన్స్లో ఆనటి వేలన్ అనే అమ్మాయితో ప్రేమలో పడి ఒక కుమార్తెకు తండ్రి అయ్యాడు. ఫ్రెంచి విప్లవ పరిస్థితుల కారణంగా ఫ్రాన్స్ ను వదలి  ఇంగ్లాండ్ కు వెళ్లిపోవాల్సి వచ్చింది. తర్వాత తన చిన్నతనపు స్నేహితురాలైన మేరీ హచిన్ సన్ ను వివాహమాడాడు. కోలరిజ్, వర్డ్స్ వర్త్, అతని  సోదరి డోరోతిల అనుబంధం చాలా గొప్పది. ఒక కవిగా ఈ అనుబంధం  అతన్ని ఎంతో ప్రభావితం చేసింది. ఇతర కవితలతో పాటు వర్డ్స్ వర్త్ రాసిన ‘ప్రేల్యుడ్’, లిరికల్ బాలడ్స్’ ఇతర కవితలతో పాటు ‘లిరికల్ బాలడ్స్’ కు ముందు మాటగా  రాసిన ‘ప్రిఫేస్’ ఎంతో ప్రఖ్యాతి పొందాయి. ప్రకృతి మానవుడికి ప్రసాదించే అనేక వరాలను తన కవితలతో వర్ణించాడు వర్డ్స్ వర్త్. మానవుని జీవితంలో, మనస్తత్వంలో కలిగే అనేక మార్పులను, దైవత్వానికి దూరమయ్యే విధానాలను, తన కవితల్లో చిత్రీకరించాడు.

ప్రకృతి తన గంభీరమైన సౌందర్యంతో అతడిని విచలితుడ్ని  చేసింది.  ‘లిరికల్ బాలడ్స్’ కు రాసిన ముందుమాటలో తెలిపినట్లు ‘కవితను చదివేటప్పుడు పాఠకుడు ఒక కవిత్వంలోకి ప్రవేశిస్తున్నట్లు వేరే ప్రత్యేక భావన పొందకుండా, సహజంగా చదివి లీనమయ్యే భాషను కవి ఉపయోగించాలని చెప్తాడు. అలాంటి భాషనే తన కవిత్వంలో  ఉపయోగించాడు. ‘డేఫోడిల్స్’, ‘ఇమోర్టాలిటీ ఓడ్’ ‘టింటర్న్ ఆబీ’, సాలిటరీ రీపర్’ ఇలాంటి కవితలన్నీ అప్రయత్నంగా రాసినట్లే కనిపిస్తాయి. ఆ కవితల్ని వ్రాసేటప్పుడు వ్యక్తీకరణలో గానీ, భాషలో కాని, భావం లో కానీ, ఏ కృత్రిమత్వం లేకుండా చాలా అలవోకగా సరళంగా సాగిపోతుంది ఈయన కవిత్వశైలి. ఒక అంతర్లీనమైన వేదనను, అంటే మానవులు  సంతోషాన్ని కోల్పోతున్న వేదనను చూపుతాడు. ‘ఇమోర్టాలిటీ ఓడ్’లో వేదాంతిలా తన నిస్పృహను, తన ఆస్తికతను వ్యక్తం చేస్తాడు.

‘ఒకానొక కాలంలో
పచ్చికబయలు, తోట, ప్రవాహం,
భూమి, ఇక్కడ కనిపించేవన్నీ
ఒక దివ్య కాంతితో
ఒక స్వప్నపు నూతనత్వంతో కనిపించేది
అదంతా పాతకాలపు మాట
ఇప్పుడు రాత్రయినా పగలైనా
నేనెటు తిరిగినా ఇంతకుముందు నేను చూసిన వేమి
నేను ఇప్పుడు చూడలేకున్నా

మన జన్మ ఏముంది? ఒక నిద్ర, ఒక మరపు
మన జీవిత తార అయిన మన ఆత్మ
మనతోనే ఉదయించి ఎక్కడో అస్తమిస్తుంది
ఎక్కడి నుండో వస్తుంది
పూర్తి మరపులో కాకుండా
పూర్తి అనాచ్చాదంగా కాకుండా
పాకాడే అద్భుత మేఘాలలా  మనం
మన మూలమైన భగవంతుడి నుంచి వస్తాం’ (ఇమోర్టాలిటీ ఓడ్)

