‘అలుగు’ కోసం ముందడుగు!

రాయలసీమ ప్రజలు తమ అరవై ఏడేళ్ల నాటి ఆకాంక్ష నెరవేర్చుకోడానికి మరోసారి గొంతెత్తాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజలందరూ ముక్తకంఠంతో ముందుకు రావలసిన తరుణం.

సిద్దేశ్వరం అలుగు గా పిలవబడే యీ ప్రాజెక్టు మలి విడత రాష్ట్రంలో ప్రాచుర్యంలోకి వచ్చింది 2003 లో ఐనా 1951 నుంచే పరిశీలనలో ఉంది. నాడు ప్లానింగ్ కమిషన్ అనుమతులు ఇచ్చిన కృష్ణా పెన్నార్ ప్రాజెక్టును భాషా ప్రయుక్త రాష్ట్రాల సమస్యలో భాగం చేసి ముందుకు రాకుండా చేశారు. దీనికి కారణం అతి తెలివితేటలు కలిగిన కోస్తా ప్రాంత అధికార కాంగ్రెస్ నేతలు , ప్రతిపక్ష కమ్యూనిస్టు నాయకులు కారణం అయితే , దానిలో సరైన రీతిలో అడుగేయకుండా నిర్లక్ష్యం చేసిన సీమ పెద్దల స్వయంకృతాపరాధం కూడా ఉంది. దీనివల్ల మద్రాసు రాష్ట్రం లోని కొంత ప్రాంతానికి సాగునీరు అందుతుంది అనే సాకును ఆధారం చేసుకుని  మొత్తానికే సీమ ప్రజల నోట్లో మట్టి కొట్టారు. ఎలాగూ విడిపోవాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మద్రాసు రాష్ట్రంలోని ప్రాంతానికి సాగునీరు అందించే పథకం వల్ల రాష్ట్రం యొక్క నీటి వనరులను నష్టపోతామని అప్పటి వాదన. సీమ ప్రజలకు వరంగా మారాల్సిన సిద్దేశ్వరం రూపు మారి నందికొండ దగ్గర నాగార్జున సాగర్ అవతారమెత్తి రాయలసీమ కు గుదిబండగా మారింది. అలా సిద్దేశ్వరం ప్రాజక్ట్ ను తుంగలో తొక్కిన తర్వాత రాష్ట్ర విభజన లో రాసుకున్న “రాయలసీమ కు నీళ్లలో మొదటి ప్రాధాన్యత“ అనే అంశాన్ని ఎక్కడా పాటించలేదు. మరో పదేళ్ల తర్వాత కట్టిన శ్రీశైలం ప్రాజెక్టును కూడా నాగార్జున సాగర్ కు ఓవర్ హెడ్ ట్యాంకుగా మాత్రమే నిర్మించారు. అప్పుడు కూడా కోస్తా నాయకులకు చిత్తశుద్ధి లేదు, సీమ నాయకులకు ముందు చూపు లేదు. యాభై ఏళ్ళ తర్వాత మరలా కర్నూలు జిల్లా లోని రిటైర్డ్ ఇంజనీర్ సుబ్బారాయుడు గారు సిద్దేశ్వరం ప్రాజెక్టు సమస్యను లేవనెత్తారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కొత్తగా నివేదిక తయారు చేసి పంపితే ఫలితం శూన్యం. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి దగ్గరకు పోయి ప్రాజెక్టు యొక్క ఆవశ్యకతను వివరిస్తే ఆయన సుముఖత వ్యక్తం చేసి యీ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవడానికి కొంత సమయం పడుతుందని హామీ ఇచ్చాడట.  ఇక్కడ రాజకీయ పక్షపాత ధోరణితో యీ మాట అంటున్నారు అని విమర్శించినా సరే ఒక మాట మాత్రం చెప్పే తీరాలి. ఎందుకంటే అవి చవకబారు రాజకీయ కామెంట్లు కాదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నేతల నోటి నుంచి నిజాయితీ తో వచ్చిన మాటలు. ఇక్కడ నిజాయితీ అనే పదం కేవలం సిద్దేశ్వరం ప్రాజెక్టు వరకే వర్తిస్తుంది. ఇతర అంశాలను ముడి పెట్టి అందరూ ఒకటే అనే వ్యాఖ్య చేయవలసిన పని లేదు. ప్రాజెక్టు కట్టాల్సిన నియోజకవర్గ ఎమ్మెల్యే తో పాటు సిద్దేశ్వరం అలుగు రిపోర్టు తయారు చేసిన ఇంజనీర్ ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ ను కలువగా ఆయన అంతా విని అంగీకారాన్ని వ్యక్తపరిచాడు. దాంతో సదరు స్థానిక ఎమ్మెల్యే సంతోషం తో గంతులేసినంత పనిచేయగా ముఖ్యమంత్రి వారించి, “ఆగాగు ప్రతాప్ ……. ఇప్పుడే అంత తొందర అవసరం లేదు. ముందు పులిచింతల ప్రాజెక్టు పూర్తి కావాలి. ఆ తర్వాత యీ ప్రాజెక్టు మొదలు పెడదాం” అన్నాడట. వైఎస్ మరణం తరువాత కొణిజేటి రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డి ల హయాంలో సిద్దేశ్వరం ఫైల్ కనీసం పరీశీలన జరపమనేలానైనా ముందుకు కదిలింది. 2014 తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆనాడు కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొందిన ప్రాజెక్టు కోసం నేడు ప్రజలు ఉద్యమం చేయాల్సిన అవసరం ఏర్పడింది.

ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు :

సిద్దేశ్వరం ప్రాజెక్టు ఇంటర్ స్టేట్ ప్రాజెక్టు. కేవలం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పూనుకుంటే సరిపోదు. పక్కనున్న తెలంగాణ ప్రభుత్వ అనుమతులూ కావాల్సిందే. రాయలసీమ లోని యీ గట్టు నుండి తెలంగాణ లోని ఆ గట్టు వరకూ కట్టాల్సిన అలుగు సిద్దేశ్వరం. ఇందులో కొత్తగా భూసేకరణ చేయాల్సిన పనేమీ లేదు. అంతా శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ భాగం లో ముందే సేకరించిన భూములే. ఇక ఖర్చు సంగతికొస్తే అంతా లెక్కేసి తేల్చినా 600 కోట్ల ప్రాజెక్టు వ్యయం. జల్లెడకు ఎన్ని చిల్లులు ఉన్నాయో అన్ని వివాదాలు ఉన్న పోలవరం ప్రాజెక్టు కు 80 వేల కోట్ల ప్రజా ధనం ఖర్చు చేస్తున్నప్పుడు కరువు ప్రాంతమైన రాయలసీమ ను కాపాడటానికి కేవలం 600 కోట్లు డబ్బుకు చేతులు రాకపోవడం హేయమైన విషయం. అంత ఖర్చు పెట్టి కట్టే పోలవరం లో కుడి కాలువ ఆయకట్టు మొత్తం ఇంతకు ముందే సాగులో ఉన్న ఆయకట్టును స్థిరీకరణ చేయడానికే. రాయల సీమ లోని పొలాలకు మొదటి పంటకే నీరు లేక బోర్లు, బావుల నుండి తోడి అవీ ఎండిపోయి రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇంకోవైపు మంచి వర్షపాతం గల ప్రాంతానికి రెండు పంటలకు కాలువ నీరు అందుతుంటే ముందస్తు జాగ్రత్తగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం నూరు శాతం పక్షపాత ధోరణి. ఆకలితో కడుపు మాడి చస్తున్న వాడిని వదిలేసి కడుపు నిండిన వాడి నోట్లో కొసిరి కొసిరి కుక్కడం ఏ రకమైన నీతి? నిజానికి ఇక్కడ సమస్య డబ్బు కాదు. విచ్చలవిడి నీటి వాడకానికి అలవాటు పడిన సంకుచిత మనస్తత్వాలు కారణం. డెబ్భై ఏళ్ల నుండి అడ్డు అదుపు లేకుండా ఇరు కారు, ముక్కారు పంటలకు సాగునీరు పారించుకుంటూ  ఉన్న ప్రాంతం నుంచి వచ్చిన మూడవ తరం వారు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు కూడా నేడు రాయలసీమ కు నీటి హక్కులు ఎక్కడ ఉన్నాయంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు సీమ ఉద్యకారులు వారికి అ ఆ ల నుండి నేర్పించాల్సిన అగత్యం ఏర్పడింది. అయినా తప్పదు. రాయలసీమ ప్రజలు ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు’ అని తమను తామే ప్రశ్నించుకోవాలి. ఒక రాష్ట్రం నుండి కొంత ప్రాంతం విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడిన సందర్భాల్లో ఆయా కొత్త రాష్ట్రాలు అభివృద్ధి చెందడం చూసి ఉంటాం కానీ ఆంధ్రప్రదేశ్ విషయం లో మాత్రం అది సగమే నిజం. మూడు సార్లు రాష్ట్రం విడిపోయినా ఏనాడు రాయలసీమ కు సరైన హక్కులు దక్కింది లేదు. సాగునీటి రంగం పరిస్థితి మరీ అధ్వాన్నం. అందుకే ఇప్పుడు సిద్దేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సీమ ప్రజలు పట్టుబడుతోంది. విద్యుత్తు పేరిటా , దిగువ నదీ పరీవాహక హక్కుల పేరిట దశాబ్దాల నుంచీ సాగుతున్న జల దోపిడీకి అడ్డుకట్ట వేసే సిద్దేశ్వరం అలుగు నిర్మాణం అయితేనే రాయలసీమ లోని సాగునీటి ప్రాజెక్టులకు కావాల్సినన్ని నీళ్లు అందేది. రాబోయే కొత్త ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న బలమైన డిమాండు యొక్క తీవ్రతను అర్థం చేసేలా ఇప్పుడు రాయలసీమ ప్రజానీకం పాదయాత్ర కు శ్రీకారం చుట్టింది. 2016 మే నెలలో రాయలసీమ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దాదాపు పదివేల మంది జనం ఏకమై సిద్దేశ్వరం అలుగు నిర్మాణ ప్రాంతంలో శంకుస్థాపన చేయాలని ప్రయత్నిస్తే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల అభీష్టానికి విరుద్ధంగా అరెస్టులు చేసింది. రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు నుంచి కూడా ప్రజలు సిద్దేశ్వరం అలుగు ప్రదేశానికి చేరుకోబోతే పోలీసులు ఎక్కడిక్కడ ఆత్మకూరు, నందికొట్కూరు పరిసర ప్రాంతాల్లో ఆపేశారు. అయినా ప్రజలు వెనక్కి తగ్గకుండా ఎక్కడిక్కడే శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు.  అలాగే 2017 లో నంద్యాల లో భారీ సంఘీభావ సభ , 2018 లో విజయవాడలో మహా ధర్నా నిర్వహించారు. ఇప్పుడు నంద్యాల నుంచి సిద్దేశ్వరం వరుకు 100 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించబోతున్నారు. సీమ ప్రజలు ఇంకెన్నాళ్లో సహించరు. తిరగబడతారు, పోరాడతారు. యీ పాదయాత్ర ఇప్పుడు ముగింపు కాదు , సీమ హక్కుల సాధనకు నాంది.

వంశీ పులి

వంశీ పులి: పూర్తి పేరు పులి. వంశీధర రెడ్డి. స్వస్థలం: కర్నూలు జిల్లా లోని వెల్గోడు గ్రామం.
డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి,. ప్రస్తుతం కర్నూలులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు .

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.