ఉద్యోగుల మధ్య సహకారం – ఉత్పాదకతకు ఊతం

రూజ్వెల్ట్

Competition has been shown to be useful up to a certain point but no further; cooperation is the thing we must strive for today, begins where competition leaves off.
                                                                                                             – Franklin Roosevelt
                                                        (1882-1945, 32nd President of the United States, 1933-1945)

‘ఒక దశ వరకు పోటీ తత్వం మంచిదే కానీ మనం ఇప్పుడు కృషి చేయాల్సింది సహకారం కోసం. పోటీ అంతమైన చోట సహకారం ప్రారంభమవుతుంది’ అంటారు ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్

ప్రపంచీకరణ అనంతరం ఒక పరిశ్రమ విజయవంతంగా నడవాలంటే విస్తృతమైన నైపుణ్యాలు, సృజనాత్మకత కలిగిన ఉద్యోగులు,  కొంగొత్త ఆలోచనల ఆవిష్కరణలు తక్షణావసరంగా మారాయి. ఈ నేపధ్యంలో ఒక పరిశ్రమలో పని చేసే ఉద్యోగుల మధ్య పరస్పర సహకారం, ఉద్యోగులకు, యాజమాన్యానికి మధ్య సహకారం అనివార్యమైంది. ఎప్పటికప్పుడు మారే కస్టమర్ల అవసరాలు, క్షణ క్షణం మార్పుకు లోనయ్యే మార్కెట్ సమాచార పరిజ్ఞానం ముందుడి పనిచేసే ఉద్యోగులలో ఉంటుంది. అనుభవ జ్ఞానం ప్రతి పరిశ్రమ అభివృద్ధికి ఎంతైనా అవసరం. వారి విలువైన అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను పరిశ్రమాభివృద్ధికి విధంగా ఉపయోగించుకోవాలనేదే నిజమైన సవాలు. పని చేసే ప్రదేశంలో సహకారం సహజంగా విస్తృత స్థాయిలో మూడు విధాలుగా ఉంటుంది.  

  1. కార్మికుల నిర్వహణలో సహకారం
  2. పరిశ్రమలో పరస్పర విజయం కోసం భాగస్వామ్య లేదా సహకార విధానాలను అనుసరించడం
  3. వివిధ స్థాయిల్లో జరిగే నిర్ణయాల్లో ఉద్యోగులను భాగస్వాములుగా చేయడంపని చేసే ప్రదేశంలో సహకారం అంటే ఉద్యోగులు కానీ, వారి ప్రతినిధులు కానీ తమ సమస్యలను, ఇరువురికి సంబంధించిన సమస్యాత్మక అంశాలను సంప్రదింపుల ద్వారా, చర్చల ద్వారా పరిష్కరించుకునే ఒక ప్రక్రియగా నిర్వచించవచ్చు. ఇరు వర్గాల అవసరాలు, ప్రయోజనాలు, సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇది ఒక సమాచార వినిమయ ప్రక్రియ.

పని చేసే ప్రదేశంలో సహకారం వలన ప్రయోజనాలు

కస్టమర్లకు ఎప్పటికప్పుడు సేవ చేయడానికి, వ్యాపారంలో పోటీని ఎదుర్కోవడానికి స్ఫూర్తి, నిబద్ధత, సామర్ధ్యం కలిగిన ఉద్యోగ బృందాన్ని యాజమాన్యం తయారు చేసుకోగలిగి ఉండాలి. పని చేసే ప్రదేశంలో ఉద్యోగుల, యాజమాన్యాల మధ్య పరస్పర సహకారం విజయవంతం కావాలంటే అది లక్ష్యాన్ని సాధించాలి. యాజమాన్యం మద్దతు, ఉద్యోగుల నిబద్ధత పని చేసే ప్రదేశంలో సహకారానికి మూలస్తంభాలు. దీనికి ఉన్నత స్థాయి ఉద్యోగుల నిబద్ధత చాలా కీలకమైనది.