అని వివరిస్తాడు. పధ్నాలుగు సంపుటాలుగా వ్రాయబడిన ‘ప్రెల్యూడ్’  లోని ప్రతి పంక్తి , ప్రకృతి తన నెలా మలిచిందీ, ఒక దైవంలా, తల్లిలా, సోదరిలా పాఠాలు నేర్పినదీ తెలియజేస్తుంది. అది ఒక కవి ఆత్మకథలా, కవి మనో నిర్మాణ శక్తి లా, ఒక ఇతిహాస కావ్యంలా సాగుతుంది. ఇది వర్డ్స్ వర్త్ వ్రాద్దామనుకున్న ‘రెక్లూజ్’ అనే కావ్యానికి ముందు మాటగా వ్రాయబడిన కావ్యం.

వర్డ్స్ వర్త్  కవిత్వం ఊహాలోకాల్లో విహరించకుండా మన కంటిముందు కనపడే ప్రకృతి, సాధారణమైన వ్యక్తులు, వారి జీవన విధానం, వారి మాటల చుట్టూ తిరుగుతుంది. ఏ చరిత్రా లేని వారు, ఎవరి చేత పట్టించుకోబడని  వారు, ఆయన కవిత్వంలో నిలిచి కన్నీటి విలువను, మానవజాతి హృదయ భాషను వినిపిస్తారు. ‘మైకెల్’, లీచ్ గాదరర్’, సైమన్ లీ’ వంటి కవితలు ఇందుకు ఉదాహరణలు. కవిత్వాన్ని నిర్వచిస్తూ ‘ఒక తీవ్రమైన అనుభూతి అప్రయత్నంగా పొంగిపొరలి ఒక ప్రశాంత క్షణాన భావమై  ఆవిర్భవిస్తే అదే కవిత్వం అవుతుందని’, ‘ఇది సర్వసాధారణమైన దైనందిన జీవిత భాషలో సరళంగా ఉండాల’ని చెప్పాడు. అందుకే ఎజ్రా పౌండ్ కూడా ‘అత్యద్భుత సాహిత్యం అంటే సాధ్యమైనంత వరకు అద్వితీయ అర్ధం కల సాధారణ భాషే’ అంటాడు. ఇందుకే వర్డ్స్ వర్త్  కవిత్వం హృదయాన్ని తాకి, సందేహాలను, భయాలను పోగొట్టగల ఒక అమృత శక్తి కలిగి ఉంటుంది.

వర్డ్స్ వర్త్  బ్రతికి ఉన్నంతకాలం అతని కవిత్వ కీర్తి అతన్ని వరించలేదు. తన మిత్రుడు సదే మరణం తర్వాత కవిసార్వభౌముడుగా కీర్తింపబడ్డాడు. బతికున్న కాలంలో అతన్ని ఎక్కువ మంది ఇష్టపడకపోయినా ఆయన కవిత్వం ఆంగ్ల సాహిత్య చరిత్రకు కొత్త వన్నెలు ఇచ్చింది. జీవితాంతం ఆర్థికంగా ఇబ్బందులు పడినా కూడా  కవిత్వాన్ని మాత్రం వదల్లేదు. గొప్ప ఆలోచనలు, సరళమైన భాష, ప్రకృతి పట్ల, నిరాడంబర జీవితం పట్ల ప్రేమ, మానవ హృదయ స్పందన పట్ల వాత్సల్యం, జీవితం పట్ల సానుభూతి, ఆయన కవిత్వాన్ని అజరామరం చేశాయి. ఆంగ్ల సాహిత్యాన్ని చదివి ఆస్వాదించాలనుకునే ప్రతి ఒక్కరూ చదవాల్సిన మొదటి కవి ‘విలియం వర్డ్స్ వర్త్’ !

(వచ్చే నెల మిగిలిన ‘నవ్యకవుల’ గురించి తెలుసుకుందాం.)

డాక్టర్ విజయ్ కోగంటి, డాక్టర్ పద్మజ కలపాల

2 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.