పని చేసే ప్రదేశంలో సహకార విధాన ప్రక్రియ సవ్యంగా ఉంటే ఎన్నో అపార్ధాలకు, అనవసర అనర్ధాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ముఖ్యంగా మార్పుకు శ్రీకారం చుట్టినప్పుడు, అసందిగ్ధ పరిస్థితులు ఏర్పడినప్పుడు సహకార విధాన ప్రక్రియ అద్భుతంగా పని చేస్తుంది. పని చేసే ప్రదేశంలో సహకారానికి ఒక విధానాన్ని రూపొందించే దశలో అది సంక్లిష్టంగా, అనవసర ఖర్చుగా, కాలహరణం చేసే ప్రక్రియగా అనిపించవచ్చు. ఉద్యోగుల సామర్ధ్యం పెంపుదల, ఉత్పాదకత, పోటీ తత్వాన్ని పెంచే విషయంలో సహకార విధాన ప్రక్రియ అద్భుతంగా తోడ్పడుతుంది. పని చేసే ప్రదేశంలో విజయవంతమైన పరస్పర సహకార విధాన ప్రక్రియ పరిశ్రమను లాభాలలో ముంచెత్తడానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.

* వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలోను, సంస్థ ఉత్పాదకతను పెంచడంలోను ఎంతగానో ఉపయోగపడుతుంది.

*  ఉద్యోగులు పని చేసే సామర్ధ్యం, నిబద్ధత పెరుగుతుంది.

* యాజమాన్యానికి, ఉద్యోగులకు మధ్య పరస్పర విశ్వసనీయత పెరుగుతుంది.

* ఉద్యోగులు చేసే పనిలో సంతృప్తి పెరుగుతుంది.

* పని చేసే వాతావరణంలో పరిణతి పెరుగుతుంది.

పని చేసే ప్రదేశంలో సహకారం వివిధ రకాలుగా రూపుదిద్దుకుంటుంది.

* సమాచారాన్ని పంచుకోవడం

సమాచార పంపకం అనేది రెండు వైపులా ఉంటుంది. యాజమాన్యం ఉద్యోగులు, ఆర్ధిక విషయాలకు సంబంధించిన విస్తృత సమాచారాన్ని, ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియచేస్తుంది. కింది స్థాయి ఉద్యోగులకు సంబంధించిన సమాచారాన్ని, కస్టమర్ల స్పందనలు, కంపెనీ అభివృద్ధికి ఇచ్చే సలహాలు కూడా పరస్పరం పంచుకుంటారు.

* సంప్రదింపులు

కొన్ని అంశాల మీద యాజమాన్యం ఉద్యోగుల సలహాలు అడుగుతుంది. నిర్ణయాధికారం మాత్రం తమ వద్దనే ఉంచుకుంటుంది.

* సంయుక్తంగా నిర్ణయాలు తీసుకోవడం

పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఉద్యోగులు, యాజమాన్య ప్రతినిధులు కలసి చర్చించుకుని నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ ఇది.

* స్వచ్ఛంద సంప్రదింపులు

యాజమాన్యం, ఉద్యోగులు లేదా ఉద్యోగుల ప్రతినిధులు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను చర్చించుకుని, ఏకాభిప్రాయానికి వచ్చాక, ఇరువురికీ ఆమోదయోగ్యమైన ఒప్పందాలు చేసుకునే ప్రక్రియ.

కంపెనీల పరిమాణం వల్ల సహకార స్థాయి మారుతుందా?    

పని చేసే ప్రదేశంలో సహకారం కంపెనీ పరిమాణం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కొద్ది మంది ఉద్యోగులతో  నడిచే చిన్న కంపెనీలకైతే సాధారణంగా సహకారం అప్పటికప్పుడు స్పాట్ లో జరిగే చిన్న సమావేశాలు, బృందాలలో తక్షణ చర్చలు, భోజన సమయంలో సమావేశాలు, టీ టైం లో సమావేశాలు చక్కగా పనికొస్తాయి.  

ఉద్యోగస్తులు ఉత్సాహంగా లేకపోయినా, మనసు విప్పి మాట్లాడకపోయినా, అందరూ గౌరవించే ఒక ప్రతినిధిని ఇటువంటి సమావేశాలకు ఆహ్వానించాలి. దీనివలన యాజమాన్యం, ఉద్యోగుల మధ్య పరస్పరం అభిప్రాయాలు పంచుకునే సుహృద్భావ వాతావరణం నెలకొంటుంది.

మధ్య తరహా పరిశ్రమల్లో ఇటువంటి పరస్పర సహకార ధోరణి ఒక పద్ధతిలో ఉంటుంది. వర్కింగ్ గ్రూపులు, టాస్క్ ఫోర్సులు, క్వాలిటీ సర్కిళ్ళు పని చేసే ప్రదేశంలో సహకారానికి ఉపయోగించుకోవచ్చు. వర్కింగ్ గ్రూపులో సీనియర్ మేనేజ్-మెంట్ ప్రతినిధులు, ఉత్పత్తిలో పాలుపంచుకునే మేనేజర్లు, కార్యనిర్వాహక యాజమాన్య సభ్యుల సంఖ్య సమతుల్యంగా ఉండాలి. సీనియర్ మేనేజ్-మెంట్ ప్రతినిధులు ఉండటం వలన కంపెనీకి సంబంధించిన సమాచారంలో సాధికారికత, విధానపరమైన సమాచారాల్లో స్పష్టత ఉంటుంది. నిర్మాణాత్మక సదభిప్రాయాలకు విలువనిచ్చి, తగిన సిఫార్సులు చేసే అధికారం అందుబాటులో ఉంటుంది. ఉత్పత్తిలో పాలు పంచుకునే ఉద్యోగులు ప్రతినిధులుగా ఉండటం వలన సాంకేతిక వివరాలు, ఉత్పత్తికి సంబంధించిన సమాచార పరిజ్ఞానం, అనుభవం అందుబాటులో ఉంటుంది. 

పెద్ద కంపెనీలు ఉద్యోగుల మధ్య పరస్పర సహకారానికి చాలా మామూలు విధానాలు అనుసరిస్తాయి. అధికార వర్గం వివిధ స్థాయిల్లో ఉండటం వలన, ఉద్యోగస్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటం వలన కమిటీలు ఏర్పాటు చేస్తాయి. సమాచార పంపకాల విధి విధానాలను ఈ కమిటీలు నిర్ణయిస్తాయి.

విస్తృత స్థాయిలో కంపెనీలో పరస్పర సహకార ప్రక్రియ ఇలా ఉండగా, వ్యక్తిగత స్థాయిలో ఉద్యోగులు కూడ పరస్పరం సహకరించుకోవడం ఎంతైనా అవసరం. తమకున్న చిన్న చిన్న నైపుణ్యాలతో సహోద్యోగికి సహకరించడం ద్వారా, పని చేసే ప్రదేశంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఉదాహరణకు జిరాక్స్ తీయడం చేతనైనవారు, రానివారికి ఆ పనిలో సహకరించాలి. నేర్పించాలి. ఎక్సెల్ షీటులో పని చేయడం రాని వారికి దానిలో సహకరించాలి. ఆ తర్వాత నేర్పించాలి. ఏదైనా నేర్చుకుని ఉద్యోగంలో పదోన్నతులు సాధించాలన్న స్ఫూర్తిని ఉద్యోగుల్లో రగిలించే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఉద్యోగులు, ఉత్పత్తి, ఉత్పాదకత పరస్పర ఆధారితాలు. అవి పని చేసే ప్రదేశంలో ఉద్యోగులు ఒకరికొకరు సహకరించుకోవడం ద్వారానే వర్ధిల్లుతాయి. అప్పుడే సమాజం, రాష్ట్రం, దేశం ఆపై ప్రపంచమంతా ప్రగతి పధంలో పయనిస్తాయి. దేశ స్వావలంబన సంపూర్ణంగా సాధ్యమవుతుంది. జాతి కలలు ఫలిస్తాయి.

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

1 comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.